పార్టీలకు జాతీయ హోదా ఎలా ఇస్తారు? దాని వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి?

ఫొటో సోర్స్, ANI
కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం దేశంలో రాజకీయ పార్టీల గుర్తింపునకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ పార్టీగా ఈసీ గుర్తింపును ఇచ్చింది.
దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉండటంతో పాటు గుజరాత్, గోవాల్లో భారీగా ఓట్లు సాధించడంతో ఆప్‌కు జాతీయ హోదా ఇస్తున్నట్లు తెలిపింది.
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లకు ఉన్న జాతీయ పార్టీ హోదాను ఈసీ రద్దు చేసింది.
ఈ మేరకు సోమవారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మార్పుల తర్వాత దేశంలో ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి. అవి బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).

మరోవైపు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీ హోదాను ఈసీ తొలగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
రాష్ట్ర పార్టీ హోదాను నిలబెట్టుకునేందుకు అవసరమైన అర్హతలను ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్ సంపాదించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
యూపీలో ఆర్‌ఎల్‌డీ, మణిపూర్‌లో పీడీఏ, పుదుచ్చేరిలో పీఎంకే, పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌ఎస్పీ, మణిపూర్‌లో ఎంపీసీకి రాష్ట్ర పార్టీ హోదాను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతం దేశంలో 56 రాష్ట్ర పార్టీలు, 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీగా నమోదు అయి, గుర్తింపు పొందని పార్టీలు వందల సంఖ్యలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయంటే..
- ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)- సీపీఎం
- బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)
- నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)
- ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)

ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీలు:
మూడు రాష్ట్రాలు:
- తృణమూల్ కాంగ్రెస్ (బెంగాల్, త్రిపుర, మేఘాలయ)
- కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (కేరళ, మణిపూర్, తమిళనాడు)
- జనతా దళ్ సెక్యులర్ (కర్ణాటక, కేరళ, అరుణాచల్ ప్రదేశ్)
- జనతా దళ్ యునైటెడ్ (బిహార్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్)
రెండు రాష్ట్రాలు:
- తెలుగుదేశం (ఆంధ్ర, తెలంగాణ)
- అన్నా డిఎంకె (తమిళనాడు, పుదుచ్ఛేరి)
- డిఎంకె (తమిళనాడు, పుదుచ్ఛేరి)
- లోక్ జన శక్తి రామ్ విలాస్ (బిహార్, నాగాలాండ్)
- నాగా పీపుల్స్ ఫ్రంట్ (మణిపూర్, నాగాలాండ్)
- ఎన్సీపీ (మహారాష్ట్ర, నాగాలాండ్)
- ఆర్జేడీ (బిహార్, ఝార్ఖండ్)
ఏదో ఒక రాష్ట్రంలోనే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీలు:
- భారత రాష్ట్ర సమితి (ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు తొలగించారు.)
- యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైయస్సార్సీ) (2014 ఎన్నికల్లో తెలంగాణలో ఉండేది. 2019 తరువాత పోయింది)
- ఎంఐఎం
మరో 42 పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి. జనసేనకు ఇంకా గుర్తింపు రాలేదు.

