భారత్‌లో కొత్త రమ్ వెల్లువెత్తనుందా? రుచి కోసం ఏం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, MAKA ZAI
- రచయిత, చెరిలన్ మోలన్
- హోదా, బీబీసీ న్యూస్
భారత్‌లోని కాక్‌టెయిల్ బార్‌లో ‘డాకురీ’, డార్క్ ‘ఎన్’ స్టార్మీ లాంటి కాక్‌టెయిల్స్‌ను ఆర్డర్ చేసేటప్పుడు రాహుల్ నాయర్ వాటిని జాగ్రత్తగా గమనిస్తుంటారు.
గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్న 32 ఏళ్ల రాహుల్ తన కాక్‌టెయిల్‌లో రమ్ము (రమ్) ఏమైనా కలిపారా అని బార్‌టెండర్‌ను అడుగుతుంటారు. ఒక్కోసారి ఆ రమ్ము బ్రాండ్‌ను కూడా ఏదో ఊహించి చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు.
కొన్ని ఏళ్లుగా షార్ట్ స్టోరీ, మకా జై, కమీకారా లాంటి దేశీయ బ్రాండ్లు భారత్‌లో రమ్ము డిమాండ్‌ను ఒడిసిపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తయారీ దగ్గర నుంచి ఫ్లేవర్ల వరకూ ఈ దేశీయ బ్రాండ్లు కొత్తగా ప్రయోగాలు చేస్తున్నాయి. కొత్తగా మద్యం ప్రియులకు చేరువయ్యేందుకు మార్గాలను అన్వేషిస్తున్నాయి.

ఫొటో సోర్స్, SEGREDO ALDEIA
ప్రపంచ వ్యాప్తంగా చాలా చోట్ల విస్కీ, జిన్‌లతో పోలిస్తే రమ్ము కాస్త వెనుకబడినట్లుగా కనిపిస్తుంది. కానీ, భారత్‌లో మాత్రం ఇది చాలా పాపులర్. ఎందుకంటే దీని ధర కాస్త తక్కువ. పైగా అందుబాటులో ఉంటుంది.
రమ్మును కొత్తగా తయారుచేసే ప్రయత్నాలు ఇక్కడ చాలా తక్కువగా జరిగేవి. ప్రస్తుతం ఇది మారుతోంది. రమ్ము తయారీలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. పెద్దపెద్ద నగరాల్లో ప్రజల ఆదాయం పెరగడంతోపాటు మద్యంలో కొత్త రుచులను ఆస్వాదించేవారి సంఖ్య ఎక్కువ కావడమే దీనికి కారణం.
‘‘నేడు రమ్ములో కొత్తదనం దిశగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జపాన్, థాయిలాండ్, మలేసియా లాంటి రమ్ము తయారుచేయని దేశాల్లోనూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు’’ అని కౌంటెర్‌టాప్ ఇండియా ఫౌండర్, మిక్సాలజిస్టు అరిజీత్ బోస్ చెప్పారు.
ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న ఆల్కహాల్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటి. 2020లో ఈ మార్కెట్ విలువ 52.5 బిలియన్ డాలర్లు(రూ.4.31 లక్షల కోట్లు )గా ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ అంచనా వేసింది.
ఈ మార్కెట్‌లో రమ్ము విలువ 11 శాతం వరకూ ఉంది.
రమ్ముకు మూలాలు కరీబియన్ దీవుల్లో ఉన్నాయి. అక్కడి చక్కెర పరిశ్రమల్లో పనిచేసే బానిసలు ఆల్కహాల్ తయారీకి మొలాసిస్‌ను ఉపయోగించొచ్చని మొదట కనిపెట్టారు. అయితే, వలస పాలనలో ఇది ప్రపంచంలో చాలా దేశాలకు విస్తరించింది.
భారత్‌లో ‘ఓల్డ్ మాంక్’ దశాబ్దాలుగా ప్రధాన రమ్ము బ్రాండ్‌గా కొనసాగుతోంది. ధర కాస్త తక్కువగా, ముదురు రంగులో కనిపించే ఈ బ్రాండ్ ఏళ్ల నుంచీ రమ్ము రుచి ఎలా ఉంటుందో చాలా మందికి పరిచయం చేస్తూ వచ్చింది. అయితే, నేడు పరిస్థితులు మారుతున్నాయి.

