శ్రీలంక అంతర్యుద్ధం: అదృశ్యమైన తమ వారి కోసం ఇప్పటికీ వెతుకుతున్న తమిళులు-ఆ రోజు ఏం జరిగింది?

- రచయిత, రాజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆగస్ట్ 30న ఇంటర్నేషనల్ డే ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌డ్ డిజప్పియరెన్స్ డే గా జరుపుకుంటారు. అంటే బలవంతంగా తమ ప్రాంతాన్ని వీడివెళ్లాల్సి వచ్చిన బాధితుల రోజు.
ప్రపంచవ్యాప్తంగా అనేక మందితో పాటు శ్రీలంకలోనూ చాలామంది బాధిత కుటుంబీకులు కనిపించకుండా పోయిన తమ వారిని గుర్తు చేసుకుంటున్నారు.
మూడు దశాబ్ధాల అంతర్యుద్దం, అందులో మరణించిన వారు, కనిపించకుండా పోయిన వారిని కుటుంబ సభ్యులు తలచుకుంటున్నారు.
యుద్ధం చివరి దశలో అదృశ్యమైన వ్యక్తులు ఎక్కువగా శ్రీలంకలోని ఉత్తర తూర్పు ప్రావిన్స్‌లలో అలాగే ఇతర ప్రావిన్సులలో కనిపిస్తారు.
తమ వారి ఆచూకీ చెప్పాలంటూ వారంతా 2,380 రోజులుగా వావునియా నగరంలో ఆందోళన చేస్తున్నారు.

దశాబ్ధాలుగా కొనసాగుతున్న అన్వేషణ
ఆందోళనలతో పాటు కనిపించకుండా పోయిన వారి ఆచూకీ కోసం అన్వేషణ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం తమ వారి జాడ కోసం వెదుకుతున్న కొంతమందిని బీబీసీ బృందం కలిసింది.
వావునియాకు చెందిన 52 ఏళ్ల వాలెంటినా యుద్ధం చివరి దశలో కనిపించకుండా పోయిన తన తల్లి క్వీన్ విక్టోరియా కోసం వెదుకుతున్నారు.
పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్న వాలెంటినా.. 14 ఏళ్లుగా తన తల్లి కోసం వెతుకుతున్నారు.
2009 మే 18న ఏం జరిగింది?
2009 మే 18తో శ్రీలంకలో స్వేచ్చ కోసం 30 ఏళ్లపాటు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం సాగించిన పోరాటం ముగింపు దశకు వచ్చింది.
ముల్లైతీవు, ముల్లివైకల్, వట్టువాగల్ వంతెన సమీపంలో శ్రీలంక సైన్యం ఎల్టీటీఈ మధ్య జరిగిన పరస్పర దాడుల్లో వాలెంటినా తల్లి తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన తల్లిని చాపపై పడుకోబెట్టి వట్టువాగల్ వంతెన సమీపంలో ఉన్న సైనిక ప్రాంతం వైపు తీసుకెళ్లారు వాలెంటీనా.
అక్కడున్న సైనికాధికారులు గాయపడిన వాలెంటీనా తల్లిని తమ చేతుల్లోకి తీసుకున్నారు.
తిరిగి అప్పగిస్తామని చెప్పిన సైన్యం.. తన తల్లిని ట్రాక్టర్‌లో ఎక్కించిందని వాలెంటినా బీబీసీతో చెప్పారు.
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు చాలా మంది గాయపడిన వారిని సైన్యం ట్రాక్టర్‌లో ఎక్కించిందని ఆమె చెప్పారు.
వాలెంటినా తన తల్లిని చూసిన చివరి క్షణం కూడా అదేనని అన్నారు.
‘‘2009లో అంటే యుద్దం చివరి దశలో ముల్లివైకల్‌లో మా అమ్మ గాయపడినప్పుడు నడవలేని స్థితిలో ఉన్న ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డు పక్కన పడి ఉన్న చాప మీద పడుకోబెట్టుకుని, శైవక్షేత్రం సమీపంలోని ఆర్మీ క్యాంపు వద్దకు తీసుకెళ్లాను. అయితే ఆమె ఎక్కడ ఉందో నాకు ఈ రోజు వరకూ తెలియదు’’ అని వాలెంటినా చెప్పారు.
కనిపించని తల్లి
అధ్యక్షుడిని కలవడంతో పాటు ఎక్కడ వెదికినా తన ఇవాళ్టికీ తన తల్లి ఆచూకీ లభించలేదన్నారామె.
"నేను ప్రతిచోటకు వెళ్లాను. అధ్యక్షుడు, ఐసీఆర్సీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇలా చాలా చోట్లకు వెళ్లాను. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.’’ అన్నారామె.
తల్లి అదృశ్యమైన తర్వాత తన జీవితం గురించి కూడా వాలెంటినా బీబీసీతో మాట్లాడారు.
‘‘పైకి మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, లోపల మా బాధ దేవుడికే తెలుసు. అదెలాంటిదంటే మీ దగ్గరున్నది మీతో లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది’’ అని చెప్పారామె.
యుద్ధంలో తన తల్లిని మాత్రమే కాకుండా కుటుంబంలోని చాలా మంది సభ్యులను కోల్పోయారు వాలెంటినా, ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నారు.
"నేను ఒంటరిగా ఉన్నాను. నాకు పెళ్లికాలేదు. నా వయసు 52 సంవత్సరాలు. అమ్మను వెతుక్కుంటూ వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అంతర్జాతీయ సమాజం మాకు అండగా నిలిస్తే బావుంటుంది. అమ్మ ఎక్కడో బతికే ఉందనే నమ్మకం ఉంది. కానీ అది ఎక్కడ, ఎలా అన్నదే మాకు అర్థం కావడం లేదు" అని వాలెంటినా చెప్పారు.

