టైటాన్ సబ్ ప్రమాదం: బాంబేలో చిన్న టేబుల్ మీద బట్టలు అమ్మిన దావూద్ కుటుంబం పాకిస్తాన్‌లో బిలియనీర్లుగా ఎలా మారింది?

ఫొటో సోర్స్, DAWOOD FAMILY
- రచయిత, రియాజ్ సొహైల్, తన్వీర్ మాలిక్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లి మరణించిన వారిలో షాహ్‌జాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ దావూద్ కూడా ఉన్నారు.
వీరు ప్రయాణించిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ పేలిపోయిందని అమెరికా కోస్టు గార్డు ప్రకటించింది.
పాకిస్తాన్‌లోని సుసంపన్న కుటుంబాల్లో ఒకటైన దావూద్ కుటుంబంపై కొన్ని రోజులుగా మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, వీరి వ్యాపారాలకు మూలాలు భారత్‌లోనే ఉన్నాయి.
దావూద్ కుటుంబం వ్యాపారాలకు అంకురం వేసిన అహ్మద్ దావూద్ ఒకప్పుడు బాంబే ప్రావిన్స్‌లో ఓ మగ్గంపై నూలు వడికేవారు. ఆయన అప్పట్లో బాంబేలో నూలు పరిశ్రమను కూడా మొదలుపెట్టారు.
ప్రస్తుతం ఎంగ్రో కార్పొరేషన్‌కు వైస్-చైర్‌పర్సన్‌గా షాహ్‌జాదా దావూద్ కొనసాగుతున్నారు. ఎరువులు, ఆహారం, ఇంధన రంగాల్లో ఈ కంపెనీ వ్యాపారాలున్నాయి.
పాకిస్తాన్‌తోపాటు విదేశాల్లోనూ దావూద్‌ల వ్యాపారాలు విస్తరించాయి. దావూద్ కుటుంబం ఆరోగ్యం, విద్య లాంటి సామాజిక సేవలకూ ప్రాధాన్యమిస్తోంది.

ఫొటో సోర్స్, DAWOOD FOUNDATION
బల్లపై బట్టల అమ్ముతూ..
ప్రస్తుతం పాకిస్తాన్‌లో బడా పారిశ్రావేత్తల్లో ఒకటైన దావూద్ కుటుంబం 20వ శతాబ్దం మొదట్లో ఒక చిన్న ప్రాంతంలో వ్యాపారం మొదలుపెట్టింది. కొన్ని దశాబ్దాల్లోనే ఆసియాలోని సుసంపన్న కుటుంబాల్లో ఒకటిగా దావూద్‌లు ఎదిగారు.
నేడు ఈ కుటుంబం చేతిలో డజన్ల కొద్దీ పరిశ్రమలు, వ్యాపారాలు ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి బ్రిటన్ వరకూ చాలా దేశాల్లో వీరు పనిచేస్తున్నారు.
ఈ కుటుంబానికి ఆద్యుడిగా భావించే అహ్మద్ దావూద్ 1905లో కఠియావాడ్‌లోని బాట్వాలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉంది.
అహ్మద్ దావూద్ తండ్రి దుస్తుల వ్యాపారం చేసేవారు. అయితే, అహ్మద్ చిన్నప్పుడే ఆయన చనిపోయారు. దీంతో తాతయ్య దగ్గరే అహ్మద్ పెరిగారు.
అహ్మద్ చిన్నప్పటి విశేషాలను ‘అహ్మద్ దావూద్ ఏక్ పైకర్-ఎ-వోసాఫ్’ పుస్తకంలో ఉస్మాన్ బాట్లీవాలా రాసుకొచ్చారు. ‘’16 ఏళ్ల వయసులోనే అహ్మద్ దావూద్ బల్లపై ఉంచి దుస్తులు అమ్మేవారు. అయితే,1920ల నాటికి ముంబయిలో ఒక చిన్న నూలు పరిశ్రమను ఆయన స్థాపించారు.’’ అని ఉస్మాన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, DAWOOD FOUNDATION
అహ్మద్ దావూద్‌ను ఉస్మాన్ చాలాసార్లు కలిశారు. ‘‘మా అమ్మ చాలా తెలివైనవారు. పిల్లలను ఎప్పుడూ ఆమె ప్రోత్సహించేవారు. నాలో కూడా ఆమె చాలా స్ఫూర్తి నింపేవారు.’’ అని అహ్మద్ దావూద్ చెప్పేవారని ఉస్మాన్ తెలిపారు.
