జీ-20 అంటే ఏంటి... ఈసారి సమావేశాలు దిల్లీలో ఎందుకు జరుగుతున్నాయి?

జీ20 సమ్మిట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జెరెమీ హోవెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత రాజధాని దిల్లీలో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరగనున్న జీ-20 సదస్సుకు ప్రపంచంలోని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు హాజరుకానున్నారు.

ఈ ఏడాది సదస్సులో ప్రధానంగా స్థిరమైన అభివృద్ధితో పాటు యుక్రెయిన్‌ సంఘర్షణపై కూడా చర్చ జరగొచ్చని భావిస్తున్నారు.

జీ20 అంటే ఏంటి?

జీ20 అనేది 20 దేశాల సమూహం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే వేదిక.

ఈ జీ20 దేశాలు ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని మూడొంతుల జనాభాలో రెండొంతులు ఈ దేశాల సొంతం.

ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, తుర్కియే, యూకే, యూఎస్ ఉన్నాయి. ఈ 19 దేశాలతో పాటు ఇందులో స్పెయిన్ శాశ్వత అతిథిగా ఉంది.

జీ20 దేశాల్లోనే మరో చిన్న గ్రూప్ జీ7 సదస్సులకు హాజరవుతాయి.

జీ20 దేశాల్లోని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు కలిసి బ్రిక్స్‌గా ఏర్పడ్డాయి. దానిని విస్తరణలో భాగంగా మరో ఆరు దేశాలకు ఆహ్వానాలు అందాయి. వాటిలో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.

జీ20 సమ్మిట్

ఫొటో సోర్స్, Reuters

ఇక్కడ ఏం చర్చిస్తారు?

గతంలో జరిగిన సమావేశాల్లో జీ20 నేతలు కేవలం ఆర్థిక విషయాలపైనే కాకుండా వాతావరణ మార్పులు, సస్టెయినబుల్ ఎనర్జీ, బహుళ జాతి సంస్థలపై పన్నుల విధింపు వంటి అంశాలపై చర్చించారు.

ప్రతి ఏటా ఒక సభ్య దేశం జీ20 సమావేశాలను నిర్వహించే బాధ్యతలను తీసుకుంటుంది. సమావేశాల్లో ఏయే అంశాలపై చర్చించాలనే అజెండాను కూడా రూపొందిస్తుంది.

2022లో ఇండోనేషియాలో జీ20 సమావేశాలు జరిగాయి. నేతల శిఖరాగ్ర సదస్సు బాలిలో జరిగింది.

2023లో దిల్లీ వేదికగా జరగబోతున్న ఈ సదస్సు స్థిరమైన అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. అలాగే, అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఆర్థిక వృద్ధిని విస్తృతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది.

ఈ సదస్సులో సామూహిక సమావేశాలతో పాటు పలు దేశాధినేతలు ఒకరితో మరొకరు చర్చించుకునే అవకాశం కూడా ఉంటుంది.

సదస్సులో వాతావరణ మార్పు, యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం, పేదరికంపై పోరాటానికి ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు తీసుకోవాల్సిన చర్యలు వంటి విషయాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడతారని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి.

అయితే, ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదని క్రెమ్లిన్ తెలిపింది. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ కూడా ఈ సమావేశాలకు దూరంగా ఉండనున్నారని చెబుతున్నారు.

జీ20 సమ్మిట్

అజెండాలో వివాదాస్పద అంశాలున్నాయా?

యుక్రెయిన్‌లో రష్యా యుద్ధం దిల్లీ సదస్సును ఇబ్బందిపెట్టే అవకాశముంది.

2022లో ఇండోనేషియాలో జరిగిన జీ20 సమావేశాల సందర్భంగా అమెరికా, రష్యా ప్రతినిధుల మధ్య జరిగిన తీవ్ర వాదనల కారణంగా విదేశాంగ మంత్రులు ఒప్పందాలు చేసుకోలేకపోయారు.

నవంబర్‌లో జరిగిన నేతల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సరిహద్దులో ఉన్న పోలెండ్‌లో క్షిపణులు పడే అవకాశంపై జరిగిన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇటీవల దక్షిణ ఆఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పుతిన్ ప్రతినిధిగా లావ్రోవ్ పాల్గొన్నారు. అయినప్పటికీ పుతిన్ కూడా వీడియో లింక్ ద్వారా సమావేశాలకు హాజరయ్యారు.

ఈ ఏడాది మేలో కశ్మీర్‌లో జరిగిన జీ20 దేశాల టూరిజం సదస్సును చైనా, సౌదీ అరేబియా బహిష్కరించాయి. కశ్మీర్ భూభాగానికి సంబంధించి భారత్ - పాకిస్తాన్ మధ్య వివాదం నెలకొని ఉండడమే అందుకు కారణం.

అరుణాచల్‌ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ భూభాగాన్ని తమ భూభాగంగా పేర్కొంటూ చైనా మ్యాప్ విడుదల చేయడంతో భారత్ - చైనా మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం కూడా మళ్లీ చెలరేగింది.

దేశాధినేతల గ్రూప్ ఫోటో ఎందుకు?

కీలక సమావేశాల అనంతరం దేశాధినేతలంతా కలిసి ఫోటో దిగడం ఆనవాయితీ. దానినే ఫ్యామిలీ ఫోటోగా వ్యవహరిస్తారు.

అయితే, ఆ ఫోటో ద్వారా పలు దేశాల మధ్య నెలకొన్న విరోధం కూడా అప్ప్పుడప్పుడూ బహిర్గతం అవుతూ ఉంటుంది.

2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ వద్ద జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యతో యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఆయన ఫోటోలో చివర్లో నిలబడడం కనిపించింది.

జీ20 సమ్మిట్

ఫొటో సోర్స్, Reuters

జీ20 సాధించిందేంటి?

2008, 2009 ఆర్థిక సంక్షోభం సమయంలో జరిగిన దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు తీసుకోవాల్సిన అనేక చర్యలకు నేతలు అంగీకరించారు.

అయితే, ప్రత్యర్థి దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ తర్వాత జరిగిన సమావేశాలు పెద్దగా విజయవంతం కాలేదని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనప్పటికీ సదస్సులో భాగంగా జరిగే ద్వైపాక్షిక సమావేశాలు నిర్మాణాత్మకంగా జరిగినట్లు నిరూపితమయ్యాయి.

2019లో ఒసాకాలో జరిగిన సదస్సులో వాణిజ్య వివాదాన్ని పరిష్కారం దిశగా చర్చల ప్రక్రియ ప్రారంభించేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్‌‌పింగ్ అంగీకరించారు.

జీ20 సమ్మిట్

ఫొటో సోర్స్, AFP

జీ20 సదస్సు వేళ నిరసనలు

దేశాధినేతల సదస్సు సందర్భంగా తరచూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

2010లో టొరంటోలో, 2017లో హాంబర్గ్‌లో జరిగిన సదస్సుల సందర్భంగా పెట్టుబడిదారీ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శనలు చేశారు.

2018 సమ్మిట్ సందర్భంగా జీ20 దేశాల ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ రియో డీ జెనీరోలో వేల మంది ఆందోళనకారులు ప్రదర్శన నిర్వహించారు.

లండన్‌లో 2009లో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సు నిరసనల్లో చిక్కుకుని ఇయాన్ టామ్‌లిన్సన్ అనే వ్యక్తి మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)