ఫొటో సోర్స్, MAKA ZAI
సిద్ధార్థ్ శర్మ నేతృత్వంలోని పికాడైలీ డిస్టిలెరీస్ ఒక కొత్త రమ్ముతో ముందుకు వచ్చింది. రమ్ అగ్రికోల్ లేదా ఫ్రెంచ్ స్టైల్‌లో మొలాసిస్‌కు బదులుగా చెరకు రసం నుంచి తయారుచేసిన కమీకారాను ఈ సంస్థ డిసెంబరులో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
భారత్‌లో నిన్నమొన్నటివరకూ ఇలాంటి ప్రయోగాలు చాలా అరుదుగా జరిగేవి. ఇటీవల కాలంలో కొత్త ప్రయోగాలతో ఎందుకు వస్తున్నారో తెలుసుకోవాలంటే మొదట ఇక్కడ రమ్ము ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలి.
ఇక్కడ చవక ధరకు లభించే రమ్ములో చాలావరకూ, చక్కెర తయారీకి ఉపయోగించిన చెరకు రసంలో మిగిలిన చిక్కటి పదార్థం మొలాసిస్‌ను పులియబెట్టి ఉత్పత్తి చేస్తుంటారు.
కాస్త తియ్యగా అనిపించేందుకు దీనిలో పంచదార, క్యారామెల్ లాంటి వాటిని కలుపుతారు.
దీని తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు ఇక్కడ విరివిగా లభిస్తుంటాయి. దీనికి ఇక్కడి చక్కెర తయారీ పరిశ్రమలే కారణం. దీంతో దీన్ని ఇక్కడ భారీగా తయారుచేసేందుకు వీలుపడుతోంది. అయితే, విదేశాల్లో తయారుచేసే రమ్ములో రుచి, ఫ్లేవర్ ఇక్కడి దేశీయ బ్రాండ్లలో కనిపించడంలేదని నిపుణులు చెబుతున్నారు.
దేశీయ రమ్ములలో ఫ్లేవర్ల కోసం కాఫీ, ఇతర మసాలా దినుసులను కలుపుతున్నారు. కొందరైతే మరింత రుచిగా ఉండేందుకు విదేశాల రమ్ములను కూడా కలుపుతున్నారు.
కమీకారా లాంటి బ్రాండ్లు మాత్రం కొత్తగా ఏమీ కలపకుండా తయారీ, నిల్వల్లో ప్రయోగాలు చేస్తున్నాయి.
థర్డ్ ఐ డిస్టిలెరీ కూడా నిరుడు షార్ట్ స్టోరీ రమ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యుత్తమ రమ్ములకు కేంద్రమైన కరీబియన్ తరహా రుచులను ఇది అందిస్తోంది. దీనిలో తెల్లని దేశీయ మొలాసిస్ రమ్ముకు జమైకా, ట్రినిడాడ్, డొమినికన్ రమ్ములను కలుపుతున్నారు.

ఫొటో సోర్స్, CAMIKARA
రెండేళ్ల క్రితం స్టిల్‌డిస్టిలింగ్ స్పిరిట్స్ ‘మకా జై’ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీనిలో కూడా తెల్లని దేశీయ రమ్ముకు గోల్డ్ రమ్మును కలుపుతున్నారు.
‘‘రమ్ము విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. కేవలం శీతాకాలంలో మాత్రమే వీటిని తీసుకోవాలి. కోక్‌తో మాత్రమే తాగాలి అని చాలా మంది చెబుతుంటారు’’ అని స్టిల్‌డిస్టిలింగ్ స్పిరిట్స్ ఫౌండర్ కస్తూరీ బెనర్జీ చెప్పారు.
‘‘మేం ఇలాంటి అపోహలను తొలగించాలని భావిస్తున్నాం. అంతేకాదు కాక్‌టైల్‌లో కలుపుకొని హాయిగా తాగే మంచి రమ్మును అందించాలని చూస్తున్నాం’’ అని కస్తూరి అన్నారు.
ఫులర్టన్ డిస్టిలెరీస్ కూడా రెండేళ్ల క్రితం సెగ్రెడో ఆల్డియాను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీనిలో రెండు రకాలు ఉన్నాయి. ఒక తెల్లని రమ్ము, రెండోది కేఫ్ రమ్ము. ఈ రెండింటినీ చెరకు, బెల్లంలతో తయారుచేస్తున్నారు. కేఫ్ రమ్ములో దక్షిణ భారత దేశంలో పండించిన కాఫీ పిక్కలను వాడుతున్నారు.
