మోదీ పర్యటన: అమెరికాతో వాణిజ్యంలో భారత్ త్వరలోనే చైనాను దాటేస్తుందా?

బైడెన్, మోదీ

ఫొటో సోర్స్, REUTERS/ELIZABETH FRANTZ

ఫొటో క్యాప్షన్, బైడెన్, మోదీ
    • రచయిత, జుబైర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్-అమెరికా మధ్య ఆర్ధిక సంబంధాలు శరవేగంగా వృద్ధి చెందున్నాయని జూన్ 23న వైట్‌హౌస్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు.

"గత దశాబ్దంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం రెండింతలు పెరిగి $191 బిలియన్ల (సుమారు రూ.15 లక్షల కోట్లు )కు పైగా ఉంది" అని ఆయన చెప్పారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ‘‘భారత్‌-అమెరికా మధ్య వాణిజ్యం,పెట్టుబడుల్లో భాగస్వామ్యం ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా కీలకం’’ అని అన్నారు.

మోదీ పర్యటన సందర్భంగా జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)సంస్థలు ఎఫ్ 414 జెట్ ఇంజిన్‌ను సంయుక్తంగా భారత్‌లో తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఇంజిన్‌ యుద్ధ విమానాలలో ఉపయోగిస్తారు.

ఎంక్యూ -9బి అనే ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి జనరల్ అటామిక్స్‌తో ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది భారతదేశపు నిఘా వ్యవస్థలను పటిష్ట పరుస్తుంది. ముఖ్యంగా చైనా సరిహద్దుల్లో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఈ డ్రోన్ క్షిపణులను కూడా మోసుకెళ్లగలదు.

"భారతదేశంలో కొత్త సెమీ కండక్టర్ నిర్మాణ, పరీక్షా సదుపాయాల ఏర్పాటు కోసం మైక్రాన్ టెక్నాలజీ అనే సంస్థ $825 మిలియన్ల( సుమారు రూ.6700 కోట్లు ) వరకు పెట్టుబడులతో ముందుకు రావడాన్ని నాయకులు స్వాగతించారు" అని తరువాత విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటన పేర్కొంది.

"మా ఆర్థిక, వాణిజ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేయడానికి యుఎస్-ఇండియా ట్రేడ్ పాలసీ ఫోరమ్‌ కృషితో సహా గత రెండు సంవత్సరాలుగా ద్వైపాక్షిక భాగస్వామ్యం ఫలితంగా నేటి ఒప్పందం జరిగింది" అని యూఎస్ వాణిజ్య ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

మోదీ

ఫొటో సోర్స్, MICHAEL REYNOLDS/EPA-EFE/REX/SHUTTERSTOC

ఫొటో క్యాప్షన్, జిల్ బైడెన్, మోదీ, జో బైడెన్

కంపెనీలతో సమావేశాలు

అమెరికా పర్యటన సందర్భంగా డజన్ల కొద్దీ అమెరికన్ వ్యాపారవేత్తలు, కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. టెస్లా హెడ్ ఎలాన్ మస్క్, అడోబ్ సిస్టమ్స్ సీఈఓ శంతను నారాయణ్, వీసా సీఈఓ ర్యాన్ మెక్‌నెర్నీ, మాస్టర్ కార్డ్ సీఈఓ మైకేల్ మేబ్యాక్, కోకా-కోలా సీఈఓ జేమ్స్ క్విన్సీ లాంటి వారు వీరిలో ఉన్నారు.

కెన్నెడీ సెంటర్‌లో జరిగే మోదీ కార్యక్రమానికి 1,500 మందికి పైగా ఆహ్వానాలు వచ్చాయి. ఇందులో కొన్ని ప్రముఖ కంపెనీల సీఈఓలు, వ్యాపారవేత్తలు ఉన్నారు.

ప్రధాని మోదీ అమెరికా పర్యటనను ఓ మైలురాయిగా పలువురు నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇటీవల ఇరుదేశాల మధ్య రక్షణ సంబంధాలు, సాంకేతిక రంగంలో భాగస్వామ్యం బలపడినా, ద్వైపాక్షిక వాణిజ్యంలో పెద్దగా ఏమీ జరగలేదని, అయితే వాటిని ముందుకు తీసుకెళ్తామని ఇరు దేశాల నేతలు చెప్పారు.

అమెరికా చైనా వాణిజ్య సంబంధాలు

2000లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కృషితో 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో చైనా చేరిన ఘటనను మోదీ-బైడెన్ భేటీ, ఇటీవల కుదిరిన ఒప్పందాలు గుర్తుకు తెస్తున్నాయి.

చైనా డబ్ల్యూటీఓలో చేరితే, అత్యధిక జనాభా కలిగిన దేశంతో అమెరికా సంబంధాలను మెరుగుపడటమే కాక, స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా అమెరికా ప్రయోజనాలు కూడా నెరవేరతాయని క్లింటన్ భావించారు.

