మార్కాపురం పలకలు: వీటినే దేశమంతటా ఉపయోగించేవారు... ఈ పరిశ్రమ ఇప్పుడెందుకు డీలా పడిపోయింది?

- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం అంటే అందరికీ గుర్తుకొచ్చేది పలకల పరిశ్రమ. ఈ పరిశ్రమ ఇప్పుడు మనుగడ కోసం అనేక ప్రయాసలు పడుతోంది.
ప్రజల అభిరుచి మారుతుండటం ఓ కారణమైతే ప్రభుత్వ నిబంధనలు కూడా అందుకు తోడు అవుతున్నాయి.
ముఖ్యంగా క్వారీల నిర్వహణ పెనుభారంగా మారడంతో పలకల తయారీకి ఇప్పుడు ముడిసరుకు కోసం విదేశీ దిగుమతుల మీద ఆధారపడుతున్నారు.
వేల మందికి ఉపాధి కల్పించిన పరిశ్రమలో అనేక యూనిట్లు మూతపడ్డాయి. దాని
ప్రభావం ఉపాధి అవకాశాలతో పాటుగా అనుబంధ రంగాల మీద కూడా పడుతోంది.
మార్కాపురం ముఖచిత్రాన్నే మార్చేసిన పలకల పరిశ్రమ ఇప్పుడు ప్రభుత్వం విధానపరమైన సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తోంది.

పలకల తయారీ ఎలా మొదలైంది?
రెండు దశాబ్దాల క్రితం అక్షరాలు దిద్దేందుకు అందరికీ రాతి పలకలే అవసరం ఉండేది. వాటికి మార్కాపురమే ముఖ్య స్థానంగా ఉండేది.
మార్కాపురం పలకలు కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశమంతటా విస్తరించాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరాయి.
వందేళ్ల క్రితం మార్కాపురం ప్రాంతంలో లభించిన రాతి మీద రాయడానికి అనువుగా ఉండడంతో తొలుత స్థానికులు దానిని పలకగా వాడడం మొదలెట్టారు.
క్రమంగా ఇతరులు కూడా ఇక్కడి రాతిని ఉపయోగించడానికి మొగ్గు చూపడంతో రాతిని తవ్వి పలకలు తయారు చేసే యూనిట్లకు అవకాశం ఏర్పడిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.
1920 నాటికే మార్కాపురంలో పలకల తయారీ జరుగుతున్నట్టు ఆధారాలున్నాయి. మార్కాపురం ప్రాంతంలో రాయి నాణ్యత గురించి బ్రిటిష్ ప్రభుత్వ నివేదికల్లో కూడా ఉందని పరిశ్రమల శాఖ చెబుతోంది.
అంటే ఆనాటికే పలకల పరిశ్రమ పురుడు పోసుకున్నట్టు భావించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఈ పరిశ్రమ క్రమంగా విస్తరించింది. స్థానికంగానే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా మార్కాపురం పలకలకు డిమాండ్ ఏర్పడింది.
దాంతో పలకల తయారీ, దానికి అనుబంధంగా వివిధ రంగాలు ఏర్పడ్డాయి. పలకల తయారీ కేంద్రంగా మార్కాపురం ఎదిగింది. బడికి పోయే పిల్లలు దేశవ్యాప్తంగా ఎక్కడ పలక వాడాలన్నా దాదాపుగా మార్కాపురం పలకలే దిక్కయ్యేవి.
హరియాణా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో కొన్ని పలకలు తయారైనప్పటికీ దేశమంతా అత్యధికులు మార్కాపురం పలకలే వాడేవారు.
పలకల కోసం ఉపయోగించే రాయి మార్కాపురంలోనే లభించడం అందుకు ప్రధాన కారణం.
పలకల గనులు మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లోని తుమ్మలచెరువు, రాయవరం, కలుజువ్వలపాడు, గానుగపెంట, పోతలపాడు, గజ్జలకొండ, మల్లంపేట, పెద్దయాచవరం, నాయుడుపల్లె తదితర గ్రామాల్లో సుమారు 15 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి.
హరియాణాలోని కుంద్ అనే ప్రాంతలో కూడా పలక రాయి లభించినప్పటికీ అక్కడ 3 శాతం వరకు మాత్రమే ఉత్పత్తి జరిగేది.
1980ల నాటికి దేశంలో వినియోగించే పలకల్లో 95 శాతం పైబడి మార్కాపురంలో తయారయ్యేవని జీవీవీ ప్రసాద్ గుప్తా అనే వ్యాపారి బీబీసీకి తెలిపారు.

