కృత్రిమ గర్భధారణతో పిల్లలను కన్నారు.. వీర్యం మారిపోవడంతో పిల్లల తండ్రి వేరొకరని తెలిసింది.. ఆ దంపతులు ఏం చేశారంటే

అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సంతాన సమస్యలతో బాధపడే చాలా జంటలు పిల్లల కోసం టెక్నాలజీని ఆశ్రయిస్తుంటాయి.

భారత్‌లోనూ ఇలానే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్‌టీ) సాయంతో ఓ జంటకు కవల పిల్లలు పుట్టారు.

అయితే, ఈ టెక్నాలజీలో ఉపయోగించిన వీర్యం తనదికాదని భర్త తెలుసుకోవడంతో వీరి జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి.

అంటే, ఆ కవల పిల్లలకు ఆయన తండ్రి కాదు.

వెంటనే నేషనల్ కంజ్యూమర్ డిస్ప్యూట్స్ రీఅడ్రెసెల్ కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)కి ఆ జంట ఫిర్యాదు చేసింది.

తమకు పరిహారంగా రెండు కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది.

ఈ కేసులో పరిహారంగా రూ. 1.5 కోట్లు చెల్లించాలని దిల్లీ ఆసుపత్రికి ఆ కమిషన్ సూచించింది.

అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

అసలు ఆ దంపతులకు ఎలా తెలిసింది?

నిజానికి ఈ కేసు 15 ఏళ్ల కిందటిది.

ఏఆర్‌టీ ద్వారా పిల్లలను కనేందుకు 2008లో దిల్లీలోని ప్రైవేటు ఆసుపత్రి ‘భాటియా గ్లోబల్ హాస్పిటల్ అండ్ ఎండోసర్జరీ ఇన్‌స్టిట్యూట్’ను ఆ దంపతులు ఆశ్రయించారు.

ఈ టెక్నాలజీని నియంత్రించేందుకు 2021లో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (నియంత్రణ) బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

ఏఆర్‌టీ సాయంతో కృత్రిమ విధానంలో పిల్లలను పొందొచ్చు.

పిల్లల కోసం సహజ పద్ధతులలో ప్రయత్నించినా ఎలాంటి ఫలితమూ కనిపించని జంటలు ఎక్కువగా ఈ విధానాన్ని ఆశ్రయిస్తుంటాయి.

దీనిలో చాలా రకాలు ఉన్నాయి. అవి ఏమిటంటే..

  • ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్
  • ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) అంటే వీర్యాన్ని అండంలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా పిల్లలను పొందడం
  • గామెట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్‌ఫర్ (జీఐటీ).. అంటే మహిళల నుంచి అండాలను సేకరించి ల్యాబ్‌లో వీర్యంతో కలిపి పిండం ఏర్పడేలా చేసి, దీన్ని ఆ మహిళ శరీరంలో ప్రవేశపెట్టడం.

ప్రస్తుత కేసులో ఆ జంట ఐసీఎస్ఐ విధానాన్ని ఆశ్రయించింది.

అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ కేసులో ఎన్‌సీడీఆర్‌సీ ఏం నిర్ణయం తీసుకుందో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

2008లో ఐసీఎస్ఐ విధానంలో ఆ మహిళ గర్భం దాల్చారు. 2009లో ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చారు.

అయితే, పిల్లలకు రక్త పరీక్ష నిర్వహించినప్పుడు ఈ దంపతుల్లో అనుమానం మొదలైంది.

పరీక్షల్లో ఆ పిల్లల బ్లడ్ గ్రూపు ఏబీ(+) గా తెలిసింది. దీన్ని చూసిన దంపతులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే ఇక్కడ తల్లి గ్రూపు బీ(+) కాగా, తండ్రిది వో (-).

ఆ తర్వాత వీరు డీఎన్ఐ ప్రొఫైల్ అంటే పెటెర్నిటీ టెస్టు చేయించారు. అప్పుడే ఆ పిల్లల సొంత తండ్రి ఆయన కాదనే విషయం వెలుగులోకి వచ్చింది.

అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ

ఫొటో సోర్స్, Getty Images

ఎన్ని కేసుల్లో ఇలా జరుగుతుంది?

ఇలా జరగడం చాలా అరుదని డాక్టర్ నయనా పటేల్ బీబీసీతో చెప్పారు. 30 ఏళ్లుగా గుజరాత్‌ ఆనంద్‌ నగరంలో ఆమె సరోగసీ సెంటర్‌ను నడిపిస్తున్నారు.

‘‘శాంపిల్ సేకరించే దగ్గర నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లేవరకూ చాలా జాగ్రత్తగా ఉంటారు. కనీసం ఇద్దరి వ్యక్తుల సమక్షంలో ఆ శాంపిల్‌ను భద్రపరుస్తారు. అయితే, చాలా కేసుల్లో దంపతులు తమ ఇంటి నుంచి శాంపిల్స్ తీసుకొస్తుంటారు. అలాంటి కేసుల్లోనూ ఎలాంటి తప్పూ జరగకుండా జాగ్రత్త వహిస్తారు. మేమైతే ఆ శాంపిల్‌ను ఇంటి నుంచి తీసుకొచ్చారని కూడా రికార్డుల్లో పొందుపరుస్తాం.’’ అని ఆమె చెప్పారు.

