ఇజ్రాయెల్: భారతీయుల్ని హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారా... అక్కడి తెలుగువాళ్ళ పరిస్థితి ఏంటి?

ఫొటో సోర్స్, HARINDER MISHRA
- రచయిత, హరేంద్ర మిశ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున రాకెట్ల దాడి చేసింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం ఎక్కువగా దెబ్బతింది.
అయితే, ఇదే ప్రాంతంలో భారతీయులు, భారతీయ మూలాలున్న ప్రజలు పెద్ద ఎత్తున నివసిస్తున్నారు. అందులో కొంతమంది కిడ్నాప్ అయ్యారని, మరికొందరు మరణించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితి ఉంది. ఎంబసీతో ఇండియన్స్ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఇజ్రాయెల్‌లో దాదాపు 95,000 మంది భారత సంతతికి చెందిన యూదులు, 18,000 మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారు.
వీరిలో ఎక్కువ మంది యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నారు.
శనివారం జరిగిన హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 600 మందికి పైగా మరణించారు. 2,200 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా, దక్షిణ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బందీలను విడిపించేందుకు హమాస్ మిలిటెంట్లు, భద్రతా బలగాలకు మధ్య పోరు కొనసాగుతోందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
అంతేకాదు హమాస్ దాడికి ప్రతిస్పందనగా గాజాపై వైమానిక దాడులు నిర్వహించింది ఇజ్రాయెల్. ఇందులో 300 మంది పాలస్తీనియన్లు మరణించారు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఇండియన్ ఎంబసీ సూచించింది.
మరోవైపు భారత సంతతికి చెందిన ఇజ్రాయెల్ మహిళల అపహరణ, మృతిపై ఆదివారం ఉదయం కొన్ని స్థానిక మీడియాల్లో కథనాలు రావడంతో అక్కడి భారతీయుల్లో విషాద వాతావరణం నెలకొంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయులు అక్కడ ఏం చేస్తున్నారు?
ఇజ్రాయెల్‌లో భారత సంతతికి చెందిన నాలుగు వర్గాల యూదులు ఉన్నారు. బెనే ఇజ్రాయెల్‌లు మహారాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు.
కోచిన్‌లు కేరళ నుంచి రాగా, బాగ్దాదీలు కోల్‌కతా దాని పరిసర ప్రాంతాల నుంచి వచ్చారు. నాలుగో గ్రూపు మణిపుర్, మిజోరాం నుంచి వచ్చిన బ్నీ మెనాషేలు.
వీరు కాకుండా ఇజ్రాయెల్‌లో సుమారు 18,000 మంది భారతీయ పౌరులు చదువు, పని నిమిత్తం అక్కడ ఉన్నారు.
ఎక్కువ సంఖ్యలో భారతీయులు అక్కడి వృద్ధులను చూసుకునే పనిలో చేరారు. విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిలో ఎక్కువ మంది పరిశోధనల కోసం వెళ్లారు.
ఇజ్రాయెల్‌లో ఉంటున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం. చైనా రెండో స్థానంలో ఉంది. ఇజ్రాయెల్‌లోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లలో వాళ్లు ఉన్నారు.
ఇజ్రాయెల్ టెక్నాలజీకి హబ్‌గా ఉండటంతో భారత్‌కు చెందిన పలువురు ఐటీ నిపుణులు అక్కడ పనిచేస్తున్నారు. టీసీఎస్ వంటి పెద్ద కంపెనీలు ఇక్కడ భారీ స్థాయిలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కువ మంది ఏ ప్రాంతాల్లో ఉంటున్నారు?
బెనే ఇజ్రాయెల్ కమ్యూనిటీకి చెందిన వారిలో ఎక్కువమంది ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ ప్రాంతం హమాస్ దాడి వల్ల ఎక్కువగా దెబ్బతింది.
అష్డోద్, అష్కెలోన్, ఓఫాకిమ్, బీర్షెబా, డిమోనా, కిర్యాత్ గట్ మొదలైన ప్రాంతాల్లో బెనేలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడే చాలా రాకెట్లు పడ్డాయి.
ఈ వర్గానికి చెందిన రికీ షాయ్ స్థానిక మున్సిపాలిటీలోని అష్కెలోన్స్‌కు ప్రతినిధి. దాదాపు రోజంతా తన కుటుంబంతో కలిసి సురక్షిత గదిలో గడిపినట్లు రికీ షాయ్ తెలిపారు.
నగరంలో చాలామంది చనిపోయారని, పలువురిని కిడ్నాప్ చేశారని రికీ అంటున్నారు.
ఈ నగరం ప్రతిసారి గాజా నుంచి రాకెట్ దాడులకు లక్ష్యంగా ఉంది. శనివారం కూడా అలాంటిదే జరిగింది.
నగరం నాశనం కావడం వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని రికీ అంటున్నారు. “ఇక చాలు, ఈ పోరాటం ఎప్పుడు ఆగుతుందో?” అని రికీ ఆవేదన చెందుతున్నారు.
భారత సంతతికి చెందిన సింగర్ లియోరా ఇట్జాక్ అక్కడే ఉంటున్నారు. ఆమె బాలీవుడ్ చిత్రాలలో కూడా పాడారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా భారత్, ఇజ్రాయెల్ దేశాల జాతీయ గీతాలనూ లియోరా ఆలపించారు.
పౌరులు, సైనికులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకున్న తీరు వారి నిజస్వరూపం బట్టబయలు చేస్తోందని ఆమె అంటున్నారు.
హింస కారణంగా అన్ని సమస్యలను భరించాల్సింది అంతిమంగా సామాన్య ప్రజలేనని ఆవేదన వ్యక్తం చేశారు లియోరా.
