చంద్రయాన్-3ను ఇస్రో ఎందుకు ప్రయోగిస్తోంది? చంద్రయాన్-2తో ఏం సాధించింది?

ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించబోతున్నారు

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించబోతున్నారు
    • రచయిత, జాహ్నవీ మూలే
    • హోదా, బీబీసీ మరాఠీ

చంద్రుడిపైకి మళ్లీ వెళ్లేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ జులై మధ్యలోనే చంద్రయాన్-3ను ప్రయోగించబోతున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది.

ఇది చంద్రుడిపైకి భారత్ వ్యోమనౌకను పంపుతున్న మూడో ప్రయోగం. చంద్రయాన్-2కు కొనసాగింపుగా దీన్ని చేపడుతున్నారు.

చంద్రుడిపై ‘సాఫ్ట్‌ ల్యాండింగ్’ కోసం దీని ద్వారా ఇస్రో ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్ చేయగలిగాయి.

సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ను కూడా ఈ ఏడాది ఆగస్టు చివరినాటికి ప్రయోగించబోతున్నట్లు ఇస్రో ప్రకటించింది. అయితే, ప్రస్తుతం చంద్రయాన్-3పైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

చంద్రయాన్-3ను ఎందుకు చేపడుతున్నారు, దీనికి ఎంత ఖర్చు అవుతోంది, ఈ ప్రయోగ లక్ష్యాలు ఏమిటి? ఈ వివరాలు తెలుసుకుందాం.

చంద్రయాన్-3ను ఎప్పుడు ప్రయోగిస్తున్నారు?

చంద్రయాన్-3 ప్రయోగానికి అన్నీ దాదాపుగా సిద్ధమైనట్లు జూన్ 28న ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు.

‘‘ప్రస్తుతం ఈ వ్యోమనౌక పనులు పూర్తయ్యాయి. పరీక్షలు కూడా చివరి దశకు వచ్చేశాయి’’ అని ఆయన చెప్పారు.

‘‘జులై 12 నుంచి 19 మధ్య ఈ ప్రయోగానికి సమయం అనుకూలంగా ఉంటుంది. మిగతా పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ప్రయోగం కచ్చితంగా ఎప్పుడు నిర్వహిస్తామో తేదీ ప్రకటిస్తాం’’ అని సోమనాథ్ తెలిపారు.

అంటే మరికొన్ని రోజుల్లో ప్రయోగ తేదీని ఇస్రో ప్రకటించే అవకాశముంది. అయితే, కొన్ని మీడియా సంస్థలు దీనిపై వార్తలు ప్రచురించాయి. జులై 13న మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ప్రయోగం నిర్వహిస్తారని ఇస్రో అధికారులు చెప్పినట్లు ఆ కథనాల్లో ఉంది. చంద్రుడిపై ఆగస్టు 23న ఈ వ్యోమనౌక ల్యాండ్ కాబోతుందని కూడా వీటిలో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ వ్యోమనౌకను ప్రయోగించబోతున్నారు. దీని కోసం ఎల్‌వీఎం3 రాకెట్ ఉపయోగించబోతున్నారు. ఈ రాకెట్‌నే ఇదివరకు జీఎస్‌ఎల్‌వీ మార్క్-3గా పిలిచేవారు.

చంద్రయాన్ 3

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, చంద్రయాన్-3 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్ల వ్యయం అవుతోంది

చంద్రయాన్-3 లక్ష్యం ఏమిటి?

చంద్రయాన్-3 ప్రయోగానికి దాదాపు రూ.615 కోట్ల ఖర్చు అవుతోంది. దీని కోసం ఇస్రో మూడు లక్ష్యాలను నిర్దేశించింది. అవి ఏమిటంటే..

  • చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ‘సాఫ్ట్ ల్యాండింగ్’ చేయడం
  • చంద్రుడిపై తిరిగే ఒక రోవర్‌ను ప్రయోగించడం
  • చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు నిర్వహించడం
ఈ మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని భావిస్తున్నారు

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, చంద్రయాన్ 3 ఈ మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని భావిస్తున్నారు

చంద్రయాన్-2 తరహాలోనే చంద్రయాన్-3లో కూడా ఒక ల్యాండర్ (ఇదే చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండ్ కాబోతోంది), ఒక రోవర్ (ఇది చంద్రుడిపై తిరుగుతుంది) ఉంటాయి.

ఈ మిషన్ ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని భావిస్తున్నారు.

ఇదివరకు చంద్రయాన్-2 ద్వారా సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో ప్రయత్నించింది. కానీ, విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. దీని నుంచి పాఠాలు నేర్చుకొని చంద్రయాన్-3 డిజైన్‌లలో ఇస్రో మార్పులు చేసింది.

ఇదివరకటి ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్‌ల పేర్లనే ప్రస్తుత ల్యాండర్, రోవర్లకు పెట్టే అవకాశముందని ఐఏఎన్‌ఎస్ ఒక వార్త ప్రచురించింది.

ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై రసాయనాలు, అక్కడి మట్టి, నీటి అణువులను పరీక్షించనున్నారు. దీని ద్వారా చంద్రుడి గురించి మరిన్ని విశేషాలు మనకు తెలిసే అవకాశముంది.

చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించే సైస్మోమీటర్ సహా కొన్ని పరికరాలను ప్రస్తుత వ్యోమనౌకలో పంపిస్తున్నారు. వీటి సాయంతో చంద్రుడి ఉపరితలంపై వాతావరణం, ఉష్ణోగ్రతలపై కూడా అధ్యయనం చేపట్టేందుకు వీలుపడుతుంది.

స్పెక్ట్రో-పొలారిమెట్రీ ఆఫ్ హ్యాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (ఎస్‌హెచ్ఏపీఈ) పరికరం ద్వారా చంద్రుడి కక్ష్య నుంచి భూమిపై అధ్యయనం చేపట్టేందుకు వీలుపడుతుంది. ఫలితంగా భూమి గురించి మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.

చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించే సైస్మోమీటర్ సహా కొన్ని పరికరాలను ప్రస్తుత వ్యోమనౌకలో పంపిస్తున్నారు

ఫొటో సోర్స్, ISRO/ANI

ఫొటో క్యాప్షన్, చంద్రుడిపై ప్రకంపనలను గుర్తించే సైస్మోమీటర్ సహా కొన్ని పరికరాలను ప్రస్తుత వ్యోమనౌకలో పంపిస్తున్నారు

చంద్రయాన్-3 ఎందుకంత ముఖ్యం?

చంద్రయాన్-3 భారత్‌కు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలకు చాలా ముఖ్యమైనది.

ఇప్పటివరకూ చంద్రుడిపై ఎవరూ చేరుకోని ప్రాంతాలపైకి తాజా ల్యాండర్‌ను పంపిస్తున్నారు. దీని ద్వారా మనకు చంద్రుడి గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే యాత్రలతోపాటు గ్రహాలపైకి చేపట్టే యాత్రలకు ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

చంద్రయాన్-2 ప్రయోగం చంద్రుడిపై నీటి అణువులను గుర్తించింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చంద్రయాన్-2 ప్రయోగం చంద్రుడిపై నీటి అణువులను గుర్తించింది

చంద్రయాన్-1, చంద్రయాన్-2 ప్రయోగాలతో ఇస్రో ఏం సాధించింది?

ఇస్రో చంద్రయాన్ కార్యక్రమం ‘ఇండియన్ లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రోగ్రామ్’లో మూడో ప్రయోగం.

దీనిలో తొలి ప్రయోగం చంద్రయాన్-1ను 2008లో చేపట్టారు. దీనిలో ఒక ఆర్బిటర్, ఒక మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ పంపారు. వీటిలోని ప్రోబ్ చంద్రుడిపై జవహర్ పాయింట్ వద్ద క్రాష్ ల్యాండ్ అయ్యింది.

అయితే ఈ ప్రయోగం ద్వారా చంద్రుడిపై జెండా ఎగురవేసిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ప్రయోగం మొదలైన 312 రోజుల తర్వాత దీని నుంచి కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోయాయి. ఆ ప్రయోగానికి నిర్దేశించిన లక్ష్యాల్లో 95 శాతం పూర్తయ్యాయని అప్పట్లో ఇస్రో ప్రకటించింది.

ఈ విజయాన్ని చంద్రయాన్ ప్రయోగంలో భారీ ముందడుగుగా నిపుణులు అభివర్ణించారు.

చంద్రయాన్-2 ప్రయోగం చంద్రుడిపై నీటి అణువులను గుర్తించింది.

తొలి ప్రయోగానికి పదేళ్ల తర్వాత 2019 జులై 22న చంద్రయాన్-2 ద్వారా విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్‌లను ఇస్రో పంపించింది.

2019 సెప్టెంబరు 6న చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. అయితే, మూడు నెలల తర్వాత ఈ ల్యాండర్ శిథిలాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించింది.

విక్రమ్ ల్యాండర్ విఫలమైనప్పటికీ ఆర్బిటర్ చంద్రుడిపై తిరుగుతూ అక్కడి వాతావరణం గురించి విలువైన సమాచారం అందిస్తోంది.

ఇప్పుడు చంద్రయాన్-3కు సర్వం సిద్ధమైంది.

వీడియో క్యాప్షన్, సూర్యుడు నవ్వుతున్నట్టుగా ఎలా, ఎందుకు కనిపించాడు?

ఆర్టెమిస్ ఎకార్డ్స్ అంటే ఏమిటి?

చంద్రుడిపై ప్రయోగానికి సిద్ధమవుతున్న దేశం భారత్ ఒక్కటే కాదు.

