జీ20 సదస్సు: తొలి రోజే డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం ఎలా కుదిరింది?

భారత ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు శనివారం తొలి రోజు విజయవంతంగా ముగిసింది. ఆదివారంనాడు రెండో రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. జీ20లోని సభ్య దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఆఫ్రికా యూనియన్ కూడా జీ20లో శాశ్వత సభ్యత్వం పొంది, ఈ సదస్సులో పాల్గొంటోంది.

సాధారణంగా ఈ వార్షిక సదస్సు ముగిసేటప్పుడు డిక్లరేషన్‌ను విడుదల చేస్తారు. కానీ, మొట్టమొదటిసారి జీ20 డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదిరినట్లు సదస్సు ప్రారంభమైన తొలి రోజే ప్రకటించారు.

జీ20 మీడియా సెంటర్‌కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జీ20 శిఖరాగ్ర సదస్సు జాయింట్ డిక్లరేషన్‌పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని ప్రకటించారు.

నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేయగానే అక్కడున్న జర్నలిస్టులంతా చప్పట్లు కొట్టారు.

ఆ తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సెంటర్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, జాయింట్ డిక్లరేషన్‌పై మరింత వివరణ ఇచ్చారు.

మొదటగా విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడారు. ‘‘ఈ రోజు సదస్సులో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. జాయింట్ డిక్లరేషన్‌లో పటిష్టమైన, అన్నింటికీ సమ ప్రాధాన్యమిచ్చే, సమ్మిళిత వృద్ధికి పెద్దపీట వేశాం’’ అని ఆయన చెప్పారు.

ఆయన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడారు. ‘‘ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుక్కునే క్రమంలో అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్తాం. ఇక్కడ నిర్ణయాలు తీసుకునే క్రమంలో దక్షిణార్ధగోళంలోని దేశాల గళం కూడా వినిపించేలా చూసేందుకు భారత్ కట్టుబడి ఉంది’’ అని ఆమె అన్నారు.

‘‘గ్రూపులోని ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలను భారత్ సూచించింది’’ అని ఆమె తెలిపారు.

జీ20 సదస్సు

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, శనివారం జీ20 నేతల సదస్సులో ప్రపంచ బ్యాంకు అధినేత అజయ్ బంగ్లా, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా, భారత ప్రధాని నరేంద్ర మోదీ, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

వాస్తవంగా, రష్యా-యుక్రెయిన్ యుద్ధం జరుగుతోన్న సమయంలో అన్ని దేశాల నుంచి ఈ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడం అతిపెద్ద సవాలే.

యుక్రెయిన్ యుద్ధంపై గ్రూపులో విభేదాలు ఉండటంతో అసలు జాయింట్ డిక్లరేషన్ వస్తుందా? అనే సందేహాలను నిపుణులు వ్యక్తంచేయడంతో మోదీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

గత సంవత్సరంలో బాలీలో జరిగిన సదస్సులో, యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను గట్టిగా ఖండించారు. కానీ, ఆ తర్వాత జీ20 ప్లాట్‌ఫామ్‌పై రష్యాను ఖండించడంపై మాస్కో, చైనాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఆ తర్వాత జీ20 అధ్యక్ష బాధ్యతను భారత్‌కు అప్పగించారు. అప్పటి నుంచి ఆతిథ్యమిచ్చే భారత్‌కు ఈ సదస్సు మేనిఫెస్టోపై అన్ని దేశాల నుంచి ఏకాభిప్రాయం పొందడం కష్టమేనని పలు కథనాలు వచ్చాయి.

భారత్ నేతృత్వం కింద జరిగిన జీ20 ఆర్థిక మంత్రుల, విదేశాంగ మంత్రుల సదస్సుల్లో కూడా డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం కుదరలేదు.

యుక్రెయిన్‌పై రష్యా దాడిని అన్ని సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాలని పశ్చిమ దేశాలు కోరాయి.

కానీ, రష్యా, చైనాలు దీన్ని వ్యతిరేకించాయి. ఈ కారణంతో సంయుక్తంగా మేనిఫెస్టోను విడుదల చేయలేకపోయాయి.

యుక్రెయిన్‌లో జరుగుతోన్న యుద్ధాన్ని జీ20 ఫోరమ్ సమస్యగా మార్చవద్దని భారత షెర్పా(జీ20 సభ్యదేశానికి చెందిన ఉన్నత ర్యాంకింగ్ అధికారి) అమితాబ్ కాంత్ తెలిపారు.