ఫొటో సోర్స్, ECI/FB
జాతీయ పార్టీగా, రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే వచ్చే ప్రయోజనాలు
గుర్తు: పార్టీ గుర్తు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటుంది. ఏ రాష్ట్రంలో పోటీ చేసిన ఆ పార్టీ గుర్తు వేరొకరికి ఇవ్వరు. అలాగే సదరు జాతీయ పార్టీ పోటీలో ఉన్న చోట, అదే గుర్తు గతంలో వేరే పార్టీకి ఇచ్చి ఉన్నా, ప్రాధాన్యత మాత్రం జాతీయ పార్టీకే ఇస్తారు.
ఉదాహరణకు జనసేనకు గుర్తింపు లేదు. అయినప్పటికీ ఉమ్మడి గుర్తుగా గాజు గ్లాసు వాడుతున్నారు. ఒకవేళ గాజు గ్లాసు గుర్తు కలిగిన ఏదైనా జాతీయ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయాలి అనుకుంటే అప్పుడు గాజు గ్లాసు గుర్తు సదరు జాతీయ పార్టీకే ఇస్తారు.
సైకిల్ గుర్తు ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీకి, ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఉంది. ఒకవేళ తెలుగుదేశం, లేదా సమాజ్ వాదీ జాతీయ పార్టీ హోదా సాధిస్తే సైకిల్ గుర్తులో ప్రాధాన్యత ముందుగా జాతీయ హోదా సాధించిన వారికి ఇస్తారు.
ఓటర్ల జాబితా ఉచితం: ఓటర్ల జాబితా సవరించేప్పుడు ఎన్నికల సంఘం నుంచి రెండు సెట్ల ఓటర్ల జాబితా ఉచితంగా ఇస్తారు. ఎన్నికల సమయంలో ఒక సెట్ ఉచితంగా ఇస్తారు. (ఇది గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలకు కూడా ఉంది)
ప్రస్తుతం పార్టీల దగ్గర డబ్బు బాగా ఉంటోంది కానీ ఒకప్పుడు రోజులు వేరు. అలాగే పెద్దగా డబ్బు ఖర్చు చేయలేని పార్టీల వారూ ఉండేవి. దీంతో ఎన్నికల సంఘం నుంచి ఉచితంగా జాబితా తీసుకోవడం కూడా ఒక పెద్ద విషయంగా, ఒక ప్రివిలైజ్ గా ఉండేది. కాకపోతే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిన తరువాత ఈ ప్రయోజనంపై పెద్దగా ఎవరికీ ఆసక్తి లేదు.
దూరదర్శన్ లో ఫ్రీ యాడ్ టైమ్: ఎన్నికల సమయం ప్రజా ప్రసార వ్యవస్థ అంటే భారతదేశంలోని ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా తమ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఉచితంగా చేసుకోవచ్చు. అందుకోసం పార్టీల వారీగా సమయం కేటాయిస్తారు. ఎన్నికల ముందు ప్రతీ పార్టీకి కొన్ని గంటల చొప్పన ఉచిత సమయం ఇస్తే, ఆ సమయంలో ఆ పార్టీ వారి ఇంటర్వ్యూలు లేదా ఇతరత్రా వీడియోలు, ఆ పార్టీ కార్యక్రమాల గురించి చెప్పుకోవచ్చు. గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలకు కూడా ఈ అవకాశం ఉంది కానీ, రాష్ట్ర పార్టీల కంటే జాతీయ పార్టీలకు ఎక్కువ సమయం ఇస్తారు.
స్టార్ క్యాంపెయినర్ల ఖర్చు: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పెట్టే ఖర్చుపై చాలా రూల్స్ ఉంటాయి. అభ్యర్థులంతా ఎన్నికల సంఘానికి తాము పెట్టిన ఖర్చు లెక్కలు ఇవ్వాలి. అందులో తేడా వస్తే ఎమ్మెల్యే, ఎంపీల పదవులు పోతాయి కూడా. అయితే ప్రతి పార్టీకి సంబంధించి కొంతమంది పెద్ద లీడర్లను స్టార్ కాంపైనర్లుగా గుర్తిస్తారు. ఆ స్టార్ కాంపైనర్లు ఏదైనా నియోజకవర్గానికి వెళితే పెద్ద లీడర్ కాబట్టి సహజంగానే పర్యటన ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. దీంతో అభ్యర్థి ఎన్నికల్లో పెట్టిన ఖర్చు పెరిగిపోతుంది. అలా జరగకుండా జాతీయ పార్టీ హోదా ఉన్న పార్టీలకు చెందిన స్టార్ కాంపైనర్లు ఏ నియోజకవర్గంలో పర్యటించినా ఆ పర్యటన ఖర్చులు సదరు అభ్యర్థి ఎక్కౌంట్లో వేయరు.
40 మంది వరకూ స్టార్ కాంపైనర్లను నియమించుకోవచ్చు.
జాతీయ పార్టీలు తమ కార్యాలయాలు కట్టుకోవడానికి ప్రభుత్వం భూమి ఇస్తుంది.
జాతీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసేప్పుడు మద్దతుగా సంతకాలు పెట్టేవాళ్లు ఒక్కరు ఉన్నా సరిపోతుంది. మిగతా పార్టీలకు ఎక్కువ మంది మద్దతు సంతకాలు కావాలి.

ఫొటో సోర్స్, Getty Images
జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అర్హతలు..
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధన -1968 ప్రకారం ( ఈ నిబంధనను కాలానుగుణంగా మార్చుతున్నారు) చివరగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి.
దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి.
(లేదా)
కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.
(లేదా)
గత సాధారణ ఎన్నికల్లో లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.

ఫొటో సోర్స్, Getty Images
రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే..
ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలను గెలవాలి.
(లేదా)
ఆ రాష్ట్రంలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లతో పాటు ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవాలి.
(లేదా)
ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలవాలి.
(లేదా)
ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 3 శాతం ఓట్లు లేదా మూడు సీట్లు సాధించాలి.
(లేదా)
లోక్‌సభ లేదా శాసనసభలో గత ఎన్నికల్లో ఆ పార్టీకి రాష్ట్రంలో పోలై చెల్లిన ఓట్లలో 8 శాతం ఓట్లు వచ్చి ఉండాలి.
అయితే, ఒక పార్టీ ఒక ఎన్నికల్లో జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే అదే హోదా శాశ్వతంగా ఉండదు.
అంటే, ఎన్నికల తరవాత పార్టీలు తమ గత హోదాను కలిగి ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది.
దీనివల్లే జాతీయ పార్టీల సంఖ్య, రాష్ట్ర స్థాయి పార్టీల సంఖ్య మారే అవకాశం ఉంటుంది.
రిజిస్టర్డ్ పార్టీలు...
జాతీయ, రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించలేని పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా పరిగణిస్తారు.
కొత్తగా స్థాపించిన పార్టీ ఒక రాష్ట్ర శాసన ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలి.
50 కంటే తక్కువ నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాలు అయితే కనీసం 5 స్థానాల్లో పోటీ చేయాలి.
20 కంటే తక్కువ లోక్‌సభ స్థానాలు ఉంటే కనీసం 2 స్థానాల్లో పోటీ చేయాలి.
ఇవి కూడా చదవండి:
- అమెరికా ‘టాప్ సీక్రెట్’ డాక్యుమెంట్లను ఎవరు, ఎందుకు లీక్ చేశారు?
- మిషన్ వాత్సల్య: తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం, దరఖాస్తుకు 15వ తేదీ వరకు గడువు
- ఆమెను టీనేజీలోనే కిడ్నాప్ చేశారు, రూ. 51 వేలకు అమ్మేశారు, పాత షెడ్డులో అత్యంత దీనంగా..
- ముసిరి: మసాలా దినుసులకు పేరుగాంచిన ఈ దక్షిణాది రేవు పట్టణం ఎలా మాయమైంది?
- ఐపీఎల్- ఇంపాక్ట్ ప్లేయర్: ఈ కొత్త ఆప్షన్ రిజర్వు ఆటగాళ్లకు వరంలా ఎలా మారింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