అప్పట్లో ఈ చర్యను పలువురు ఎంపీలతోపాటు, కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించాయి. అయితే చైనాలో పెట్టుబడులు పెట్టి భారీ లాభాలు ఆర్జించే అవకాశాలపై దేశంలోని బడా కంపెనీల సీఈఓలు అప్పట్లో చాలా ఉత్సాహంగా ఉండేవారు.

క్లింటన్ ప్రయత్నాలు చైనా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మారడానికి, ప్రపంచంలోనే నంబర్ వన్ ఎగుమతిదారుగా కావడానికి సహాయపడింది. కానీ, ఆయన కోరుకున్నట్లుగా చైనా తన విదేశాంగ విధానాన్ని మార్చుకోలేదు.

ఇక ఈనాటి విషయానికి వస్తే అమెరికాకు అతిపెద్ద ప్రత్యర్థిగా చైనా ఆవిర్భవించింది. చైనాకు సాయం చేయడం ద్వారా అమెరికాకు నేరుగా సవాల్ విసరగలిగే ఒక భూతాన్ని ఆయన సృష్టించారని క్లింటన్‌ను విమర్శించే అంటున్నారు.

ఈసారి మోదీ అమెరికా పర్యటన విషయంలో అమెరికా భారత్‌కు ముక్తకంఠంతో స్వాగతం పలికినట్లు కనిపించింది. మరి చైనా మాదిరిగానే, రాబోయే 10-15 సంవత్సరాలలో అమెరికా ఆర్థిక, వ్యాపార, రాజకీయ భాగస్వామ్యంతో చైనాలాగే భారతదేశం కూడా ఆర్థిక శక్తిగా మారగలదా?

షీజిన్‌పింగ్, బైడెన్

ఫొటో సోర్స్, REUTERS/KEVIN LAMARQUE

ఫొటో క్యాప్షన్, షీజిన్‌పింగ్, బైడెన్

భారతదేశ ప్రాధాన్యాలేంటి?

అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో అప్లైడ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న స్టీవ్ హెచ్. హాంకే ఈ అంశంపై మాట్లాడారు. ఆయన మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌కు ఆర్థిక సలహాదారుల మండలిలో కూడా పనిచేశారు.

"వాణిజ్యం రెండు దేశాల సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఇక భూతాలంటారా, అవి వేరే చోట నుంచి పుట్టుకొస్తాయి’’ అన్నారు.

ప్రొఫెసర్ హర్ష్ వి.పంత్ కూడా దీనిపై మాట్లాడారు. ఆయన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌‌కు చెందిన ఫారిన్ పాలసీ విభాగంలో వైస్‌ చైర్మన్‌గా పని చేస్తున్నారు. అమెరికాకు భారత్ సవాల్‌గా మారే రోజు దగ్గర్లో లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ప్రస్తుతం భారతదేశపు ఆందోళన చైనా గురించే. రాబోయే 10-20 సంవత్సరాలలో చైనా స్థానం ఎక్కడికీ పోదు. అలాగే భారతదేశం సమీప భవిష్యత్తులో అమెరికాను సవాల్ చేసే స్థితికి వెళ్లే పరిస్థితి చాలా తక్కువ. భారత్‌కు దేశీయ అభివృద్ధి మొదటి ప్రాధాన్యత. రాబోయే 20 సంవత్సరాలపాటు దాని దృష్టి అంతా అక్కడే ఉంటుంది" అన్నారాయన.

కానీ మున్ముందు అమెరికాను భారత్ సవాల్ చేయగలదా?

‘‘భారతదేశం మరింత అగ్రస్థానానికి చేరినా, అది అమెరికాను సవాల్ చేస్తుందని చెప్పలేం. పైగా, అమెరికా శక్తి కూడా గతంతో పోలిస్తే కొంత వరకు తగ్గింది. భారత్‌తో జతకట్టడం ఆ దేశానికి కూడా అవసరం’’ అన్నారు హర్ష్ పంత్.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో కూడా భారత ఆర్ధిక వ్యవస్థ బలాన్ని మోదీ నొక్కి చెప్పారు.

‘‘నేను ప్రధానమంత్రిగా (2014లో) మొదటిసారి అమెరికాను సందర్శించినప్పుడు, భారతదేశం ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. నేడు భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలోనే భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. మాది కేవలం అభివృద్ధి కాదు, వేగవంతమైన అభివృద్ధి’’ అన్నారు.

రెండు సంవత్సరాల కిందట చైనాను వదిలి భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది అమెరికా. అంటే భారతదేశంతో వాణిజ్య లావాదేవీల విషయంలో అమెరికా చైనాను అధిగమించింది.

