గుంటూరు జిల్లాలో ‘యూదులు’.. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంపై వీరు ఏమంటున్నారు?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తోంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండల కేంద్రానికి చెందిన కొత్తరెడ్డిపాలెంలో కొందరు తమ పండుగలు రద్దు చేసుకున్నారు.
తమను యూదులుగా చెప్పుకుంటున్న 40 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నాయి.
సుమారు 40 కుటుంబాలకు చెందిన ఓ సమూహం తమది ‘బెనె ఎఫ్రాయిమ్’ తెగ అని చెబుతోంది. ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చిన జాతిగా వారు చెప్పుకుంటున్నారు.
ఈ సమూహం బెనే యాకోబ్ ప్రార్థనా మందిరంలో యూదు సంప్రదాయాన్ని అనుసరిస్తోంది. యూదు పండుగలు జరుపుకుంటోంది. హీబ్రూ భాషలోనే కార్యకలాపాలు సాగిస్తోంది.
గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో వందేళ్ల క్రితం నుంచే తమ కుటుంబీకులు నివపిస్తున్నట్టు యూదుల ప్రతినిధిగా ఉన్న యాకోబీ సాదోక్ బీబీసీకి తెలిపారు.
"ఇజ్రాయెల్ నుంచి 300 ఏళ్ల క్రితం యూదులు వివిధ ప్రాంతాలకు వలస వచ్చారు. అలా మా పూర్వీకులు తొలుత తెలంగాణ ప్రాంతానికి, ఆ తర్వాత అమరావతికి వచ్చారు. మా పూర్వీకులు ఉపయోగించిన అనేక వస్తువులు ఇప్పటికీ అమరావతి మ్యూజియంలో భద్రపరచి ఉన్నాయి. కానీ మాకు ఇజ్రాయెలీయులుగా గుర్తింపు ఇవ్వడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో మాదిగల జీవనానికి దగ్గరగా ఉన్నామనే కారణంగా మాదిగలంటూ పేర్కొన్నారు. సర్టిఫికెట్లలో కూడా మాదిగలుగానే ఉంటుంది" అంటూ ఆయన వివరించారు.
యాకోబీ సాదోక్ ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. సరళమైన తెలుగు మాట్లాడుతున్నారు. తనకు హీబ్రూ రాయడం, చదవడం, మాట్లాడడం తెలుసన్నారు.
తనతోపాటు కొత్తరెడ్డిపాలెంలో ఉన్న 40 కుటుంబాలకు చెందిన సుమారు 250 మందిలో అత్యధికులకు హీబ్రూ మాట్లాడడం వచ్చని ఆయన బీబీసీకి తెలిపారు.
యాకోబీ సాదోక్‌కి స్థానికంగా దేవ ప్రసాద్ అనే పేరు కూడా ఉందని, అదే పేరుతో తాను అధికారికంగా కొనసాగుతున్నానని ఆయన చెప్పారు.

‘ఇజ్రాయెల్ వెళ్లిపోతాం’
యూదు సంప్రదాయాన్ని అనుసరించే కొత్తరెడ్డిపాలెం వాసుల్లో అత్యధికులు సామాన్య కుటుంబీకులే. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులుగా ఉపాధి పొందుతున్నారు. రెండు, మూడు కుటుంబాల నుంచి విద్యావంతులుగా మారి, ఉద్యోగాలు చేస్తున్న వారున్నారు. వారందరికీ అటు తమ యూదు జాతి పేరుతో పాటుగా, స్థానికంగా వాడుకకు మరో పేరు కూడా పెట్టుకుంటున్నారు.
"మమ్మల్నందరినీ మళ్లీ త్వరలోనే ఇజ్రాయెల్‌కు పిలుస్తారు" అంటూ యాకోబీ సాదోక్ ధీమా వ్యక్తం చేశారు.
"ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చేసిన సమూహాల్లో మాదే అత్యంత సామాన్య జాతి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలా ఉన్న యూదులను మళ్లీ ఇజ్రాయెల్‌కి పిలుస్తున్నారు. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన తెగలలో ఒకటైన 'బెనె ఎఫ్రాయిమ్' తెగకు చెందిన మమ్మల్ని కూడా త్వరలోనే అక్కడికి తీసుకెళ్తారు.
విడిపోయిన సభ్యులందరూ ఇజ్రాయెల్‌కు తిరిగి రావాలని పవిత్ర గ్రంథమైన తోరాలో రాసుంది. అందుకు తగ్గట్టుగా ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన యూదు ప్రజలు తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మణిపుర్ నుంచి 3,000 మంది యూదులు గతంలో ఇజ్రాయెల్ వెళ్లారు” అంటూ ఆయన వివరించారు.
కొత్తరెడ్డిపాలెంలో మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన బెనే యాకోబ్ ప్రార్థనా మందిరానికి కూడా యాకోబి అధిపతి.
ఆయనతో పాటు ఏడుగురు సభ్యులతో కూడిన బృందం యూదు సమాజానికి ప్రతినిధులుగా ఉన్నారు.
లష్కర్ మిలిటెంట్ల ద్వారా...

భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో యూదులున్నారు.
ముంబయి, కోచి, మణిపుర్, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లలో కూడా యూదులున్నట్టు అధికారిక నివేదికల్లో ఉంది.
కానీ ఆంధ్ర్రప్రదేశ్‌లో యూదులున్నారనే విషయం 2004లో లష్కరే తోయిబా మిలిటెంట్ల అరెస్టు తర్వాత వెలుగు చూసింది.
తమను మగద్దీన్ అంటారని, దాని అర్థం బోధకులు అని చెబుతున్నారు గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెం వాసులు. తమను మట్టుబెట్టేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై రాజమండ్రిలో ఓ ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారని వారు చెబుతున్నారు.
ఎనిమిది మందిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత, వారంతా యూదులను టార్గెట్‌గా చేసుకుని ఏపీలో మకాం వేసినట్టు గుర్తించారని తెలిపారు.
అప్పటి నుంచి వివిధ సందర్భాల్లో ఇంటెలిజెన్స్, పోలీసులు కొత్తరెడ్డిపాలెం వచ్చి తమ గురించి సమాచారం సేకరించి వెళ్తుంటారని వారు చెబుతున్నారు.
ప్రతి శనివారం విశ్రాంతి దినంగా షబ్బత్ పాటించడం, హీబ్రూ సంప్రదాయాన్ని అనుసరించిన వివాహ పద్ధతులు వంటివి అమలులో ఉన్నాయని స్థానిక పెద్ద ఇట్స్ కాక్ అన్నారు.
తమ క్యాలెండర్‌ని అనుసరించి 5781వ సంవత్సరం నడుస్తోందని, ఏటా తిషిరి(సెప్టెంబర్ మాసం)తో ఇది మొదలవుతుందని ఆయన వివరించారు.

‘యూదులుగా గుర్తింపు కోరుతున్నాం’
ఎస్సీలలో మాదిగలుగా పరిగణిస్తున్న తమకు యూదులుగా గుర్తింపు ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వాలకు నివేదించినప్పటికీ ఫలితం దక్కలేదని స్థానికులు అంటున్నారు.
"గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశించాం. మణిపూర్, మిజోర్ ప్రాంతాల వాసులు అక్కడికి వెళ్లారు. కానీ మాకు ఇంకా అలాంటి లక్ష్యం నెరవేరలేదు.
ఇజ్రాయెల్ అనుసరించే లా ఆఫ్ రిటర్న్ ప్రకారం మాకు కూడా అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అవన్నీ పూర్తయితే పిలుపు వస్తుంది. కానీ తొలుత మమ్మల్ని యూదులుగా గుర్తించి మైనార్టీ హోదా కల్పిచాలని ఆశిస్తున్నాం" అని మతన్యా యెహోషువా అనే యువకుడు అన్నారు.
యెహోషువా కూడా స్థానికంగా మట్టా ప్రవీణ్ కుమార్ అనే పేరుతో రికార్డుల్లో ఉన్నారు.

