చీర్స్.. నచ్చే వైన్‌ వెతికిపెట్టడంలో సాయం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

సిప్పిడ్

ఫొటో సోర్స్, SIPPD

    • రచయిత, విల్ స్మేల్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రుచి, వాసన చూడలేదు. కానీ, మంచి వైన్ వెతికిపెట్టాలంటూ దీన్ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.

ఏఐ సాయంతో పనిచేస్తున్న ‘సిప్పిడ్’ యాప్‌ను రూపొందించాలనే ఆలోచన తన భార్య నుంచే వచ్చిందని బ్లేక్ హేర్షీ చెప్పారు.

ఒక వారాంతంలో ఆమె స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు. అయితే, బ్లేక్‌ మంచి వైన్‌ ఏదో చెప్పడంలో నిపుణుడని ఆమెకు తెలుసు. దీంతో బయట రెస్టారెంట్‌ నుంచి తరచూ ఆయనకు సూచనల కోసం ఆమె మెసేజ్‌లు చేసేవారు.

అప్పుడే ప్రజలకు కూడా ఇలానే రెస్టారెంట్ లేదా సూపర్‌మార్కెట్ లేదా వైన్ షాప్‌లో మంచి వైన్ బాటిల్ వెతికి పెట్టడంలో సాయం చేయాలనే ఆలోచన బ్లేక్‌కు వచ్చింది.

‘‘కొత్తగా వస్తున్న టెక్నాలజీలతో వైన్‌లకు భిన్నరకాల పేర్లు పెడుతున్నారు. వీటిలో అసలు ఏది మంచిదో, ఏది చెడ్డతో కనిపెట్టడం చాలా కష్టం అవుతోంది. దీంతో ఎట్టకేలకు ఏది మంచిదో మీరే చెప్పండని చాలా మంది వెయిటర్లను అడుతుంటారు. అయితే, అసలు మీకు ఏం నచ్చుతుందో వారికి ఎలా తెలుస్తుంది? అందుకే అలా వారిని అడగం అనేది కాలం చెల్లిన విధానంలా అనిపిస్తుంది.’’ అని బ్లేక్ చెప్పారు.

అలా అమెరికాకు చెందిన ‘సిప్పిడ్’ అనే యాప్ ఆలోచన పుట్టింది. దీన్ని 2021లో మొదలుపెట్టారు. నేడు వివినో లాంటి చాలా యాప్‌లు టెక్నాలజీపై ఆధారపడటం ఎక్కువ అవుతోంది. అయితే, సిప్పిడ్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది మొదట్నుంచీ టెక్నాలజీపైనే పనిచేస్తోంది.

బ్లేక్ హేర్షీ

ఫొటో సోర్స్, SIPPD

ఫొటో క్యాప్షన్, బ్లేక్ హేర్షీ

కొత్త వినియోగదారులు మొదట దీనిలో ‘వైన్ క్విజ్’ను పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనిలో తమ అభిరుచులు ఏమిటో తెలియజేయాలి. రంగు, ఫ్లేవర్, స్వీట్‌నెస్, ధర లాంటి వివరాలను దీనిలో సేకరిస్తారు.

ఆ తర్వాత ఏఐ సాఫ్ట్‌వేర్ ‘‘హెవీ లిఫ్టింగ్’’ చేస్తుంది. అంటే వీరి అభిరుచులకు తగిన వైన్‌లను వేల కొద్దీ బాటిళ్లలో వెతికిపట్టుకుంటుంది. వీటిలో ఒక్కొక్కటి పర్సంటేజీల రూపంలో చూపిస్తుంది. ఇక్కడ వంద శాతం అంటే పూర్తిగా మీ అభిరుచులకు మ్యాచ్ అయిందని అర్థం.

మీరు కావాలంటే వైన్ బాటిళ్లపై లేబుళ్లను మొబైల్‌లోని కెమెరాతో స్కాన్‌చేసి యాప్‌లో సరిపోల్చి చూడొచ్చు. ఆ బాటిల్‌లోని వైన్‌ను, మీ అభిరుచులను విశ్లేషించి ఇది స్కోర్ ఇస్తుంది.

వైన్

ఫొటో సోర్స్, Getty Images

నిరంతరం నేర్చుకుంటుంది

మీరు వైన్‌ను కొనుగోలు చేసినప్పుడు, వీటికి రివ్యూలు ఇచ్చినప్పుడు కొత్త విషయాలను సిప్పిడ్ నేర్చుకుంటుంది. మీకు వ్యక్తిగతమైన అప్‌డేట్లు ఇవ్వడంలో మరింత కచ్చితత్వం సాధించడమే దీని లక్ష్యమని బ్లేక్ చెబుతున్నారు.

‘‘కొత్తగా తాగడం మొదలుపెట్టేవారికి అసలు ఏది కొనాలో తెలియక చాలా తికమకపడుతుంటారు. అసలు ఎక్కడ మొదలుపెట్టాలో కూడా వారికి సరిగ్గా తెలియదు. అలాంటి వారికి ఈ యాప్ మెరుగ్గా ఉపయోగపడుతుంది.’’ అని ఆయన అన్నారు.

‘‘అలాంటి వారి కోసమే మేం ‘ఇంట్రడక్టరీ క్విజ్’ను రూపొందించాం. అసలు విస్తృతమైన వైన్ ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టాలో దీని నుంచి కొన్ని సూచనలు ఇస్తాం.’’ అని ఆయన తెలిపారు.

ప్రస్తుతం కేవలం అమెరికాలో మాత్రమే అందుబాటులోనున్న ఈ యాప్‌లో ప్రస్తుతం లక్ష మంది వినియోగదారులు ఉన్నారు. ఈ యాప్‌ను ఉచితంగా ఇక్కడ ఉపయోగించొచ్చు. వైన్‌ బాటిళ్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు ఇది వేదికలా పనిచేస్తుండటంతో ఆయా కంపెనీల నుంచి ఈ యాప్‌కు ఆదాయం వస్తోంది.

