ఇజ్రాయెల్‌పై హమాస్ ఊహకందని మెరుపు దాడి ఎలా చేసింది? బీబీసీ పరిశీలించిన ఆ వీడియోల్లో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సీన్ సెడ్డాన్, డేనియల్ పలుంబో
- హోదా, బీబీసీ కోసం
హమాస్ దాడులు మొదలైనప్పుడు ఇజ్రాయెల్లో చాలా మంది ఇంకా నిద్రలేవలేదు.
యూదులకు సెలవు దినమైన శనివారం నాడు పండుగ కూడా కలిసిరావడంతో చాలా మంది కుటుంబంతో కలిసి ఇంట్లోనో, చర్చిలోనో సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారు.
కానీ తెల్లవారుజాామున మొదలైన రాకెట్ల వర్షం ఎవరూ ఊహించనిది.
చాలా కాలం నుంచి ఇజ్రాయెల్ తన దేశానికి, పాలస్తీనీయుల అధీనంలోని గాజాకు మధ్య శత్రు దుర్భేద్యమైన భద్రత ఏర్పాటు చేసుకుంది. అయితే తాజా దాడులు అలాంటి భద్రత ఏదీ లేదని తేల్చాయి.
హమాస్‌ను బ్రిటన్ సహా అనేక దేశాలు ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాయి.
గాజా నుంచి హమాస్ తన భీకరదాడులను ఇంత పకడ్బందీగా ఎలా చేసిందనే విషయమై మిలిటెంట్లు, పౌరులు చిత్రీకరించిన దృశ్యాలను బీబీసీ విశ్లేషిస్తోంది.

ఫొటో సోర్స్, AFP
రాకెట్ల వర్షంతోనే దాడులు ప్రారంభం
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటలకు రాకెట్లు గాలిలోకి ఎగరడం మొదలైంది.
గాజాను చెప్పుచేతల్లో పెట్టుకున్న హమాస్ ప్రయోగించే రాకెట్లు ఇజ్రాయెల్ అధునాతన ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను ఎదుర్కోవడంలో తరచూ విఫలమవుతుంటాయి.
కానీ స్వల్పవ్యవధిలోనే వేల రాకెట్లను ప్రయోగించడం ద్వారా ఈ బలహీనతను హమాస్ అధిగమించింది.
దాడి జరిగిన స్థాయిని గమనిస్తే ఇందుకోసం హమాస్ కొన్ని నెలలుగా పక్కాగా పథకం పన్నినట్టు అర్థమవుతోంది.
ఐదు వేల రాకెట్లను ప్రయోగించినట్టు హమాస్ చెబుతోంది.

గాజా, టెల్ అవీవ్ నుంచి పశ్చిమ జెరూసలెం వరకు వైమానిక దాడుల సైరన్ మోత వినిపించింది.
రాకెట్ల దాడితో పట్టణాలపైన పొగ కమ్ముకోవడమూ కనిపించింది.
గాజా, ఇజ్రాయెల్ మధ్యనున్న పటిష్టమైన కంచెను తొలగించేందుకు నిరంతరాయంగా రాకెట్లను ప్రయోగించారు.
2005లోనే ఇజ్రాయెల్ తన బలగాలను, సెటిలర్లను గాజా నుంచి తరలించినా ఇంకా, గగనతలంపై నియంత్రణతోపాటు సరిహద్దును, తీరప్రాంతాన్నీ పంచుకుంటోంది.
చొరబాట్లను తిప్పికొట్టడానికి ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో సైన్యం గస్తీ తిరుగుతుంటుంది. సరిహద్దు ప్రాంతంలో కొంత భాగం కాంక్రీట్ గోడ, మరికొంత భాగం కంచె ఉన్నాయి. అలాగే కెమెరాలు, సెన్సర్ల వ్యవస్థ కూడా ఉన్నాయి.
కానీ కొన్ని గంటలలోనే ఈ రక్షణ వ్యవస్థను అనేక చోట్ల హమాస్ బద్దలు కొట్టింది.