యుక్రెయిన్ యుద్ధం యూరప్ యుద్ధమని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో సమస్యలు ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్నాయన్నారు.

జీ20 సదస్సు

ఫొటో సోర్స్, ANI

విజయం సాధించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దౌత్యం

‘‘మనపై(భారత్‌పై) అనుమానం వ్యక్తం చేశారు. కానీ, మనం సాధించాం’’ అని సీనియర్ జర్నలిస్ట్ కేవీ ప్రసాద్ అన్నారు.

ఆతిథ్య భారత్‌ సాధించిన విజయమని చాలా మంది జర్నలిస్ట్‌లు కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ విధానాలతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.

‘‘ఒక సమస్యపై 20 దేశాల నేతలను ఒప్పించడం నిజంగా అతిపెద్ద సవాలే. భారత చొరవ వల్లే ఇది సాధ్యమైంది’’ అని కేవీ ప్రసాద్ అన్నారు.

ప్రధాని మోదీ దౌత్యపరమైన విజయం సాధించారని చాలా మంది జర్నలిస్ట్‌లు అభిప్రాయం వ్యక్తం చశారు.

భారత్ ఇప్పటి వరకు ఎప్పుడూ యుక్రెయిన్‌పై రష్యా దాడిని బహిరంగంగా ఖండించలేదు.

పశ్చిమ దేశాలతో, రష్యాతో సమతుల్యాన్ని పాటిస్తూ వస్తోంది. ఈ యుద్ధంపై తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. కానీ, శాంతిని నెలకొల్పాల్సినవసరం ఉందని మాత్రం చెబుతోంది.

జీ20 సదస్సులో నేతలు

ఫొటో సోర్స్, ANI

ఈ డ్రాఫ్ట్‌ను రష్యా ఎలా అంగీకరించింది?

యుక్రెయిన్‌ యుద్ధం విషయంలో బాలీ సదస్సులో రష్యాను తీవ్రంగా ఖండించారు. దీన్ని రష్యా, చైనాలు వ్యతిరేకించాయని నిపుణులు చెప్పారు.

కానీ, దిల్లీ డిక్లరేషన్‌ను జాగ్రత్తగా గమనిస్తే యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఉపయోగించిన పదాలు కాస్త మెతకగా కనిపిస్తున్నాయి. బాలీ డిక్లరేషన్‌ తరహాలో రష్యా చర్యలను దీనిలో నేరుగా ఖండించలేదు.

‘‘ప్రపంచంలోని భిన్న ప్రాంతాల్లో యుద్ధాల వల్ల ప్రజలు అనుభవించే తీవ్రమైన బాధ, ప్రతికూల ప్రభావాలపై మేం ఆందోళన చెందుతున్నాం’’ అని మాత్రమే పేర్కొన్నారు.

న్యూదిల్లీ డిక్లరేషన్‌లో పేర్కొన్న పదాలు చాలా డిప్లమాటిక్‌గా ఉన్నాయి. వీటిని రష్యా, చైనాలు కూడా అంగీకరించాయి.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ డైనమిక్, ప్రపంచ నాయకత్వం నేతృత్వంలో భారత్ చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. 21వ శతాబ్దం ప్రపంచ సమాజపు సమ్మిళిత వృద్ధి, శాంతి యుగం అవుతుందని ప్రతి ఒక్కరూ అంగీకరించారు. దీనిపై ప్రపంచమంతా ఒకే కుటుంబంగా ఐక్యత సాధించాలి’’ అని విదేశీ వ్యవహారాల నిపుణులు డాక్టర్ సర్వోకమల్ దత్తా అన్నారు.

దీనిపై ఏకాభిప్రాయం ఎలా సాధించారా అని ఆశ్చర్యపోయినట్లు ఈ సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా న్యూస్ పేపర్ ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ కు చెందిన ఒక జర్నలిస్ట్ అన్నారు. అంతేకాక రెండు రోజుల సదస్సులో తొలి రోజే దీనిపై ప్రకటన రావడం మరింత ఆశ్చర్యపరిచిందన్నారు.

ఈ సదస్సు చివరి రోజు కవర్ చేయడానికి మరేం లేదన్నారు.

ఆదివారం జరిగే సమావేశానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంటోని అల్బనీస్ హాజరు కాలేకపోతుండటంతో, సదస్సు ప్రారంభమైన తొలి రోజే అంటే శనివారమే జాయింట్ డిక్లరేషన్‌పై ప్రకటన చేశారు.