వస్తువులు, సర్వీసులతో సహా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఏడాది 190 బిలియన్( సుమారు రూ. 15 లక్షల కోట్లు) డాలర్లుగా ఉంది. కేవలం వస్తు వ్యాపారం గురించి చెప్పాలంటే దాని విలువ 130 బిలియన్(రూ. 10 లక్షల కోట్లు) డాలర్లు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గత ఏడాది చైనా, అమెరికా మధ్య పరస్పర వాణిజ్యం విలువ 700 బిలియన్ డాలర్లు( సుమారు రూ. 57 లక్షల కోట్లు).

భారత్-అమెరికా మధ్య ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యం విలువ చైనా-అమెరికా భాగస్వామ్యపు విలువను చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని ఇక్కడ అర్ధం చేసుకోవాల్సి ఉంది. అయితే, 2030 నాటికి భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వస్తు,సేవల వాణిజ్యం 500-600 బిలియన్‌ డాలర్లకు( సుమారు రూ. 40 నుంచి 50 లక్షల కోట్లు) చేరుకుంటుందని గత ఏడాది వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చాలా పెద్ద లక్ష్యం. రెండు దేశాల మధ్య సంబంధాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వ్యాపార సంబంధాల పురోగతికి అడ్డంకిగా మారుతున్న అనేక ఉద్రిక్తతలు, విభేదాలు ఉన్నాయి.

అమెరికాలో భారత సంతతి ప్రజలు

ఫొటో సోర్స్, REUTERS/KEVIN LAMARQUE

ఫొటో క్యాప్షన్, అమెరికాలో భారత సంతతి ప్రజలు

వాణిజ్య విభేదాల కథ

అమెరికా-భారత్ మధ్య వాణిజ్యం పెరగడంతో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు కూడా పెరిగాయి. ట్యాక్సులు, విదేశీ పెట్టుబడులపై పరిమితులు, వ్యవసాయ విధానాల విషయంలో చాలాకాలంగా భారత్, అమెరికాలు ఒకదానితో ఒకటి విభేదించుకుంటున్నాయి.

అమెరికాలో మేథో సంపత్తి హక్కులు గత 30 సంవత్సరాలుగా భారత్‌ను ఇబ్బంది పెడుతుండగా, వైద్య పరికరాలు, డిజిటల్ ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఇటీవలే పుట్టుకొచ్చాయి.

డోనాల్డ్ ట్రంప్ కాలంలో అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య లోటుపై దృష్టిపెట్టడం, కొత్త టాక్సుల విధింపుతో మరింత గందరగోళం పెరిగింది. దీనికి నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా ప్రతీకారం తీర్చుకుంది.

ఇక చారిత్రాకంగా అంతర్జాతీయ వ్యవహారాలలో రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను దెబ్బతీసింది.

ప్రొఫెసర్ హర్ష్ పంత్ అభిప్రాయం ప్రకారం, రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య విభేదాలు "అంత తేలికగా పరిష్కరించేవి కావు. అవి అలాగే ఉంటాయి. ఎందుకంటే అనేక విధాలుగా మన పరిశ్రమను, వాణిజ్యాన్ని అనేక రంగాలలో రక్షణాత్మక ధోరణిలో నిర్వహిస్తుంటాం. అమెరికా కూడా తన ప్రయోజనాలను కాపాడుకోవాలనుకుంటోంది’’ అని అన్నారు.

అయితే, భారత్ అమెరికాలు తమ మధ్య ఉన్న వాణిజ్య విభేదాలను మోదీ కాలంలో చాలా వరకు సర్దుకుంటాయని ప్రొఫెసర్ స్టీవ్ హెచ్. హాంకే అభిప్రాయపడ్డారు.

జూన్ 22న ఇరువురు నేతల మధ్య చర్చల అనంతరం డబ్ల్యూటీఓలో పెండింగ్‌లో ఉన్న ఆరు వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసులు డబ్ల్యుటీఓ కోర్టులో నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవడానికి ఇరు దేశాలు సిద్ధమయ్యాయి.

మొత్తమ్మీద అమెరికా ఇప్పుడు చైనాకు బదులు కొత్త భాగస్వామిని వెతుక్కుంటోంది. ఆ భాగస్వామి భారత్ రూపంలో ఎదురు చూస్తోంది. యూఎస్‌లో భారత మాజీ రాయబారి మీరా శంకర్ మాట్లాడుతూ "చైనా ప్రమాదం నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను విముక్తి చేయడానికి యుఎస్ కొత్త ప్రయత్నిస్తోంది. కాబట్టి, ఇండియా అమెరికా కలిసి పనిచేయడానికి ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నాను" అన్నారు.

వీడియో క్యాప్షన్, భారత్‌తో సంబంధాలకు అమెరికా ఎందుకంత ప్రాధాన్యమిస్తోంది?

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)