తెలంగాణ: కేసీఆర్ లక్ష్యం మారిందా? బీజేపీని వదిలి కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం వెనుక కారణం ఏమిటి

ఫొటో సోర్స్, facebook
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
2022 ఆగస్టు 25… రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం హైదరాబాద్ శివారులోని కొంగరకలాన్‌లో జరిగింది.
ఆ రోజు బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ..
‘‘ఇవాళ మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి.
మనకు పంటలు పండే తెలంగాణ కావాలా.. మతపిచ్చితో మంటలు లేచే తెలంగాణ కావాలా.. ఏం కావాలి..
పంటల తెలంగాణనా.. మంటల తెలంగాణనా..’’ అని అన్నారు.
దానికి ‘‘పంటల తెలగాణ’’ అనే సమాధానాన్ని సభికుల నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు.

ఫొటో సోర్స్, BRS Party/face book
ఆ తర్వాత నిజామాబాద్ సహా కొన్ని చోట్ల జరిగిన సభల్లోనూ కేసీఆర్ నోటి నుంచి ఇవే మాటలు వచ్చాయి.
తర్వాత మంత్రి కేటీఆర్ సైతం ఇవే మాటలను ఎక్కువగా తన ప్రసంగంలో ప్రస్తావించేవారు.
కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా.. ఒకట్రెండు నెలల కిందట వరకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీనే టార్గెట్‌గా ఉండేది.
కానీ, కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో కీలక మార్పు కనిపిస్తోంది.
రెండు వారాల కిందట జోగులాంబ గద్వాల కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ లక్ష్యంగా కేసీఆర్ విమర్శలు సాగాయి.
బీజేపీని విమర్శించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు.
‘‘మూడేళ్లు నేను కష్టపడి ఇంత మంచి ‘ధరణి’ని తయారు చేస్తే కాంగ్రెస్ పార్టీ వారు దాన్ని బంగాళాఖాతంలో వేస్తామంటున్నారు.
నేను ఎక్కడ అడిగినా ధరణి ఉండాలనే ప్రజలు చెబుతున్నారు. ధరణి తీసేస్తమన్న కాంగ్రెస్ పార్టీకి మీరే బుద్ధి చెప్పాలి’’ అంటూ కేసీఆర్ ప్రసంగం సాగింది.
తర్వాత జరిగిన సభల్లోనూ కేసీఆర్ కాంగ్రెస్‌నే లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇంతకుముందు.. ఇంకా చెప్పాలంటే మూడు, నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీపై విమర్శల విషయంలో కేసీఆర్ సహా బీఆర్ఎస్ కీలక నేతలెవరూ సరిగా పట్టించుకున్నది లేదు.
ఆ పార్టీ తమకు ప్రత్యర్థి కాదన్నట్లుగా ధోరణి ఉండేది.
ఇప్పుడు ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు కేసీఆర్‌కు, బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ లక్ష్యంగా మారింది.

ఫొటో సోర్స్, INCKARNATACKA/FACEBOOK
మలుపు తిప్పిన కన్నడ రాజకీయం
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలం ఉందనేది కాదనలేని సత్యం.
కానీ, హుజూరాబాద్, దుబ్బాక, ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బీజేపీ బలం పుంజుకుందనే వాదన వినిపించింది.
నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ పోటీ ఇచ్చినా, మళ్లీ మునుగోడుకు వచ్చేసరికి బీజేపీ నుంచే బీఆర్ఎస్‌కు పోటీ ఎదురైంది.
అందుకే బీజేపీనే బీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకునేది.
కానీ, కర్ణాటక ఎన్నికల తర్వాత మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణలో రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో సరికొత్త ఉత్తేజం వచ్చిందని చెప్పారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్.