రచయిత ఉమర్ అబ్దుల్ రెహ్మాన్.. అహ్మద్ దావూద్ గురించి తన పుస్తకంలో ఇలా రాశారు.. ‘‘బట్టల వ్యాపారం నుంచి నెమ్మదిగా నూనె మిల్లు, ఒక చమురు ఫ్యాక్టరీలను అహ్మద్ దావూద్ మొదలుపెట్టారు. ఆ తర్వాత కోల్‌కతా, మద్రాసు, కాన్పూర్, మథుర, లూథియానా, దిల్లీ లాంటి ప్రాంతాలకూ తన వ్యాపారాన్ని విస్తరించారు.’’ అని పేర్కొన్నారు.
‘‘వంట నూనె ఫ్యాక్టరీ తర్వాత ఆయన వ్యాపారం చాలా మెరుగుపడింది. దీంతో ఆయన సోదరులు సులేమాన్ దావూద్, అలీ మహమ్మద్ దావూద్, సిద్దిఖ్ దావూద్, సత్తార్ దావూద్‌లు కూడా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.’’ అని ఉస్మాన్ రాసుకొచ్చారు.
దేశ విభజన తర్వాత ఆ వ్యాపారాలు పాకిస్తాన్ కేంద్రంగా జరిగేవి. ఆ తర్వాత ఆయన బ్రిటన్‌కు వెళ్లిపోయారు. అప్పుడే మాంచెస్టెర్‌లో దావూద్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించారు.

ఫొటో సోర్స్, DAWOOD FOUNDATION
పాకిస్తాన్ సైనిక పాలనలో..
పాకిస్తాన్‌లో సైనిక పాలన దావూద్ కుటుంబానికి అనుకూలంగా ఉండేది. ఫీల్డ్ మార్షల్ ఆయుబ్ ఖాన్ లేదా జనరల్ జియావుల్ హక్ ఇలా పాలకులు ఎవరైనా దావూద్ కుటుంబానికి సహకరించేవారు.
‘‘ఆయుబ్ ఖాన్ సమయంలో కరాచీ, బోరేవాలాలలోని జౌళీ పరిశ్రమల పరిస్థితి దారుణంగా ఉండేది. ఇవి పాకిస్తాన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (పీఐడీసీ) నియంత్రణలో ఉండేవి. కానీ, వీటి పరిస్థితి నానాటికీ మరింత దారుణంగా మారింది. అందుకే వీటిని దావూద్ కుటుంబానికి అప్పగించాలని ఆయుబ్ ఖాన్ సూచించారు.’’ అని ఉస్మాన్ చెప్పారు. మరోవైపు ఆ ఆఫర్‌ను దావూద్, ఆయన సోదరులు కూడా అంగీకరించారు.
అప్పట్లో ప్రైవేటీకరణలో ఎలాంటి వేలం ప్రక్రియలను అనుసరించలేదని ఉస్మాన్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
మొదట్లో దావూద్ కాటన్ మిల్స్ కరాచీలో మాత్రమే పనిచేసేది. అయితే, తన అదృష్టం పరీక్షించుకునేందుకు ఆయన తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)కు కూడా వెళ్లారు. ఈ అవకాశం కూడా ఆయుబ్ ఖాన్ ప్రభుత్వమే కల్పించింది.

ఫొటో సోర్స్, APP
కర్ణఫులిలోని పేపర్ మిల్స్, టెక్స్‌టైల్ మిల్స్‌లను కార్మికుల నిరసనలు, ఇతర సమస్యలు వేధించేవి. అప్పుడే కాలాబాగ్ నావాబు ఈ మిల్స్‌ను దావూద్ కుటుంబానికి అప్పగించాలని భావించారు. అప్పట్లో ఇక్కడి పేపర్ మిల్స్ పాకిస్తాన్‌లో వెదురు నుంచి కాగితాన్ని తయారుచేస్తున్న ఏకైక పరిశ్రమగా ఉండేది.
