గాజా ఆస్పత్రిలో పేరుకుపోతున్న శవాలు.. పనిచేయని ఐసీయూ, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల ప్రాణాలకు ముప్పు

అల్-షిఫా ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన చిన్నారులు
ఫొటో క్యాప్షన్, అల్-షిఫా ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన చిన్నారులు

గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫాలో పరిస్థితులు దయనీయంగా మారాయని సిబ్బంది చెప్తున్నారు.

ఆసుపత్రి సమీపంలోని వీధుల్లో భారీగా కాల్పులు జరుగుతున్నాయని, పెద్ద సంఖ్యలో శరణార్థులు, రోగులు ఆసుపత్రిలో ఉండిపోయారని సిబ్బంది చెప్తున్నారు.

ఆసుపత్రిలో నీరు, ఆహారపు నిల్వలు నిండుకున్నాయని, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని వైద్యులు బీబీసీకి తెలిపారు.

ఆసుపత్రి సమీపంలోనే హమాస్‌తో పోరాటం జరుగుతోందని, కానీ, తాము ఆసుపత్రిపై ఎలాంటి కాల్పులూ జరపలేదని ఇజ్రాయెల్ చెప్పింది.

ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలు మరణించినట్లు, మరో 37 మంది శిశువుల ఆరోగ్యం విషమిస్తోందన్న సమాచారం వైద్యుల నుంచి అందుకున్నామని, వారిని సురక్షితంగా మరో ఆసుపత్రికి తరలించేందుకు సాయం చేస్తామని ఇజ్రాయెల్ ఆదివారం ప్రకటించింది.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజాలోని అల్-షీఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు

అల్-షిఫా ఆసుపత్రిలోని సర్జికల్ థియేటర్‌లో 20 మంది నవజాత శిశువులు ఉన్న ఫోటోలు బీబీసీకి అందాయి.

విద్యుత్ సరఫరా నిలిచిపోయి, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పనిచేయడం లేదని, ఈ కారణంగా శిశువులు చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఆసుపత్రిలో నెలకొన్న గందరగోళం, ఆందోళనలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆసుపత్రిలో ఉన్న పరిస్థితుల గురించి తెలుసుకుంటే అర్థమవుతోంది.

ఆసుపత్రికి దగ్గరలోనే యుద్ధం జరుగుతోంది. అప్పుడే ఆపరేషన్ అయిన రోగులను తరలించడం సాధ్యం కాదు.

శవాలను ఖననం చేయడానికి కూడా అవకాశం లేక, శవాలు పేరుకుపోతున్నాయి.

రెండు రోజులుగా ఇజ్రాయెల్ దళాలు, హమాస్ యుద్ధం మధ్యలో చిక్కుకుపోయిన అల్-షిఫా ఆసుపత్రిలో వేల మందికి పైగా రోగులు, ప్రజలు తలదాచుకుంటున్నట్లు అంచనా.

ఇజ్రాయెల్-గాజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హమాస్-ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం మధ్య చిక్కుకుపోయిన అల్ షిఫా ఆసుపత్రి

కరెంటు లేక ఇద్దరు శిశువుల మృతి

అల్ షిఫా ఆసుపత్రి కింద భాగంలో ఉన్న సొరంగాల నుంచి హమాస్ తన కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఐడీఎఫ్ పదే పదే ఆరోపణలు చేస్తోంది. హమాస్ ఈ ఆరోపణలను ఖండించింది.

“అల్-షిఫా ఆసుపత్రి చుట్టూ క్షణానికోసారి కాల్పులు, బాంబుల శబ్దాలు వినిపిస్తున్నాయి” అని ఆసుపత్రిలోని వైద్యులు డా.మర్వాన్ అబు సాదా తెలిపారు.

ఆసుపత్రి చుట్టూ నెలకొన్న పరిస్థితులు, కాల్పుల కారణంగా శవాలను ఖననం చేసే పనులను నిలిపివేశామని ఆయన బీబీసీతో చెప్పారు.

“ఇంధనం లేక జనరేటర్‌ పనిచేయడం ఆగిపోయింది. దీని వలన మార్చురీలోని రిఫ్రిజిరేటర్ కూడా పనిచేయడం లేదు. కానీ, శవాల ఖననంతో మరేదైనా ప్రమాదం వస్తుందేమోనన్న భయంతో ఆ పనులు కూడా ఆపేశాం” అన్నారు.

ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా లేక నెలలు నిండకుండానే పుట్టిన ఇద్దరు శిశువులు మరణించినట్లు ‘ఫిజీషియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇజ్రాయెల్’ స్వచ్ఛంద సంస్థకు చెందిన వైద్యుల బృందం తెలిపింది.

మరో 37 మంది నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని హెచ్చరించింది.

గాజా సిటీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజాలోని అల్-షీఫా ఆసుపత్రి (నవంబర్ 10 నాటి చిత్రం)

‘ఈ శిశువులను ఇలానే వదిలేస్తే, చనిపోతారు’

అల్-షిఫా ఆసుపత్రిని తాము ముట్టడించలేదని, ఆసుపత్రి తూర్పు భాగం తెరిచే ఉందని ఇజ్రాయెల్ తెలిపింది. ఆసుపత్రి నుంచి వెళ్లాలనుకున్న వారు సురక్షితంగా వెళ్లొచ్చని ప్రకటించింది.

