సముద్రగర్భంలో 1600 అడుగుల లోతున 76 గంటల పాటు చిక్కుకున్న ఇద్దరు నావికుల కథ.. 12 నిమిషాలలో ఆక్సిజన్ అయిపోతుందనగా ఎలా బయటపడ్డారంటే

ఫొటో సోర్స్, PA Media
- రచయిత, వనెసా బార్‌ఫోర్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
టైటానిక్ శిథిలాలను చూడడానికి వెళ్లిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఆచూకీ ఇంకా దొరకలేదు. వెతుకులాట కొనసాగుతోంది. లోపల అయిదుగురు వ్యక్తులు ఉన్నారు. ఆక్సిజన్ నిల్వ తరిగిపోతోంది. పూర్తిగా అయిపోయేలోపు జలాతర్గామి జాడ వెతికి పట్టుకోవడానికి సహాయక సిబ్బంది పరుగులుపెడుతున్నారు. అయితే, ఇలా సముద్రంలో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు.
సుమారు 50 సంవత్సరాల క్రితం ఇద్దరు బ్రిటిష్ నావికులు ఆరు అడుగుల వెడల్పు గల జలాంతర్గామిలో మూడు రోజులపాటు సముద్రగర్భంలో గడపాల్సి వచ్చింది.
ఐర్లాండ్‌కు 150 మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. వాళ్ళు ప్రయాణిస్తున్న సబ్‌మెర్సిబుల్ సముద్రంలో సుమారు 1600 అడుగుల అగాధానికి పడిపోయింది.
వాళ్లను రక్షించే సమయానికి జలాంతర్గామిలో 12 నిమిషాల ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది.
ఇది పైసీస్ III కథ. 1973 ఆగస్టు 29న ఈ జలాంతర్గామిలో ప్రయాణిస్తున్న రాయల్ నేవీ సిబ్బంది రోజర్ చాప్‌మన్ (అప్పటికి 28), ఇంజనీర్ రోజర్ మలిన్‌సన్ (అప్పటికి 35) ప్రమాదవశాత్తు అట్లాంటిక్ మహాసముద్రం లోతులకు పడిపోయారు.
వారిని వెతికిపట్టుకునేందుకు 76 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
ఆ రోజు ఏం జరిగింది?
పైసీస్ III కెనడాకు చెందిన వ్యాణిజ్య జలాంతర్గామి. ఆ రోజు పైలట్ రోజర్ చాప్‌మన్, సీనియర్ పైలట్ రోజర్ మలిన్‌సన్ ఐర్లాండ్‌కు 150 మైళ్ల దూరంలో ఉన్న అట్లాంటిక్ మహాసముద్రం అడుగున టెలిఫోన్ కేబుళ్ళను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు.
ఇది వాళ్ళు తరచూ చేసే పనే. పైసీస్ III లో ఇద్దరూ మునకవేశారు. అది పొరపాటున అగాధంలోకి పడిపోయింది. మూడు రోజుల తరువాత ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు.
2013లో బీబీసీ ఈ సంఘటన గురించి రోజర్ చాప్‌మన్, రోజర్ మలిన్‌సన్‌లతో మాట్లాడింది. ఆ వివరాలు ఈ కథనంలో అందిస్తున్నాం.
"సాధారణంగా మేం సముద్రం అడుగుకు చేరుకుని వైర్లు, కేబుళ్ళు వేస్తాం. గంటకు అర మైలు వేగంతో అడుగున ప్రయాణిస్తాం. పంపులు, జెట్లను ఉపయోగించి బురద చేశాక, కేబుళ్ళు వేసి అవి పూర్తిగా కవర్ అయేలా చూస్తాం. ఇది మెల్లగా జరిగే పని. బురద, మురికి అవుతుంది. ఆరోజు 1,600 అడుగుల (500మీ) లోతుకు వెళ్ళడానికి 40 నిమిషాలు పట్టింది" అని చాప్‌మన్ చెప్పారు.
సముద్రం అడుగున సరైన వెలుతురు ఉండదు కాబట్టి ఈ పనులు చేస్తున్నప్పుడు చాలా అలసిపోతామని మలిన్‌సన్ చెప్పారు.