మనవరాలి కోసం అమ్మమ్మ
యుద్ధ చివరి దశకు చేరుకున్న సమయంలో మనవరాలిని కోల్పోయిన 76 ఏళ్ల తనలెట్సుమి ఆమె కోసం వెతుకుతూనే ఉంది.
పులియంకుళం ప్రాంతంలో యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న తన పుట్టింటికి సమీపంలోనే తనలెట్సుమి చిన్న ఇల్లు కట్టుకుని మరో మనవరాలితో అక్కడే జీవిస్తున్నారు.
తన మనవరాలిని సైన్యం తీసుకెళ్లినప్పుడు ఆమె వయస్సు 17 సంవత్సరాలని తనలెట్సుమీ వెల్లడించారు.
ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనవరాలిని వెతుక్కుంటూ ఎక్కడికెళ్లినా ఆమె గురించి ఎలాంటి సమాచారం లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
‘యుద్ధం వచ్చింది, మా పిల్లల్ని పోగొట్టుకున్నాం’
సైన్యం తన మనవరాలితో సహా పలువురిని పాఠశాల గదుల్లోకి తీసుకెళ్లి, విచారణ జరిపి ఓమంథై చెక్‌పోస్టు వద్ద వాహనాల్లో ఎక్కించడాన్ని తాను చూశానని ఆమె చెప్పారు.
"యుద్ధం వచ్చింది. నా కూతురు, అల్లుడు కలిసి వట్టువాగల్ వెళ్లారు. ముల్లైతీవు తీవ్రంగా దెబ్బతింది. ఒక్కో ప్రదేశం నుంచి చివరకు వట్టువాగల్‌కు వెళ్లాం. కూతురు, అల్లుడు అక్కడే మృతి చెందారు. ఇద్దరి మరణానంతరం ఈ ఇద్దరు పిల్లలు నా చేతుల్లో ఉన్నారు. అక్కడి నుంచి సముద్రం దాటి ఒమన్‌కు వెళ్లి పిల్లలను వెంట తెచ్చుకున్నాం. సైన్యం మమ్మల్ని ఒమన్‌లో దింపింది."
"పిల్లలందరినీ ఒక గదిలో ఉంచారు, ఆ గదిలో అందరూ పోలీసు అధికారులు ఉన్నారు, వారెవరో నాకు తెలియదు, వారు వరుసలో ఉన్న పిల్లలందరినీ ఒకచోట చేర్చారు, వాళ్లందర్నీ స్కూలు రూముల్లోకి తీసుకెళ్లి వారితో మాట్లాడారు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలియదు. వెళ్లి అడిగాను.. పంపిస్తాం అని చెప్పారు. సైనికులంతా ఓ వాహనంలో ఎక్కారు. అందులోనే పిల్లలందర్నీ ఎక్కించారు. అప్పటి నుంచి ఆ పిల్లలు ఏమయ్యారనేది ఇప్పటికీ తెలియదు’’ అని తనలెట్సుమి చెప్పారు.
యుద్ద బాధితులైన తమిళులు చేస్తున్న ఆరోపణలను శ్రీలంక సైన్యం 14 ఏళ్లుగా నిరంతరం తిరస్కరిస్తూనే ఉంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