‘‘ఇప్పుడు కొత్త టెక్నాలజీలు చాలా అందుబాటులోకి వచ్చాయి. దీంతో తప్పులు జరగడం చాలా అరుదు.’’అని ఆమె తెలిపారు.

అయితే, ‘‘ఒక్కోసారి శాంపిల్స్ ఇచ్చేవారి పేర్లు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. అలాంటి చోట్ల తప్పులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి కేసుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి.’’ అని ఆమె అన్నారు.

తప్పులు జరగడం చాలా అరుదని డాక్టర్ హర్షాన్ బెన్‌ కూడా చెప్పారు. ‘‘ప్రస్తుతం శాంపిల్ ఇచ్చే వ్యక్తికి ఒక ఐడీ ఇస్తారు. దీనికి ఒక కోడ్ ఉంటుంది. అదే కోడ్ బాక్సుపై కూడా రాస్తారు. దీన్నే ఎలక్ట్రానిక్ విటెనెస్ సిస్టమ్‌గా పిలుస్తారు.’’ అని ఆమె తెలిపారు. ఆమె ఎంబ్రయాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

‘‘వీర్యం శాంపిల్‌తోపాటు ఫలదీకరణం చెందిన అండానికి కూడా అదే ట్యాగ్ లేదా బార్‌కోడ్ ఇస్తాం. ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే హెచ్చరికలు వస్తుంటాయి. ఫలితంగా ఇక్కడ తప్పు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.’’ అని ఆమె వివరించారు.

ప్రస్తుత కేసును చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందని దిల్లీలోని క్లౌడ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ గుంజన్ సబర్వాల్ చెప్పారు. ‘‘ఇలా జరగడం చాలా అరుదు. ఎందుకంటే పిల్లల కోసం వచ్చిన దంపతులతో మొదట ఒక కన్సెంట్ లెటర్‌పై సంతకం చేయిస్తారు. అప్పుడు వారి ఫోటోలను కూడా తీసుకుంటారు.’’ అని ఆమె చెప్పారు.

‘‘శాంపిల్‌ను సేకరించే ముందే ఆ వ్యక్తి పూర్తి పేరును అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడు శాంపిల్ తీసుకురావాలో ఒక సమయం కూడా చెబుతారు. అన్ని వివరాలనూ జాగ్రత్తగా రాసుకుంటారు. ఇక్కడ తప్పు జరిగే అవకాశం చాలా తక్కువ.’’ అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 9 మార్గాలు

కేసును ఎలా పరిష్కరించారు?

ప్రస్తుత కేసులో ఆ కవల పిల్లల తండ్రి ఎవరో బయటి వ్యక్తి అని తెలుసుకున్న వెంటనే కన్సూమర్స్ అఫైర్స్ యాక్ట్ కింద ఆ దంపతులు ఫిర్యాదు చేశారు.

తమ విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరించారని, అందుకే ఈ తప్పు జరిగిందని వారు ఆరోపించారు.

‘‘ఆ ఆసుపతి నిర్లక్ష్యం వల్ల తాము భావోద్వేగంగా చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. మా కుటుంబంలో చాలా గొడవలు కూడా వచ్చాయి.’’ అని ఆ పిల్లల తండ్రి చెప్పారు.

ఆ పిల్లలకు భవిష్యత్‌లో ఏవైనా జన్యుపరమైన వ్యాధులు వచ్చే ముప్పు ఉంటుందని కూడా ఆ దంపతులు ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ నిర్లక్ష్యానికి రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కేసులో ఎన్‌సీడీఆర్‌సీ చైర్మన్ డాక్టర్ ఎస్ఎం కాంతికార్ తీర్పునిచ్చారు.

ఏఆర్‌టీ క్లినిక్‌ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఏఆర్‌టీతో పనిచేసే సిబ్బందికి ఈ టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉండాలని ఆయన చెప్పారు.

‘‘కొన్నిసార్లు దీనిపై ఎలాంటి పరిజ్ఞానంలేని కొందరు కూడా ఏఆర్‌టీ క్లినిక్‌లను తెరుస్తున్నారు. దీని వల్ల అనైతిక చర్యలు ఎక్కువవుతున్నాయి.’’ అని వివరించారు.

‘‘ఇలాంటి తప్పుడు చికిత్సల వల్ల సంతాన సమస్యలతో ఇబ్బంది పడేవారు మన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

ప్రస్తుత కేసులో భాటియా గ్లోబల్ హాస్పిటల్ అండ్ ఎండోసర్జరీ ఇన్‌స్టిట్యూట్ రూ.1.5 కోట్లను పరిహారంగా చెల్లించాలని ఎన్‌సీడీఆర్‌సీ సూచించింది.

‘‘దీనిలో రూ.20 లక్షలను కన్సూమర్ లీగల్ ఎయిడ్ అకౌంట్‌లో జమ చేయాలి. మిగతా 1.3 కోట్లను ఆ పిల్లల పేరిట ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలి.’’ అని ఎన్‌సీడీఆర్‌సీ పేర్కొంది.

మరోవైపు దంపతులకు చికిత్స చేసిన ఇద్దరు వైద్యులు కూడా రూ.10 లక్షలు చొప్పున చెల్లించాలని ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశించింది.

వీడియో క్యాప్షన్, మహిళలకు శరీరంలో వీర్యం నిల్వ చేసుకునే సామర్థ్యమే ఉంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)