ఇజ్రాయెల్- గాజా: ఆ వాట్సాప్ గ్రూప్ మూగబోయింది, ఎందుకంటే అందులో ఉన్నవారంతా చనిపోయారు

ఫొటో సోర్స్, Ahmed Alnaouq
- రచయిత, స్టెఫానీ హెగార్టీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
అప్పుడు ఉదయం 4 గంటలు అవుతుంది. అహ్మద్ మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే నిద్రలో నుంచి లేచాడు.
ఇజ్రాయెల్-గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి అహ్మద్ తరచుగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌ను చెక్ చేస్తున్నారు.
అహ్మద్, లండన్‌లో ఉంటారు. గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ విద్యుత్ సరఫరా నిలిపేసినప్పటి నుంచి తన తండ్రి, తోబుట్టువులతో మాట్లాడటం అహ్మద్‌కు కష్టంగా మారింది.
అంతకు రెండు రోజుల ముందే తన అక్క అయా నుంచి అహ్మద్‌కు ఒక మెసేజ్ వచ్చింది.
ఒక బాంబు దాడిలో తన ఇల్లు ధ్వంసమైనట్లు అయా సందేశం పంపారు.
‘‘ఇంట్లోని తలుపులు, కిటికీలు అన్ని పగిలిపోయాయి. కానీ, దేవుని దయవల్ల మాకేం కాలేదు. మేమంతా బాగానే ఉన్నాం’’ అని ఫ్యామిలీ గ్రూప్‌లో అయా మెసేజ్ చేశారు.
ఈ మెసేజ్‌కు అహ్మద్ రిప్లై ఇచ్చారు. ‘‘ఇల్లును మళ్లీ బాగు చేయించవచ్చు. మీరు సురక్షితంగా బయటపడ్డారు అదే చాలా ముఖ్యం’’ అని అయాకు అహ్మద్ మెసేజ్ చేశారు.
అయా తన నలుగురు పిల్లలను తీసుకొని సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్-బలాలో ఉన్న తన తండ్రి ఇంటికి వెళ్లిపోయారు.
ఆ రోజు రాత్రి అహ్మద్ మేల్కొని వాట్సాప్ చెక్ చేస్తే తన ఫ్యామిలీ గ్రూప్‌లో ఎలాంటి అలికిడి లేదు.
కానీ, ఇతరుల నుంచి తనకు వచ్చిన మెసేజ్‌లను ఆయన చూశారు.
అప్పడే తన కుటుంబ సభ్యులు అందరూ చనిపోయినట్లు ఆయన గుర్తించారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు గాజాలోని తన మిత్రునికి అహ్మద్ ఫోన్ చేశారు.

ఫొటో సోర్స్, Alnaouq family
యుద్ధం మొదలైనప్పటి నుంచి అహ్మద్‌తో పాటు ఆయనతో ఫ్లాట్‌లో నివసించేవారంతా ఒక రకమైన నరకాన్ని అనుభవిస్తున్నారు.
విధ్వంసం, మరణాలకు సంబంధించిన వార్తలతో వారి ఫోన్లలో సందేశాలు నిండిపోయాయి.
ప్రతీరోజూ ఎవరో ఒకరు మరణించారనే వార్తను వారు వినాల్సి వచ్చేది. కానీ, యుద్ధం నేరుగా తన కుటుంబాన్ని కబళిస్తుందని అహ్మద్ ఎప్పుడూ అనుకోలేదు.
డెయిర్ అల్-బలాలో మునుపెన్నడూ టార్గెట్ చేయని ప్రాంతంలో వారి ఇల్లు ఉంటుంది.
‘‘వారికి ఇది భయానక సమయం. కానీ అందరూ బాగానే ఉంటారని నేను అనుకున్నా’’ అని అహ్మద్ చెప్పారు.
వైమానిక దాడిలో వారి ఇల్లు నేలమట్టం కావడంతో అందులో ఉన్న తన తండ్రి, ముగ్గురు అక్కలు, ఇద్దరు అన్నలు, వాళ్ల 15 మంది పిల్లలు కలిపి మొత్తం 21 మంది చనిపోయారు.

