టైటాన్ సబ్‌మెర్సిబుల్: సముద్ర గర్భంలోని జలాంతర్గామిని ఆకాశంలో ఎగిరే విమానం ఎలా కనిపెడుతుంది?

P-8 పోసిడాన్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, P-8 పోసిడాన్‌
    • రచయిత, మార్క్ పైసింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అట్లాంటిక్ సముద్రంలో గల్లంతైన టైటాన్ సబ్‌మెర్సిబుల్‌ను వెతకడానికి పలు విమానాలు, నిఘా సాంకేతికత సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఇంతకీ అవి ఎలా పని చేస్తాయి?

టైటాన్ సబ్‌మెర్సిబుల్ ఈ వారం అట్లాంటిక్‌ మహాసముద్రంలో అదృశ్యమైంది. దీంతో దాని జాడ కోసం పలు విమానాలు సముద్రంలో గాలిస్తున్నాయి .

అమెరికా కోస్ట్‌గార్డ్ కెనడియన్ P-3 విమానం బుధవారం నీటి అడుగున శబ్దాలను గుర్తించిందని ప్రకటించింది. ఆ సిగ్నల్‌పై దర్యాప్తు చేస్తున్నామని, దానిపై విశ్లేషణ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

అయితే, సముద్రపు అలలపై ఎగురుతున్న విమానం నీటి అడుగున ఉన్న వస్తువును ఎలా గుర్తించగలదు?

సబ్‌మెర్సిబుల్‌‌ను వెతకడం వైమానిక దళంలోని అతిపెద్ద, అత్యంత సాంకేతికతో కూడిన అధునాతన విమానాల ప్రత్యేకమైన పని.

సముద్రం కింద జలాంతర్గాములను గుర్తించడానికి ఈ మెషీన్లలో శబ్దాలను గుర్తించే సెన్సార్లు అమర్చి ఉంటాయి.

ఈ శోధన ప్రక్రియ సాధారణంగా విమానం, జలాంతర్గాముల మధ్య పిల్లి, ఎలుక ఆటలాంటిది. అయితే, ఇక్కడ పరిస్థితి వేరు.

ఈ వైమానిక రెస్క్యూ బృందానికి అధునాతన కొత్త సాంకేతికత అందుబాటులో ఉండటం వారికి ప్రయోజనాన్ని ఇస్తుంది.

అయితే, 3.8 కిలోమీటర్ల లోతులో టైటానిక్ శిథిలాలు ఉన్న చోట అదృశ్యమైన సబ్‌మెర్సిబుల్ కనుగొనడం చాలా కష్టంగా మారింది.

సముద్రం

ఫొటో సోర్స్, Getty Images

సోనార్‌లు ఎలా పనిచేస్తాయి?

జలాంతర్గామి జాడ తెలుసుకునే ప్రయత్నంలో బుధవారం సముద్రపు నీటిలో ఒక శబ్దాన్ని గుర్తించింది నాలుగు-ఇంజిన్ల టర్బోప్రాప్ పీ-3 ఓరియన్.

1962లో ఇది తన సేవలను ప్రారంభించింది. పీ-3 ఓరియన్ 'లాక్‌హీడ్ ఎలక్ట్రా ఎయిర్‌లైనర్‌'పై ఆధారపడుతుంది.

విమానం నుంచి సోనార్ బోయ్‌లను నీటిలో వేసిన తర్వాత ఒక శబ్ధాన్ని విన్నది పీ-3 ఓరియన్. నీటి ఉపరితలంపై ప్రవహించే సోనార్‌లు ప్రకృతి చేయలేని శబ్దాలను వింటాయి.

ఇది 30-నిమిషాల వ్యవధిలో ఒక సాధారణ చప్పుడు శబ్దాన్ని విన్నది. ఆ శబ్దాలు మానవులే చేస్తున్నారని నిపుణులు సూచిస్తున్నారు.

ఆ శబ్దాలు 30 నిమిషాల దూరంలో ఉండటం మంచి సంకేతమని బ్రిటన్‌లోని కీలే యూనివర్సిటీలో ఫోరెన్సిక్ జియోసైన్స్‌లో రీడర్ అయిన జామీ ప్రింగిల్ అంటున్నారు.

''నౌక ప్రొపెల్లర్ నిరంతరాయంగా పనిచేస్తుంది. ధ్వని నీటిలో చాలా దూరం ప్రయాణిస్తుంది. మీరు ఖచ్చితమైన ధ్వని స్థానం పొందడానికి మూడు స్టాటిక్ బోయ్‌లు (త్రిభుజాకారంలో) అవసరం" అని జామీ ప్రింగిల్ చెప్పారు.