ఇటీవల కాలంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్ గురించి మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగా ఆర్టెమిస్-1 వ్యోమనౌక చంద్రుడిపైకి వెళ్లి, నిరుడు భూమిపైకి తిరిగివచ్చింది. 2025 నాటికి చంద్రుడిపైకి మరో మనిషిని పంపాలని నాసా భావిస్తోంది.

జపాన్, దక్షిణ కొరియా, చైనా, రష్యా కూడా లూనార్ ప్రయోగాలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని దేశాలు యూరోపియన్ యూనియన్‌తో కలిసి పనిచేస్తున్నాయి.

ఈ మిషన్ల మధ్య సమన్వయం కోసం నాసా, అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ కలిసి ఆర్టెమిస్ ఎకార్డ్స్‌ను తీసుకొచ్చాయి. చంద్రుడితోపాటు అంగారకుడు, ఇతర గ్రహాలపై పరిశోధనలు, అక్కడి వనరులను శాంతియుత అవసరాల కోసం ఉపయోగించుకోవడం కోసం ఈ ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఇటీవలి అమెరికా పర్యటనలో ఈ ఒప్పందాన్ని అమెరికాతో కుదుర్చుకున్నారు.

చంద్రుడిపై ప్రయోగాల పట్ల ఈ దేశాలు ఎందుకు అంత శ్రద్ధ పెడుతున్నాయి?

వీడియో క్యాప్షన్, శాస్త్ర పరిశోధన రంగంలో ఇదో పెద్ద విజయం అంటున్న శాస్త్రజ్ఞులు

చంద్రుడిపైకే ఎందుకంటే...?

కొందరు దీన్ని స్పేస్-రేస్‌గా పిలుస్తుంటే, మరికొందరు దీన్ని తమ అధునాతన టెక్నాలజీ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాల ముందు ప్రదర్శించడంగా చెబుతున్నారు.

భారత్ విషయానికి వస్తే, చైనాతో పోటీ వాదనను మనం తోసిపుచ్చలేం. చాంగి-6, చాంగి-7, చాంగి-8లను రష్యాతో కలిసి చేపట్టేందుకు చైనా ప్రణాళికలు రచిస్తోంది. చంద్రుడిపై పరిశోధనా కేంద్రాన్ని నిర్మించాలని కూడా భావిస్తోంది.

స్పేస్-రేస్‌ వాదనను పక్కన పెడితే, ప్రస్తుత మూన్ మిషన్లు భవిష్యత్తులో అంగారకుడు సహా ఇతర గ్రహాలపైకి చేపట్టే యాత్రలకు కీలకంగా మారనున్నాయి.

ఎందుకంటే భూమిపై కంటే చంద్రుడిపై నుంచి వ్యోమనౌకను సుదూర ప్రాంతాలకు పంపించడానికి కాస్త తక్కువ ఇంధనం అవసరం అవుతుందని పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీలోని స్పేస్ ప్రాజెక్ట్ మేనేజర్ డాక్టర్ లుసిండా కింగ్ బీబీసీతో చెప్పారు.

ఈ దశాబ్దంలో చంద్రుడిపైకి వెళ్లే మనుషులు ఎక్కువ కాలం అక్కడ ఉండేందుకు అవసరమైన వనరులను కూడా ఈ మిషన్లలో పంపించబోతున్నారు.

ఆదిత్య-ఎల్1 భారత్ తొలి సోలార్ మిషన్

ఫొటో సోర్స్, ISRO

ఫొటో క్యాప్షన్, ఆదిత్య-ఎల్1 భారత్ తొలి సోలార్ మిషన్

ఆదిత్య ఎల్-1 ఏమిటి?

భారత్ ఈ ఏడాది చేపడుతున్న కీలక అంతరిక్ష ప్రయోగం చంద్రయాన్-3 మాత్రమే కాదు. సూర్యుడిపైకి కూడా ఇస్రో ఒక వ్యోమనౌకను పంపుతోంది.

ఆదిత్య-ఎల్1 భారత్ తొలి సోలార్ మిషన్. అయితే, ఈ వ్యోమనౌక పూర్తిగా సూర్యుడి మీదకు వెళ్లదు. భూమికి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరం నుంచి సూర్యుడిపై ఇది అధ్యయనం చేపడుతుంది.

సూర్యుడు, భూమి మధ్య ఉండే ఎల్-1 లేదా లగ్రేంజ్ పాయింట్ దగ్గర రెండింటి గురుత్వాకర్షణ శక్తులు సమానంగా ఉంటాయి.

ఆదిత్య-ఎల్1 సాయంతో సూర్యుడి బాహ్య ఉపరితలమైన క్రోమోస్పియర్, కరోనాలతోపాటు అక్కడి గురుత్వాకర్షణ క్షేత్రం, సోలార్ విండ్స్‌పైనా అధ్యయనం చేపట్టొచ్చు.

ఇప్పటివరకు నాసా, జర్మన్ ఏరోస్పేస్ సెంటర్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మాత్రమే సూర్యుడిపైకి ప్రోబ్స్‌ను పంపించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)