ఫొటో సోర్స్, ISRAEWL DEFENCE FORCES

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
హమాస్ మిలిటెంట్లు ఎలా చొరబడ్డారు?
చాలా మంది హమాస్ ఫైటర్లు సరిహద్దు నుంచి కాకుండా దొంగ దారిలో ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. ఇందుకోసం పారాగ్లైడర్లు, పడవలను ఉపయోగించారు. ఏడుగురు ఇజ్రాయెల్‌పై ఎగరడం ధ్రువీకరించని ఓ వీడియోలో కనిపించింది.
తీర ప్రాంతం నుంచి చొరబడటానికి హమాస్ చేసిన రెండు ప్రయత్నాలను తిప్పికొట్టినట్టు ఇజ్రాయిల్ రక్షణ దళాలు చెప్పాయి.
ఉదయం ఐదు గంటల 50 నిమిషాలకు హమాస్ సాయుధ విభాగం టెలిగ్రామ్ ఖాతాలో తొలి ఫోటోను పోస్ట్ చేసింది.
గాజా దక్షిణ ప్రాంతంలోని కెరెమ్ షాలోమ్ ప్రాంతం నుంచి ఈ ఫోటోను పోస్ట్ చేశారు.
అందులో ఓ చెక్ పాయింట్‌ను మిలిటెంట్లు ఆక్రమించుకోవడం, రక్తమోడుతూ నేలపై పడుతున్న ఇద్దరు ఇజ్రాయిల్ సైనికుల శవాలు కనిపించాయి.
మరో చిత్రంలో కంచెను కత్తిరించి మిలిటెంట్లు చొరబడటం కనిపిస్తోంది.
ఐదు మోటారు సైకిళ్ళపై ఇద్దరేసి మిలిటెంట్లు రైఫిళ్ళతో చొరబడటం ఈ చిత్రంలో ఉంది.
తక్కువ భద్రత ఉన్న చోట కంచెను ధ్వంసం చేస్తున్న ఓ బుల్డోజర్ కనిపించింది. నిరాయుధులైన కొందరు ప్రజలు అక్కడ గుమిగూడారు.
తరువాత కంచె మధ్య ఏర్పడిన దారిలోంచి పరుగులు పెట్టారు.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ఎరెజ్‌లోని కొన్ని ప్రాంతాల్లో హమాస్ సభ్యులు గుంపులుగుంపులుగా సరిహద్దులు దాటారు.
హమాస్ అనుకూల చానళ్లలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో కాంక్రీట్ కంచె వద్ద పేలుడు జరిపిన దృశ్యాలు కనిపించాయి.
దాడి ప్రారంభించడానికి దీనిని గుర్తుగా వాడారు.
అలాగే ఓ మిలిటెంట్, కొందరు ఫైటర్లను పేలుడు జరిగిన ప్రాంతం వైపు తరలించడానికి చేయి ఊపడం కనిపిస్తోంది.
బుల్లెట్ ప్రూఫ్ దుస్తులు ధరించి, రైఫిల్స్‌తో ఉన్న 8 మంది భారీ భద్రత ఉన్న చెక్ పాయింట్ వద్దకు చేరుకుని ఇజ్రాయెల్ దళాలపై కాల్పులు జరిపారు.

తరువాత ఆ వీడియోలో ఇజ్రాయెల్ సైనికులు నేలపై పడి ఉండటం, మిలిటెంట్లు ఆ ప్రాంతాన్నంతా అణువణువు జల్లెడ పట్టడం కనిపిస్తోంది.
గాజాలో సరిహద్దు వెంబడి ఏడు అధికారిక మార్గాలు ఉన్నాయి.
వీటిలో ఆరింటిని ఇజ్రాయెల్ నియంత్రిస్తుండగా, ఈజిప్ట్‌లోకి దారితీసే మార్గాన్ని ఈజిప్ట్ పర్యవేక్షిస్తోంది.
కాన్నీ కొన్నిగంటల వ్యవధిలోనే కంచె వెంబడి ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడ్డారు.
ఇజ్రాయెల్ భూభాగాల్లోకి దూసుకెళ్లి దాడులు
హమాస్ దళాలు 27 ప్రాంతాల నుంచి దాడులు చేశాయని ఇజ్రాయెల్ అధికారవర్గం చెపుతోంది.
హమాస్ ఎక్కువ భాగం చొచ్చుకువెళ్ళిన ప్రాంతం గాజాకు తూర్పు ప్రాంతం.
ఇక్కడ 22.5 కిలోమీటర్ల మేర హమాస్ ఓఫాకిమ్ పట్టణ ప్రాంతంలోకి చొచ్చుకుపోయాయి.