‘‘కర్ణాటక ఎన్నికలు ఒక మలుపుగా చెప్పవచ్చు. దీన్ని కాంగ్రెస్ పార్టీ మున్ముందు ఎంతవరకు వినియోగించుకోగలదనే చూడాలి. కర్ణాటక ఫలితాలు కేవలం తెలంగాణలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పునరాలోచనలో పడేలా చేశాయి. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇదే తరహాలో ఉంటే ఎలా..? అనే అనుమానం కలిగేలా చేశాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత సంపూర్ణ మెజార్టీ రాకపోతే బీజేపీకి ప్రాంతీయ పార్టీలు కీలకం. అందుకే ఇప్పుడు ప్రాంతీయ పార్టీలతో స్నేహం కోసం చూస్తోందన్న ప్రచారం ఉంది. తెలంగాణ వంటి చోట్ల శక్తియుక్తులు పెడితే ఉపయోగం లేదనే అభిప్రాయం కూడా బీజేపీకి ఉండొచ్చు. దీనివల్ల కొంత దూకుడు తగ్గించింది. ఇదంతా ఒక భావనే మాత్రమే... వాస్తవమేమిటనేది తెలియాలి. తెలంగాణ కాంగ్రెస్ లో అనైక్యత, కేసీఆర్ తో సమర్థంగా ఢీకొట్టే నాయకత్వం వంటి సమస్య ఉన్నప్పటికీ సంప్రదాయకరంగా కాంగ్రెస్ అనేది తెలంగాణలో ప్రధాన పార్టీగా ఉంది.
అందుకే కేసీఆర్ తన వ్యూహం కాంగ్రెస్ వైపు మళ్లించారని అనుకోవచ్చు.’’ అని కె.శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
తెలంగాణ రాజకీయ పరిస్థితులపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ కె.శ్రీనివాసులు బీబీసీతో మాట్లాడారు.
‘‘కర్ణాటకలో బీజేపీ అపజయం అనేది సిద్ధాంతపరమైనదిగా చెప్పొచ్చు.
పౌరహక్కులు, మేధావులు, సాహిత్య సంఘాలు బీజేపీని ఓడించాయనే వాదన ఉంది.
తెలంగాణలోనూ పౌర సమాజం సంస్థలు ఉండేవి. అవి యాక్టివ్‌గా పనిచేస్తే కర్ణాటక వంటి పరిస్థితి తెలంగాణలో రావొచ్చు అని బీఆర్ఎస్ భావిస్తుందని చెప్పవచ్చు.
కర్ణాటకలో వచ్చిన మార్పు ప్రభావం తెలంగాణలో ఉంటుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుండవచ్చు.
దీనికి కారణం చాలా వర్గాలలో చాపకింద నీరులా అసంతృప్తి ఉంది. అది కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది.
ఇప్పటికిప్పుడు కాకపోయినా కాంగ్రెస్ కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ కాంగ్రెస్‌కు లాభిస్తుంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, DHARANI
రెండు పార్టీలకు ధరణినే లక్ష్యం
ధరణి పోర్టల్‌ను 2020 అక్టోబరు 29న కేసీఆర్ ప్రారంభించారు.
భూముల సమస్యలు తీర్చే ప్రధాన ఉద్దేశంతో పోర్టల్‌ను తీసుకువచ్చినప్పటికీ, సాంకేతికంగా సమస్యలు ఇంకా వేధిస్తూనే ఉన్నాయి.
ఇప్పడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ధరణి కేంద్రంగానే విమర్శలు సాగుతున్నాయి.
అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని కాంగ్రెస్ చెబుతుండగా.. అలాంటి వారిని బంగాళాఖాతంలో పడేయాలని కేసీఆర్ ప్రతి విమర్శలు చేస్తున్నారు.
బీజేపీ మాత్రం అధికారంలోకి వస్తే ధరణిలో మార్పులు చేస్తామని చెబుతోంది.
‘‘తెలంగాణలో గానీ, కేంద్రంలో గానీ గత తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు.
ఆ పార్టీని పాలనపరమైన విధానాలపై లేదా నిధులు ఇవ్వడం లేదని విమర్శించడానికి బలమైన కారణాలు కేసీఆర్ వద్ద లేవనే చెప్పాలి.
అందుకే ధరణి వంటివి ప్రధాన అజెండాగా మారుతోందని చెప్పవచ్చు’’ అని కె.శ్రీనివాస్ అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/TELANGANACMO
జాతీయ రాజకీయాలపై అప్పుడే..
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశంతో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు కేసీఆర్.
మహారాష్ట్రలో పార్టీ విస్తరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత వారంలో నాగ్‌పుర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభించారు.
అయితే, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నాలు కొద్దిరోజులుగా కాస్త నెమ్మదించాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదే విషయంపై దిల్లీలోని సీనియర్ జర్నలిస్టు ఎ. కృష్ణారావు బీబీసీతో మాట్లాడారు.