ఫొటో సోర్స్, Alnaouq family
మృతుల జాబితా చాలా పెద్దగా ఉంది. తన కుటుంబంలో మరణించిన వారి పేర్లు, వయస్సు వివరాలు చెబుతూ అహ్మద్ తడబడ్డారు.
చనిపోయిన పిల్లల్లో 13 ఏళ్ల ఎస్లమ్ అందరికంటే పెద్దవాడు. ఆయన అహ్మద్‌కు మేనల్లుడు. పిల్లలందరిలో ఎస్లమ్‌తో అహ్మద్‌కు ఎక్కువ అనుబంధం ఉంది.
ఎస్లమ్ పుట్టినప్పుడు అహ్మద్ టీనేజర్. అప్పుడు అహ్మద్ తల్లిదండ్రులతో కలిసి ఉండేవారు. అహ్మద్ అక్క కుమారుడు ఎస్లమ్. ఆమె ఉద్యోగానికి వెళుతుండటంతో అహ్మద్ తల్లి ఎక్కువగా ఎస్లమ్‌ను చూసుకునేవారు. ఎస్లమ్‌కు తినిపించడం, న్యాపీలు మార్చడం వంటి పనుల్లో తల్లికి అహ్మద్ సహాయపడేవారు.
పెరిగి పెద్దయ్యాక మామ అహ్మద్‌లా ఉండాలని అనుకుంటున్నట్లు ఎస్లమ్ చెప్పేవారు.
ఎస్లమ్ బాగా చదివేవాడని, యూకేకు రావాలనే ఉద్దేశంతో ఇంగ్లిష్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేవాడని అహ్మద్ గుర్తు చేసుకున్నారు.
ఎస్లమ్‌తో పాటు అతని చెల్లెళ్లు దిమా (10), తలా (9), నూర్ (5), నస్మా (2), ఎస్లమ్ కజిన్లు రఘద్ (13), బకర్ (11), ఇస్లా (9), సారా (9), మొహమ్మద్ (8), బసీమా (8), అబ్దుల్లా (6), తమీమ్ (6) చనిపోయారు.

ఫొటో సోర్స్, Alnaouq family
చివరిసారిగా వీడియో కాల్‌లో ఈ పిల్లలందరినీ అహ్మద్ చూశారు. తనకు బోనస్ లభించడంతో కుటుంబ సంప్రదాయం ప్రకారం మేనళ్లుల్లు, మేన కోడళ్లకు ట్రీట్ ఇస్తానని అహ్మద్ ప్రామిస్ చేశారు.
‘‘బీచ్‌కు వెళ్లాలని ఉందని వారంతా నాకు చెప్పారు. అక్కడ నచ్చిన ఆహారం తిని, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలని ఉందన్నారు. ఆ ఏర్పాట్లన్నీ నేను చేశాను. ఆ రోజు బీచ్ నుంచి వారు నాకు ఫోన్ చేశారు. నాతో మాట్లాడేందుకు పోటీపడ్డారు. ఇప్పుడు వారిలో 15 మంది చనిపోయారు’’ అని అహ్మద్ చెప్పారు.
తన తొమ్మిది మంది తోబుట్టువుల్లో తనతో పాటు ఇద్దరు అక్కలు మాత్రమే ఇప్పుడు ప్రాణాలతో మిగిలి ఉన్నట్లు అహ్మద్ అన్నారు.
తన కుటుంబంపై వైమానిక దాడి జరిగిన తర్వాత, చనిపోయిన పిల్లలందరి ఫొటోలను అహ్మద్ ఆన్‌లైన్‌లో ఉంచారు. అందులో మూడేళ్ల ఒమర్ ఫొటో కూడా ఉంది.
అప్పుడే తన అక్క ఫోన్ చేసి ఒమర్ బతికే ఉన్నాడని చెప్పినప్పుడు తన జీవితంలో అదే అత్యంత ఆనందకర క్షణంగా అనిపించిందని అహ్మద్ చెప్పారు.
బాంబు దాడి జరిగినప్పుడు తల్లి షిమా, తండ్రి ముహమ్మద్ మధ్యలో ఒమర్ నిద్రిస్తున్నాడు. ఈ దాడిలో ముహమ్మద్ చనిపోగా షిమా, ఒమర్ ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ దాడి నుంచి అహ్మద్ 11 ఏళ్ల మేనకోడలు మలక్ కూడా సజీవంగా బయటపడ్డారు. కానీ, ఆమె శరీరం 50 శాతం కాలిపోయింది.

