ఫ్రాన్స్: పారిస్ మేయర్ ఇంట్లోకి కారుతో గేటు ధ్వంసం చేస్తూ చొరబడిన నిరసనకారులు... అసలేం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Reuters
ఫ్రాన్స్‌లో నిరసనకారుల ఆందోళనలను అయిదో రోజు కూడా తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. పారిస్ శివార్లలోని నాంటెరె ప్రాంతంలో మంగళవారం నాడు 17 ఏళ్ళ టీనేజర్‌ను పోలీసులు కాల్చి చంపడంతో మొదలైన ఆందోళనలు ఆగకుండా కొనసాగుతూనే ఉన్నాయి.
గత రాత్రి దక్షిణ ప్రాంతంలోని మార్సియెల్ నగరంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోలీసులు దాదాపు 719 మందిని అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు రోజు కూడా వేయికి పైగా ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆందోళనకారులు గత రాత్రి పారిస్ శివార్లలోని మేయర్ ఇంట్లోకి కారుతో దూసుకు వెళ్ళడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పారిస్ కాలమానం ప్రకారం ఈ ఘటన తెల్లవారు జామున 1.30 గంటలకు జరిగింది. ఆ సమయంలో మేయర్ విన్సెంట్ జాన్‌బ్రన్ తన ఆఫీసులో ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఆందోళనకారులు మేయర్ ఇంటి గేటును కారుతో డీకొడుతూ లోపలికి చొచ్చకొచచారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆయన భార్య, ఇద్దరు పిల్లలు పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే నిరసనకారులు వారిపై దాడి చేశారు. మేయర్ భార్య, పిల్లల్లో ఒకరు ఆ దాడిలో గాయపడ్డారు.
“ఇది పిరికిపందలు చేసిన హత్యాయత్నం” అని మేయర్ జాన్‌బ్రన్ అన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆందోళనలను కట్టడి చేసేందుకు శనివారం నాడు దేశమంతటా దాదాపు 45,000 మంది పోలీసులను రంగంలోకి దింపారు. అయితే, అంతకు ముందు రోజులతో పోల్చితే తీవ్రత కొంత తగ్గిందని హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Reuters
ప్రధానంగా, మార్సియెల్ నగరంలో ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అక్కడ పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. 56 మందిని అరెస్ట్ చేశారు. ఇకపోతే, పారిస్ నగరంలో భారీయెత్తున పోలీసులను మోహరించడంతో ఇక్కడ నిరసనలు కొంత తగ్గు ముఖం పట్టాయి.
అయితే, పారిస్ శివార్లలోని లాహెలెస్ రోసెస్‌లోని మేయర్ ఇంట్లోకి నిరసనకారులు కారుతో గేటు ధ్వంసం చేస్తూ లోపలికి చొరబడడం కలకలం రేపింది.
ఆందోళనలను అదుపు చేయడంలో స్థిరచిత్తంతో వ్యవహరించిన పోలీసులను ప్రశంసిస్తూ హోం మంత్రి గెరాల్డ్ డార్మానిన్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














