నిర్మలా సీతారామన్: 'ఒబామా అధికారంలో ఉన్నప్పుడు ఆరు ముస్లిం దేశాలపై బాంబులు వేశారు'

ఒబామా, నిర్మల సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కాలంలో ఏడు ముస్లిం దేశాలపై బాంబులు వేశారని, కానీ, ఆయన ప్రస్తుతం భారత్‌పై విమర్శలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు.

అలాంటి వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేసినప్పుడు, వారిపై ఎవరు నమ్మకం ఉంచుతారని అన్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్టేట్ విజిట్‌పై జూన్ 20న అమెరికా పర్యటనకు వెళ్లారు.

మోదీకి జో బైడెన్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది.

కానీ, ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మోదీ ప్రభుత్వం మెజార్టీ సంఖ్యాకులకు అనుకూలంగా రాజకీయాన్ని చేపడుతుందంటూ ఆరోపణలు చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

ప్రధాని మోదీ అమెరికాను చేరుకున్న సమయంలో, చాలా మంది ఎంపీలు, మానవ హక్కుల కార్యకర్తలు భారత్‌లో అప్పటికే మానవ హక్కుల ఉల్లంఘనపై, పత్రికా స్వేచ్ఛపై దాడి వంటి వాటిపై పలు రకాల ప్రశ్నలు సంధించారు.

కానీ, ఒబామా చేసిన వ్యాఖ్యల తర్వాత ఇవి మరింత చర్చనీయాంశమయ్యాయి.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ప్రధాని మోదీ గత వారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు.

ఆ సమయంలో, అమెరికా న్యూస్‌పేపర్ వాల్ స్ట్రీట్ జర్నల్‌కి చెందిన ఒక జర్నలిస్ట్, భారత్‌లోని మానవ హక్కులు, మైనార్టీలకు సంబంధించి ప్రశ్నలు వేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ, భారత డీఎన్ఏలోనే ప్రజాస్వామ్యం ఉందన్నారు.

ప్రధాని మోదీని ప్రశ్నించిన పాత్రికేయురాలు సబ్రీనా సిద్దిఖీ ప్రస్తుతం భారత్‌లో బీజేపీ మద్దతుదారులకు లక్ష్యంగా మారారు.

ఒబామా వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ ఇస్లామోఫోబియా రూపంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇక ఇప్పుడు భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒబామాను లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

‘‘ అమెరికా అధ్యక్షుడు బైడెన్ రక్షణాత్మక ప్రజాస్వామ్యం కోసం తన కార్యాలయాన్ని కేంద్రంగా చేసుకున్నారు.ఈ సమయంలో ప్రపంచంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. నియంత నేతలు, నియంతృత్వాలు ప్రజాస్వామ్యాన్ని సవాలు చేస్తున్నాయి. ఉదారవాద ప్రజాస్వామ్యాలు కూడా దీన్ని సవాలు చేస్తున్నాయి. చైనా అధ్యక్షుడిని నియంతగా బైడెన్ పిలుస్తున్నారు’’ అని అమెరికాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ క్రిస్టియన్ అమన్‌పూర్, ఒబామాతో అన్నారు.

“బైడెన్ ప్రస్తుతం మోదీని స్వాగతిస్తున్నారు. కానీ, మోదీపై నిరంకుశుడు అన్న విమర్శలున్నాయి. అలాంటి నాయకులతో అధ్యక్షుడు ఎలా వ్యవహరించాలి?’’ అని జర్నలిస్ట్ క్రిస్టియన్ అమన్‌పూర్ ఒబామాను అడిగారు.

ఈ ఇంటర్వ్యూలో బరాక్ ఒబామా మాట్లాడుతూ.. ‘‘ హిందూ మెజార్టీ దేశం భారత్‌లో ముస్లిం మైనార్టీ భద్రత గురించి మాట్లాడుకోవడం ఎంతో అవసరం. నేను మోదీతో మాట్లాడి ఉంటే, మీరు మైనారిటీల హక్కులను కాపాడకపోతే, భవిష్యత్తులో భారతదేశంలో విభజన వాదం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది దేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది కదా’’ అని చెబుతానని అన్నారు.

ఒబామాను లక్ష్యంగా చేసుకుని అసోం సీఎం కూడా ఒక ట్వీట్ చేశారు.