1969 జనవరి 17నాటికి అహ్మద్ దావూద్ కుటుంబం పాకిస్తాన్‌లోని రెండో అత్యంత సంపన్న కుటుంబంగా మారిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అప్పట్లో వీరి ఆస్తుల విలువ 200 మిలియన్ డాలర్లు(రూ.1,640 కోట్లు)గా ఉండేవి.
పత్తి, జౌళీ, రసాయనాలు, గనులు, బ్యాంకింగ్, బీమా, కాగితం, ఎరువులు తదితర రంగాల్లో వీరికి పరిశ్రమలు ఉండేవి.
అయితే, 1971లో తూర్పు పాకిస్తాన్ వేరుపడటంతో కర్ణఫులి పేపర్ మిల్స్, దావూద్ మైనింగ్, దావూద్ షిప్పింగ్ లాంటి సంస్థలపై ప్రభావం పడింది. మొత్తంగా అప్పట్లో ఈ కుటుంబానికి రూ.30 కోట్ల నుంచి రూ.35 కోట్ల మధ్య నష్టం సంభవించిందని ఉస్మాన్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.
జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వంతో...
అయితే, పాకిస్తాన్‌లో జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం సోషలిజం అనే సిద్ధాంతాలతో అధికారంలోకి వచ్చింది. దేశానికి పెట్టుబడి అవసరమని, ఈ ధనిక కుటుంబాలు తమ సంపదను దేశం కోసం ఇవ్వాలని, లేదంటే వారిని అరెస్టు చేస్తామని భుట్టో చెప్పారు.
అప్పట్లో దావూద్ కుటుంబం సహా చాలా ధనిక కుటుంబాల ఆస్తుల్లో కొన్నింటిని ప్రభుత్వం జాతీయం చేసింది.
ఆ తర్వాత దావూద్‌ను కూడా గృహ నిర్బంధంలో పెట్టారు. విడుదల అవుతూనే ఆయన అమెరికాకు వెళ్లిపోయారు.
అమెరికాలోని చమురు అన్వేషణ సంస్థలతో కలిసి అక్కడ అహ్మద్ దావూద్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు.
అయితే, భుట్టో ప్రభుత్వాన్ని జనరల్ జియావుల్ హక్ కూలదోసినప్పుడు మళ్లీ అహ్మద్ దావూద్‌కు మంచి రోజులు వచ్చినట్లయింది.
దావూద్ కుటుంబంలో ముఖ్యమైనవారు వీరే..
ప్రస్తుతం దావూద్ ఫౌండేషన్‌ను అహ్మద్ దావూద్ కుమారుడు హుస్సైన్ దావూద్ నడిపిస్తున్నారు.
దావూద్ కుటుంబంలో మరో ముఖ్యమైన వ్యక్తి రజాక్ దావూద్. మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్‌కు ఆయన వాణిజ్య సలహాదారుగానూ పనిచేశారు. మరోవైపు పాకిస్తాన్ తెహ్రీకీ ఇన్సాఫ్ ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిగానూ ఆయన కొనసాగారురు.
అహ్మద్ దావూద్ సోదరుడు సులేమాన్ దావూద్ కుమారుడే రజాక్ దావూద్. ప్రస్తుతం డిస్కాన్ ఇంజినీరింగ్ కంపెనీకి ఆయనే చీఫ్.
హుస్సైన్ దావూద్‌కు కుమారుడే షెహ్‌జాదా దావూద్. తాజా ప్రమాదంలో మరణించిన షెహ్‌జాదా దావూద్ ఎంగ్రో కార్పొరేషన్‌కు కూడా వైస్ చైర్మన్.
ఇవి కూడా చదవండి:
- రష్యా ఊపిరి కాసేపు ఆగిపోయేలా చేసిన వాగ్నర్ 'ప్రైవేట్ ఆర్మీ' చీఫ్ ఎందుకు వెనక్కి తగ్గారు... 24 గంటల పాటు అసలేం జరిగింది?
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















