‘గాజాలో సురక్షిత ప్రాంతమనేదే మిగల్లేదు.. ఇజ్రాయెల్ భీకర దాడుల నుంచి మా ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?’

ఫొటో సోర్స్, EPA
- రచయిత, రుష్దీ అబు అలూఫ్
- హోదా, బీబీసీ న్యూస్, గాజా
‘‘మేమెక్కడికి వెళ్లాలి? చాలా నిశ్శబ్దంగా అందంగా ఉండే ఈ పరిసరాల్లో సురక్షిత ప్రాంతమనేది ఎక్కడైనా మిగిలిందా’’ అని రైమాల్‌లోని ఒక అపార్టుమెంటులో ఉండే స్థానికులు నన్ను అడిగారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల సమయంలో అత్యంత కష్టంగా ఏడు గంటల పాటు లోపలే ఉండిపోయాను.
అక్టోబరు 7 శనివారం ఉదయం దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో గాజా సరిహద్దులను దాటుకుంటూ వచ్చి, మునుపెన్నడూ లేని విధంగా పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది.
వాటికి ప్రతీకార దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. ఈ భీకర దాడులు ఇరు ప్రాంతాల మధ్య కొనసాగుతున్నాయి.
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలోని నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. అనేక మంది పౌరులు గాయపడ్డారు.
టెలీకమ్యూనికేషన్స్ కార్యాలయాలు, గాజాలోని ఇస్లామిక్ యూనివర్సిటీలోని ఉపాధ్యాయ భవనాలు దాడుల్లో తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
సోమవారం రాత్రి జరిగిన భీకర పేలుళ్లతో ఈ ప్రాంతమంతా వణికిపోయింది. పిల్లలు బోరున విలపిస్తూనే ఉన్నారు. ప్రజలకు నిద్ర కరువైంది.
రైమాల్ ప్రాంతంలో స్థానికులకు అదొక పీడకల లాంటిది. ఇది గాజా నగరంలో సంపన్న ప్రాంతమే కాదు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే ప్రాంతం కూడా.
దాడుల అనుభవాల నుంచి వాళ్లు చాలా కాలం బయటకు రాలేరు.
పొద్దుపొడిచింది. మంగళవారం వచ్చింది. దాడుల తీవ్రత తగ్గింది. దాడుల విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అప్పుడు ప్రజలు అర్థం చేసుకున్నారు.
నైరుతి ప్రాంతంలోని మౌలిక వసతులన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్కడికి చేరుకునే రోడ్లన్నీ తెగిపోయాయి.
ఈ ప్రాంతంలో మేము వెళ్తుంటే ఇక్కడ భూకంపం వచ్చినట్లుగా అనిపించింది. శిథిలాలు మిగిలాయి. ప్రతి చోటా పగిలిన గాజు ముక్కలు, తెగిన వైర్లు కనిపిస్తున్నాయి.
విధ్వంసం స్థాయి ఎలా ఉందంటే, నేను ముందుగా చూసిన భవనాలు ఇప్పుడు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
‘’నేను అన్నీ కోల్పోయాను. నా ఐదుగురు పిల్లలుండే అపార్టుమెంట్ ఈ భవనంలోనే ఉండేది. దాని కింద ఉండే నా కిరాణా కొట్టు పూర్తిగా ధ్వంసమైంది,’’ అని మొహమ్మద్ అబు అల్ ఖాస్ చెబుతున్నారు. ఆయన తన కూతురిని వీధిలోకి తీసుకెళ్తున్నారు.
‘’మేమెక్కడికి వెళ్లాలి? మేమిప్పుడు నిర్వాసితులుగా మిగిలాం. మాకు ఉండటానికి చోటు లేదు. చేయడానికి పని లేదు’’
‘’నా ఇల్లు, కిరాణా దుకాణం ఇజ్రాయెల్ మిలిటరీకి దాడి చేసే లక్ష్యాలా’’ అని ఆయన అడుగుతున్నారు.
సామాన్య పౌరులపైన దాడులు చేయట్లేదని చెబుతున్న ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటనలను ఆయన తప్పుబడుతున్నారు.
సోమవారం గాజాపై జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారని, వారిలో మూడొంతులు సామాన్య పౌరులేనని పాలస్తీనా ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.
గత కొన్నేళ్లలో అత్యంత ఎక్కువ మంది ప్రాణాలను బలిగొన్న భయానక దాడి ఇదే.
గాజా నగరంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న జబాలియా శరణార్థుల శిబిరంలో 15 మంది వరకు చనిపోయారు.
అయితే హమాస్ కమాండర్ ఉండే నివాసాన్ని తాము లక్ష్యంగా ఎంచుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ చెబుతోంది.
కానీ స్థానిక మార్కెట్‌లో ఉన్న చాలా మంది ప్రజలు, చుట్టుపక్కల భవనాల్లో ఉన్న వారు ఈ దాడిలో మృతి చెందారు.

ఫొటో సోర్స్, Reuters
ముదురుతున్న మానవీయ సంక్షోభం
గాజా హెల్త్ మినిస్ట్రీ లెక్కల ప్రకారం, శనివారం నుంచి గాజాలో మృతి చెందిన వారి సంఖ్య 900 వరకూ చేరింది.
వారిలో 260 మంది పిల్లలున్నారు. మరో 4500 మందికి గాయాలయ్యాయి.
జన సాంద్రత ఎక్కువగా ఉండే ఈ చిన్న భౌగోళిక ప్రాతంలో ఇప్పటికే దారుణ మానవీయ సంక్షోభ పరిస్థితులున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత దిగజారుతోంది.
