అమెరికా నుంచి భారత్ రూ.25 వేల కోట్లు పెట్టి కొనాలనుకుంటున్న ఎంక్యూ-9 సిరీస్ డ్రోన్లు ఎలా పని చేస్తాయి?

ఎంక్యూ-9 బీ డ్రోన్

ఫొటో సోర్స్, GA-ASI.COM

ఫొటో క్యాప్షన్, ఎంక్యూ-9 బీ డ్రోన్
    • రచయిత, రాఘవేంద్రరావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా పర్యటన చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఒక రక్షణ ఒప్పందంపై నిలిచింది. ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా నుంచి భారత్ 31 సాయుధ డ్రోన్‌లను కొనుగోలు చేయనున్నట్లు అంచనా.

ఇటీవల, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, అమెరికన్ కంపెనీ జనరల్ అటామిక్స్ నుంచి సాయుధ ‘‘ఎంక్యూ 9బీ’’ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

అయితే, ఈ ప్రతిపాదనకు కేబినెట్ భద్రత కమిటి నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.

ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య చర్చల అనంతరం ఈ రక్షణ ఒప్పందానికి అధికారిక ముద్ర పడవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మొత్తం 31 డ్రోన్లలో, 15 భారత నౌకా దళానికి, 8 డ్రోన్లు ఆర్మీకి, మరో 8 వైమానిక దళానికి అందజేస్తారు. ఈ డ్రోన్ల కొనుగోలు అంచనా వ్యయం సుమారు రూ. 25 వేల కోట్లు (3 బిలియన్ డాలర్లు).

మానవరహిత రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ డ్రోన్ల కొనుగోలును ఒక భాగంగా చెప్పవచ్చు.

భారతదేశం తన సరిహద్దుల్లో నిఘా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, శత్రువుల నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ డ్రోన్ల డీల్ వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

అలాగే, హిందూ మహాసముద్ర ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యంపై నిఘా ఉంచేందుకు ఈ డ్రోన్లు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు.

డ్రోన్

ఫొటో సోర్స్, GA-ASI.COM

ఈ డ్రోన్ ప్రత్యేకత ఏంటి?

నివేదికల ప్రకారం, ఎంక్యూ 9 సిరీస్‌లో అందుబాటులో ఉన్న ‘ఎంక్యూ 9ఎ: స్కై గార్డియన్’తో పాటు ‘ఎంక్యూ 9బి: సీ గార్డియన్’ డ్రోన్‌లను కొనుగోలు చేయాలని భారత్ అనుకుంటోంది.

సముద్రపు నిఘా కోసం సీ గార్డియన్ డ్రోన్లను, భూసరిహద్దు పరిరక్షణ నిఘా కోసం స్కై గార్డియన్ డ్రోన్‌లను వినియోగించనున్నారు.

ఇటువంటి సాయుధ డ్రోన్‌లకు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి. ఫైటర్ జెట్‌లు చేయగలిగే పనులు అంటే శత్రు లక్ష్యాలపై క్షిపణులతో దాడి చేయడం, మందుగుండు సామగ్రితో విధ్వంసం సృష్టించడం వంటి పనులను ఈ డ్రోన్లతో చేయవచ్చు. .

ఈ డ్రోన్‌లకు నిఘా సామర్థ్యం ఉంటుంది. ఈ డ్రోన్లలోని సాయుధ రకాల్లో హెల్‌ఫైర్ క్షిపణులు అమర్చి ఉంటాయి.

మానవతా సహాయం, విపత్తుల సమయంలో రక్షణ చర్యలు, గాలింపు చర్యలు, గాలిలో ముందస్తు హెచ్చరికలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, యాంటీ-సర్ఫేస్ వార్‌ఫేర్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌లలో ఈ డ్రోన్లను ఉపయోగించవచ్చు.

డ్రగ్స్ అక్రమ రవాణా, పైరసీ వంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి కూడా ఈ డ్రోన్‌లను మోహరించవచ్చు.

అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఏకధాటిగా 30 నుంచి 40 గంటల పాటు ఈ డ్రోన్‌లు ఎగరగలవు. 40,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలిగే సామర్థ్యం వీటికి ఉంటుంది.

సీ గార్డియన్ డ్రోన్‌లు సముద్ర నిఘా, డొమైన్ అవగాహనకు బాధ్యత వహిస్తాయి. స్కై గార్డియన్ డ్రోన్‌లు భూ సరిహద్దులను రక్షించడానికి ఉపయోగిస్తారు.

డ్రోన్

ఫొటో సోర్స్, GA-ASI.COM

కొన్నేళ్లుగా ప్రతిపాదన దశలోనే...

గత కొన్నేళ్లుగా ఈ డ్రోన్‌ల కొనుగోలు గురించి ఎప్పటికప్పుడు ప్రస్తావన వస్తూనే ఉంది. అయితే, చాలా కాలంగా ఈ విషయాన్ని దాటవేస్తూ వస్తున్నట్లు కనిపిస్తోంది.

రక్షణ శాఖ విశ్లేషకుడు రాహుల్ బేడీ మాట్లాడుతూ, " ఇంత భారీగా డ్రోన్లను కొనుగోలు చేయడం ద్వారా అమెరికాను సంతోషపెట్టాలని భారత్ ప్రయత్నిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ అమ్మకానికి ఆమోదం పొందడానికి అమెరికన్లు చాలా కష్టపడ్డారు. చాలా కాలంగా జనరల్ఎలక్ట్రిక్ ఇంజిన్ల కొనుగోలుకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగింది.

అకస్మాత్తుగా ఒక వారం రోజుల క్రితం ఈ డ్రోన్ల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. ముందుగా 18 డ్రోన్లు కొనుగోలు చేయాలని అనుకున్నారు. తర్వాత ఆ సంఖ్య 30కి పెరిగింది. ఇప్పుడు 31 అంటున్నారు. ఈ డ్రోన్లను భారత్‌కు అమ్మడం ద్వారా అమెరికా కూడా తన చిత్తశుద్ధిని చాటుకోవాలనుకుంటోంది’’ అని అన్నారు.

మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజీమ్ (ఎంటీసీఆర్)లో భారత్ 2016లో అధికారిక సభ్యత్వం పొందినప్పటి నుంచి ఈ డ్రోన్లను కొనుగోలు చేయాలనే చర్చ మొదలైందని రాహుల్ బేడీ చెప్పారు.

ఎంటీసీఆర్‌పై భారత్ సంతకం చేసి ఉండకపోతే ఈ డ్రోన్లను పొందే అవకాశం భారత్‌కు ఉండేది కాదని ఆయన అన్నారు.

‘‘ఎంటీసీఆర్‌పై సంతకం చేసిన కొద్దిసేపటికే, ఈ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి అమెరికాకు భారత్ అభ్యర్థన లేఖను పంపింది. ఇప్పటి వరకు అమెరికా ఈ డ్రోన్లను నాటో సభ్య దేశాలకు మాత్రమే అందించింది. ఒకవేళ భారత్‌కు ఈ డ్రోన్లు అందితే, వీటిని పొందిన తొలి నాటోయేతర దేశంగా భారత్ నిలుస్తుంది’’ అని రాహుల్ చెప్పారు.

రాహుల్ బేడీ చెప్పినదాని ప్రకారం, ఈ డ్రోన్‌లను కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని భారత్ బయటపెట్టినప్పుడు, అమెరికా చాలా ప్రయత్నాలు చేసి వీటిని భారత్‌కు అమ్మడానికి కావల్సిన అనుమతులు పొందింది.

