ఇజ్రాయెల్-గాజా: ఈ నాలుగు వారాల్లో వెలుగులోకి వచ్చిన అయిదు కొత్త నిజాలు

గాజా, ఇజ్రాయెల్ వివాదం

ఫొటో సోర్స్, REUTERS

    • రచయిత, జెరెమీ బోవెన్
    • హోదా, ఇంటర్నేషనల్ ఎడిటర్, దక్షిణ ఇజ్రాయెల్‌

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడి తర్వాత రిపోర్టింగ్, విశ్లేషణలు, వ్యాఖ్యానాల నుంచి అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఎవరి దగ్గరా పూర్తి విషయం లేదు.

యుద్ధభూమిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ వాతావరణంలోకి చొచ్చుకుపోవడం కష్టంతో కూడుకున్న పనే.

ఇప్పటివరకైతే ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల వివాదం కొత్త రూపం సంతరించుకోలేదు.

అయితే, ఘటనలు చాలా వేగంగా జరుగుతున్నాయి. యుద్ధం ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదమూ లేకపోలేదు. మిడిల్ ఈస్ట్‌లో కొత్త సంఘటనలు పుట్టుకొస్తున్నాయి.

వచ్చే రోజుల్లో బహుశా ఏడాదిలో యుద్ధంలో ఏం జరగబోతుందనే దానిపై ఆ విషయాలు ఆధారపడి ఉండొచ్చు. అందులో మనకు కొన్ని తెలుసు, మరికొన్ని తెలియదు. మన దగ్గర ఖచ్చితమైన సమాచారం లేదు.

2003లో ఇరాక్‌పై అమెరికా దాడి చేసిన సమయంలో అప్పటి అమెరికా రక్షణ మంత్రి డొనాల్డ్ రమ్స్‌ఫెల్డ్ 'తెలియని విషయాల' గురించి మాట్లాడినప్పుడు కొంతమంది ఆయనను ఎగతాళి చేశారు.

కానీ ప్రపంచంలోని మిగతా ప్రాంతాల సంగతి వదిలేసినా, ఈ ప్రాంతంలో తెలియని కొత్త విషయాలు బయటపడితే వాటి ప్రభావం ఎక్కువే ఉండొచ్చు.

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం

ఫొటో సోర్స్, REUTERS

1

గాజాలో హమాస్, దాని మిత్రపక్షమైన ఇస్లామిక్ జిహాద్‌ల అధికారాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్‌లో చాలామంది ప్రజలు మద్దతు ఇస్తారు.

హమాస్ దాడిలో 1,400 మందికి పైగా ఇజ్రాయెలీలు మరణించడం, గాజాలోకి మరో 240 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లడం ఇజ్రాయెలీల ఆగ్రహానికి కారణమైంది.

ఈ దాడి మొత్తం ఇజ్రాయెల్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది.

నేను రిటైర్డ్ ఇజ్రాయెలీ ఆర్మీ జనరల్ నోమ్ టిబోన్‌ను కలిశా. అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత టిబోన్ తన భార్యతో కలిసి గాజా సరిహద్దు సమీపంలోని నహాల్ ఓజ్ కిబుట్జ్ వద్దకు చేరుకున్నారు. మీరు ఇక్కడకు ఎలా రాగలిగారని ఆయన్ను అడిగా.

తన కొడుకు, కోడలు వారి ఇద్దరు పిల్లలను రక్షించడమే నోమ్ టిబోన్ లక్ష్యం, అందులో విజయం సాధించారు కూడా. వారిని ఆయన ఒక సేఫ్ రూమ్‌కి చేర్చారు.

ఆ సమయంలో బయట హమాస్ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయి.

టిబోన్‌కు 62 ఏళ్లు, కానీ పూర్తి ఫిట్‌గా కనిపిస్తున్నారు. ఆయన ఒక ఇజ్రాయెల్ సైనికుడి మృతదేహం వద్ద నున్న అసాల్ట్ రైఫిల్, హెల్మెట్‌ తీసుకొని కిబుట్జ్ చేరుకున్నారు.

ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనికులకు మార్గనిర్ధేశం చేశారు టిబోన్. కిబ్బుట్జ్‌‌లో సైనికులతో కలిసి ఆయన పలువురిని రక్షించారు.

