సముద్రం లోతుల్లో ఏముందో మనకేం తెలుసు?

మిడ్ నైట్ జోన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సిమ్రన్ ప్రీత్ కౌర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భూమి దాదాపు 70 శాతం నీటితోనే నిండి ఉంది. అయినప్పటికీ, సముద్రాల్లో దాదాపు 80 శాతం ప్రాంతాల్ని ఇప్పటి వరకూ ఎవరూ చూడలేదు, అన్వేషించలేదు, చేరుకోలేదు.

సముద్ర లోతుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనిషికి కొంతే తెలుసు.

సముద్రం ఎంత లోతు ఉంటుంది? సముద్రంలో మనుషులు ఎంత లోతు వరకు వెళ్లారు?

సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతంలో ఎలాంటి జీవులు నివసిస్తున్నాయి?

సముద్రంలో సూర్య కాంతి ఎక్కడి వరకూ ప్రసరిస్తుంది?

ఈ ప్రశ్నలన్నికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మిడ్ నైట్ జోన్

ఫొటో సోర్స్, Getty Images

నీటిలో చాలావరకూ జీవులు సముద్ర ఉపరితలానికి దగ్గర్లోనే ఉంటాయి. సముద్రంలో లోతుల్లోకి వెళ్లేకొద్దీ... అక్కడ ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుంది. నీటి ఒత్తిడి పెరుగుతుంది. వెలుతురు కూడా తగ్గిపోతుంది.

సముద్ర అన్వేషకుడు హెర్బర్ట్ నిట్చ్ 2007లో ఒక రికార్డు నెలకొల్పారు. ఆయన సముద్రంలో 214 మీటర్లు, అంటే 702 అడుగుల లోతుకు ఎలాంటి పరికరాలు లేకుండా వెళ్లగలిగారు.

దీంతో ఫ్రీ డైవింగ్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచి ‘‘డీపెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్’’గా పేరు తెచ్చుకున్నారు.

ఆయన ఎలాంటి శ్వాస పరికరాలు, ఆక్సిజన్ సిలెండర్లు లేకుండా, ఒక్కసారి ఊపిరి పీల్చుకుని.. సముద్రంలో ఆ లోతువరకూ చేరుకుని ఈ అద్భుతాన్ని సాధించారు.

మిడ్ నైట్ జోన్

ఫొటో సోర్స్, Getty Images

స్కూబా డైవింగ్‌తో

2014లో అహ్మద్ గ్యాబ్రిన్ అత్యంత లోతులో స్కూబా డైవింగ్ చేశారు.

ఆక్సిజన్ వంటి శ్వాస పరికరాలు ఉపయోగించుకుని ఆయన ఎర్ర సముద్రంలో 332 మీటర్లు అంటే 1090 అడుగుల లోతు వరకూ వెళ్లారు.

సముద్రంలోకి వెళ్లేకొద్దీ.. వెయ్యి మీటర్ల లోతులో అంటే.. 3280 అడుగుల లోతుతో సూర్యరశ్మి క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది.

దీనినే ఎఫోటిక్ జోన్ లేదా మిడ్ నైట్ జోన్ అంటారు. ఈ జోన్ దాటిన తర్వాత సముద్రంలోకి సూర్యకాంతి చేరుకోలేదు.

దానికన్నా లోతుల్లో చాలా తక్కువ జీవులు నివసిస్తాయి.

ఎందుకంటే చీకటిలో ఆహారం కోసం వేటాడటం కష్టం కాబట్టి అక్కడ పెద్దగా జీవులు నివసించవు.

బీక్డ్ వేల్స్... సముద్రం ఉపరితలంలో ఒక్కసారి గాలి పీల్చుకుని.. సముద్రంలో మూడు వేల మీటర్ల లోతు వరకూ చేరుకుంటాయి.

మిడ్ నైట్ జోన్

ఫొటో సోర్స్, Getty Images

టైటానిక్ శిథిలాలు ఎక్కడ ఉన్నాయి?

అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శిథిలాలు ఉన్న ప్రాంతం గురించి చెప్పుకోవాలంటే.. అవి సముద్ర ఉపరితలానికి 12,500 అడుగుల లోతులో, అంటే 3800 మీటర్ల లోతులో ఉన్నాయి.