"దట్టమైన పొగమంచులో మోటార్‌బైక్‌పై తెల్లటి గీత వెంబడి ప్రయాణించడం ఎలా ఉంటుందో అలా ఉంటుంది సముద్రంలో కేబుళ్లు వేసే పని. ఒకచేత్తో వైర్లు పట్టుకుని, మరొకచేత్తో మిగతా ఏర్పాట్లు చేస్తూ, ఒక్కోసారి తల వొంచి, మోకాళ్లపై కూర్చుని చేయాల్సి ఉంటుంది. ఉక్కిరిబిక్కిరి అవుతాం" అని మలిన్‌సన్ చెప్పారు.
ఘటన జరిగినరోజు 26 గంటలపాటు పనిచేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.
"అంతకుముందు రోజు మేం సముద్రం లోతుకు వెళ్లినప్పుడు చిన్న ప్రమాదం జరిగింది. మానిప్యులేటర్ పాడైపోయింది. దాన్ని బాగు చేస్తూ సమయం గడిచిపోయింది. పైసీస్ III లోపల, బయట నాకు అన్నీ క్షుణ్ణంగా తెలుసు. కెనడా నుంచి వచ్చినప్పుడు శిథిలావస్థలో ఉంది. దాన్ని నేనే బాగుచేశాను."
ఆరోజు ఆక్సిజన్ ట్యాంకు కూడా మార్చారు మలిన్‌సన్. అది అనుకోకుండా జరిగింది.
"సముద్రం లోతుకు వెళ్ళడానికి లోపల ఉన్న ఆక్సిజన్ సరిపోతుంది. కానీ, ఎందుకైనా మంచిదని ఫుల్ ట్యాంక్ మార్చాను. ఆక్సిజన్ ట్యాంక్ మార్చడం తేలిక కాదు. చాలా కష్టపడి మార్చాను. అదే చేసుండకపోతే ప్రమాదం జరిగినప్పుడు మేం బతికి ఉండేవాళ్ళం కాదు" అని చెప్పారు మలిన్‌సన్.
సముద్రం లోతులకు పడిపోయినప్పుడు ప్రతీ 40 నిమిషాలకొకసారి లిథియం హైడ్రాక్సైడ్ ఫ్యాన్ ఆన్ చేశామని చెప్పారు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటుంది.
"మా జలాంతర్గామిని పైకి లాగడం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాం. తాళ్లు, సంకెళ్ల శబ్దం వినిపించింది. కానీ, అకస్మాత్తుగా సబ్‌మరీన్ మరింత లోతుకు మునిగిపోయింది. పెద్ద కుదుపు వచ్చింది. చాలా భయమేసింది" అని మలిన్‌సన్ చెప్పారు.
నావికులు ఇద్దరూ జలాంతర్గామిలో కరంట్ ఆపేశారు. చిమ్మచీకటి అలుముకుంది. బరువు తగ్గించుకోవడానికి అలా చేశారు.
జలాంతర్గామి సముద్రం అడుగున 1575 అడుగులకు చేరి, అక్కడ ఆగిపోయింది. అలా మునిగినా ఏమీ కాకుండా బతికి ఉన్నందుకు సంతోషించామని మలిన్‌సన్ చెప్పారు. గంటకు 65 కిమీ వేగంతో కిందకు వెళ్ళినట్టు వాళ్ళకు తరువాత తెలిసింది.

రెస్క్యూ ఆపరేషన్
జలాంతర్గామి లోపల అంతా చెల్లాచెదురైపోయింది. అన్నింటినీ మళ్లీ యథాస్థానానికి తెచ్చారు.
తరువాత ఫోన్ ద్వారా వాళ్ళిద్దరికీ ఏమీ కాలేదన్న సమాచారాన్ని అందించారు. అప్పటికి 66 గంటల ఆక్సిజన్ మిగిలి ఉంది.
కదిలినా, మాట్లాడినా ఆక్సిజన్ వేగంగా తరిగిపోతుంది. ఇద్దరు కదలకుండా పడుకున్నారు. లోపల 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది. ఇద్దరూ ఎలాగోలా సర్దుకున్నారు.
సముద్రం వెలువల వీరిని కాపాడేందుకు సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సపోర్ట్ షిప్ వికర్స్ వెంచరర్‌ని పంపించారు. రాయల్ నేవీ నుంచి హెచ్ఎంఎస్ హెకటే, యూఎస్ నేవీ నుంచి సబ్‌మరీన్ కర్వ్-3 బయలుదేరాయి.
