శ్రీలంక: మందుల కొరతతో బాలిక మృతి, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? - గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, DISLHA DILRUKSHI FAMILY
- రచయిత, రంజన్ అరుణ్ ప్రసాద్
- హోదా, బీబీసీ కోసం
శ్రీలంకను నిరుడు చుట్టుముట్టిన భారీ ఆర్థిక సంక్షోభం ఇంకా అక్కడి ప్రజల జీవితాలపై ప్రభావం చూపిస్తోంది.
నిరుటితో పోల్చితే ప్రస్తుతం పరిస్థితులు కొంతవరకూ మెరుగుపడ్డాయి. అయితే, ఇప్పటికీ చాలా మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు శ్రీలంకలోని ఇరకువానాయ్ ఆనకట్ట, ఫోర్ట్ ప్రాంతాల్లో బీబీసీ పర్యటించింది.
రత్నపుర జిల్లాలోని ఇరకువానాయ్‌లో పెద్ద సంఖ్యలో తమిళ ప్రజలు జీవిస్తుంటారు.
శ్రీలంకలోని మధ్య ప్రాంతంలో ఉండే ఈ నగరానికి చేరుకోవాలంటే రాజధాని నుంచి మూడు గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది.
రోజు కూలీగా జీవించే పుష్పలత ఇక్కడి పరిస్థితులపై బీబీసీతో మాట్లాడారు.
భర్తతో కలిసి పుష్పలత కూలి పనికి వెళ్తుంటారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
వీరి రెండో కుమార్తె దిల్షా దిల్‌రుక్షి పదో తరగతి చదువుతోంది.

ఫొటో సోర్స్, DISLHA DILRUKSHI FAMILY
కొన్ని నెలల క్రితమే దిల్షాకు క్యాన్సర్ సోకినట్లు తెలిసింది. ఆమెకు మహారాగమ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
దిల్షా దిల్‌రుషిని వెతుక్కుంటూ వారి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ ఆమె తల్లి, అక్క మాత్రమే బీబీసీకి కనిపించారు.
‘‘ప్రస్తుతం దిల్షా ఆసుపత్రిలోనే ఉంది. ఆమెకు తోడుగా నా భర్త అక్కడ ఉన్నారు.’’ అని పుష్పలత బీబీసీతో చెప్పారు.
‘‘మా అమ్మాయికి లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) సోకిందని చెప్పారు. తనకు కళ్లు తిరగడం, వాంతులు, నీరసం లాంటి లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాం. ఇరకువానాయ్ నుంచి కహావత్‌కు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు మాకు సూచించారు.’’ అని పుష్పలత చెప్పారు.
అక్కడి నుంచి ఆమెను రత్నపురకు తీసుకెళ్లాలని సూచించారు. అలా ఇక్కడి పెద్ద ఆసుపత్రుల్లో ఒకటైన మహారాగమకు దిల్షాను తీసుకొచ్చారు.
‘‘అసలు మహారాగమకు ఎందుకు తీసుకెళ్లమన్నారో మాకు అర్థం కాలేదు. అయితే, అక్కడకు వెళ్లిన తర్వాతే తనకు క్యాన్సర్ సోకిందని మాకు చెప్పారు.’’ అని పుష్పలత వివరించారు.