ఫొటో సోర్స్, Alnaouq family
నేను అహ్మద్‌ను కలిసినప్పుడు, ఆసుపత్రిలో ఉన్న మలక్ ఫొటోను చూపించారు. ఆమె శరీరం మొత్తం బ్యాండేజ్‌లతో నిండి ఉంది.
మొదట చిన్నగా ఉన్న జుట్టును చూసి ఆ ఫొటోలో ఉన్నది బాలుడేమో అని పొరబడ్డాను. కానీ, జుట్టు చాలా పొడవుగా ఉండేదని, ఈ దాడిలోనే ఆమె జుట్టు కాలిపోయి ఉండొచ్చని మలక్ గురించి అహ్మద్ చెప్పారు.
ఈ బాంబు దాడి జరిగినప్పుడు మలక్ తండ్రి ఇంట్లో లేరు. దీంతో ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారు. కానీ, ఆయన భార్య మరో ఇద్దరు పిల్లలు చనిపోయారు.
ఎలా ఉన్నారంటూ ఆయనను అహ్మద్ మెసేజ్ ద్వారా పలకరిస్తే, ‘‘బతికి ఉన్న శవంలా ఉన్నానంటూ’’ ఆయన సమాధానం ఇచ్చారు.
ఆ సమయంలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేయడంతో గాజాలో పూర్తిగా ఫోన్ సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో అహ్మద్ ఎవరినీ సంప్రదించలేకపోయారు.
రెండు రోజుల తర్వాత సిగ్నల్స్‌ను పునరుద్ధరించారు. అప్పుడే ఆయనకు మలక్ చనిపోయిన సంగతి తెలిసింది.

ఫొటో సోర్స్, Alnajjar family
వైద్య సామగ్రి కొరత ఏర్పడటంతో పాటు మరో ఎమర్జెన్సీ కేసు రావడంతో ఐసీయూ నుంచి మలక్‌ను వేరే వార్డుకు తరలించాల్సి వచ్చింది. అప్పటికి ఆమె ఏమాత్రం కోలుకోలేదు.
‘‘మలక్ అవస్థను చూడలేక రోజుకు వందసార్లు నేను చచ్చిపోయాను’’ అని అహ్మద్‌తో మలక్ తండ్రి చెప్పారు. మలక్ చనిపోవడంతో ఆయన తన ముగ్గురు పిల్లలను కోల్పోయినట్లయింది.
మరోవైపు తన అంకుల్ ఇంటిపై కూడా దాడి జరిగినట్లు అహ్మద్‌కు తెలిసింది. అయితే, అక్కడ ఎవరు చనిపోయారనే విషయం ఇంకా అహ్మద్‌కు తెలియదు. కమ్యూనికేషన్ వ్యవస్థ మళ్లీ నిలిచిపోయింది.
గాజాలో 20కి పైగా కుటుంబ సభ్యులను కోల్పోయిన ముగ్గురు వ్యక్తులతో మేం మాట్లాడాం. అందులో ఒకరు దార్విష్ అల్ మనామా. దార్విష్ తన 44 మంది కుటుంబసభ్యులను కోల్పోయారు. దార్విష్ అంతులేని వేదనను అనుభవిస్తున్నారు.
యారా షరీఫ్ లండన్‌లో ఉంటారు. యారా షరీఫ్ ఒక ఆర్కిటెక్ట్. ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన తన అత్త ఇంటి ఫొటోలను యారా మాకు పంపించారు.

ఫొటో సోర్స్, Alnajjar family
‘‘అది చాలా అందమైన ఇల్లు. మధ్యలో పెద్ద ప్రాంగణం ఉండేది. అందమైన భవంతి అది. ఇజ్రాయెల్ దాడుల్లో ఆ ఇంట్లోని 20 మంది చనిపోయారు’’ అని యారా చెప్పారు.
యారా అత్త, అంకుల్, ఆమె ఇద్దరు కజిన్లు, వారి 10 మంది పిల్లలతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులు ఈ దాడిలో కన్నుమూశారు.
వారిలో శిథిలాల్లో చిక్కుకుపోయిన కొందరి మృతదేహాలను బయటకు తీశారు. హమాస్ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మృతుల జాబితాలో వారి పేర్లు కూడా ఉన్నాయి.
మృతుల్లో సామ (16), కవలలు ఒమర్, ఫాహ్మీ (14), అబ్దుల్ (13), ఫాతిమా (10), ఒబైడా (7), అలెమన్ (5), ఫాతిమా (5), యూసుఫ్ (4), సారా (3), అనస్ (3) ఉన్నారు.
యారా ఇద్దరు కజిన్లు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, మీడియాతో మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారనే నిరాధారమైన పుకార్ల కారణంగా తమ పేర్లను చెప్పవద్దని వారు కోరారు.
‘‘ముహమ్మద్ బాడీతో పాటు పిల్లలిద్దరి మృతదేహాలు ఇంకా శిథిలాల కిందే మిగిలిపోయాయి’’ అని వారు యారాకు మెసేజ్ చేశారు.

