టైటాన్ సబ్ మెర్సిబుల్: 3.8 కిలోమీటర్ల లోతున ఉన్నప్పుడు దానిపై నీటి బరువు 10 వేల టన్నులకు సమానం.. ఎలా పేలిపోవచ్చంటే..

టైటాన్

ఫొటో సోర్స్, OCEANGATE

ఉత్తర అట్లాంటిక్‌లో సముద్రమట్టానికి 3,800 మీటర్ల దిగువన గల టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లిన 'టైటాన్ సబ్‌మెర్సిబుల్' పేలుడుకి గురైంది. దానిలో ప్రయాణిస్తున్నఐదుగురు మరణించారని అమెరికా అధికారులు ప్రకటించారు.

ఆదివారం టైటాన్ సబ్‌తో కమ్యునికేషన్ తెగిపోయిన కొద్దిసేపటికే సముద్రంలో శబ్దాలను గుర్తించినట్లు అమెరికా నావికాదళం తెలిపింది. అయితే ఈ సమాచారం గురువారం మాత్రమే బయటికి వెల్లడించారు.

కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ ద్వీపంలో భారీ సెర్చ్ మిషన్ తర్వాత ఈ సబ్ మెర్సిబుల్ ప్రమాదాన్ని నిర్ధరించారు.

పేలుడుకు కారణమేంటి?

అత్యధిక నీటి పీడనం కారణంగానే టైటాన్ పేలిపోయిందని భావిస్తున్నారు.

అయితే, అలాంటి ఒత్తిడిని తట్టుకునేలా ఆ జలాంతర్గామిని నిర్మించారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

శిథిలాల విశ్లేషణ దీనికి సహాయపడనుంది.

టైటాన్ కమ్యునికేషన్ తెగిపోయినప్పుడు అది సముద్ర మట్టానికి 3,500 మీటర్ల దిగువన ఉన్నట్లు భావిస్తున్నారు.

ఆ జలాంతర్గామి చాలా లోతుగా వెళ్లింది. ఆ సమయంలో దానిపై గల నీటి పరిమాణం ఈఫిల్ టవర్ బరువుకు సమానం. అంటే దాదాపు పదివేల టన్నుల బరువు ఉంటుంది.

సబ్‌మెర్సిబుల్‌లో వ్యాపారవేత్తలు
ఫొటో క్యాప్షన్, సబ్‌మెర్సిబుల్‌లో ఉన్న పాకిస్తానీ వ్యాపారవేత్త షాహజాదా దావూద్, బ్రిటీష్ అన్వేషకుడు హమీష్ హార్డింగ్

శరీరాలు భస్మమై తక్షణమే బూడిదగా..

టైటాన్‌కు పగుళ్లు లేదా లోపం ఉంటే , దానిపై బయటి నుంచి కలిగే పీడనం తీవ్రత దానిపై పడుతుంది.

జలాంతర్గామి పైభాగం బద్దలైతే, అది గంటకు దాదాపు 2,414 కి.మీ. వేగంతో లోపలికి వెళుతుంది.

అంటే సెకనుకు 671 మీటర్లు అని అమెరికా మాజీ న్యూక్లియర్ సబ్‌మెరైన్ అధికారి డేవ్ కోర్లే చెప్పారు.

ఈ నేపథ్యంలో టైటాన్ పూర్తిగా బద్దలవడానికి అవసరమయ్యే సమయం ఒక మిల్లీసెకన్ లేదా సెకనులో వెయ్యో వంతు మాత్రమే.

టైటాన్ లోపల ఉండే గాలి హైడ్రోకార్బన్ ఆవిరితో అధిక సాంద్రతను కలిగి ఉంటుంది.

''టైటాన్ పైభాగం పగిలిపోయినపుడు ఆ గాలి స్వయంచాలకంగా మండుతుంది. వేగంగా పేలుతుంది'' అని కోర్లే చెప్పారు.

దీంతో మానవ శరీరాలు కాలి తక్షణమే బూడిదైపోతాయి.

వీడియో క్యాప్షన్, చరిత్రలో అత్యంత ఘోరమైన సబ్‌మెరైన్ ప్రమాదం

ప్రమాదంపై విచారణ ఎలా చేయనున్నారు?

దీనిలో ఏ పరిశోధనైనా టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లోని కార్బన్ ఫైబర్ మిడ్-సెక్షన్‌పై దృష్టి సారిస్తుంది.

ఇలాంటి లోతైన వాహనాల పీడన నాళాలు సాధారణంగా టైటానియం వంటి బలమైన లోహంతో నిర్మిస్తారు.

అందులోని ప్రయాణికులు ఉండే ప్రదేశం చుట్టూ ఒత్తిడిని సమానంగా వ్యాప్తి చేయడానికి గోళాకారాన్ని ఎంపిక చేసుకుంటారు.

కానీ, లోపల ఎక్కువ మంది వ్యక్తులు ప్రయాణించడానికి సబ్‌మెర్సిబుల్‌ను స్థూపాకారంలో నిర్మించింది ఓషన్ గేట్ సంస్థ.

టైటానియం కొన క్యాప్‌ల మధ్య కార్బన్ ఫైబర్ ట్యూబ్‌తో నిర్మించారు.

సాధారణంగా కార్బన్ ఫైబర్ చాలా కఠినమైనది. దానిని విమానం రెక్కలు, రేసింగ్ కార్లను నిర్మించడానికి ఉపయోగిస్తారు.

అయితే, నీటి అడుగున పీడనం అనేది సముద్ర ఉపరితలం వద్ద ఉండే వాతావరణం కంటే 300 రెట్లు ఎక్కువ ఉంటుంది.

ఏ పరిశోధనైనా నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటుంది.

ఎయిర్‌క్రాఫ్ట్‌‌కు పగుళ్లు రావడం లేదని నిర్ధరించుకోవడానికి సాధారణ, సూక్ష్మ-స్థాయి తనిఖీలు చాలానే ఉంటాయి.

సముద్రపు అడుగుభాగంలోని టైటాన్ శిథిలాల ఫోటోలు తీయడం, ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అధ్యయనం కోసం తిరిగి వాటిని ఉపరితలంపైకి తీసుకురావడం చేశాకే జలాంతర్గామి నిర్మాణంలో ఎక్కడ లోపముందో గుర్తించడానికి ఇంజనీర్లు ప్రయత్నించవచ్చు.

వీడియో క్యాప్షన్, టైటాన్ సబ్‌మెర్సిబుల్: మిల్లీ సెకను వ్యవధిలోనే కాలి బూడిదైపోయి ఉంటారు

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)