లాక్‌హీడ్ P-3 ఓరియన్‌లో మాగ్నెటిక్ అనోమలీ డిటెక్టర్లు ఉంటాయి.

ఇవి భూ అయస్కాంత క్షేత్రంలో లోహ జలాంతర్గామి వల్ల ఏర్పడే చిన్నచిన్న శబ్దాలను గుర్తిస్తాయి.

డిటెక్టర్లను అమర్చిన విమానాన్ని లోహం పరిధిలో ఎగురవేస్తే, అది దానిని గుర్తిస్తుంది.

టైటానిక్ వంటి పెద్ద ఉక్కుతో కూడిన ఓడ శిథిలాల ఉనికి కారణంగా ఈ సాంకేతికతను ఉపయోగించడం కష్టతరం కానుంది.

గస్తీ నౌకలు

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

రంగంలోకి అధునాతన గస్తీ నౌకలు

అయితే, జలాంతర్గామిని వెతకడంలో పాల్గొన్న విమానం P-3 మాత్రమే కాదు.

అట్లాంటిక్‌ను జల్లెడ పట్టే ఇతర విమానాలలో C-130 హెర్క్యులస్, కొత్త బోయింగ్ P-8 పోసిడాన్‌లు కూడా ఉన్నాయి.

వీటిని ప్రపంచంలోనే అత్యంత అధునాతన సముద్ర గస్తీ నౌకలుగా పిలుస్తారు.

పోసిడాన్ సుపరిచితం ఎందుకంటే ఇది బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం నుంచి వచ్చింది.

పోసిడాన్ (2,250 కి.మీ) పరిధి P-3 విమానం (9,000 కిమీ ) కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఇది 12,000ft (3,660 మీటర్ల) ఎత్తుకు, చాలా వేగంగా ఎగురుతుంది.

సబ్‌మెర్సిబుల్ లేని చోట పని చేయడానికి పోసిడాన్ ఎయిర్‌క్రూ గ్రిడ్ నమూనాను ఉపయోగిస్తుంది.

ఇది జలాంతర్గామిని ట్రాక్ చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటైన సోనో బోయ్ ఫీల్డ్స్ ఉపయోగిస్తుంది.

ఎయిర్ పారాచూడ్ మల్టీస్టాటిక్ యాక్టివ్ కోహెరెంట్ (ఎంఏసీ) బోయ్‌లు ఎక్కువ కాలం కొనసాగడానికి, వాటి శోధనా పరిధిని విస్తరించడానికి అధిక సంఖ్యలో సోనార్ తరంగాలను ఉత్పత్తి చేస్తాయి.

జలాల్లో శత్రువులతో జరిగే యుద్దాలలో వాడే రహస్య ప్రణాళికల్లో ఇటువంటి బోయ్‌ల అమరిక ఒకటి. ఒక P-8 పోసిడాన్‌ 120కి పైగా బోయ్‌లను మోహరించగలదు.

జలాంతర్గామి

ఫొటో సోర్స్, OCEANGATE

జలాంతర్గామిని కనుగొనడం ఎందుకు కష్టమవుతోంది?

ఈ సోనో బోయ్‌ ఫీల్డ్స్‌తో పాటు పోసిడాన్ అకౌస్టిక్ సెన్సార్, సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్)తో సహా మొత్తం సాంకేతికతను ఉపయోగిస్తుంది.

ఇది ఉపరితలంపై ఉన్న సబ్‌మెర్సిబుల్‌లను గుర్తించడానికి, వర్గీకరించడానికి, ట్రాక్ చేయడానికి,పెరిస్కోప్‌లను చాలా దూరంలో గుర్తించడానికి ఉపయోగపడుతుంది .

ఎలక్ట్రానిక్ సపోర్ట్ మెజర్ (ఈఎస్ఎం)ని విద్యుదయస్కాంత సెన్సార్‌గా ఉపయోగిస్తుంది. ముఖ్యంగా రాడార్ ఉద్గారాల స్థానాలను ట్రాక్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.

డీజిల్ ఎలక్ట్రిక్ మిలిటరీ సబ్‌మెరైన్‌ల ఉనికిని పసిగట్టడానికి హైడ్రోకార్బన్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉపయోగపడుతుంది.

మాగ్నెటిక్ అనోమలీ డిటెక్షన్‌ను సమర్థవంతంగా ఉపయోగించడానికి పోసిడాన్ చాలా ఎత్తులో ఎగురుతుంది.