టిబోన్ పాతకాలపు మనిషి. ముక్కుసూటిగా మాట్లాడే ఇజ్రాయెల్ సైనిక అధికారి.

ఆయన నాతో “గాజా పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. తమ పొరుగువారు.. పిల్లలు, మహిళలు, సాధారణ ప్రజలను ఊచకోత కోస్తే ఏ దేశం అంగీకరించదు.

రెండో ప్రపంచ యుద్ధంలో మీరు (బ్రిటీష్ ప్రజలు) మీ శత్రువును అణిచివేసిన విధానమే గాజాలోనూ అమలుచేయాలి. కనికరం చూపకూడదు” అని అంటున్నారు టిబోన్.

హత్యకు గురవుతున్న అమాయక పాలస్తీనా పౌరుల గురించి నేను ఆయనను అడిగితే..

"మేం కఠినాత్ములతో జీవిస్తున్నాం, మనుగడ సాగించాలంటే మేం కఠినంగా ఉండాలి, వేరే మార్గం లేదు" అన్నారు టిబోన్.

పాలస్తీనా పౌరుల మరణాలు దురదృష్టకరమని, అయితే హమాస్ చర్యల కారణంగానే వారిని చంపేస్తున్నారని ఇతర ఇజ్రాయెలీలు ఆయన మాట్లాడిన భాషనే మాట్లాడారు.

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

2

హమాస్‌పై ఇజ్రాయెల్ దాడి భారీ రక్తపాతానికి దారితీస్తుందని కూడా స్పష్టమైంది.

హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం గాజాలో మరణాల సంఖ్య 10 వేలు దాటింది. వీరిలో 65 శాతం మంది మహిళలు, పిల్లలే.

ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారిలో ఎంతమంది పౌరులు ఉన్నారు? అందులో ఎంతమంది హమాస్, ఇస్లామిక్ జిహాద్ కోసం పోరాడుతున్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటాను నమ్మడం లేదు. కానీ గతంలో జరిగిన ఘర్షణల్లో వెల్లడించిన పాలస్తీనియన్ల మరణాల డేటాను అంతర్జాతీయ సంస్థలు సరైనవని తేల్చాయి.

2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. అప్పటి నుంచి 9,700 మంది పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

ఇజ్రాయెల్ దాడిలో చనిపోయిన పాలస్తీనియన్లలో కొందరు హమాస్‌లో భాగం కావచ్చు.

మరణించిన వారిలో వీరు పది శాతమని భావించినా, 2022 ఫిబ్రవరి నుంచి యుక్రెయిన్‌లో రష్యా దాడుల్లో ఎంతమంది చనిపోయారో, అదే సంఖ్యలో పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ ఒక నెలలోనే చంపబోతోంది.

(యుక్రెయిన్ మాదిరే గాజాలో కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది)

హమాస్‌ నిర్మూలనకు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మొదటి నుంచి మద్దతిస్తున్నారు.

అయితే దీని కోసం సరైన పద్ధతిని అవలంభించాలని, యుద్ధ నియమాలను అనుసరించాలని వైట్‌హౌస్ సూచిస్తోంది.

అమెరికా రక్షణ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇటీవల ఇజ్రాయెల్ నగరమైన టెల్ అవీవ్ వెళ్లారు. తిరుగు విమానం ఎక్కే ముందు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు.

“శిథిలాల నుంచి ఒక పాలస్తీనా చిన్నారిని బయటకు తీస్తున్న దృశ్యం చూసినప్పుడు నాకు మిగతా వారిని చూసినప్పటికంటే ఎక్కువ బాధ కలిగింది.'' అన్నారు.

ఎక్కడైనా లేదా ఏ ఇజ్రాయెలీ చిన్నారిని చూసినా అంత బాధ కలగకపోవచ్చని అభిప్రాయపడ్డారు బ్లింకెన్.

నేను గత ముప్పై ఏళ్లలో ఇజ్రాయెల్ అన్ని యుద్ధాల గురించి రిపోర్టు చేశాను.

ఇజ్రాయెల్ యుద్ధ నియమాలను పాటించాలని ఇంత స్పష్టంగా ఏ అమెరికా నేత చెప్పినట్లు నాకు గుర్తు లేదు.

