శవాలను గుర్తించేందుకు గద్దలను వినియోగిస్తున్న ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, RSPB
- రచయిత, ఫిల్ మెక్ కాస్లాండ్
- హోదా, బీబీసీ న్యూస్
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడి హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించేందుకు గద్దలను వినియోగిస్తున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు.
గద్దలకు అమర్చిన జీపీఎస్ ట్రాకింగ్ పరికరాల ద్వారా అవి చేరుకుంటున్న ప్రదేశాలను గుర్తిస్తున్నారు ఇజ్రాయెల్ నేచర్ అండ్ పార్క్స్ అథారిటీకి చెందిన ఒహద్ హట్జోఫె.
అక్టోబర్ 23న ఇజ్రాయెల్ సైన్యం సాయం కోరినప్పటి నుంచి గద్దలను వినియోగిస్తున్న హట్జోఫె, ఈ డేటా సాయంతో ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. మరో పక్షి కొన్ని ఇతర ప్రాాంతాలను గుర్తించిందని అన్నారు.
ఇజ్రాయెల్‌కు చెందిన తెలుపు తోక కలిగిన గద్దకు సంబంధించిన డేటాను తొలుత విశ్లేషించినట్లు తెలిపారు.
అంతరించిపోతున్న జాతికి చెందిన ఈ జాతి పక్షుల సంఖ్యను మళ్లీ వృద్ధి చేశారు శాస్త్రవేత్తలు.
ఉత్తర మాస్కో నుంచి వలస వచ్చిన ఈ పక్షి ఆకలితో ఉందని, చురుగ్గా వేటాడలగదని చెప్పారు హట్జోఫె.
డేటా ఆధారంగా విశ్లేషణ..
తన ప్రయాణంలో ఈ పక్షి ఆగిన ప్రదేశాలను గుర్తించి, ఆ డేటాను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దళాలకు అందజేశారు హట్జోఫె. అనంతరం నాలుగు మృతదేహాలను గుర్తించారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్-గాజా సరిహద్దు కంచెలను ధ్వంసం చేసి దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలోకి జొరబడిన హమాస్ మిలిటెంట్లు మారణకాండకు పాల్పడ్డారు. ఇజ్రాయెల్ కమ్యూనిటీలు, మిలటరీ స్థావరాలతోపాటు మ్యూజిక్ ఫెస్టివల్‌ను లక్ష్యాలుగా చేసిన దాడుల్లో పద్నాలుగు వందల మందికి పైగా చనిపోయారు. 200 మందికి పైగా బందీలుగా మారారు.
అనంతరం జరిగిన పరిణామాల్లో ఇజ్రాయెల్ సైన్యం గాజాలో చేసిన దాడుల్లో ఇప్పటివరకు 10,800 మందికిపైగా మరణించినట్లు హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరణించిన వారిలో 4,400 మందికి పైగా చిన్నారులు ఉన్నారని తెలిపింది.
పక్షి ఆగిన ప్రదేశాలను జీపీఎస్ పరికరాల సాయంతో గుర్తిస్తున్నారు హట్జోఫె. ఈ పరికరాలకు కెమరాలు అమర్చకపోయినా, పక్షులు ఎగురుతున్న తీరు, ఇతర డేటాను విశ్లేషించి, ఆ సమాచారాన్ని సేకరించి, శాటిలైజ్ ఇమేజరీ సాయంతో డేటాను సరిచూసుకుంటున్నారు.
ముఖ్యంగా తమ వారి కోసం ఎదురుచూస్తున్న బాధితుల ప్రశ్నలకు సమాధానం వెతికేందుకు చేస్తున్న ఈ సాయం తనకు చాలా సంతృప్తినిస్తోందని అన్నారు,
కిబ్బుట్జ్‌లోని నిర్ ఒజ్ ప్రాంతంలో హమాస్ దాడుల తర్వాత కనిపించకపోయినా తన మిత్రుడు ఒహద్ యహలొమి, అతని 12 ఏళ్ల కుమారుల ఆచూకీ ఇప్పటికీ తెలియలేదని చెప్పారు.
హమాస్ మిలిటెంట్లు తన భర్తను కాల్చిచంపారని, తాను, తన ఇద్దరు పిల్లలతో కలిసి తప్పించుకోగలిగానని ఒహద్ యహలొమి భార్య మీడియాకు చెప్పారు.
“ఇది చాలా బాధాకరం” అని హట్జోఫె చెప్పారు.
ఒహద్ యహలొమి మృతదేహాన్ని గుర్తించేందుకు త్వరలోనే సాయం చేస్తానని అన్నారు.
ఈ యుద్ధం త్వరలోనే ముగిసిపోతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
సాధారణ సమయంలో రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ఈ యుద్ధకాలంలో అంతా కలిసికట్టుగా ఉండాలని ఆయన అన్నారు.
“మనం ఆపదలో ఉన్నాం. అందరం ఒకే లక్ష్యం కోసం పని చేస్తున్నాం. పక్షుల కదలికలు, వాటి ప్రవర్తనల విశ్లేషణలో నాకున్న ప్రావీణ్యం ఏదో ఒకరకంగా ఉపయోగపడుతున్నందుకు సంతోషంగా ఉంది” అన్నారు.
తనలాగే ఈ పని చేయడానికి చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నారు. హట్జోఫ్ సహచరుల్లో చాలామంది మిలటరీ సేవల్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రోజూ 4 గంటలపాటు దాడులకు విరామం
ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు ముమ్మరం చేస్తోంది. హమాస్ స్థావరాలే లక్ష్యాలుగా భూతల, వైమానిక దాడులు జరుగుతున్నాయి.
ఇప్పటికే పౌరులు ఉత్తరగాజాను ఖాళీ చేయాలని చాలాసార్లు కోరింది ఐడీఎఫ్. చాలామంది వెళ్లినప్పటికీ, ఇంకా ఉత్తరగాజాలోని పలు ప్రాంతాల్లో పౌరులు ఉన్నారు. వీరు కూడా సురక్షితంగా దక్షిణ గాజాకు వెళ్లేందుకు వీలుకల్పిస్తూ, రోజూ నాలుగు గంటలపాటు మిలటరీ ఆపరేషన్‌కు విరామం ఇస్తున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది. పౌరులంతా కాలినడకనే దక్షిణ గాజాకు చేరుకుంటున్నారు.
ఈ ఒప్పందం పట్ల అమెరికా అధ్యక్షులు స్పందిస్తూ, ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని సరైన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా చెప్పారు. పౌరులు సురక్షితంగా దక్షిణ ప్రాంతానికి వెళ్లేందుకు ఈ విరామం అవసరమని అన్నారు.
విరామ సమయంపై ఇజ్రాయెల్‌తో సంప్రదింపులు కొనసాగుతాయని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.
బీబీసీతో ఆయన మాట్లాడుతూ, హమాస్ చెరలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించేందుకు భవిష్యత్తులో ఎక్కువ విరామ సమయం అవసరమవుతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