పైసీస్ II, పైసీస్ V జలాంతర్గాములను సిద్ధంచేశారు. వికర్స్ వాయేజర్ కార్క్ నగరం నుంచి బయలుదేరింది. ఇది కాకుండా, రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేయడానికి మరికొన్ని నౌకలు, ఒక విమానాన్ని సంఘటనా స్థలానికి సమీపంలో మోహరించారు.

ఫొటో సోర్స్, PA Media
మూడు రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్
రెస్క్యూ ఆపరేషన్ మూడు రోజులు సాగింది. మొదట తాడు సహాయంతో పైసీస్ IIను సముద్రపు అడుగుభాగానికి పంపే ప్రయత్నం చేశారు.
కానీ, ఆ తాడు తెగిపోయింది. పైసీస్ II వెనక్కి మళ్లాల్సి వచ్చింది.
తరువాత, పైసీస్ V పంపారు. ఎన్ని గంటలు వెతికినా, మునిగిన జలాంతర్గామి కనిపించలేదు. ఇంధనం అయిపోవడంతో పైసీస్ V వెనక్కి వచ్చేసింది.
కొంతసేపటి తరువాత మళ్లీ పైసీస్ V ను లోపలికి పంపారు. ఈసారి పైసీస్ III కనిపించింది.
దాన్ని తాడుతో లాగడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పైసీస్ IIIతో పాటు అక్కడే ఉండమని పైసీస్ V కు ఆదేశాలు ఇచ్చారు.
తరువాత పైసీస్ IIను పంపించారు. అయితే, దాన్లోకి నీరు చేరిపోవడంతో అది మళ్లీ వెనక్కి మళ్లింది.
నావికులను చేరిన ఒక షిప్.. క్వీన్ ఎలిజబెత్ వారికోసం పంపించిన సమాచారాన్ని అందించింది. అది చూసి చాలా ఆనందం కలిగందని మలిన్‌సన్ చెప్పారు.
అయితే, ఆ సందేశం క్వీన్ నుంచి రాలేదని, క్వీన్ ఎలిజబెత్-2 అనే ఓడ నుంచి వచ్చిందని తరువాత తెలిసింది.
కానీ, ఆ సందేశం తమకు ఊపిరిలూదిందని మల్లిన్‌సన్ చెప్పారు.

ఫొటో సోర్స్, PA Media
ఎట్టకేలకు బయటపడ్డారు..
చివరికి 1973 సెప్టెంబర్ 1న పైసీస్ IIIని బయటకుతీశారు. చాప్‌మన్, మలిన్‌సన్ సముద్రం అడుగున పైసీస్ IIIలో 84 గంటల 30 నిమిషాలు గడిపారు.
“మేం అడుగున పడిపోయినప్పుడు మాకు 72 గంటల లైఫ్ సపోర్టు ఉంది. ఎలాగోలా మరో 12.5 గంటలు మేనేజ్ చేయగలిగాం. మమ్మల్ని కాపాడినప్పుడు మా ఆక్సిజన్ సిలిండర్‌లో కేవలం 12 నిమిషాల ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంది" అని చాప్‌మన్ చెప్పారు.
ఈ సంఘటన తరువాత రోజర్ చాప్‌మన్ ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంత డిఫెన్స్ కంపెనీని ప్రారంభించాడు.
రోజర్ మల్లిన్‌సన్ మరో అయిదేళ్లు అదే కంపెనీలో కొనసాగారు.
ఆ తరువాత కూడా నావికులిద్దరూ తరచూ కలుసుకునేవారు. అయితే, ఈ ప్రమాదం వారిద్దరినీ మానసికంగా పెద్దగా ప్రభావం చేయలేదని చెప్పారు.
చాప్‌మన్ 2020లో 74 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో మరణించారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ‘అమరుల’ స్మారకం: 3 ఎకరాల ప్రాంగణంలో ‘త్యాగాల దివ్వె’.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం
- సోయం బాపూరావు - ఎంపీల్యాడ్స్: ఈ నిధులతో ఎంపీలు సొంత ఇల్లు కట్టుకోవచ్చా? 9 సందేహాలు, సమాధానాలు
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- భారత్, అమెరికాలు మాట్లాడుకోని ఆ ఒక్క విషయం
- మణిపుర్: వందల చర్చిలను ధ్వంసం చేశారని క్రైస్తవ సంఘాల ఆరోపణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















