టిక్ టిక్ టిక్ : ‘మీ ప్రాంతంపై బాంబులు వేస్తాం, మీకు రెండు గంటలే టైం ఉంది'

ఇజ్రాయెల్ - గాజా

ఫొటో సోర్స్, BBC/GETTY

    • రచయిత, అలైస్ కుడ్డీ
    • హోదా, బీబీసీ న్యూస్, జెరూసలెం

తెల్లవారుజాము సమయంలో మహమూద్ షాహీన్‌కి ఫోన్ కాల్ వచ్చింది.

అది గురువారం ఉదయం, సుమారు 6.30 గంటల సమయం. అప్పటికే గాజాపై 12 రోజులుగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది.

గాజా స్ట్రిప్‌లోని అల్-జహ్రా పట్ణణంలో మధ్యతరగతి ప్రజలు నివాసముండే ఒక అపార్ట్‌మెంట్‌లోని మూడవ అంతస్తులో, ఒక త్రిబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌లో ఆయన ఉంటున్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆ ప్రాంతంపై పెద్దగా జరగలేదు.

బయటి నుంచి పెద్దపెద్ద అరుపులు, కేకలు వినిపించాయి. ''మీరు తప్పించుకోవాలి, ఎందుకంటే, వారు ఈ టవర్ల (అపార్ట్‌మెంట్లు)పై బాంబులు వేయబోతున్నారు'' అని ఎవరో పెద్దగా అరిచారు.

వెంటనే ఆయన అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వచ్చి, రోడ్డు దాటి సురక్షిత ప్రదేశం కోసం వెతుకుతున్నారు. అప్పుడే ఆయన ఫోన్ మోగింది.

''నేను ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్‌ నుంచి మాట్లాడుతున్నా'' అని చెప్పారని మహమూద్ తెలిపారు.

ఆ ఫోన్ కాల్ గంటకుపైగా సాగిందని, తన జీవితంలో అత్యంత భయంకరమైన ఫోన్ కాల్ అదేనని ఆయన అన్నారు.

మహమూద్ షాహీన్

ఫొటో సోర్స్, MAHMOUD SHAHEEN

ఫొటో క్యాప్షన్, ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మహమూద్ చాలా మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు

'మూడు టవర్లపై బాంబులు వేయబోతున్నాం'

ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి మహమూద్ పూర్తి పేరు చెప్పడంతో పాటు, అరబిక్‌లో ధారాళంగా మాట్లాడుతున్నారు.

''మూడు టవర్లపై బాంబులు వేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆ చుట్టుపక్కల ప్రదేశాలను ఖాళీ చేయించాలని నన్ను ఆదేశించారు''

మహమూద్ నివసిస్తున్న టవర్‌కి ఎలాంటి ప్రమాదం లేకపోయినప్పటికీ, వందల మందిని ఖాళీ చేయించాల్సిన బాధ్యత అనూహ్యంగా అతనిపై పడింది. ''ప్రజల ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి'' అని ఆయన అన్నారు.

వెంటనే తేరుకున్న మహమూద్, ఫోన్ కట్ చేయొద్దని అబు ఖలీద్‌గా పరిచయం చేసుకున్న అవతలి వ్యక్తికి చెప్పారు.

ఈ పనికి తననే ఎందుకు ఎంచుకున్నారో దంత వైద్యుడైన 40 ఏళ్ల మహమూద్‌కి తెలియదు. కానీ, ఆ రోజు తన చుట్టూ ఉన్న ప్రజలను కాపాడుకోవడానికి ఆయన చేయాల్సిందంతా చేశారు.

తన ఫోన్ బ్యాటరీ అయిపోయినా కూడా తనను సంప్రదించగలుగుతున్న ఆ అపరిచిత వ్యక్తులు చెప్పినట్లు ఆయన నడుచుకున్నారు. బాంబు దాడులు ఆపాలని వారిని వేడుకున్నారు. ప్రజలు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని గొంతుకు చిల్లులు పడేలా అరిచారు.