ఫొటో సోర్స్, DISLHA DILRUKSHI FAMILY
జీవితాలను ఛిన్నాభిన్నంచేసిన క్యాన్సర్
ఇక్కడ జీవిస్తున్న చాలా మంది తమిళ ప్రజలు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు.
తేయాకు, రబ్బరు తోటల్లో కార్మికులుగా కొందరు పనిచేస్తుంటే.. మరికొందరు వడ్రంగి పనులు చేస్తుంటారు. పుష్పలత, ఆమె భర్త కూడా ఇలానే రోజు కూలీలుగా పనిచేస్తున్నారు.
అయితే, తమ కుమార్తె అనారోగ్యంతో బాధపడటంతో ఆమెకు తోడుగా తన భర్త ఉండాల్సి వస్తోందని, ఫలితంగా తమ ఆదాయం సగం తగ్గిపోయిందని పుష్పలత చెప్పారు.
వీరిద్దరూ రోజుకు వెయ్యి నుంచి 1200 శ్రీలంక రూపాయలను సంపాదిస్తుంటారు. అంటే రోజుకు మొత్తంగా 2,000 నుంచి 2,400 వరకూ సంపాదిస్తారు.
‘‘నెలలో 25 రోజులు పనికి వెళ్తాం. కానీ, ఇప్పుడు నేను ఒక్కదాన్నే పనికి వెళ్తున్నాను. మా అమ్మాయికి తోడుగా నా భర్త ఉంటున్నాడు.’’ అని ఆమె చెప్పారు.
‘‘మొన్నటివరకూ మేం ఇద్దరమూ పాప దగ్గరే ఉండేవాళ్లం. అప్పుడు అసలు ఆదాయమే ఉండేది కాదు. అందుకే కనీసం నేనైనా ఇప్పుడు పనికి వెళ్తున్నాను.’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, NIROSHA FAMILY
మందుల కొరత..
శ్రీలంకలో ప్రస్తుతం మందుల కొరత దిల్షా దిల్‌రుక్షి చికిత్సపైనా ప్రభావం చూపిస్తోంది.
‘‘వైద్యులు సూచిస్తున్న మందుల్లో సగం ఆసుపత్రుల్లో దొరకడం లేదు. మేం బయట ఉండే మందుల షాపుల్లో వీటిని కొనుక్కోవాల్సి వస్తోంది.’’ అని పుష్పలత చెప్పారు.
కొన్నిసార్లు ప్రైవేటు మెడికల్ షాపుల్లోనూ మందులు కనిపించడం లేదు. దేశంలోని మందుల షాపులపై నిరుడు ఆర్థిక సంక్షోభం తీవ్ర ప్రభావం చూపించింది.
‘‘ఆ మందులను కొనుక్కొనేంత స్తోమత మాకు లేదు. ప్రభుత్వం మాకు సాయం చేస్తే చాలా బావుంటుంది.’’ అని పుష్పలత చెప్పారు.
15 ఏళ్ల దిల్షా ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స తీసుకుంటోంది. అదే నగరానికి చెందిన నిరోషా ఇటీవల క్యాన్సర్‌తో మరణించింది.
మందుల కొరత వల్లే నిరోషా మరణించిందని ఆమె సోదరి కార్తికేయన్ కనకప్రియ చెప్పారు.

ఫొటో సోర్స్, NIROSHA FAMILY
‘‘విపరీతంగా పెరిగిన ధరలు’’
కార్తికేయన్ నిరోషా కూడా ఇరాకువానాయ్‌లోని ఒక స్కూలులో చదువుకునేది.
ఏడేళ్ల వయసులోనే తనకు క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. అయితే, ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స తర్వాత, మళ్లీ ఆమె సాధారణ జీవితం గడపడం మొదలుపెట్టింది.
‘‘అయితే, కరోనా సంక్షోభ సమయంలో మా చెల్లికి చికిత్స సరిగా అందలేదు. అప్పట్లో టెస్టులు చేయలేదు, వైద్యులు కూడా అందుబాటులో ఉండేవారు కాదు.’’ అని కనకప్రియ చెప్పారు.
‘‘మా చెల్లికి వారు ఐదు మిల్లీ లీటర్లలో ఔషధాలు ఇచ్చేవారు. దీనికి ఒక్కో డోసుకు 1050 శ్రీలంక రూపాయలు ఖర్చయ్యేవి. ఇలాంటివి రెండు రకాల ఔషధాలు తనకు అవసరం అయ్యేవి. అంటే ఒక వారానికి మేం దాదాపు 60,000 ఖర్చు పెట్టాల్సి వచ్చేది.’’ అని కనకప్రియ తెలిపారు.
‘‘మందులకు అదనంగా రవాణా, ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. ఆర్థిక సంక్షోభం ఉండేటప్పటికీ మేం ఎలాగోలా డబ్బులను పోగాశాం. కానీ, మందులు మాత్రం అందుబాటులో ఉండేవి కాదు.’’ అని ఆమె చెప్పారు.
‘‘మందుల కొరత వల్ల మా చెల్లిలాంటి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.’’ అని కనకప్రియ వివరించారు.
ఇవి కూడా చదవండి:
- నిర్మల్ కొయ్య బొమ్మలకు ప్రాణం పోసే ఆ చెట్టు ఏమిటి? నంబర్లు వేసి కాపాడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
- పెట్రికోర్: తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- తల్లి ప్రాణాన్ని ఆరేళ్ల చిన్నారి రెండుసార్లు అలెక్సా సాయంతో ఎలా కాపాడింది?
- మహిళలకు 3 లక్షల రుణం.. దళితులకు వడ్డీ కూడా ఉండదు.. ఈ కేంద్ర పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