‘‘ప్రస్తుతం కేసీఆర్‌కు తొమ్మిదేళ్ల పాలనపరమైన వ్యతిరేకత ఉంటుంది. దాన్ని అధిగమించడంతో కాంగ్రెస్‌తో ఎన్నికల్లో పోరాడాలి.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయే తప్ప తగ్గే అవకాశాలు తక్కువ.
ప్రస్తుతం జాతీయ రాజకీయాలు అనేవి కేసీఆర్ లక్ష్యం కాకపోవచ్చు.
కేసీఆర్ ఫోకస్ తెలంగాణలోనే ఉంటుంది. మరోవైపు కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లోని నాయకులు ఏకతాటిపైకి వచ్చి మాట్లాడటం గమనిస్తున్నాం.
కొందరు నాయకులు బీజేపీలోకి కాకుండా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
అన్నింటి కంటే ఫైనాన్షియల్‌గా ఇబ్బంది ఉండకపోవచ్చు.
వీటిని పరిగణనలోకి తీసుకుంటే సహజంగానే కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని చెప్పవచ్చు’’ అని ఎ. కృష్ణారావు చెప్పారు.

ఫొటో సోర్స్, BANDI SANJAY KUMAR / TWITTER
గత ఎన్నికలతో పోల్చితే మార్పు
ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లలో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.
బీఆర్ఎస్(అప్పుడు టీఆర్ఎస్) 119 సీట్లలో పోటీ చేసి 88 సీట్లలో గెలిచింది. ఆ పార్టీ 46.87 శాతం ఓట్లు సాధించింది.
బీజేపీ 117 సీట్లలో పోటీ చేసి.. కేవలం గోషామహల్ సీటు గెలుచుకుంది. 6.98 శాతం ఓట్లను సాధించింది.
కాంగ్రెస్ పొత్తుల కారణంగా 99 సీట్లలోనే పోటీ చేసింది. 19 సీట్లలో గెలిచింది. 28.43శాతం ఓట్లు పొందింది.
తర్వాత వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలలో చాలావరకు మార్పు కనిపించింది.
2020 డిసెంబరులో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీగా మారాయి.
బీఆర్ఎస్ పార్టీకి 56 సీట్లు వచ్చాయి. ఓట్ల శాతం 35.81శాతానికి పడిపోయింది. అంతకుముందు ఎన్నికలతో పోల్చితే ఓట్ల శాతం 8.04శాతం పడిపోయింది.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు సాధించింది. 35.56శాతం ఓట్ల శాతం సాధించింది. అంతకుముందు ఎన్నికలతో పోల్చితే 25.22శాతం ఎక్కువ.
ఏఐఎంఐఎం పార్టీ తరఫున 44 మంది కార్పొరేటర్లు గెలిచారు. అంతకుముందు 2016లో జరిగిన ఎన్నికలతో పోల్చితే 2.91శాతం ఓట్ల శాతం పెంచుకుని 18.76శాతం ఓట్లను సాధించింది.
అలాగే ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయాలు సాధించారు.
అలాగే నాగార్జున సాగర్‌లో నోముల భరత్, మునుగోడులో ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది జూన్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని లేఖ ఇచ్చారు.
అప్పట్నుంచి కాంగ్రెస్ బాగా బలహీనపడిందనే వాదన తెలంగాణలో వినిపిస్తోంది. తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడం కాంగ్రెస్‌ను మరింత ఇరుకున పడేసింది.
ఈ పరిణామాలతో బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది.
ఒకానొకదశలో 2023లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఎన్నికలు జరుగుతాయన్న వాదన బలంగా వినిపించింది.
కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికలతో సీను మారిందనే విశ్లేషకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికాలో యోగా ఎందుకంత పాపులర్ అయింది? అమెరికా ప్రెసిడెంట్లు, పాప్స్టార్లు కూడా యోగాకు ఎలా ఆకర్షితులయ్యారు?
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- హంటర్ బైడెన్: పన్ను ఎగవేసినట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడి కొడుకు
- టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లి సముద్ర గర్భంలో మిస్సయిన తండ్రీ కొడుకులు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది?
- ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