చుట్టుపక్కల ఉన్న జనాన్ని పెద్దసంఖ్యలో అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఆ తర్వాత అక్కడి భవనాలు కుప్పకూలడం ఆయన కళ్లారా చూశారు.

ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసే ముందు గాజాలోని కొంతమందికి ఇజ్రాయెల్ సైన్యం ఫోన్ చేసి హెచ్చరికలు చేస్తోంది. అందుకు మహమూద్ ఉదంతమే నిదర్శనంగా నిలుస్తోంది.

మహమూద్‌కి అలాంటి హెచ్చరిక కాల్ వచ్చిందని అల్‌-జహ్రాకి చెందిన కొందరు చెప్పడంతో బీబీసీ ఆయనను సంప్రదించింది.

ఆ రోజు ఫోన్ కాల్ సంభాషణలను మేం ధ్రువీకరించలేదు. అయితే అది జరిగిన మూడు వారాల తర్వాత తనకు గుర్తున్న విషయాలను మహమూద్ చెప్పారు. అయితే, కమ్యూనిటీ ఫేస్‌బుక్ గ్రూపుల్లోని సమాచారం, ఆ ప్రాంతంలో బాంబులు వేయకముందు, వేసిన తర్వాత తీసిన శాటిలైట్ చిత్రాలు ఆయన చెప్పిన వివరాలతో సరిపోలాయి.

వందల సంఖ్యలో అపార్ట్‌మెంట్లు ఉన్న కనీసం 25 నివాస భవన సముదాయాలను, పరిసర ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం బంబులతో నాశనం చేయడంతో భారీ సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారని మనకు తెలుసు. వాళ్లంతా బతికేందుకు అవసరమైన అతికొద్ది వస్తువులతో అక్కడి నుంచి పారిపోయారు. అందరూ అక్కడి నుంచి చెదిరిపోయారు.

సైనిక లక్ష్యాలను సాధించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) చెబుతోంది. ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాల్లోని నిబంధనలకు లోబడే ఉన్నాయని తెలిపింది.

ఇజ్రాయెల్ - గాజా

ఫొటో సోర్స్, QUTAIBA KOLTHOUM

ఫొటో క్యాప్షన్, వీధుల్లోకి వచ్చిన ప్రజలు

అది నిజమేనని నమ్మేందుకు 'వార్నింగ్ షాట్'

అవతలి వ్యక్తి చెబుతున్నప్పుడు ముందు నమ్మలేకపోయానని మహమూద్ గుర్తు చేసుకున్నారు.

ఫేక్ ఫోన్ కాల్ అయి ఉంటుందని చుట్టూ ఉన్న వాళ్లు అన్నారు. అయితే, ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలంటూ వచ్చే బూటకపు ఫోన్ కాల్స్‌, వాస్తవ ఫోన్ కాల్స్‌ని ఎలా గుర్తించాలనే విషయంపై ఫేస్‌బుక్ కమ్యూనిటీ గ్రూపుల్లో కొన్ని సలహాలు, సూచనలు అందుబాటులో ఉన్నాయి.

అది నిజమైతే హెచ్చరికగా ఒక పేలుడు (వార్నింగ్ షాట్) చేయాలని ఫోన్‌లో అవతలి వైపు ఉన్న వ్యక్తిని మహమూద్ అడిగారు. వీధుల్లో జనం అరుపులు వినకుండా ఇంకా నిద్రపోతున్న వారు ఎవరైనా ఉంటే ఈ పేలుడుతో వాళ్లకూ తెలుస్తుంది అని ఆయన భావించారు.

ఆ తర్వాత ఎక్కడి నుంచో ఒక పేలుడు జరిగింది. బహుశా డ్రోన్ షాట్ అనుకుంటా. ప్రమాదంలో ఉన్నాయని చెబుతున్న ఒక అపార్ట్‌మెంట్‌పై పడిందని ఆయన చెప్పారు.

''మీరు బాంబులు వేసే ముందు మరోసారి వార్నింగ్ షాట్ చేయాలని అడిగాను'' అని మహమూద్ చెప్పారు. మరోసారి బాంబు పేలింది.

