ఇండియా-యూరప్ కారిడార్ అంటే ఏంటి... ఇది చైనా 'బెల్ట్ అండ్ రోడ్'తో పోటీపడగలదా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, నిఖిల్ ఇనామ్‌దార్
- హోదా, బీబీసీ న్యూస్
దిల్లీలో ఇటీవల జరిగిన జీ20 సదస్సులో ప్రకటించిన ‘ట్రాన్స్‌పోర్ట్ కారిడార్’ రానున్న వందల ఏళ్లపాటు ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా మారబోతోందని తన రేడియో కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇది నిజమేనా?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ల గత ఏడాది ఇబ్బందికర పిడికిలి పలకరింపు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనమిక్ కారిడార్ (ఐఎంఈసీ)ని ప్రకటించేటప్పుడు వీరు కరచాలనం చేస్తూ కనిపించారు.
ఐరోపా, ఆసియాల మధ్య రవాణా, కమ్యూనికేషన్ సంబంధాలను పటిష్టం చేయడమే లక్ష్యంగా రైలు, షిప్పింగ్ నెట్‌వర్క్‌లతో ఐఎంఈసీని ప్రకటించారు. ‘‘చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు మరింత ప్రయోజనాలు చేకూర్చేందుకే ఈ ప్రాజెక్టును సిద్ధంచేశారు’’ అని ఫారిన్ పాలిసీ మ్యాగజైన్ ఎడిరట్ రవీ అగర్వాల్ బీబీసీతో చెప్పారు.
ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం ద్వారా అమెరికాకు నేరుగా పెద్దగా ప్రయోజనం కలగకపోవచ్చు. ‘‘అయితే, అమెరికాలో జరిగే జపాన్, దక్షిణ కొరియాల శిఖరాగ్ర సదస్సులో ఇది ప్రధాన అంశం కాబోతోంది’’ అని కనెక్టోగ్రఫీ పుస్తక రచయిత పరాగ్ ఖన్నా చెప్పారు. చైనా విస్తరణ కాంక్ష నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పసిఫిక్ దేశాల మధ్య మరింత సయోధ్య కుదిర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.
మరోవైపు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)కు పోటీగా అమెరికా తీసుకొచ్చిన ప్రాజెక్టే ఐఎంఈసీగా చాలా మంది భావిస్తున్నారు. తమ దేశాన్ని ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, రష్యా, ఐరోపాలతో అనుసంధానించేందుకు చైనా బీఆర్ఐను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఫొటో సోర్స్, Getty Images
బీఆర్ఐతో పోల్చడం సరైనదేనా?
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ బీఆర్ఐను ఆవిష్కరించి ఈ ఏడాదికి పదేళ్లు గడుస్తున్నాయి.
ఆర్థిక మందగమనం నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడాన్ని చైనా తగ్గిస్తోంది. ఫలితంగా బీఆర్ఐ అంచనాలు ఇప్పుడు చాలా తగ్గాయని కొందరు చెబుతున్నారు. మరోవైపు ఇటలీ లాంటి కొన్ని దేశాలు ఈ ప్రాజెక్టు నుంచి బయటకు రావాలని భావిస్తున్నట్లు ఇప్పటికే చెబుతున్నాయి. మరోవైపు శ్రీలంక, జాంబియా లాంటి దేశాలు దీని వల్ల రుణాల ఊబిలో కూరుకుపోయాయి.
బీఆర్ఐ ప్రాజెక్టులపై చాలా ఇతర విమర్శలు కూడా ఉన్నాయి. ‘‘అభివృద్ధి పేరుతో వ్యూహాత్మక ప్రాబల్యానికి చైనా ప్రయత్నిస్తోందని, స్థానిక అవసరాలను అసలు పట్టించుకోవడం లేదని, ప్రాజెక్టుల్లో పారదర్శకతే ఉండటం లేదని, ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని పట్టించుకోవడం లేదని, పర్యావరణానికి హాని చేస్తున్నారని, అవినీతి కూడా చోటు చేసుకుంటోందని ఇలా చాలా ఆరోపణలు వస్తున్నాయి’’ అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ గిరీశ్ లూథ్రా చెప్పారు.
కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ బీఆర్ఐను చైనా పట్టాలపైకి తీసుకెళ్లగలిగిందని, కానీ, ఐఎంఈసీ ప్రస్తుతానికి దాని దరిదాపుల్లోకి వెళ్లలేదని ఖన్నా అన్నారు.
‘‘బీఆర్ఐ తరహాలో ఇది గేమ్ చేంజర్ కాదు. ఇదీ మంచి ప్రాజెక్టే. కానీ మీరు దీని వైపు చూసి.. ఈ ప్రాజెక్టు లేకుండా మేం బతకలేం అని చెప్పలేరు’’ అని బీబీసీతో ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎందుకు పోల్చకూడదు?
దీని వెనుక కారణాలు ఏమిటి?
బీఆర్ఐను పదేళ్ల క్రితమే చైనా మొదలుపెట్టింది. దీని కింద పెట్టుబడులు ఇప్పటికే ఒక ట్రిలియన్ డాలర్లు (రూ.83.24 లక్షల కోట్లు)కు దాటాయి. ‘‘ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 150కిపైగా దేశాలు చేరాయి. ఒకప్పుడు ప్రాంతీయంగా ఉండే ఈ ఇనీషియేటివ్.. నేడు గ్లోబల్‌గా మారింది’’ అని లూథ్రా అన్నారు.
చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటవ్‌కు పోటీగా పశ్చిమ దేశాలు ఇలాంటి ప్రాజెక్టుకు తీసుకురావడం ఇదేమీ తొలిసారి కాదు.
జీ7 దేశాలు, అమెరికా కలిసి ‘పార్ట్‌నర్‌షిప్ ఫర్ గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టిమెంట్’ పేరుతో 2022లో ఒక ప్రాజెక్టుకు తీసుకొచ్చారు. 2027నాటికి 600 బిలియన్ డాలర్లు (రూ.49.94 లక్షల కోట్లు) సమీకరించాలని దీని ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు ‘గ్లోబల్ గేట్‌వే’ను యూరోపియన్ యూనియన్ కూడా ఆవిష్కరించింది.
అయితే ఇవేవీ బీఆర్ఐతో పోటీపడే స్థాయిలో లేవు. ‘‘అయితే, బీఆర్ఐ వేగంగా ముందుకు వెళ్లడంతో గత ఐదేళ్లలో ఈ ప్రాజెక్టులు కాస్త వేగం పుంజుకున్నాయి’’ అని ఖన్నా అన్నారు.
అయితే, బీఆర్ఐ కోణంలోనే ఐఎంఈసీని చూడటాన్ని కొందరు విశ్లేషకులు తప్పపడుతున్నారు.
ఐఎంఈసీతో దేశాల మధ్య దేశాల సహకారం పెరగడం, భిన్న దేశాలు ఒకే ప్రాజెక్టుపై పనిచేయడం లాంటి అంశాల్లో మరింత పురోగతి లభిస్తుంది. ‘‘నేడు చాలా దేశాలు ఇలాంటి కూటములు, వేదికలపై కలిసి పనిచేయాలని చూస్తున్నాయి’’ అని కోపెన్‌హెగన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవీంద్ర కౌర్ అన్నారు.
అదే అసలు భయం
ఐఎంఈసీ మెమరాండమ్‌లో పెద్ద వివరాలేమీ ఇవ్వలేదు. కానీ, తర్వాతి 60 రోజుల్లో యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించే అవకాశముంది. ప్రస్తుతానికి ఏఏ దేశాల గుండా, ఎలా వెళ్తుందో కారిడార్‌ను మాత్రం మ్యాప్ చేశారు.
దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడమనేది చాలా సంక్లిష్టం. ‘‘ఈ పెట్టుబడులను ఏ ప్రభుత్వ సంస్థలు పెడతాయో గుర్తించడం, ప్రాజెక్టులను కేటాయించడం, టైమ్ ఫ్రేమ్‌లను నిర్ధారించడం లాంటివి ముందు జరగాలి’’ అని ఖన్నా అన్నారు.
కొత్త కస్టమ్స్, వాణిజ్య విభాగాలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ట్రాన్స్-యురేసియన్ రైల్వేను తీసుకోండి. ఇది 30 దేశాల గుండా నడుస్తోంది. ‘‘ఇక్కడ మొదట్లో, చివర్లో క్లియరెన్స్ ఇస్తే చాలు. కానీ, ఐఎంఈసీకి ఇలాంటి వ్యవస్థ అందుబాటులో లేదు’’ అని ఖన్నా అన్నారు.
మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా లాంటి దేశాల మధ్య సంబంధాల్లో ఎప్పటికప్పుడే విభేదాలు వస్తుంటాయి. ఈ వ్యూహాత్మక సహకారం గాడితప్పడానికి పెద్ద ఎక్కువ సమయం పట్టబోదని కొందరు నిపుణులు అంటున్నారు.
సూయజ్‌తో పోటీ
ఐఎంఈసీ ప్రస్తుతం ‘సూయజ్ కెనాల్’తో పోటీపడాల్సి ఉంటుంది. ముంబయి నుంచి ఐరోపా మధ్య వస్తు రవాణాలో ఈజిప్టులోని ఈ కెనాల్ కీలకపాత్ర పోషిస్తుంది. ‘‘ఐఎంఈసీలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాలతో మన సంబంధాలు మెరుగుపడితే, ఈజిప్టు సంబంధాలు దెబ్బ తింటాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు రాసిన సంపాద కీయంలో ఎకానమిస్టు స్వామినాథన్ అయ్యర్ అన్నారు.
మరోవైపు సూయజ్ కెనాల్ గుండా రవాణా కాస్త చవకైనది. వేగంగా పనిచేస్తుంది. ‘‘ఐఎంఈసీ చూడటానికి రాజకీయంగా అద్భుతమైనదిగా కనిపించొచ్చు. కానీ, ట్రాన్స్‌పోర్ట్ ఎకానమిక్స్‌కు ఇది పూర్తి విరుద్ధంగా ఉంటుంది’’ అని అయ్యర్ అన్నారు.
అయితే, ఇక్కడ వాణిజ్యం, ఆర్థిక సంబంధాలతో మాత్రమే ఆగిపోకుండా విద్యుత్ గ్రిడ్లు, సైబర్ సెక్యూరిటీ ఇలా చాలా అంశాలను ఈ కారిడార్‌లో చేరుస్తున్నారు.
‘‘దిల్లీ సదస్సులో చెప్పినట్లుగా ఐఎంఈసీని తీసుకురాగలిగితే, మన భూమిని మరింత సురక్షితంగా, నివాసయోగ్యంగా మార్చుకోవచ్చు. అలా జరగాలనే అందరమూ కోరుకుందాం’’ అని యూఏసీ అంబాసిడర్‌గా పనిచేసిన నవ్‌దీప్ పురీ ద నేషనల్ న్యూస్‌కు రాసిన ఒక వ్యాసంలో తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎలాంటి భోజనం వడ్డిస్తున్నారు? సోషల్ మీడియాలో చర్చకు కారణం ఏంటి?
- తెలంగాణలో పసుపు బోర్డ్ ఏర్పాటైతే రైతులకు కలిగే లాభమేంటి?
- Sexual Health: సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- ‘సెక్స్ కోరికలు పెంచే ఆ హార్మోన్ తీసుకున్నాక నాకు కొడుకు పుట్టాడు’
- పువ్వును కాయగా మార్చే యంత్రం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