మార్కాపురానికి పలకలే ఆధారం
ప్రస్తుతం ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతంలో ఉన్న మార్కాపురం నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ సాగునీటి వనరులు నేటికీ నామమాత్రంగానే ఉన్నాయి. అత్యధికంగా మెట్ట పంటలే ఆధారంగా జీవిస్తారు.
అలాంటి ప్రాంతంలో రాతి పలకల వ్యాపారం విస్తరించడంతో వేల మందికి ఉపాధి లభించింది. కేవలం పలకల తయారీలోనే 1980 నాటికి 15వేల మంది వరకు ఉపాధి పొందేవారు.
పలకలకు అనుబంధంగా బోర్డర్ కోసం చెక్క సిద్ధం చేయడం, దానిని అమర్చడం, తయారైన పలకల రవాణా సహా వివిధ రంగాల్లో మరో అయిదు వేల మందికి ఉపాధి లభించేది.
అప్పట్లో నిండా 25వేలు కూడా జనాభా లేని ఓ మోస్తరు పట్టణంలో ప్రతీ ఇల్లు పలకల తయారీ, దాని అనుబంధ రంగాలే ఆధారంగా జీవనం సాగించేవి. పలకల పరిశ్రమ ఆధారంగానే మార్కాపురం కూడా దేశమంతా గుర్తింపు పొందింది.
డిజైన్ పలకలు రాకముందు పూర్తిగా సహజసిద్ధమైన రాతి పలకల తయారీ సాగినకాలంలో దాదాపుగా 200 పరిశ్రమలు ఈ పలకల తయారీలో ఉండేవి.
ప్రస్తుతం అవి 43 వరకు నడుస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంటే ముప్పావు శాతం యూనిట్లు మూతపడ్డాయి.
మెట్ట ప్రాంతంలో వ్యవసాయంలో ఉపాధి లేకపోయినా పలకల పరిశ్రమతో జీవనం సాగించిన అనేక కుటుంబాలు క్రమంగా వివిధ రంగాలకు మళ్లాల్సి వచ్చింది.

2019లో మారిన మైనింగ్ నిబంధనలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో మైనింగ్ నిబంధనలు మార్చింది. లీజుదారులు చెల్లించాల్సిన రాయల్టీ 5 రెట్లు పెరిగింది.
అంతేగాకుండా ఐరన్ ఓర్, గ్రానైట్ సహా ఇతర పెద్ద పెద్ద మైనింగ్ క్వారీలకి, మార్కాపురం పలకల కోసం తవ్వే చిన్న క్వారీలకు ఒకటే నిబంధన వర్తింపజేస్తున్నారు.
క్వారీల అనుమతి కోసం గతంలో చిన్న చిన్న మైన్స్‌కి ఉన్న వెసులుబాటు తొలగించారు. పెద్ద మైన్స్‌తో పాటుగా వివిధ శాఖల అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
ఇలాంటి మార్పులు తమకి సమస్యగా మారాయి అని, ప్రభుత్వం మరోసారి సర్వే చేసి, నిబంధనలు సడలించాలని మార్కాపురం పలకల తయారుదారులు కోరుతున్నారు.

మారిన నిబంధనలతో ఇబ్బందులు
"సహజమైన టైల్స్ సిద్ధం చేసే ప్రాసెస్ పెద్దది. కానీ, ఫోర్సిలిన్ టైల్స్ తక్కువ ధరకే, మార్కెట్‌కి అవసరమైన మేరకు అందుబాటులో ఉంటుంది. దాని వల్ల మాకు డిమాండ్ తగ్గుతోంది.
అదే సమయంలో ఏపీలో మైనింగ్ నిబంధనలు మార్చడం మా పరిశ్రమకు పెను భారంగా మారింది. ఐరన్ ఓర్‌కి, గ్రానైట్‌కి, పలక మైనింగ్‌కి కూడా ఒకటే రూల్ పెట్టేశారు.
దాని మూలంగా సాధారణ మైనింగ్ చేసే మాలాంటి పరిశ్రమలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి.
ఒకేసారి 10 రెట్లు అదనంగా రాయల్టీ కట్టాలి. కుటీర పరిశ్రమల లాంటి మాకు పెద్ద పరిశ్రమల మాదిరి అవకాశం ఉండదు. కాబట్టి ఇబ్బందుల పాలవుతున్నాం" అంటూ మార్కాపురం పట్టణానికి చెందిన వ్యాపారి జీవీవీ ప్రసాద్ గుప్తా బీబీసీకి చెప్పారు.
స్లేట్ మైనింగ్ మీద ఓ సర్వే చేసి ప్రభుత్వం నిబంధనలు మార్చాల్సిన అవసరం ఉందని గుప్తా కోరుతున్నారు. ప్రభుత్వం మైనింగ్ విధానం సవరిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