డ్రోన్

ఫొటో సోర్స్, GA-ASI.COM

చాలా ఖరీదైన వ్యవహారం

ఈ డ్రోన్ల ధర, నిర్వహణ ఖర్చు గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఈ డ్రోన్లను కొనడం, వాటిని నిర్వహించడం రెండూ చాలా ఖరీదైన వ్యవహారమని నిపుణులు అంటున్నారు.

నిఘా విషయానికి వస్తే ఇవి ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రోన్లని రాహుల్ బేడీ అన్నారు. అదే సమయంలో ఒక ముఖ్యమైన ప్రశ్నను ఆయన లేవనెత్తారు.

"వేల కోట్లు ఖరీదు చేసే ఈ డ్రోన్‌లను తీసుకొచ్చి, వాటిని ఎక్కడ వాడతారు? ఈ డ్రోన్‌లను ఆపరేట్ చేయడం చాలా ఖరీదైన వ్యవహారం. వాటికి సంబంధించిన ప్రతీదీ చాలా ఖర్చుతో కూడుకొని ఉంటుంది. వీటిని పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడుతున్నవారిపై ఉపయోగించవచ్చా? పదుల సంఖ్యలోని తీవ్రవాదుల కోసం ఇంత ఖరీదైన మిషన్లను వాడటం అసాధ్యం. నిఘా కోసం మినహాయించి ఈ డ్రోన్లను ఇంకా దేనికోసం వాడవచ్చో నాకు తెలియదు. వీటిని చైనాతో సరిహద్దులో వాడితే, చైనా కూడా దీటుగా స్పందిస్తుంది. పాకిస్తాన్ సరిహద్దు వద్ద వాడితే భారత్‌కు అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమవుతుంది.

అమెరికా పరికరాల వల్ల ఏర్పడే ఇబ్బంది ఏంటంటే, వాటిని ఆపరేట్ చేయడం, నిర్వహించడం చాలా ఖరీదైన వ్యవహారం ’’ అని ఆయన వివరించారు.

మోదీ, బైడెన్

ఫొటో సోర్స్, Getty Images

రెండు దేశాల పెరుగుతున్న రక్షణ సహకారం

భారత్ ఇటీవలి సంవత్సరాలలో అమెరికా నుంచి అనేక ముఖ్యమైన రక్షణ పరికరాలను కొనుగోలు చేసింది. రెండు దేశాల మధ్య రక్షణ సహకారం పెరిగింది.

గత కొన్నేళ్లలో అమెరికా నుంచి భారత్ 22 అపాచి అటాక్ హెలికాప్టర్లు, 15 చినూక్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్లు, 10 సీ-17 గ్లోబ్ మాస్టర్ 3 ట్రాన్స్‌పోర్ట్ విమానాలు, P8ఐ సముద్ర నిఘా విమానం, ఎం 777 హొవిట్జర్ ఆర్టిలరీ గన్‌లను కొనుగోలు చేసింది.

అమెరికా నుంచి ఎంక్యూ 9 డ్రోన్లను కొనుగోలు చేయడం చాలా మంచిది అని భారత వైమానిక దళ రిటైర్డ్ కమోడోర్ ప్రశాంత్ దీక్షిత్ అన్నారు.

ఈ ఒప్పందం భారతదేశ సైనిక ఆధునీకరణ కార్యక్రమానికి సహాయపడుతుందా? అని అడగగా ఆయన అవునని సమాధానం చెప్పారు.

హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా పెంచేందుకు 2020లో అమెరికా నుంచి భారత్ రెండు ఎంక్యూ 9 డ్రోన్‌లను లీజుకు తీసుకుంది. ఈ డ్రోన్‌లు తమిళనాడులోని రాణిపేట్ జిల్లా అరక్కోణం దగ్గర్లో ఉన్న భారత నౌకా దళ ఎయిర్‌స్టేషన్ ఐఎన్‌ఎస్ రాజాలి వద్ద మోహరించారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ డ్రోన్ల లీజు 2024 నాటికి ముగుస్తుంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)