‘‘భారత్‌లోనే చాలా మంది హుస్సేన్ ఒబామాలున్నారు. వాషింగ్టన్ వెళ్లడానికి ముందే వారి గురించి మేం చూడాల్సి ఉంది. అసోం పోలీసులు వారి స్వీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా నడుచుకుంటారు’’ అని తెలిపారు.

హిమంత బిశ్వ శర్మ చేసిన ఈ ప్రకటన సోషల్ మీడియా నుంచి అమెరికా మీడియా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది.

ఇదే సమయంలో, నిర్మలా సీతారామన్ కూడా ఆదివారం నిర్వహించిన పత్రికా సమావేశంలో బరాక్ ఒబామాపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.

‘‘అమెరికాతో మేం మంచి స్నేహ బంధాన్ని కోరుకుంటున్నాం. కానీ, వారి నుంచి మత సహనంపై పలు కామెంట్లు వస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆరు ముస్లిం మెజార్టీ దేశాలపై బాంబులు వేశారు. సిరియా, యెమెన్, సౌదీ, ఇరాక్.. నా వద్ద స్పష్టమైన గణాంకాలు లేవు. కానీ, ఏడు దేశాల్లో యుద్ధ వాతావరణ పరిస్థితులను సృష్టించారు. 26 వేలకు పైగా బాంబులు వేశారు. అలాంటి దేశం భారత్‌కు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తుంది. వారిపై ఎవరు నమ్మకం ఉంచుతారు’’ అని నిర్మలా సీతారామన్ అన్నారు.

మోదీ, జో బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఒబామాపై విమర్శలు

బరాక్ ఒబామాపై చేసిన వ్యాఖ్యలపై వాషింగ్టన్ పోస్టు ఒక కథనాన్ని ఇచ్చింది.

ఈ కథనంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను బీజేపీలో వెలుగుతోన్న ఒక తారగా అభివర్ణించింది.

భారత్‌లోనే చాలా మంది హుస్సేన్ ఒబామాలున్నారని, వారిపై ప్రస్తుతం దృష్టిపెట్టాలని భారత పోలీసులకు హిమంత బిశ్వ శర్మ తెలిపినట్లు పేర్కొంది.

అమెరికాలో మీడియాలో ప్రధాని మోదీకి సంబంధించిన ఒక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రధానమంత్రిగా గత తొమ్మిదేళ్లలో తొలిసారి లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మోదీ పలు ప్రశ్నలను ఎదుర్కొన్నారు.

దీంతో పాటు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అమెరికా రావడాన్ని ఎలా నిషేధించారనే విషయంపై కూడా ప్రతిసారి చర్చనీయాంశమవుతోంది.

2002లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో హింసాత్మక అల్లర్లు చోటు చేసుకున్నాయి.

మోదీ పర్యటనపై అమెరికా న్యూస్ ఛానల్ సీఎన్ఎన్ పెద్ద ఎత్తున కవరేజ్ ఇచ్చింది.

‘‘మోదీకి భారత్‌లో పాపులారిటీ గణనీయంగా ఉంది. కానీ, నిరంకుశత్వం విషయంలో మాత్రం పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి’’ అని సీఎన్ఎన్ తన రిపోర్ట్‌లో పేర్కొంది.

అసమ్మతిని, జర్నలిస్ట్ టార్గెట్ చేస్తున్నామన్న దాన్ని, మానవ హక్కుల ఉల్లంఘన, ముస్లింలపై వివక్ష వంటి ఆరోపణలను మోదీ కొట్టివేశారు.

‘‘భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పిలుస్తారు. ఆసియాలో బైడెన్ వ్యూహంలో భారత్ అతి ముఖ్యమైన దేశంగా ఉంది. జనాభా విషయంలో కూడా ఇటీవలే భారత్, చైనాను వెనక్కు నెట్టింది. భారత్ తోడు లేకుండా పర్యావరణ మార్పులు వంటి ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనలేమని బైడెన్ భావిస్తున్నారు’’ అని సీఎన్ఎన్ రాసింది.