సముద్రంలో ఈ ప్రాంతానికి సూర్యకాంతి అస్సలు చేరుకోలేదు.

ఇక్కడ నివసించే కొన్ని జీవులు స్వయంగా కాంతిని వెదజల్లే లక్షణాల్ని కలిగి ఉంటాయి.

ఓషన్ సర్వీస్ చెప్పిన దాని ప్రకారం... సముద్ర గర్భంలో అత్యంత లోతైన ప్రాంతాన్ని ‘ఛాలెంజర్ డీప్’ అని పిలుస్తారు.

ఈ ఛాలెంజర్ డీప్ ప్రాంతం 10,935 మీటర్లు అంటే 35,876 అడుగుల లోతులో ఉంది.

అంటే దాదాపు ఈ ప్రాంతం సముద్ర ఉపరితలానికి 11 కిలోమీటర్ల లోతులో ఉందన్నమాట.

వీడియో క్యాప్షన్, సముద్రంలో షార్క్ ఒక్కసారిగా మీదకు దూసుకొచ్చినప్పుడు ఆమె ఎలా తప్పించుకున్నారంటే...

ఛాలెంజర్ డీప్ ఎక్కడ ఉంది

ఫసిఫిక్ మహా సముద్రంలో దక్షిణ మెరియానా ట్రెంచ్‌కు సమీపంలో గువామ్ దీవికి నైరుతి దిక్కులో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. దీనికి ఆ పేరును బ్రిటిష్ రాయల్ నేవీ సర్వీస్ షిప్ హెచ్ఎంఎస్ చాలెంజర్ పేరు మీద పెట్టారు.

హెచ్ఎంఎస్ చాలెంజర్ 1872 నుంచి 1876 మధ్యలో నిర్వహించిన అన్వేషణలో ఈ ప్రాంతంల లోతును రికార్డు చేసింది.

మానవులు సముద్ర గర్భంలోకి వెళ్లకుండానే సాగిన ఈ అన్వేషణలో సముద్రం గురించి చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి.

1960లో డాన్ వాల్ష్, జాక్ స్పికెట్ తొలిసారిగా సముద్రంలో ఇంత లోతుకు చేరుకున్నారు. వారు తమ సబ్ మెరీన్లో ఇంత లోతుకు వెళ్లారు.

james cameron

ఫొటో సోర్స్, Getty Images

టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కూడా..

2012లో టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ కూడా ఒంటరిగా ఇదే ప్రాంతానికి వెళ్లారు. ఆయన కూడా సబ్ మెరీన్లో ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన తన సబ్ మెరీన్ డీప్ సీ చాలెంజర్ లో ఈ యాత్ర కొనసాగించారు.

2019లో విక్టర్ వెస్క్ కూడా భూమ్మీద అత్యంత లోతైన ఈ ప్రాంతానికి తన సబ్ మెరీన్లో చేరుకున్నారు. ఈయన అంతకు ముందు భూమ్మీద అత్యంత ఎత్తైన ప్రాంతం ఎవరెస్ట్‌ను కూడా అధిరోహించారు.

దీని తర్వాత ఛాలెంజర్ డీప్‌ దగ్గరకు చాలా మంది సబ్ మెర్సిబుల్స్‌లో వెళ్లివచ్చారు.

వీడియో క్యాప్షన్, సముద్రంలో అంతుచిక్కని రహస్యాలు

అతి పెద్ద అమీబాలు ఉంటాయి

మరి ఇంత లోతుల్లో నివసించే జీవులేంటో తెలుసా... సీ పీగ్స్, సీ కుకంబర్లు, స్నెయిల్ ఫిష్‌లతో పాటు జెయింట్ డీప్ సీ అమీబాలు కూడా నివసిస్తాయి.

వీటిని ఈ ప్రపంచంలో అతిపెద్ద ఏక కణ జీవులుగా చెప్పుకుంటారు.

అయితే మనకు సాగరాల గురించి అన్ని విషయాలూ తెలుసా? అంటే... యునెస్కో అంచనాల ప్రకారం, ఇప్పటి వరకూ సముద్రాల్లో కేవలం ఐదు శాతం ప్రాంతాన్ని మాత్రమే అన్వేషించాం.

అంటే ఇంకా అన్వేషించడానికి చాలా మిగిలే ఉందన్నమాట.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)