దాదాపుగా 22 లక్షల మంది ప్రజలకు ఆహారం, ఇంధనం, విద్యుత్, నీళ్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం పూర్తిస్థాయి గాజా నిర్బంధాన్ని ప్రకటించింది.
హమాస్ దాడులకు ప్రతిస్పందనగా గాజాకు వెళ్లాల్సిన అన్ని నిత్యావసరాలను నిలిపేశారు.
శనివారం ఎవరూ ఊహించని విధంగా జరిగిన హమాస్ మెరుపు దాడుల్లో 1000 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు.
దాదాపు 100 నుంచి 150 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది.
‘’కరెంటు, నీళ్లు లేకుండా 21వ శతాబ్దంలో బతకడాన్ని మీరు ఊహించగలరా? నా బిడ్డకు నేపీ ప్యాడ్లు అయిపోయాయి. సీసాలో పాలు సగమే మిగిలాయి’’ అని వాద్ అల్ ముఘ్రాబి అన్నారు.
రైమాల్‌లో ఆమె ఇంటి పక్కనున్న భవనాలు దాడిలో ధ్వంసమయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters
గాజా బయటున్న అతిపెద్ద సూపర్ మార్కెట్‌ను, శనివారం మొదటిసారిగా తెరిచారు.
చిన్నగా ఉండే దాని వెనుక ద్వారం బయట పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూలు కడుతున్నారు.
దొరికిన సరుకులను కొనేందుకు ఎగబడుతున్నారు. సుదీర్ఘ కాలం పాటు దాడులు కొనసాగుతాయని వాళ్లు భయపడుతున్నారు.
గాజాలోని తాజా కూరగాయలను, పళ్లను చాలా వరకు దక్షిణ ప్రాంతంలో పండిస్తారు.
తీవ్రమైన ఇంధన కొరతతో వాటిని ఉత్తర ప్రాంతాలకు రవాణా చేయడం చాలా కష్టంగా మారుతుంది.
ఇప్పటివరకైతే ఈజిప్ట్ నుంచి ఎలాంటి ఫుడ్ డెలీవరీ కానీ, ఇతర నిత్యావసరాల సహాయం కానీ అందలేదు.
ఇజ్రాయెల్‌తో కలిసి ఈజిప్ట్ కూడా గాజా కఠిన సరిహద్దు నిర్బంధాన్ని కొనసాగిస్తోంది.
గాజా ప్రాంతాన్ని 2007లో హమాస్ అధీనంలోకి తీసుకున్న తర్వాత భద్రత కారణాల దృష్ట్యా ఈజిప్ట్, ఇజ్రాయెల్‌తో కలిసి గాజా సరిహద్దు నిర్బంధాన్ని కొనసాగిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
ఈజిప్టుతో గాజా పంచుకునే సరిహద్దులోని రఫా బార్డర్ క్రాసింగ్ నుంచి కూడా ప్రజలు గాజా నుంచి పారిపోవడానికి వీలు లేకుండా ఉంది.
కేవలం నాలుగు వందల మందినే వెళ్లేందుకు వచ్చేందుకు అనుమతిస్తున్నారు.
సోమవారం, మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో పాలస్తీనా వైపున్న సరిహద్దు గేటు ధ్వంసమైంది. దాంతో ఎవ్వరూ ఇక్కడి నుంచి వెళ్లే పరిస్థితి లేదని గాజాలోని పాలస్తీనా అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
దాంతో గాజా నుంచి ఇళ్లను వదిలి పారిపోవాలనుకున్న రెండు లక్షల మంది ప్రజలు ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న స్కూళ్లలో తల దాచుకుంటున్నారు.
వాళ్లలో కొంత మంది భయంతో పారిపోయారు. మిగిలిన వాళ్ల ఇళ్లు దాడుల్లో ధ్వంసమయ్యాయి.
చాలా మంది గాజా ప్రజలు బేస్మెంట్లలో తలదాచుకుంటున్నారు. కానీ పైనున్న భవనం కుప్పకూలితే శిథిలాల్లో చిక్కుకుంటారని భయపడుతున్నారు.
సోమవారం రాత్రి ఒక భవనం కింద బేస్మెంట్లో దాదాపు 30 కుటుంబాలు చిక్కుకున్నాయి.
‘’గతంలో యుద్ధాలు జరిగినప్పుడు, సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఇక్కడ ఉండేందుకు సురక్షితంగా ఉండేది’’ అని రైమాల్ నివాసి మొహమ్మద్ అల్ ముఘ్రాబి చెబుతున్నారు.
సోమవారం రాత్రి జరిగిన ఇజ్రాయెలీ దాడులతో సురక్షిత ప్రాంతాలనేవి ఇక మిగల్లేదని అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- టైటాన్ సబ్ మెర్సిబుల్: 114 రోజుల తర్వాత దొరికిన శకలాలు, అవశేషాలు
- విశాఖపట్నం: రుషికొండపై నిర్మాణాలు సీఎం కార్యాలయం కోసమేనా, దసరా నుంచి ఇదే పాలనా కేంద్రం అవుతుందా?
- విశాఖ: అప్పికొండ బీచ్‌లో బండరాళ్ల మధ్య మచిలీపట్నం యువతి ఎలా చిక్కుకుపోయారు? ఆమెతోపాటు వచ్చిన యువకుడు ఎక్కడ?
- వరల్డ్ పోస్ట్ డే - 2023: 'పోస్టాఫీస్ లేకపోయుంటే నా జీవితం ఎలా ఉండేదో ఊహించడమే కష్టం'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