ఫొటో సోర్స్, Alnajjar family
శుక్రవారం రోజు అహ్మద్ వద్ద నేను ఉన్నప్పుడు టీవీలో మృతుల వివరాలు ఇచ్చారు. ఆ వివరాల్లో మీ కుటుంబ సభ్యులు ఉన్నారా? అని అడగగా, కేవలం 12 మంది మాత్రమే ఉన్నారని, మిగతా 9 మంది మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదని అహ్మద్ చెప్పారు.
బాంబు దాడి జరిగినప్పుడు తన సొంత ఇంట్లో ఉన్న అహ్మద్ పెద్దక్క గత వారం శిథిలమైన ఇంటి వద్దకు వెళ్లారు.
కానీ, కుళ్లిపోయిన మృతదేహాల వాసనను భరించలేకపోయానని అందుకే అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయానని ఆమె అహ్మద్‌కు మెసేజ్ చేశారు.
శుక్రవారం నుంచి తన అక్కలతో అహ్మద్ మాట్లాడలేదు. వారి ఫోన్లు పనిచేయడం లేదు. అక్కడేం జరుగుతుందో ఆయనకు తెలియట్లేదు.
బాంబు దాడులు జరుగుతున్నప్పటి తన బాధను మాటల్లో చెప్పలేనని అహ్మద్ అన్నారు. ఏడ్చినా దాని వల్ల ఒరిగేదేమీ లేదని అంటున్నారు.
‘‘నేను కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, నిద్రపోలేకపోతున్నా. ఈ బాధను ఎలా అధిగమించాలో అర్థం కావడం లేదు’’ అని అహ్మద్ అన్నారు.

ఫొటో సోర్స్, Alnaouq family
మృతుల్లో అహ్మద్ చిన్న తమ్ముడు మహమూద్ కూడా ఉన్నారు.
అహ్మద్ తరహాలోనే మహమూద్ కూడా ఎన్జీవోలో పనిచేసేవారు.
ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయడానికి మహమూద్‌కు ఇప్పుడే స్కాలర్‌షిప్ ఆఫర్ వచ్చింది.
‘‘యుద్ధం మొదలైన వారం రోజులకు ఫోన్ చేసిన మహమూద్ తనకు ఆస్ట్రేలియా వెళ్లడం లేదని చెప్పాడు. గాజాపై దాడులకు పశ్చిమ దేశాల స్పందనపై అతను చాలా కోపంగా ఉన్నాడు’’ అని అహ్మద్ తెలిపారు.
‘‘ఇక దీన్ని నేను భరించలేకపోతున్నా. మమ్మల్ని ఊచకోత కోస్తున్నారు’’ అంటూ మహమూద్ ఒక ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చేసిన వారం రోజుల తర్వాత తన తండ్రి ఇంట్లో మహమూద్ చనిపోయారు.
తన తండ్రి గురించి అహ్మద్ మాట్లాడుతూ, ‘‘ఆయన చాలా దయగల వ్యక్తి. మమ్మల్ని చదివించడం, మాకు ఇల్లు కట్టడం కోసం ఆయన ట్యాక్సీ డ్రైవర్‌గా, భవన నిర్మాణంలో పని చేస్తూ చాలా కష్టపడ్డారు’’ అని చెప్పారు.
ఇప్పుడు ప్రాణాలతో ఉన్న తన ఏకైక మేనల్లుడు ఒమర్ గురించి తలుచుకుంటూ అహ్మద్ ఇలా అన్నారు. ‘‘ఒమర్ ఏమనుకుంటాడు? ఈ యుద్ధం తన కుటుంబాన్ని పొట్టన పెట్టుకుందని తెలిశాక ఒమర్ ఏ వైపు నడుస్తాడు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- షరాన్ స్టోన్ : ‘నీ అంత అందగత్తె ఇంకెవరూ లేరంటూ నా ముందే ప్యాంట్ విప్పేశాడు..’
- కేసీఆర్, రేవంత్, ఈటల: రెండు నియోజకవర్గాలలో పోటీ...చరిత్ర ఏం చెప్తోంది?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- బంగ్లాదేశ్ చరిత్రలో రక్తపు మరకలు...ఆ వారం రోజుల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