దీంతో అది బటూకపు ఫోన్ కాల్ కాదు, నిజమేనని మహమూద్‌కి అర్థమైంది. కొద్దిసేపు ఆగాలని అవతలి వ్యక్తిని కోరారు. ''అందరూ ఖాళీ చేస్తున్నప్పుడు దుర్మార్గంగా బాంబులు వేయొద్దు'' అని ఆయనతో చెప్పానని అన్నారు.

అందుకు అతను సమయం ఇస్తానని చెప్పాడు. ఎవరూ చనిపోవాలని మేము కోరుకోవడం లేదని అతను చెప్పాడని మహమూద్ ఆ ఘటనను గుర్తుచేసుకున్నారు.

ఎవరికీ గాయాలు కూడా కాకూడదని అనుకుంటున్నానని మహమూద్ బదులిచ్చారు.

ఇజ్రాయెల్ - గాజా

ఫోన్ కాల్‌లో ఉండగానే అతను పరుగెత్తుకుంటూ వెళ్లి మొత్తం ఖాళీ చేయాలని చుట్టుపక్కల వారిని అభ్యర్థించారు. ఆయన అరుస్తూనే ఉన్నారని మహమూద్ పొరుగునే ఉండే ఓ వ్యక్తి గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంకొంతమంది ఆయనతో చేరారు.

''మనం ఎవరినైనా రక్షించగలమా, లేదా అని ఆలోచించలేదు'' అని మహమూద్ చెప్పారు.

ఆ రోజు ఉదయం వందల మంది ప్రజలు వీధుల్లో పోగయ్యారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ పట్టణంలోని ప్రజలు హాహాకారాలు చేసుకుంటూ పరిగెత్తారు. కొందరు వారి పైజామాలు, ప్రార్థన చేసే సమయంలో వేసుకునే దుస్తుల్లోనే ఉన్నారు.

వాడి గాజా నదికి పక్కనే ఉత్తరం వైపు ఉన్న ఈ పట్టణం అత్యాధునిక అపార్ట్‌మెంట్లు, దుకాణాలు, కెఫేలు, యూనివర్సిటీలు, స్కూళ్లు, పార్కులతో ఉంటుంది. ఆ పార్కుల్లోనే జనం గుమిగూడారు. యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి సామాన్య పౌరులు దక్షిణ గాజాకి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరిస్తూ వస్తోంది.

తమ సమీప ప్రాంతం ఎందుకు లక్ష్యంగా మారిందో మహమూద్‌కు అర్థం కాలేదు. ''అతన్ని ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నించా. అసలు ఎందుకు బాంబులు వేయాలనుకుంటున్నారని కూడా అడిగా'' అని మహమూద్ అన్నారు.

గాజా

ఫొటో సోర్స్, Google earth

''అక్కడ మీకు కనిపించని విషయాలు చాలా ఉన్నాయని ఆయన నాతో అన్నారు'' అని చెప్పారు. అయితే అవేంటో అర్థమయ్యేలా చెప్పలేదు.

''అక్కడ బాంబులు వేయాలని పెద్దవాళ్ల నుంచి వచ్చిన ఆదేశాలు. వాళ్లు నీకంటే, నాకంటే పెద్దవాళ్లు. బాంబులు వేయాలని మాకు ఆదేశాలొచ్చాయి'' అని ఫోన్‌లో అవతలి వైపు వ్యక్తి అన్నారని మహమూద్ చెప్పారు.

ఆ భవనాల చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు ఖాళీ అయిన తర్వాత బాంబులు వేయడం ప్రారంభిస్తున్నట్లు అతను మహమూద్‌కి సమాచారం ఇచ్చారు.

ఒకవేళ పొరపాటున వేరే భవనంపై బాంబులు పడితే? అని మహమూద్ ఆందోళనకు గురయ్యారు. అప్పుడు ''ఒక్క నిమిషం'' అని అవతలి వ్యక్తి అన్నారని ఆయన చెప్పారు.