బైడెన్ సలహాను ఇజ్రాయెల్ పాటించడం లేదని బ్లింకెన్ పర్యటన సూచిస్తుంది.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

ఫొటో సోర్స్, REUTERS

3

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని మనకు కచ్చితంగా తెలుసు.

అక్టోబర్ 7న జరిగిన దాడుల నుంచి ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని కమ్యూనిటీలను రక్షించడంలో వ్యవస్థల వైఫల్యాలకు ఇజ్రాయెల్ భద్రతా దళాలు, సైనికాధిపతుల తరహాలో ఆయన వ్యక్తిగతంగా బాధ్యత వహించలేదు.

నిఘా వర్గాలను నిందిస్తూ అక్టోబర్ 29న ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో నెతన్యాహు ఆ ట్వీట్‌ను తొలగించడంతో పాటు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

''ఈ యుద్ధంలోనూ, ఆ తర్వాత పరిణామాల్లోనూ నెతన్యాహుకి ఎలాంటి పాత్ర ఉండకూడదు. ఇజ్రాయెలీ ప్రధాన మంత్రికి విధేయులైన మద్దతుదారులు ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం, భద్రతా వ్యవస్థల్లోని ముఖ్యమైన వ్యక్తుల విశ్వాసాన్ని ఆయన కోల్పోయారు'' అని ఇజ్రాయెల్‌కి చెందిన శాంతి చర్చల మాజీ ప్రతినిధి, ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ షిన్ బెట్ మాజీ చీఫ్, ఒక టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకుడు ఫారిన్ ఎఫైర్స్ జర్నల్‌లో రాసిన కథనంలో అభిప్రాయపడ్డారు.

1940లో బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిన బ్రిటిష్ ప్రధాన మంత్రి నెవల్ చాంబర్లీన్ ‌తో ప్రధాని నెతన్యాహును పోల్చారు రిటైర్డ్ జనరల్ నోమ్ టిబాన్. చాంబర్లీన్ స్థానంలో విన్‌స్టన్ చర్చిల్ బాధ్యతలు చేపట్టారు.

''ఇది ఇజ్రాయెల్ చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యం.సైన్యం, నిఘా వ్యవస్థలు ఫెయిలయ్యాయి. ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇజ్రాయెల్ చరిత్రలో ఈ అతిపెద్ద వైఫల్యానికి ఆయనదే బాధ్యత'' అని టిబోన్ నాతో చెప్పారు.

ఇజ్రాయెల పర్యటనలో బ్లింకెన్

ఫొటో సోర్స్, REUTERS

4

ఇది గతంలోని యథాతథ స్థితిని తుంగలో తొక్కింది. 2005లో చివరి పాలస్తీనా తిరుగుబాటు ముగిసినప్పటి నుంచి నెతన్యాహు ఇక నిరవధికంగా అధికారంలో కొనసాగవచ్చనే ఒక భావన ఏర్పడింది. పాలస్తీనియన్లు, ఇజ్రాయెలీలకు సంబంధించి అదో ప్రమాదకరమైన భ్రమ.

అదే సమయంలో, పాలస్తీనియన్లు ఇకపై ఇజ్రాయెల్‌కు ప్రమాదకరం కాబోరనే వాదనలు నడిచాయి. అయితే దానికి బదులుగా సామ దాన భేద దండోపాయాలతో పాటు 'విభజించు - పాలించు' అనే పాత వ్యూహాలతో సమస్యను అధిగమించాల్సి వచ్చింది.

1996 నుంచి 1999 వరకూ, 2009 తర్వాత కూడా ఎక్కువ కాలం ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగిన నెతన్యాహు శాంతి కోరుకునే భాగస్వామి స్థిరంగా లేదంటూ వాదిస్తూ వచ్చారు.

హమాస్‌కు ప్రధాన ప్రత్యర్థి, లోపాల పుట్ట అయిన పాలస్తీనియన్ అథారిటీ(పీఏ) అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌ పక్కకు తప్పుకుంటే మంచిదని అనుకునేవారు. కానీ, అది 1990లలో ఇజ్రాయెల్‌తో కలిసి పాలస్తీనా రాజ్య ఏర్పాటుకు అంగీకరించింది.