విమానాల రద్దుతో ఇబ్బందులు
ఇండియన్స్ అలర్ట్‌గా ఉండాలని ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీ, పాలస్తీనాలోని భారత ప్రతినిధి కార్యాలయాలు శనివారం సూచనలు జారీ చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో 'నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని' సూచించాయి.
"కొంతమంది భారతీయ పర్యాటకులు తమను తరలించాలంటూ కోరారు" అని భారత రాయబార కార్యాలయ వర్గాలు తెలిపాయి.
దిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు వారానికి ఐదు రోజులు ఎయిరిండియా విమానాలను నడుపుతోంది. అయితే, యుద్ధం నేపథ్యంలో ఎయిరిండియా అక్కడికి విమానాలను రద్దు చేసింది.
దీంతో ఇజ్రాయెల్ నుంచి భారత్ రావాలనుకునే వారిపై దీని ప్రభావం పడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అక్కడి తెలుగు వారు ఏమంటున్నారు?
యుద్ధం జరుగుతున్నా కొంతమంది భారతీయులు అంతగా ఆందోళన చెందడం లేదు. భద్రతకు సంబంధించిన సూచనలు పాటిస్తే ఇబ్బంది ఉండదని వారు అంటున్నారు.
ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాలు తప్ప ఇతర ప్రాంతాల్లో పెద్దగా దాడులు జరగడం లేదు. ప్రజలు సురక్షిత గృహాలకు చేరుకుంటే రాకెట్ దాడుల నుంచి ప్రమాదం తక్కువగా ఉంటుందని ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేశారు.
చాలా రాకెట్లు అష్కెలోన్ నగరంలోనే పడ్డాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ వాసి ఎల్లే ప్రసాద్ మాట్లాడుతూ ''చాలా అప్రమత్తంగా ఉండాలి, సైరన్ మోగినప్పుడు వెంటనే షెల్టర్‌కు చేరుకోవాలి'' అని సూచిస్తున్నారు.
తాను సేఫ్టీ ప్రోటోకాల్‌లను అనుసరించానని, సురక్షితంగా ఉన్నానని హిబ్రూ యూనివర్శిటీకి చెందిన పరిశోధక విద్యార్థిని బిందు అంటున్నారు.
భారతీయ విద్యార్థులందరూ పరస్పరం టచ్‌లో ఉన్నారని, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని ఆమె తెలిపారు.
ఇజ్రాయెల్ వదిలి వెళ్లాలనే ప్రశ్నలపై చాలామంది భారతీయ విద్యార్థులు స్పందిస్తూ పరిస్థితి అదుపులోకి వస్తుందని "అనవసరమైన భయాందోళనలకు గురికావద్దు" అని సూచిస్తున్నారు.
పని కోసం వెళ్లిన భారతీయుల్లో కొంతమంది ఆందోళన చెందుతున్నారు కానీ, ఇజ్రాయెల్‌ను వదిలి వెళ్లడంపై వారు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉన్నామని, ఇజ్రాయెల్ ఆర్మీ సూచనలను పాటిస్తున్నానని వారు చెబుతున్నారు.
అందరూ చాలా భయపడ్డారని, ఎక్కడికీ వెళ్లలేకపోతున్నారన్నారు మరో సంరక్షకుడు వివేక్. అయితే తాము ఇక్కడే ఉంటామని, తిరిగి వచ్చే ఉద్దేశం లేదని ఆయన తెలిపారు.
ఇజ్రాయెల్‌లో విద్యాసంస్థలు మూసివేశారు. అత్యవసర సేవలతో పాటు, ఇతర కార్యాలయాలలో కూడా ఇంటి నుంచి పని చేయడానికి అనుమతి ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న సినీ యాక్టర్ పరిస్థితేంటి?
ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ నటి నుష్రత్ భరూచా ఇండియా చేరుకున్నారు.
ఇజ్రాయెల్ హైఫీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఆమె అక్కడికి వెళ్లారు.
ఇజ్రాయెల్‌లో కొనసాగుతున్న యుద్దంలో నుష్రత్ చిక్కుకుపోయారని ఆదివారం ఉదయం మీడియా కథనాలు వెల్లడించింది.
భారత్ ఎంబసీ నుష్రత్‌ను సురక్షితంగా తరలిస్తోందని ఆమె ప్రతినిధులు ప్రకటించారు.
ఈ క్రమంలో నుష్రత్ ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారని ముంబైకి చెందిన బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ సుప్రియా సోగ్లే తెలిపారు.
ఇవి కూడా చదవండి
- కతియా: మిస్టరీగా మారిన శ్మశాన వాటిక, అక్కడ దెయ్యాలు ఉన్నాయని గ్రామస్తులు ఎందుకు భయపడ్డారు?
- క్రికెట్: టీమిండియాకు స్పాన్సర్ చేశాక ఆరిపోతున్న కంపెనీలు, అసలేం జరుగుతోంది?
- చెంఘిజ్ ఖాన్ వారసురాలు ప్రిన్సెస్ ఖుతులున్ ఎంత సౌందర్యవతో అంత యోధురాలు... తనను పెళ్ళి చేసుకోవాలనే యువకులకు ఆమె పెట్టిన షరతులేంటి?
- ఇండియా-యూరప్ కారిడార్ అంటే ఏంటి... ఇది చైనా 'బెల్ట్ అండ్ రోడ్'తో పోటీపడగలదా?
- బిహార్: బీసీలు ఎంత శాతం? కులాల వారీ జన గణనలో ఏం తేలింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