గత సంవత్సరం లాగానే ఈ ఏడాది సదస్సులో కూడా యుక్రెయిన్ యుద్ధానికి ప్రాధాన్యత ఇచ్చేలా పశ్చిమ దేశాలు చాలా కృషి చేశాయని దిల్లీ సదస్సులో పాల్గొన్న విదేశీ వ్యవహారాల నిపుణులు చెప్పారు.

కానీ, ఆతిథ్య భారత్ దీనికి ఒప్పుకోలేదని అన్నారు.

‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో శుక్రవారం సాయంత్రం నరేంద్ర మోదీ నిర్వహించిన సమావేశం చాలా ముఖ్యమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం పొందేందుకు అవసరమైన సాయమంతా చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు భరోసా ఇచ్చారు’’ అని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి మార్గరెట్ మెక్లియోడ్ చెప్పారు.

‘‘ఈ సమావేశంలోనే సదస్సు మేనిఫెస్టోపై అమెరికా అధ్యక్షుడి సమ్మతిని కూడా ప్రధాన మంత్రి తీసుకుని ఉంటారు. ’’ అని ఒక అమెరికా జర్నలిస్ట్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జాయింట్ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 సభ్య దేశాధినేతలు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జాయింట్ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 సభ్య దేశాధినేతలు

జీ20 కాస్త ప్రస్తుతం జీ21

శనివారం సదస్సు ప్రారంభమైన వెంటనే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ20 కుటుంబంలోకి ఆఫ్రికా యూనియన్‌ను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఎంతో కాలంగా ఉన్న ఈ డిమాండ్ నెరవేరింది.

జీ-20 శాశ్వత సభ్యదేశం హోదాలో కేటాయించిన కుర్చీలో ఆసీనులు కావాలని ఆఫ్రికా యూనియన్ అధినేతను మోదీ ఆహ్వానించారు.

ప్రధాని ఆహ్వానం మేరకు ఆఫ్రికా యూనియన్ చైర్‌పర్సన్ అజలి అసౌమని తన కుర్చీలో ఆసీనులయ్యారు.

అజలి అసౌమనికి జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటోన్న దేశాధినేతలందరూ చప్పట్లతో స్వాగతం పలకగా.. ప్రధాని మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు.

ఆఫ్రికన్ యూనియన్‌కు చెందిన 55 సభ్య దేశాలు దీనిపై సానుకూల స్పందనను వ్యక్తం చేశాయి.

‘‘యూరోపియన్ యూనియన్ జీ20లో సభ్యులైనప్పుడు, ఆఫ్రికన్ యూనియన్ ఎందుకు కాకూడదు?’’ అని సీనియర్ జర్నలిస్ట్ కేవీ ప్రసాద్ ప్రశ్నించారు.

ఆఫ్రికా దేశాలు సాధించిన ఈ విజయాన్ని భారత విజయం కూడా అభివర్ణించారు.

‘‘ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు కూడా శాశ్వత సభ్యత్వం కల్పించాలని చాలా ఆఫ్రికా దేశాలు ఇప్పటికే అంగీకరించాయి. ఇక ఇప్పుడు అన్ని ఆఫ్రికా దేశాలు దీనికి సమ్మతి తెలియజేయనున్నాయి’’ అని కేవీ ప్రసాద్ అన్నారు.

ఆఫ్రికాలో చాలా దేశాల్లో ఆహార భద్రతా అనేది అతిపెద్ద సమస్యగా ఉంది.

పేద, ధనిక దేశాల మధ్య పెరుగుతోన్న అంతరాయాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాల్సి ఉందని సభ్యదేశాలు నొక్కి చెప్పాయి.

‘‘జీ20 భారత్ అధ్యక్షతన కింద, ఆఫ్రికన్ యూనియన్‌ను కూడా శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా గ్లోబల్ సౌత్ ప్రాతినిధ్యాన్ని మరింత విస్తరించారు. జీ21 సరికొత్త యుగం ప్రారంభమైంది. వచ్చే ఏడాది సమావేశంలో అంటే 2024లో పసిఫిక్ ఐలాండ్ దేశాలకు కూడా చోటు కల్పించి జీ21ను జీ22గా మార్చేందుకు ఇక ఇప్పుడు భారత్ దృష్టిపెట్టాలి’’ అని డాక్టర్ సర్వోకమల్ దత్తా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)