అసోం ముఖ్యమంత్రి

ఫొటో సోర్స్, Getty Images

బీజేపీ ఘాటు స్పందన

కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యల తర్వాత, అసోం పోలీసులు పవన్ ఖేడాను దిల్లీ విమానశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

ఖేడా ఆ సమయంలో కాంగ్రెస్ కన్వెక్షన్‌లో పాల్గొనేందుకు విమానంలో చత్తీస్‌ఘడ్ వెళ్తున్నారు.

పవన్ ఖేడా అరెస్ట్‌ను కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.

ఈ సంఘటనను ప్రస్తావిస్తూ.. జర్నలిస్ట్ రోహిణి సింఘ్ ట్విటర్‌లో ఒక ప్రశ్నను సంధించారు.

‘‘సెంటిమెంట్లను దెబ్బతీసినందుకు ఒబామాకు వ్యతిరేకంగా గౌహతిలో ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తారా? ఒబామాను అరెస్ట్ చేసేందుకు అసోం పోలీసులు వాషింగ్టన్ వెళ్తారా?’’ అని అడిగారు.

‘‘భారత్‌లోనే చాలా మంది హుస్సేన్ ఒబామాలున్నారు. వాషింగ్టన్ వెళ్లడానికి ముందే వారి గురించి చూడాలి. అసోం పోలీసులు వారి స్వీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా నడుచుకుంటారు’’ అంటూ వెంటనే హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.

హిమంత బిశ్వ శర్మ ట్వీట్‌పై దేశ, విదేశాల నుంచి పలు రకాల స్పందనలు వస్తున్నాయి.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఒకవైపు ప్రధాని మోదీ అమెరికాలో మైనార్టీల ప్రయోజనాలు, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే, మరోవైపు తన సొంత పార్టీ ముఖ్యమంత్రి ముస్లిం గుర్తింపును లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేస్తున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు.

‘‘భారత ప్రజాస్వామ్య విలువల్లో మతం, కులం, వయసు లేదా ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ఎలాంటి వివక్ష ఉండదు. ప్రజాస్వామ్య విలువలను ఆధారంగా చేసుకుని రూపొందించిన రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వం నడుస్తుంటే, పక్షపాతం అనే ప్రశ్ననే ఉండదు’’ అని మోదీ అమెరికాలో చెప్పారు.

ప్రధాని మోదీతో సమావేశం జరిగినప్పుడు మైనార్టీ మతస్తుల గురించి అధ్యక్షుడు బైడెన్ మాట్లాడాలని అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో పాల్గొన్న ఆ దేశ డెమొక్రాట్ నేత బెర్నీ సాండర్స్ చెప్పారు.

‘‘ప్రధాని మోదీ ప్రభుత్వం పత్రికలు, పౌర సమాజంపై దాడులు చేసింది. రాజకీయ ప్రత్యర్థులను జైలులో పెట్టింది. హిందూ జాతీయవాదాన్ని ప్రోత్సహించింది. భారతదేశంలోని మతపరమైన మైనారిటీలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. మోదీతో సమావేశం సందర్భంగా బైడెన్ ఈ అంశాలను ప్రస్తావించాలి’’ అని తెలిపారు.

మోదీ, ఒబామా

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ, బరాక్ ఒబామాల మధ్య సంబంధాలపై ఇంతకుముందు కూడా చర్చలు జరిగాయి.

2019లో నటుడు అక్షయ్ కుమార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘‘బరాక్ ఒబామా మంచి స్నేహితుడు.’’ అని చెప్పారు ప్రధాని మోదీ.

2015లో అధ్యక్షుడిగా బరాక్ ఒబామా భారత్‌కు వచ్చినప్పుడు, మతపరమైన విషయాలపై విభజన జరగనంత వరకు భారత్ విజయవంతమవుతూనే ఉంటుందన్నారు.

ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా భారత్‌కు వచ్చిన బరాక్ ఒబామా.. ‘‘ప్రతి ఒక్క వ్యక్తి వారి మతాన్ని అనుసరించే హక్కు ఉండాలి. ఏ మతానికి వ్యతిరేకంగా వివక్ష ఉండకూడదు.’’ అని అన్నారు.

తన బ్యాక్‌గ్రౌండ్ కారణంతో తాను చాలా విషయాల్లో అమెరికాలో ఇబ్బందులు పడ్డట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)