విశాఖపట్నం: పూర్ణానందస్వామిని ఎందుకు అరెస్ట్ చేశారు...లైంగిక వేధింపులతో పాటు బాలిక చేసిన ఆరోపణలేంటి?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నం వెంకోజి పాలెంలోని జ్ఞానానంద ఆశ్రమ నిర్వాహకులైన పూర్ణానంద సరస్వతి స్వామిని ఎంవీపీ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆశ్రమంలో ఆయన తనపై లైంగిక హింసకు పాల్పడ్డారని ఒక బాలిక విజయవాడలో దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, పూర్ణానంద స్వామిని జూన్ 19, సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
పూర్ణానంద స్వామి 15 ఏళ్ల బాలికను గొలుసులతో బంధించి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని ఎంవీపీ పోలీసులు తెలిపారు.
ఆశ్రమం నుంచి ఎలాగోలా బయటపడిన బాలిక విజయవాడ చేరుకుందని, అక్కడే దిశ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

చిన్నప్పుడే ఆశ్రమానికి..
బాలిక తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో పాప పెద్దమ్మ ఆమెను ఆశ్రమంలో చేర్పించినట్టు తెలుస్తోందని పోలీసులు చెప్పారు.
అలా ఆ బాలిక గత రెండేళ్లుగా ఆశ్రమంలోనే ఉంటోంది.
ఆశ్రమ నిర్వాహకుడైన పూర్ణానంద సరస్వతి బాలికతో ఆవులకు మేత వేయడం, పేడ తీయడం వంటి పనులను చేయించేవారు.
తనపై అత్యాచారం చేసేవారని, రెండేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని బాలిక ఫిర్యాదులో రాసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఫిర్యాదు ఆధారంగానే పూర్ణానందను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
“చాలా రోజులుగా ఆశ్రమ భూములను కొట్టేయాలని కొందరు చూస్తున్నారు. అందులో భాగంగానే అత్యాచార అరోపణలతో నాపై కుట్ర చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాను” అని అన్నారు.

'రోజూ రాత్రి గదికి పిలిచేవారు..'
రెండేళ్లుగా హింస అనుభవిస్తున్నానని ఆ బాలిక తెలిపింది.
“గత రెండేళ్లుగా స్వామిజీ నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. రోజు రాత్రుళ్ళు నన్ను తన గదికి పిలుస్తారు. ఆశ్రమం నుంచి పారిపోయి విశాఖ రైల్వే స్టేషన్ చేరుకుని, విజయవాడకు వెళ్లే ట్రైన్ ఎక్కేశాను. ట్రెయిన్లో ఒక మహిళకు నా బాధంతా చెప్పాను. ఆవిడ సహాయంతో విజయవాడ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాను” అని పూర్ణనంద స్వామిపై ఫిర్యాదు చేసిన బాధిత బాలిక చెప్పింది.
మరో వైపు, జూన్ 13 తేదీ నుంచి తమ ఆశ్రమంలో ఒక బాలిక కనిపించడం లేదని విశాఖలోని ఏంవీపీ పోలీసులకు జూన్ 15న పూర్ణనంద స్వామి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై విచారణ చేపడుతున్న పోలీసులకు బాలిక విజయవాడలో ఉన్నట్లు తెలిసింది.
అదే సమయంలో, ఆమె పూర్ణనంద స్వామిపై దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
“విజయవాడలో నమోదైన కేసు విశాఖకు ట్రాన్స్ ఫర్ చేశారు. ప్రస్తుతం పూర్ణనందపై కేసు నమోదయింది. దర్యాప్తు చేస్తున్నాం” అని ఏంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ మల్లేశ్వరరావు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