అధికార ప్రతినిధి డేనియల్ హగరీ ఆదివారం మాట్లాడుతూ, ఆసుపత్రిలోని పీడియాట్రిక్ విభాగంలో ఉన్న రోగులను సురక్షితమైన ఆసుపత్రికి తరలించేందుకు సాయం చేస్తామని అన్నారు.

ఆసుపత్రి నిర్వహణ సిబ్బంది కోరిన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

అల్-షీఫా ఆసుపత్రి సమీపంలో హమాస్ మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణ జరిగిందని, అయితే, ఆసుపత్రి వైపు గానీ, ఆసుపత్రి ఆవరణలో గానీ ఎలాంటి కాల్పులు జరపలేదని అంతకుముందు కల్నల్ మోషె టెట్రో చెప్పారు.

20 మంది శిశువులను వరుస క్రమంలో బెడ్‌లపై ఉంచిన ఫోటోలు బీబీసీకి అందాయి. చాలా వరకు శిశువుల మొఖాలపై టేప్‌లు అతికించి ఉన్నాయి. వారికి ఆక్సిజన్ సహాయం అవసరమని ఇవి గుర్తుచేస్తున్నాయి.

ఇజ్రాయెల్ ముట్టడితో పదిహేను రోజులుగా విద్యుత్ సరఫరాలో కొరత ఏర్పడి ఇంక్యుబేటర్ సామర్థ్యం మరింతగా తగ్గుతూ వచ్చిందని వైద్యులు చెప్తున్నారు.

డా.అబు సాదా మాట్లాడుతూ “శిశువులకు ఇంటెన్సివ్ కేర్ చికిత్స అవసరమని, లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్‌తోపాటు కృత్రిమంగా శ్వాస అందించే ఏర్పాట్లు అవసరం” అని చెప్పారు.

“ఈ పరిస్థితుల్లో శిశువులను ఇలానే వదిలేస్తే, చనిపోతారు. అందరూ నెలలు నిండకుండానే పుట్టిన శిశువులు” అంటూ తన ఆడియో క్లిప్‌ను బీబీసీకి పంపారు.

వైద్య చికిత్స అందక ఆసుపత్రిలోని రోగులు చనిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ చారిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

“కాల్పుల విరమణ జరగకపోతే ఆసుపత్రుల్లోని రోగులంతా చనిపోతారు. ఆసుపత్రులన్నీ శ్మశానాలుగా మారతాయి” అని ‘డాక్టర్స్ వితవుట్ బార్డర్స్’ (ఎంఎస్ఎఫ్) డిప్యూటీ మెడికల్ కోఆర్డినేటర్ బీబీసీతో అన్నారు.

అల్-క్వద్స్ ఆసుపత్రిలో 500 మంది రోగులు, 14 వేల మంది శరణార్థులు సహా ‘ది పాలస్తీనా రెడ్ క్రెసెంట్స్ సొసైటీ’ బృందాలు చిక్కుకుపోయాయని సొసైటీ తెలిపింది.

ఇదిలా ఉంటే, గాజాలోని చిన్న ఆసుపత్రులు దాదాపుగా ఖాళీ అవుతున్నాయి. అల్-రాంటిసి ఆసుపత్రిలో కొద్ది మంది రోగులు, సిబ్బంది మాత్రమే ఉన్నారు.

22 లక్షల మందికి ఆశ్రయం కల్పిస్తోంది గాజా స్ట్రిప్. యూఎన్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా రెఫ్యూజీస్ (యూఎన్ఆర్‌డబ్ల్యూఏ) లెక్కల ప్రకారం వీరిలో 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించిన హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండలో 1,200 మంది చనిపోయారు. రెండు వందల మందికి పైగా హమాస్ చెరలో బందీలుగా మారారు.

అందుకు బదులుగా దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ సైన్యం గాజాలో ప్రవేశించి, వైమానిక, భూతల దాడులను కొనసాగిస్తోంది.

ఇమాన్యుయెల్ మాక్రాన్
ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్

ఇజ్రాయెల్ కాల్పులు ఆపాలన్న ఫ్రాన్స్

శుక్రవారం బీబీసీ ఇంటర్వ్యూలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని మహిళలు, చిన్నారులను చంపడం ఆపాలన్నారు.

“రక్షణ కోసం పోరాటం చేసే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది, కానీ గాజాలో బాంబు దాడులను ఆపాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం” అన్నారు.

హమాస్ చేపడుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను ఫ్రాన్స్ వ్యతిరేకిస్తుందని ఆయన మరోసారి నొక్కి చెప్పారు. అయితే ఇజ్రాయెల్ చేపడుతున్న బాంబు దాడులను తాము సమర్థించలేమని, కాల్పుల విరమణ వల్ల ఇజ్రాయెల్ లాభపడుతుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)