ఈ ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌లో విక్రయించే వస్తువులు ప్రమాదకరమని అమెరికా ఎందుకంటోంది? వీగర్ ముస్లింలతో తయారుచేయించినందుకేనా

ఫొటో సోర్స్, TEMU
చైనీస్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ‘టెము’ వివాదంలో చిక్కుకుంది. ఆ సైట్‌లో విక్రయించే ఉత్పత్తులు "అత్యంత ప్రమాదకరం" అని అమెరికా చట్టసభ సభ్యులు హెచ్చరిస్తున్నారు.
వీగర్ ముస్లింలతో బలవంతంగా పనిచేయిస్తూ తయారుచేసిన వస్తువుల దిగుమతిని నిరోధించే 2021 అమెరికా చట్టం ప్రకారం కొనసాగుతున్న దర్యాప్తులో ఈ వాదనలు బయటికొచ్చాయి.
అంతేకాకుండా నైక్, అడిడాస్, షీన్‌లపైనా దర్యాప్తు జరుగుతోంది.
మరోవైపు థర్డ్-పార్టీ విక్రేతలు తమ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తే దానికి బాధ్యత వహింలేమని టెము తెలిపింది.
ఈ ఆన్‌లైన్ రిటైలర్ దుస్తులు, బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ సహా అనేక రకాల వస్తువులను విక్రయిస్తుంది.
దీనిపై టెము కంపెనీని బీబీసీ సంప్రదించగా వెంటనే స్పందించలేదు.
దీనికి చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం పిండ్యుయోడ్యుయో మద్దతునిస్తోంది. అమెరికాలో ఏడాది క్రితం ప్రారంభమై అధిక ప్రజాదరణ పొందింది ఈ సంస్థ.
అంతర్జాతీయ విస్తరణలో భాగంగా టెము ఇటీవల బ్రిటన్, యూరప్‌లో తన కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది.
ఈ యాప్‌లో వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉంటాయని చెప్తారు. ఈ ఆన్‌లైన్ విక్రేతకు 80,000 కంటే ఎక్కువ సరఫరాదారులున్నారు.
అంతేకాకుండా క్రమం తప్పకుండా ఆపిల్ యాప్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్స్ అయిన వాటిలో ఇది ఒకటి.

ఫొటో సోర్స్, Getty Images
2021లో అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్‌గా అవతరణ
గత నెలలో అమెరికాలో దాని అమ్మకాలు ప్రత్యర్థి ఫాస్ట్-ఫ్యాషన్ రిటైలర్ షీన్‌ను మించిపోయాయని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. దీంతో ఇది 2021లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్- రిటైలర్‌గా అవతరించింది.
"టెము కోసం నిర్బంధ కార్మికులతో పనిచేయించుకునే ప్రమాదం చాలా ఎక్కువ ఉందని అమెరికన్ వినియోగదారులు తెలుసుకోవాలి" అని హౌస్ సెలెక్ట్ కమిటీ తన నివేదికలో ఆరోపించింది.
"వీగర్ ఫోర్స్‌డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఎఫ్ఎల్పీఏ)కి అనుగుణంగా ఉండేలా టెముకు ఎలాంటి వ్యవస్థ లేదు.
ఇది కార్మికులతో బలవంతంగా తయారు చేయించిన ఉత్పత్తులను టెము ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తున్నాయనే దానిని ధ్రువీకరిస్తోంది" అని కమిటీ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
రెండు దేశాల్లో ఉద్రిక్తతలు, వేల కోట్ల పన్నులు
రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో చైనా తయారీ ఉత్పత్తుల పరిశీలనపై అమెరికా దృష్టి పెంచింది.
డోనల్డ్ ట్రంప్ అమెరికా అద్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది.
ఇది రెండు దేశాల్లో వేల కోట్ల రూపాయల మేర సుంకాలు పెరగడానికి కారణమైంది.
వాటిలో చాలా పన్నులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.
గతంలో కొన్ని చిప్ టెక్నాలజీలపై చైనా యాక్సెస్‌ను తగ్గించాలని అమెరికా ప్రయత్నించింది.
రూ. 65 వేలు కంటే తక్కువ విలువగల ప్యాకేజీలను కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయించే ప్రస్తుత అమెరికా చట్టం ద్వారా షీన్, టెము లాంటి కంపెనీల వేగవంతమైన వృద్ధికి సహాయపడిందని అమెరికా గతంలో ఆందోళనలను లేవనెత్తింది .
ఈ రెండు సంస్థలు ప్రతిరోజు అమెరికాకు రూ. 65 వేలు కంటే తక్కువ విలువైన దాదాపు 6,00,000 ప్యాకేజీలు రవాణా చేస్తాయని ఒక రిపోర్టు తెలిపింది.
షీన్, టెములకు చెందిన ఇలాంటి తక్కువ విలువగల ప్యాకేజీలు రోజువారీ మొత్తం ప్యాకేజీల్లో 30 శాతం కంటే ఎక్కువ ఉంటాయని అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి
- తెలంగాణ ‘అమరుల’ స్మారకం: 3 ఎకరాల ప్రాంగణంలో ‘త్యాగాల దివ్వె’.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం
- సోయం బాపూరావు - ఎంపీల్యాడ్స్: ఈ నిధులతో ఎంపీలు సొంత ఇల్లు కట్టుకోవచ్చా? 9 సందేహాలు, సమాధానాలు
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- భారత్, అమెరికాలు మాట్లాడుకోని ఆ ఒక్క విషయం
- మణిపుర్: వందల చర్చిలను ధ్వంసం చేశారని క్రైస్తవ సంఘాల ఆరోపణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