కొన్నేళ్ల క్రితమే ఇజ్రాయెల్ నుంచి రబ్బీస్ అని పిలిచే యూదు మత పెద్దలు కొత్తరెడ్డిపాలెం వచ్చి అక్కడి స్థానికుల వివరాలు కూడా సేకరించారు.
యూదులుగా గుర్తింపు లభిస్తే ఇజ్రాయెల్ నుంచి వారికి సహకారం ఉంటుందని తేల్చారు.
వారం క్రితం ఇజ్రాయెల్ నుంచి వచ్చిన యూదు ప్రతినిధులు కొత్తరెడ్డిపాలెంలో నిర్వహించిన కార్యక్రమాలకు హాజరయ్యారు.
అయితే ఆ దేశంలో ఏర్పడిన ఉద్రిక్తత కారణంగా పండుగ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నట్టు యాకోబీ తెలిపారు.
ఇజ్రాయెల్ ప్రతినిధులు కూడా తిరిగి ముంబయి చేరుకున్నారని, అక్కడి నుంచి పరిస్థితులు అనుకూలిస్తే ఆ దేశానికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
తాజా పరిణామాలు తమను తీవ్రంగా కలచివేశాయని, నిత్యం ఇజ్రాయెల్ ప్రతినిధులతో మాట్లాడి అక్కడి ప్రజల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నట్టు వివరించారు.
త్వరలోనే పరిస్థితులన్నీ సద్దుమణిగి తిరిగి ఇజ్రాయెల్‌లో సాధారణ పరిస్థితులు రావాలని తామంతా ప్రార్థనలు చేస్తున్నట్టు తెలిపారు.

సీసీఎంబీ పరిశోధనలు
కొత్తరెడ్డిపాలెంలో యూదులుగా చెబుతున్న కుటుంబాల వారి రక్తనమూనాలను హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశీలించింది.
2014లోనే వారికి డీఎన్ఏ పరీక్షలు జరిపినట్టు స్థానిక రెవెన్యూ అధికారి పి.రామచంద్రరావు తెలిపారు.
"వారి మూలాలను పరిశీలించిన తర్వాత భారతీయులకు భిన్నంగా ఉన్నట్టు నిర్ధరించారు. కానీ ఇజ్రాయెల్‌తో వారి అనుబంధంపై స్పష్టత లేదు" అంటూ ఆయన వివరించారు.
తమ ఆహారపు అలవాట్ల నుంచి, వైవాహిక జీవనం వరకూ అన్నీ యూదులను పోలి ఉన్నందున తమకు గుర్తింపు ఇవ్వాలని సారా అనే మహిళ కోరారు.
“మేము కోషెర్ మాంసాన్ని తింటాం. బయట ఫంక్షన్లకు హాజరయినప్పుడు మా పెద్దలు ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే మాంసం తింటాం. లేదంటే ఖాళీ కడుపుతోనైనా ఉంటాంగానీ దానిని ముట్టం. వారంలో ఏడో రోజును 'హాలి'గా పాటిస్తాం. ప్రార్థనలు కూడా చేస్తాం. అబ్బాయిలకు 13వ ఏటకు ముందే సున్తీ చేయిస్తాం" అంటూ ఆమె వివరించారు.
యూదులుగా భారత ప్రభుత్వం నుంచి తమకు గుర్తింపు దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నట్టు సారా బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్-పాకిస్తాన్ క్రికెట్: ఇరుజట్లు మైదానంలో బద్ధశత్రువులే, కానీ బయట మంచి మిత్రులు..
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- సిక్కింలో ఆనకట్ట తెగేంత వరద ఎందుకు వచ్చింది? మంచు సరస్సుల్లో ఏం జరుగుతోంది?
- విశాఖ: అప్పికొండ బీచ్‌లో బండరాళ్ల మధ్య మచిలీపట్నం యువతి ఎలా చిక్కుకుపోయారు? ఆమెతోపాటు వచ్చిన యువకుడు ఎక్కడ?
- ఎలక్షన్ కోడ్ వచ్చేసింది.. ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