ఇజ్రాయెల్ - గాజా

ఫొటో సోర్స్, QUTAIBA KOLTHOUM

ఫొటో క్యాప్షన్, నిరాశ్రయుల్లో కొందరు పాలస్తీనా విశ్వవిద్యాలయం సమీపంలో ఆశ్రయం పొందారు

ఒక ఇజ్రాయెలీ ఎయిర్‌క్రాఫ్ట్ ఆ ప్రాంతమంతా తిరిగింది.

మహమూద్ తమ అపార్ట్‌మెంట్ సమూహానికి పొరుగునే ఉన్న ఆ మూడు టవర్ల వైపు చూశారు. అప్పుడే వాటిలో ఒక టవర్‌‌పై బాంబు పడింది.

''మేం దాడి చేయాలనుకున్నది ఆ టవర్‌పైనే. అక్కడి నుంచి దూరంగా ఉండండి'' ఆ ఫో‌న్‌లో ఉన్న వ్యక్తి చెప్పారు. ఆ తర్వాత ఆ భవనం కూలిపోయిందని మహమూద్ చెప్పారు.

కొద్దిసేపటి తర్వాత మిగిలిన రెండు బ్లాక్‌లను కూడా ధ్వంసం చేశారు.

ఆ ఉదయం అల్‌ జహ్రాలో తీసిన ఫోటోలు ఆ మూడు అపార్ట్‌మెంట్ బ్లాక్‌లు శిథిలమైనట్లు చూపిస్తున్నాయి. అవి ధ్వంసమవుతున్నప్పుడు స్థానికులు దిగ్భ్రాంతికి గురైన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.28 గంటలకు ''పూర్తిగా నేలమట్టమయ్యాయి'' అని కమ్యూనిటీ ఫేస్‌బుక్ గ్రూపులో ఒక పోస్టు కనిపించింది.

బాంబులు ఆగిపోయిన తర్వాత, ''మా పని పూర్తయింది. మీరు తిరిగి వెనక్కి వెళ్లొచ్చు'' అని అవతలి వ్యక్తి చెప్పారని మహమూద్ గుర్తు చేసుకున్నారు.

తననే ఎందుకు ఎంచుకున్నారనే విషయం మహమూద్‌కి అర్థం కావడం లేదు. గాజాకి సమీపంలోని ఈ ప్రాంతంలో ఆయన 15 ఏళ్లుగా ఉంటున్నారు. అక్కడ దంత వైద్యశాల నడుపుతున్నారు. తన పిల్లలని పెంచుకుంటూ అక్కడే ఉంటున్నారు.

''అల్-జహ్రా సాధారణ పౌరులు నివసించే ప్రాంతం. ఇక్కడ కొత్తవాళ్లెవరూ లేరని అతనికి అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించా. ఇది సరిహద్దు ప్రాంతం కూడా కాదు. గతంలో ఎలాంటి ఘర్షణలూ లేవు. వివాదాస్పద ప్రాంతానికి దూరంగా ఉంటుంది'' అని మహమూద్ చెప్పారు.

ఆ తర్వాత ఆశ్రయం కోల్పోయిన పొరుగువారికి ఆహారం, మంచినీళ్లు అందించాలని, వారికి సాయం చేయాలని కమ్యూనిటీ ఫేస్‌బుక్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.

ప్రజలు ఆశ్రయం కోసం వెతుక్కుంటున్నారు. స్థానిక అధికారులు రోడ్లపై పడిన శిథిలాలు, చెత్తను, భవన శిథిలాల్లో మంటలను ఆర్పివేయడం ప్రారంభించారు.

ఇళ్లకు ఏ నష్టం జరగని వారు తిరిగి వచ్చారు. వారిలో కొంతమంది క్షేమంగానే ఉన్నట్టు భావించారు.

''మేము ఇంటికి వచ్చేశాం. మళ్లీ బాంబులు వేయరని అనుకుంటున్నాం'' అని ఒకరు మాతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, సంఘర్షణ వెస్ట్ బ్యాంక్‌లోనూ వ్యాపిస్తోందనే భయాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)