ఫొటో సోర్స్, GOOGLE
అలాగే సెదార్ట్‌లో ట్రక్ వెనుక భాగంలో మిలిటెంట్లు నిలబడి పట్టణమంతా తిరగడం కనిపించింది.
గాజా తూర్పు ప్రాంతంలోని ఈ పట్టణంలో మూడు కిలోమీటర్ల మేర వీరు ఇలా చక్కర్లు కొట్టారు.
ఆక్సెలెలోని ఖాళీ వీధుల్లో ఓ డజను మంది సాయుధులు చక్కర్లు కొట్టారు. ఇక ఎరేజ్ క్రాసింగ్ లోని ఉత్తర భాగంలోకి ఇప్పుడే దూసుకొచ్చారు.
ఇజ్రాయెల్ దక్షిణ భాగంలో ఇటువంటి దృశ్యాలు పదేపదే కనిపించాయి. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని మిలటరీ అధికారులు చెప్పారు.
రీమ్ సమీపంలో యువకులు పెద్ద సంఖ్యలో గుమిగూడి జరుపుకుంటున్న మ్యూజిక్ ఫెస్టివల్‌పై సాయుధులు కాల్పులు జరిపారు.
ఇజ్రాయెలీలను లక్ష్యంగా చేసుకునేందుకు మిలిటెంట్లు ఆయుధాలు నింపిన వ్యాన్‌లో తిరిగినట్టు ఓ ప్రత్యక్షసాక్షి బీబీసీకి చెప్పారు.

బందీలుగా సైనికులు, పౌరులు
మ్యూజిక్ ఫెస్టివల్, ఇతర ప్రాంతాల నుంచి పౌరులను బందీలుగా పట్టుకుని గాజాకు తరలించారు.
100 మంది పౌరులు, సైనికుల్ని బందీలుగా తీసుకెళ్లినట్లు ఇజ్రాయెల్ చెప్పింది.
బీరీ పట్టణంలో తీసిన ఫుటేజ్‌ను బీబీసీ పరిశీలించగా, అందులో నలుగురు పౌరులను మిలిటెంట్లు బలవంతంగా తీసుకువెళుతున్న దృశ్యం కనిపించింది.
ఇజ్రాయెలీలపై దాడులకు సంబంధించిన అనేక వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి.
వీటిలో కొన్ని తీవ్రంగా గాయపడినవారిని గాజాలోని కిక్కిరిసిన వీధులలో ఊరేగిస్తున్నవి కూడా ఉన్నాయి.
మరి కొన్ని దృశ్యాలు పబ్లిష్ చేయడానికి వీల్లేని విధంగా ఉన్నాయి. ఇందులో ఓ వ్యక్తిని కారులోంచి బయటకు లాగి మెడను నరకడం లాంటి దృశ్యాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
ఇజ్రాయెలీ కమ్యూనిటీలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు మిలటరీ స్థావరాలు ఉన్న జికిమ్, రీమ్‌పై హమాస్ దాడి చేసింది.
దాడుల అనంతరం రీమ్ సమీపం నుంచి సేకరించిన పుటేజీలో మిలటరీ బేస్ సమీపంలో తగలబడుతూ రోడ్డుపై అడ్డదిడ్డంగా ఉన్న కార్లు కనిపించాయి.
ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారనేది తెలియలేదు.
హమాస్ సోషల్ మీడియా ఇజ్రాయెల్ సైనికుల మృతదేహాలను పదేపదే షేర్ చేస్తోంది. బీబీసీ ఇంకా ఈ ఫోటోలను పరిశీలించలేదు.
రాకెట్ల దాడి మొదలైన కొన్ని గంటల్లోనే వందల మంది ఇజ్రాయెలీలు చనిపోయారు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేనట్టుగా ఇది సాగింది.
దాడులు జరిగిన ప్రాంతంలో కొన్ని గంటల్లో సహాయ చర్యలు ప్రారంభమయ్యాయి.
కానీ గాజా బయటి ప్రాంతంలోని కొంత భాగాన్ని హమాస్ ప్రభావవంతంగా నియంత్రించగలిగింది.
మెరుపు దాడుల్లోని వేగం, బీభత్సం ఇజ్రాయెల్‌ను నిర్ఘాంతపోయేలా చేసింది. ఏళ్ళ తరబడి ఇదెలా జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి.
ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతాన్యుహు ‘‘మనం(ఇజ్రాయెల్) యుద్ధంలో ఉన్నాం’’ అని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- స్పై డెత్స్: మజ్జోరే సరస్సు పడవ మునకలో గూఢచారుల మరణాలపై అనేక సందేహాలు
- ‘నా వక్షోజాలను సర్జరీతో వికారంగా మార్చిన డాక్టర్‌కు వ్యతిరేకంగా పోరాడాను... ఆయనకు ఏడేళ్ల జైలుశిక్ష పడేలా చేశాను’
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- రాణిని చంపేందుకు ప్రోత్సహించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్, జస్వంత్ సింగ్‌కు 9 ఏళ్ల జైలు శిక్ష
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