ఈ రమ్ములన్నీ 750 మిల్లీలీటర్లకు అంటే ఒక బాటిల్‌కు రూ.1000 నుంచి మొదలై రూ.6,000 వరకూ ఉంటున్నాయి.
విస్కీతో పోలిస్తే, కాస్త ధర ఎక్కువే ఉన్నప్పటికీ, వినియోగదారులు చెల్లించే మొత్తానికి నాణ్యమైన రమ్మును ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తయారీ సంస్థలు చెబుతున్నాయి.
ఇక్కడ రమ్ము వినియోగదారుల సంఖ్య పెరగకపోవడానికి కారణం ధర కాదు. వీటిపై అవగాహన లేకపోవడమే.
‘‘రమ్ములో చాలా రకాలు ఉంటాయి. ఫ్రెంచ్, స్పానిష్, ఇంగ్లిష్ వీటిలో ప్రధానమైనవి. అక్కడి ప్రాంతాలకు అనుగుణంగా వీటిని తయారుచేస్తుంటారు’’ అని సిద్ధార్థ్ శర్మ చెప్పారు.
అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మద్యం ప్రియుల్లో జిన్‌కు ఆదరణ పెరగడంతో కొత్త రకం ఆల్కహాల్‌ను తాగేవారి సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతోంది.
రెస్టారెంట్లు, బార్లు కూడా కొత్త ఆల్కహాల్‌తో కొత్తకొత్త రుచులను అందిస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ రమ్ము బ్రాండ్లు కూడా భారత్ మార్కెట్ వైపు చూస్తున్నాయి.
ఫ్రెంచ్ రమ్ము బ్రాండ్ ‘ప్లాంటేషన్’ కూడా నిరుడు భారత్‌లో తమ రమ్ము విక్రయాలు మొదలుపెట్టింది. జమైకా, బార్బడోస్, ట్రినిడాడ్ లాంటి కరీబియన్ రుచులను కూడా సంస్థ అందిస్తోంది. ఫెర్నాడ్ రిచర్డ్ కూడా హావానా క్లబ్ రమ్మును నిరుడు మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
దేశీయంగా చాలా ప్రయోగాలు చేస్తున్నప్పటికీ, ప్రపంచ స్థాయి రమ్మును మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ఇక్కడి దేశీయ సంస్థలు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనికి చాలా సమయంతోపాటు పెట్టుబడులు కూడా అవసరమని అన్నారు.
ప్రస్తుతం ప్రయోగాలు చేస్తున్న చాలా సంస్థలు కాస్త చిన్నవి, ఒక్కోసారి ‘ప్రైమరీ డిస్టిలేషన్ యూనిట్ల (ఇక్కడే పులియబెట్టిన మొలాసిస్ నుంచి ప్రాథమిక ఆల్కహాల్‌ను తయారుచేస్తారు)’ స్థాపనకు వీటికి పెట్టుబడుల సమస్య ఎదురవుతోంది.
‘‘విస్కీ లేదా రమ్ము రెండింటికీ ప్రైమరీ డిస్టిలేషన్ అనేది చాలా కీలకం. కానీ, భారత్‌లో ఇవి మొదలుపెట్టేందుకు లైసెన్స్ తీసుకోవడం అంత తేలిక కాదు. అదే వేరే దేశాల నుంచి వచ్చే ఆల్కహాల్‌పై ఆధారపడితే నాణ్యత విషయంలో రాజీపడినట్లే’’ అని బోస్ అన్నారు.
ఇక రెండోది విస్కీ లానే రమ్ము కూడా కనీసం రెండేళ్లను నిల్వ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. కానీ, ఇక్కడ గిడ్డంగుల్లో నిల్వ చేయడం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. ఉపయోగించే కర్రలను బట్టీ ఒక్కో బ్యారెల్‌కు వేల రూపాయల్లో ఖర్చు అవుతుంది.
అయితే, ‘‘రమ్ముపై ప్రజల్లో చర్చ జరిగేలా చూసేందుకు ఈ బ్రాండ్లు ప్రయత్నిస్తున్నాయి. దీన్ని మనం పెద్ద ముందడుగుగా చూడాలి’’ అని బోస్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