డిజైన్ స్లేట్స్ వైపు..
రాతి పలకలతో మొదలైన మార్కాపురం ప్రస్థానం ఆ తర్వాత అట్ట, రేకు, ఎనామిల్ ఇలా వివిధ రకాల పలకల వైపు మళ్లింది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా ప్రస్తుతం ఎండీఎఫ్ బోర్డుతో పలకలు తయారుచేస్తున్నారు.
ఇండోనేసియా, మలేసియా వంటి దేశాల నుంచి ఎండీఎఫ్ బోర్డు దిగుమతి చేసుకుంటారు. దాన్ని పలకల సైజుకి అనుగుణంగా కట్ చేస్తారు. తర్వాత దానికి కలర్ కోటింగ్ వేస్తారు. పెయింటింగ్ ఆరిన తర్వాత దానికి ప్లాస్టిక్ బోర్డర్ ఇస్తారు.
ఓ పలక తయారీకి వారం రోజుల ప్రోసెస్ ఉంటుంది. ఆ పలకలు కూడా వివిధ డిజైన్లలో చేస్తున్నారు. కలర్స్, సైజులు కూడా కూడా భిన్నంగా ఉంటున్నాయి.
మొజాయిక్, పింక్, ఆటమ్, మల్టీకలర్ తదితర రంగుల్లో మార్కాపురం పలకల రాయి లభిస్తుంది.
"60, 70 ఏళ్లుగా పలకల తయారీలో మిషన్లు వాడుతున్నారు. రాతి పలకలు సానబట్టడం, బోర్డర్ ఫినిషింగ్ వంటివి మిషన్లతో జరిగేవి. ప్రస్తుతం రాతి పలకలు 2, 3 శాతం మాత్రమే ఉంటున్నాయి.
మార్కాపురం వాళ్లకు ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ కారణంగా ఎనామిల్, బోర్డు, ఎండీఎఫ్ ఇలా పలకలు మారుతున్నా మార్కాపురం నుంచే దేశమంతా వెళుతున్నాయి.
నేటికీ 80 నుంచి 90 శాతం దేశంలోని విద్యార్థులు వాడే పలకలు మార్కాపురం నుంచే. మారుతున్న మార్కెట్ అభిరుచులకు తగ్గట్టుగా పరిశ్రమలో మార్పులు చేసుకుంటూ ముందుకెళుతుండడమే దానికి కారణం" అని బీబీకి చెప్పారు వ్యాపారి చెక్కా సుబ్బారావు.
సర్వశిక్షా అభియాన్‌లో పలకలకు ప్రాధాన్యత ఇవ్వడం కలిసి వచ్చిందని బీబీసీతో అన్నారు. పలకల పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు.

పూర్వ వైభవం రావాలంటే
రాత పలకల విషయంలో మార్కాపురం నేటికీ దేశంలోనే కేంద్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పలకల పరిశ్రమ కారణంగా ఒకప్పుడు మార్కాపురం నుంచి వలస వెళ్లాల్సిన అవసరం రాలేదు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడటానికి పలకల పరిశ్రమలో ఉపాధి తగ్గిపోవడమే కారణమని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు.
"పలకల పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చినట్లుగా, మార్కాపురం పలకలకు మినహాయింపు అవసరం. సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. విద్యుత్ చార్జీలు తగ్గించాలి. ఎగుమతులను ప్రోత్సహించాలి. క్వారీల నిబంధనల్లో మినహాయింపు ఇవ్వాలి. ఎగుమతుల్లో కూడా ఆంక్షలు సడలించాలి. పలకల పరిశ్రమ బాగుంటే ఈప్రాంతంలో వలసలు ఉండవు, కూలీలందరికీ పని ఉంటుంది" అంటూ డిజైన్ స్లేట్ అసోసియేషన్ ప్రెసిడింట్ వెన్నా పోలిరెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ నిబంధనల కారణంగా విధానపరంగా మైనింగ్ అనుమతుల మంజూరులో మార్పు జరిగిందని సంబంధిత అధికారులు అంటున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మారితేనే తదనుగుణంగా చర్యలు ఉంటాయని చెబుతున్నారు.
దీనిపై వివరణ కోసం ఏపీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బీబీసీ సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ‘అమరుల’ స్మారకం: 3 ఎకరాల ప్రాంగణంలో ‘త్యాగాల దివ్వె’.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం
- సోయం బాపూరావు - ఎంపీల్యాడ్స్: ఈ నిధులతో ఎంపీలు సొంత ఇల్లు కట్టుకోవచ్చా? 9 సందేహాలు, సమాధానాలు
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- భారత్, అమెరికాలు మాట్లాడుకోని ఆ ఒక్క విషయం
- మణిపుర్: వందల చర్చిలను ధ్వంసం చేశారని క్రైస్తవ సంఘాల ఆరోపణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