దానికి బదులుగా డిటెక్టర్‌లతో కూడిన యూఏవీలు (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్) సోనో బోయ్ ట్యూబ్‌ల నుంచి ప్రయోగించడానికి అభివృద్ధి అవుతున్నాయి.

మారనిది ఏంటంటే అత్యాధునిక విమానాల కోసం కూడా పాత-కాలపు తెలివితేటలపై ఆధారపడటం.

"అత్యంత ప్రభావవంతంగా ఉండాలంటే జలాంతర్గామిని కనుగొనడానికి P-8కి ముందుగా దాని స్థానం, దిశ గురించి అవగాహన అవసరం" అని బ్రిటన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్, రాయల్ యునైటెడ్ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూట్ (ఆర్‌యూఎస్ఐ)లో రీసెర్చ్ ఫెలో అయిన సిద్ధార్థ్ కౌశల్ అంటున్నారు.

సైనిక శోధనలో సిగ్నల్స్, ఉపగ్రహ చిత్రాలు, వ్యక్తులతో మాట్లాడటం, సముద్ర ఉపరితలం మీద ఉండే హైడ్రోఫోన్ నెట్‌వర్క్‌ల నుంచి సేకరించిన సమాచారం ఆధారపడదగ్గవి.

కానీ, అదృశ్యమైన టైటాన్ జలాంతర్గామి విషయంలో ఇలాంటి ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి.

పోసిడాన్ అత్యంత ముఖ్యమైన సామర్థ్యాలలో ఒకటి, దానిని ఓరియన్ నుంచి వేరు చేసేది ఓడల నెట్‌వర్క్, సెన్సార్-అమర్చిన యూఏవీ, అన్‌క్రూవ్డ్ సర్ఫేస్ వెసెల్స్ (యూఎస్వీ)ల మధ్యలో కమ్యూనికేషన్ హబ్‌, నోడ్‌గా పని చేయగల సామర్థ్యం.

ఈ నెట్‌వర్క్ శక్తి వల్ల పోసిడాన్ వంటి విమానాల రాకతో సముద్రం పారదర్శకంగా మారే శకానికి నాంది పలుకుతుందని, నీటిలో జలాంతర్గాములను రహస్యంగా దాచడం అసాధ్యమని కొంతమంది విశ్లేషకులు భావించేలా చేసింది. అయితే ఓరియన్స్, పోసిడాన్ సాంకేతికతలు, సామర్థ్యాలు తమదే పైచేయి ఉన్నట్లుగా అనిపించినా వాటికి పరిమితులు ఉన్నాయి.

టైటానిక్

ఫొటో సోర్స్, Getty Images

ఎలాంటి పరిస్థితుల్లో జలాంతర్గామి కనుగొనలేం?

సోనార్ తరంగాలకు నీటిలో వేర్వేరు ఉష్ణోగ్రత, లవణీయత పొరలతో ఇబ్బందులు పడవచ్చు. వీటి కింద సబ్‌మెర్సిబుల్‌ను దాచవచ్చు.

మాగ్నెటిక్ (అయస్కాంత) డిటెక్షన్ టెక్నాలజీ పరిధి తక్కువ ఉంటుంది. ఇది భూమికి, విమానానికి దగ్గరగా ఉన్న సబ్‌మెర్సిబుల్‌లను మాత్రమే గుర్తిస్తుంది.

సముద్రంలో శబ్దం వచ్చే ప్రాంతంలో దాగి ఉండటం ద్వారా సబ్‌మెర్సిబుల్‌ కూడా గుర్తించకుండా నివారించవచ్చు.

P-8 పోసిడాన్‌ ప్రపంచంలోనే అత్యంత అధునాతన శోధనా యంత్రం (సబ్ హంటర్) కావచ్చు.

అయితే పోసిడాన్ వంటివి ఇంకా ఏ ప్రాంతాల్లో సరిగ్గా చూడాలో తెలుసుకోవాలని ఇండిపెండెంట్ డిఫెన్స్ అనలిస్ట్ హెచ్ఐ సుట్టన్ బీబీసీతో చెప్పారు.

నిజానికి సబ్‌మెర్సిబుల్‌ను కనుగొనడం కూడా అదృష్టానికి సంబంధించిన ప్రశ్నే. అదృశ్యమైన టైటాన్ నుంచి వచ్చే శబ్దాలను గుర్తించినట్లు చెప్పింది 60 ఏళ్ల P-3 ఓరియన్ అని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)