నికోలాస్ బెంజ్

ఫొటో సోర్స్, NICHOLAS BENZ

ఫొటో క్యాప్షన్, నికోలాస్ బెంజ్

నార్వేలోనూ టెక్ పారిశ్రామికవేత్త నికోలాస్ బెంజ్ తొలి ఏఐ వైన్ రికమండీషన్ యాప్ ఫిన్‌పావైన్‌ను 2020లోనే మొదలుపెట్టారు.

‘‘ఏఐ అనేది శ్వాసలా మన జీవితాల్లో కలిసిపోతోంది.’’ అని బెంజ్ అన్నారు. ఇది వినియోగదారుల అభిరుచుల నుంచి నేర్చుకుంటూ వారికి తగినట్లుగా సూచనలు చేస్తుందని తెలిపారు.

నార్వే ప్రభుత్వ ఆల్కహాల్ షాప్‌లలో విక్రయించే వైన్‌లే ప్రస్తుతం ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని సేవలను విదేశాలకూ విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని బెంజ్ చెప్పారు.

‘‘నేను ఒక సోషల్ నెట్‌వర్క్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నాను. దీనిలో అన్నీ వైన్‌ చుట్టూ తిరుగుతుంటాయి. దీనిలో ఒక వైన్ గురించి తెలుసుకునేందుకు నేరుగా ఆ వైన్ ఏఐతోనే మాట్లాడొచ్చు.’’అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, కొన్ని ఆహార పదార్థాలు ఆకలిని నియంత్రిస్తాయా, పరిశోధనల్లో ఏం తేలింది?

అయితే, ఈ యాప్‌ల గురించి ప్రొఫెషనల్ వైన్ నిపుణులు ఏం అంటున్నారు?

‘‘మొత్తంగా చూసుకుంటే, సరైన రీతిలో ఉపయోగిస్తే ఇది మంచి టెక్నాలజీనే.’’అని వైన్ నిపుణుడు జాన్ డోన్స్ చెప్పారు. ‘‘ఈ యాప్ ప్రజలను కనెక్ట్ చేస్తుంది. ఇది ప్రజలకు చాలా సాయం చేయొచ్చు. వైన్‌ గురించి మరింత తెలుసుకునేందుకు ఉపయోగపడొచ్చు.’’ అని ఆయన అన్నారు.

వైన్ రచయిత జేమీ గూడీ మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. ‘‘ఈ వైన్ యాప్‌లు చాలా గొప్పలు చెబుతుంటాయి. కానీ, పని తీరు మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే.. అభిరుచులకు అనుగుణంగా వైన్‌ను సిఫార్సు చేయడమే. అసలు ఒక వైన్‌ను ఎలా వర్గీకరిస్తాం, దీనిలోని ఒక్కో అంశాన్ని ఎలా పోలుస్తాం?’’ అని ఆయన అన్నారు.

‘‘ఏటా లక్షల సంఖ్యలో తయారుచేస్తున్న వైన్‌ల గురించి ఈ యాప్‌కు సమాచారం ఎలా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల వైన్‌లు ఉంటాయి. మీరు మంచి వైన్ కావాలంటే ఏదైనా షాప్‌ లేదా వెబ్‌సైట్‌కు వెళ్లి అన్నీ చూసుకుని జాగ్రత్తగా కొనుక్కోవాలి.’’ అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, ఖర్జూర కల్లు: చెట్టు మీంచి కుండ దించక ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో టెక్నాలజీ రెగ్యులేషన్ ప్రొఫెసర్‌గా శాండ్రా వాచెథెర్ పనిచేస్తున్నారు. ఏఐతో ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు, నైతిక పరమైన సమస్యలపై ఆమె పరిశోధన చేపడుతున్నారు. ఆమె ఈ యాప్‌లకు మద్దతు ఇస్తారని మీరు అనుకోవచ్చు.

అయితే దీనికి భిన్నంగా ఈ విషయంలో టెక్నాలజీ జోలికి వెళ్లకుండా మనమే నేరుగా మంచి వైన్ వెతుక్కుంటే మంచిదని ఆమె సూచిస్తున్నారు.

‘‘రుచి, వాసన విషయానికి వస్తే, ఏదైనా యాప్‌పై ఆధారపడే కంటే నేరుగా మనమే రంగంలోకి దిగడం మంచిది.’’అని ఆమె చెప్పారు.

‘‘మన కళ్లు, ముక్కు, నోరు చెప్పే విషయాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే.. మనమే ఆ టెక్నాలజీ కంటే మంచి బాటిళ్లు వెతికి పట్టుకోగలం. ఏఐ పోషించడానికి చాలా పాత్రలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ, ఈ విషయంలో మాత్రం మన పని మనమే చేసుకోవాలి.’’అని ఆమె అన్నారు.

అయితే, ఈ యాప్‌ను కేవలం ప్రజలకు సాయం చేసేందుకు మాత్రమే తీసుకొచ్చామని సిప్పిడ్ మార్కెటింగ్ హెడ్ అలీసియా ఓర్టిజ్ చెప్పారు. ‘‘ముఖ్యంగా కొత్తగా వైన్ ఎంచుకునేవారికి మేం సాయం చేసేందుకు వచ్చాం. దీని వల్ల వారు అసలు ఏ వైన్ బావుంటుందోనని గంటలపాటు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. మేం ఇచ్చే సిఫార్సులను తీసుకొని హాయిగా వైన్‌ను ఆస్వాదించొచ్చు.’’ అని అలీసియా అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)