మృతదేహాలకు స్నానం చేయించి, మేకప్ చేసి అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న 24 ఏళ్ల మహిళ

చనిపోయిన వారి శరీరాలతోనే ఇసాబెల్ వాల్టన్ రోజు గడుస్తుంది. శవాలను అంత్యక్రియల కోసం ముస్తాబు చేయడాన్ని తాను గర్వంగా భావిస్తున్నానని ఆమె చెప్తారు.
మరణ భయాన్ని ఎదుర్కొంటున్న టీవీ ప్రెజెంటర్ స్టాసీ డూలే, చనిపోయిన తర్వాత ఎంబామింగ్ ఎలా చేస్తారో తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఆమె కలిసిన వ్యక్తుల్లో ఈ యువ ఎంబామర్ ఒకరు.
చల్లగా, శుభ్రంగా ఉన్న ఆ మార్చురీ (శవాగారం)లో ఒక ఇబ్బందికరమైన వాసన వస్తోంది.
‘‘ఇక్కడ వెంటిలేషన్ వ్యవస్థ ఉంది కానీ, సాధారణ ప్రజలు మనం వాడే కెమికల్స్‌ను వాసనను తట్టుకోలేరు. అందుకే నేను ఎప్పుడూ ముక్కుకు మాస్క్ వేసుకునే ఉంటాను'' అని వాల్టన్ చెప్పారు.
మార్చురీ మేనేజర్‌గా 24 ఏళ్ల వాల్టన్‌కి అదేమీ పెద్ద విషయం కాదు.
‘‘ఒకమ్మాయి అయి ఉండి, అందులోనూ చాలా చిన్న వయసులో ఈ పని చేస్తున్నావా అని జనం ఆశ్యర్యపోతుంటారు.'' అని ఆమె చెప్పారు.
దానికి కారణం కూడా చెబుతున్నారామె.
‘‘ఈ పనిలో కూడా ఇప్పటికీ మగవాళ్లదే ఆధిపత్యం.’’ అన్నారామె.

ఏడబ్ల్యూ లిమ్న్‌తో కలిసి నాటింగ్‌హామ్‌లో పనిచేస్తున్నారు వాల్టన్. 2019 నుంచి ఆమె ట్రైనీ ఫ్యునరల్ డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ ఆమె ఎక్కువగా కంపెనీ మార్చురీలో పనిచేసేవారు.
ఎంబామింగ్ చదువుతూనే తనకు 21 ఏళ్లు వచ్చినప్పటి నుంచి ఆమె అక్కడ ఫుల్ టైమ్ పని చేయడం ప్రారంభించారు.
వయసులో చిన్నదే అయినప్పటికీ శిక్షణ తరగతుల్లో మాత్రం అందరికంటే ముందుండేవారు. కుటుంబం ఎప్పుడూ ఆమెకు అండగా ఉంది. అయితే, తాను చేస్తున్న పని గురించి చెప్పినప్పుడు ఆమె స్నేహితుల్లో కొందరు మాత్రం గాబరాపడేవారు.
బీబీసీ వన్ కోసం స్టాసీ డూలీ ఇటీవల మార్చురీకి వెళ్లారు. తన మరణ భయాన్ని జయించేందుకు ఆమె ప్రయత్నించారు. అదొక నివారించలేని, అర్థంలేని భయమని చివరకు ఆమె అంగీకరించారు.
''అలా జరగదని తెలిసినా, నేను ఎప్పటికీ బతికే ఉండాలని కోరుకుంటా'' అని టీవీ ప్రెజెంటర్ అన్నారు.
కానీ, చుట్టూ మృతదేహాలు ఉన్నా ఎలాంటి భయం లేకుండా ఉండడమే కాకుండా, రోజంతా అక్కడ ఉండడంలో తనకు ఇబ్బందేమీ ఉండదని వాల్టన్ చెప్పారు.
‘‘ఏదైనా జరిగినా నేను చూసుకోగలను’’ అన్నారామె.
ఆ మార్చురీలో దాదాపు 80 మృతదేహాలు ఉన్నాయి. ఒక్కోటి కనీసం 15 - 20 రోజుల నుంచి అక్కడ భద్రపరిచారు.

ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు ముందు మాత్రమే వారిని శవపేటికలో పెట్టాలని చాలా మంది అనుకుంటారని వాల్టన్ చెప్పారు. కానీ, ఆ శరీరాలను అంత్యక్రియలకు సిద్ధం చేసేందుకు ఆమె సమయం తీసుకుంటారు.
కాబట్టి, చనిపోయిన వారి అంత్యక్రియలకు ముందు వారి ఆత్మీయులు తమను విడిచి వెళ్తున్న వారితో కొంత సమయం గడపొచ్చు.
ఆమె మృతదేహాలకు స్నానం చేయిస్తారు, జట్టును అందంగా దువ్వుతారు, అవసరమైతే షేవ్ చేస్తారు. దుస్తులు వేసి, ఆ తర్వాత మేకప్ కూడా చేస్తారు.
''ఎవరైనా చాలా కాలం ఆస్పత్రిలో ఉండి చనిపోతే, వారి కుటుంబాలు వారిని మాసిన గడ్డంతో చూడాలని అనుకోకపోవచ్చు. మంచి దుస్తులు వేసుకుని, క్లీన్‌షేవ్‌తో అందంగా కనిపించాలని కోరుకోవచ్చు'' అని వాల్టన్ అన్నారు.
ఆమె, ఆమె సహోద్యోగులు మృతదేహాలకు 65 శాతం ఎంబామ్ చేస్తారు. డెడ్‌బాడీలు త్వరగా కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు ఉండేలా చేసే ప్రక్రియ ఇది. ఇందులో ప్యాకేజీలుంటాయి.
అంత్యక్రియల వేళ శవపేటిక మూత తెరిచినప్పుడు, మళ్లీ బొద్దుగా, జీవం ఉన్నట్లుగా కనిపించేలా చేయొచ్చని, ఎలా తీర్చిదిద్దాలనేది వారి కుటుంబ సభ్యులు ఎంచుకునే ప్యాకేజీని బట్టి ఉంటుందని ఆమె చెప్పారు.
''నేను చేసే పనిలో చాలా శ్రద్ధగా ఉంటాను. ఎక్కువ సమయం వెచ్చిస్తాను. అయితే, దానిపై ఎంత శ్రద్ధ తీసుకుంటారో ప్రజలు గ్రహించడం లేదని నేను అనుకుంటున్నా'' అని ఆమె చెప్పారు.
ఎంబామింగ్ ప్రక్రియలో భాగంగా శరీరాన్ని శుభ్రం చేస్తారు. నోరు తెరుచుకోకుండా కుడతారు. శరీరంలోని రక్తం అంతటినీ బయటికి తీసేసి క్రిమిసంహారక ఫార్మాల్డిహైడ్ ఫ్లూయిడ్ ఎక్కిస్తారు. శరీరం చుట్టూ కూడా దాన్ని చల్లుతారు. శరీరంలోని అవయవాల్లో ఉన్న వాయువులను కూడా బయటికి పంపించేసి ఎంబామింగ్ ఫ్లూయిడ్‌తో నింపేస్తారు.
రసాయనాల వినియోగం కారణంగా కొన్ని మత విశ్వాసాలు ఎంబామింగ్ ప్రక్రియను అంగీకరించవు.

''ఒకవేళ ఎవరైనా ప్రమాదాల్లో చనిపోయిన వారి మృతదేహాలకు ఎంబామింగ్ చేయాల్సి వస్తే, ముందు శరీరాన్ని సాధారణంగా కనిపించేలా చేయాల్సి ఉంటుంది. ముందుగా దెబ్బతిన్న భాగాలను ఎంబామింగ్ చేయాలి. తర్వాత మైనంతో, దాని తర్వాత ప్రత్యేకంగా మేకప్ వేయాల్సి ఉంటుంది'' అని వాల్టన్ చెప్పారు.
''అది బతికి ఉన్నవాళ్లకు మేకప్ వేసినట్టు కాదు. అందుకోసం మార్చురీ మేకప్ వాడతాం. అప్పుడే అది చల్లబడిపోయిన శరీరంపై అతుక్కుని ఉంటుంది'' అని ఆమె అన్నారు.
సాధారణంగా డిసెంబర్ నుంచి మార్చి మధ్య చలికాలంలో ఫ్యునరల్ డైరెక్టర్స్ బిజీగా ఉంటారు. ఆ సమయంలో ఎక్కువ మరణాలు సంభవిస్తూ ఉంటాయి.

''అక్కడ కిటికీలు కూడా ఉండవు. కాఫీ కోసం వెళ్లినప్పుడే మాత్రమే నాకు వెలుతురు కనపడుతుంది'' అన్నారు వాల్టన్.
మార్చురీలోనూ, అంత్యక్రియల్లోనూ మూసపద్ధతులను తాను సవాల్ చేయాలనుకుంటున్నానని వాల్టన్ అన్నారు. అంత్యక్రియల వేళ ఎవరైనా సాయం అడిగితే మహిళల్లో ఆమె ఒక్కరే ఉండేవారు. కానీ, ఇటీవల ఒక అంత్యక్రియలో నలుగురు మహిళలు ఉన్నారని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నేపాల్ భూకంపం: ‘ప్లేట్లు, గిన్నెలతో తవ్వి శిథిలాల కింద ఉన్న వారి కోసం వెతికాం’
- దొడ్డిదారిన అమెరికా వెళ్లి పట్టుబడిన 96 వేల మంది భారతీయులు.. వాళ్లంతా అక్కడి వరకు ఎలా వెళ్లారు?
- కిబ్బుట్జ్ బీరి: ఇజ్రాయెల్ తమను కాపాడగలదన్న ఈ ప్రాంత ప్రజల నమ్మకం కూడా ధ్వంసమైందా?
- ఫియోనా: ఈ ‘ఒంటరి గొర్రె’ గురించి ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి?
- ఫిలిప్పీన్స్: ఈ చిన్న దేశం చైనాను ఎందుకు ప్రపంచం ముందు నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