నెతన్యాహు విభజించు పాలించు విధానమేంటంటే, పాలస్తీనియన్ అథారిటీ ఖర్చుతో గాజాలో హమాస్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించడం.

ఈ విషయంలో బహిరంగ వ్యాఖ్యలపై నెతన్యాహు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన చర్యలు ఎప్పుడూ పాలస్తీనియన్ల స్వతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగానే ఉన్నాయి.

వెస్ట్‌బ్యాంక్‌లోని భూభాగాన్ని వదులుకోవడం, యూదుల పవిత్ర స్థలంగా చెప్పే తూర్పు జెరూసలెంను వదులుకునే విషయంలో అది స్పష్టంగా కనిపిస్తుంది.

ఎప్పటికప్పుడు నెతన్యాహు ప్రకటనలు లీక్ అవుతూనే ఉంటాయి. పాలస్తీనా స్వతంత్ర రాజ్యాన్ని వ్యతిరేకిస్తే ఖతర్ నిధులతో గాజాలో చేపడుతున్న పథకాలకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని 2019లో ఆయన తన పార్లమెంట్‌ సభ్యుల బృందంతో అన్నట్లు ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి.

గాజాలో హమాస్, వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్ అథారిటీని మరింత విడదీస్తే స్వతంత్ర రాజ్య ఏర్పాటు అసాధ్యమవుతుందని ఆయన వారికి చెప్పారు.

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం

ఫొటో సోర్స్, బ్లింకెన్

5

హమాస్ అధికారంలో కొనసాగేందుకు వీలుగా ఉన్న ఒప్పందాన్ని సహించబోమని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అమెరికా మద్దతుతో దానిని వ్యతిరేకిస్తామని తెలిపింది. ఇది మరింత రక్తపాతానికి దారితీసే అవకాశం ఉంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేది ఎవరనే సమాధానం దొరకని ప్రశ్నను లేవనెత్తింది.

జోర్డాన్ నది నుంచి మధ్యధరా సముద్రం మధ్యనున్న ప్రాంతంపై నియంత్రణ కోసం అరబ్బులు, యూదుల మధ్య వందేళ్లకు పైగా వివాదం కొనసాగింది. సుదీర్ఘ కాలం సాగిన ఈ రక్తపాత చరిత్ర సైనిక చర్యతో ఎలాంటి పరిష్కారం లభించదనే గుణపాఠం నేర్పింది.

తూర్పు జెరూసలెం రాజధానిగా పాలస్తీనా దేశం ఏర్పాటు చేయడం ద్వారా ఇరుదేశాల మధ్య రగులుతున్న వివాదానికి ముగింపు పలికేందుకు 1990లో ఓస్లో శాంతి ప్రక్రియ మొదలైంది.

ఏళ్లపాటు చర్చలు జరిగిన అనంతరం ఆ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ఒబామా హయాంలో చివరి ప్రయత్నం జరిగింది. దశాబ్దం కిందట అది కూడా విఫలమైంది. ఉద్రిక్తతలు మరింత పెరగడానికి అది కూడా కారణమైంది.

ఇజ్రాయెల్ పక్కనే పాలస్తీనా స్వతంత్ర దేశ ఏర్పాటు మాత్రమే యుద్ధాల నివారణకు ఉన్న ఏకైక పరిష్కారమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

ఇరువైపులా ఉన్న నాయకులతో అది ప్రస్తుతం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అలాంటి ప్రయత్నాలను 1990ల నాటి ఒప్పందం తరహాలో భగ్నం చేసేందుకు ఇజ్రాయెల్, పాలస్తీనాలలో రెండు వైపులా ఉన్న తీవ్రవాదులు చేయాల్సిందంతా చేస్తారు.

వారిలో కొందరు దేవుడు చెప్పిందే చేస్తున్నామని నమ్ముతారు. వారితో లౌకిక పరిష్కారం సాధించడం సాధ్యం కాదు.

ఈ వివాదానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలమైతే భవిష్యత్ తరాలు కూడా యుద్ధాల కారణంగా శిక్ష అనుభవించక తప్పదు.

వీడియో క్యాప్షన్, ఉత్తర గాజాలో గత రాత్రి భారీ ఎత్తున వైమానిక దాడులకు పాల్పడ్డ ఇజ్రాయెల్...

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)