కూల్‌డ్రింక్స్‌లో వాడే స్వీటెనర్ 'అస్పార్టేమ్' క్యాన్సర్ కారకమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గల్లఘెర్
- హోదా, హెల్త్ కరస్పాండెంట్
వివిధ రకాల ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్‌లో ఉండే స్వీటెనర్ అస్పార్టేమ్ కారణంగా క్యాన్సర్ వచ్చే ముప్పుందని త్వరలో అధికారికంగా ప్రకటించే సూచనలున్నాయి.
క్యాన్సర్ వచ్చేందుకు అవకాశమున్న ఇతర పదార్థాల్లో అలొవెరా (కలబంద), డీజిల్, ఆసియా దేశాల్లో ఎక్కువగా వాడే కూరగాయలతో చేసిన ఊరగాయలు ఉన్నాయి.
ఈ విషయంపై జులై 14న ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్‌సీ) అధికారిక ప్రకటన చేయనున్నట్టు బీబీసీకి తెలిసింది.
అస్పార్టేమ్‌లో ఏముంది?
చక్కెర కంటే 200 రెట్లు తియ్యగా ఉండే అస్పార్టేమ్.. ఎలాంటి క్యాలరీలు లేకుండానే రుచిని అందిస్తుంది.
డైట్ డ్రింక్స్, షుగర్ ఫ్రీ ఫుడ్స్, చూయింగ్ గమ్స్, పెరుగు వంటి పులిసిన ఆహార పదార్థాల్లో అస్పార్టేమ్ వినియోగిస్తారు.
డైట్ కోక్, కోక్ జీరో, పెప్సీ మ్యాక్స్, 7 అప్ ఫ్రీ వంటి డ్రింక్స్‌తో సహా దాదాపు 6 వేల ఆహార పదార్థాల్లో ఈ అస్పార్టేమ్ వాడుతున్నారు.
ఈ స్వీటెనర్‌ను దశాబ్దాలుగా వాడుతున్నారు. ఆహార భద్రత సంస్థల ఆమోదం కూడా ఉంది. అయినప్పటికీ ఇటీవల అస్పార్టేమ్ చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి.
అస్పార్టేమ్, క్యాన్సర్‌ల మధ్య సంబంధంపై చేపట్టిన 1,300 అధ్యయనాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన క్యాన్సర్ పరిశోధనా విభాగం ఐఏసీఆర్ తాజాగా విశ్లేషించింది.
ఈ పరిశోధన చేపట్టిన వారితో తాము మాట్లాడినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. త్వరలోనే అస్పార్టేమ్‌ను క్యాన్సర్ కారక పదార్థంగా గుర్తించే అవకాశముందని తెలిపింది.
అయితే, ఇలా గుర్తిస్తే ఏం జరుగుతుంది?
అస్పార్టేమ్‌పై అధికారిక ప్రకటనను ఐఏఆర్‌సీ చేస్తుంది. అదే సమయంలో ఫుడ్ అడేటివ్స్ ఎక్స్‌పర్ట్ కమిటీ ల్యాన్సెట్ ఆంకాలజీ మెడికల్ జర్నల్‌లో జులై 14న ఒక అధ్యయనం ప్రచురించబోతోంది.
ఆహార పదార్థాలను ఐఏఆర్‌సీ ఇలా వర్గీకరిస్తుంది
- గ్రూప్ 1 – మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యేవి
- గ్రూప్ 2 ఏ – మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉండొచ్చు అనుకునేవి (ప్రాబబుల్)
- గ్రూప్ 2 బీ: మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం (పాసిబుల్) ఉన్నవి
- గ్రూప్ 3: ఏ వర్గానికీ చెందినవి
అయితే, ఇక్కడే గందరగోళం నెలకొనివుంది.
‘‘ఐఏఆర్‌సీ వర్గీకరణతో అస్పార్టేమ్‌తో క్యాన్సర్ ముప్పు ఏ స్థాయిలో ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఐఏఆర్‌సీ వర్గీకరణ లక్ష్యం అదికాదు.’’ అని ఓపెన్ యూనివర్సిటీలోని స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ కెవిన్ మెక్‌కాన్వే చెప్పారు.
ఆ పదార్థానికి వ్యతిరేకంగా ఆధారాలు ఎలా ఉన్నాయో ఈ వర్గీకరణ చెబుతుందని, కానీ, దానితో మీ ఆరోగ్యానికి ముప్పు ఏ స్థాయిలో ఉంటుందో కాదు.
మనుషులు లేదా జంతువులపై చేపట్టిన అధ్యయనాల్లో పరిమిత స్థాయిలో ఆధారాలు లభించినప్పుడు ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉండొచ్చని (పాసిబుల్) అని చెబుతారు. డీజిల్, నికెల్, కలబంద, ఆసియాలో కనిపించే ఊరగాయలు, కొన్ని రసాయనాలు ఈ వర్గంలోకి వస్తాయి.
‘‘అయితే, ఈ పదార్థాలు క్యాన్సర్‌కు కారణం అవుతాయని కచ్చితంగా సాక్ష్యాధారాలు ఉండకపోవచ్చు. వీటిని 1 లేదా 2 ఏ గ్రూపులో పెట్టొచ్చు.’’ అని ప్రొఫెసర్ మెక్‌కాన్వే చెప్పారు.
గతంలోనూ ఐఏఆర్‌సీ వర్గీకరణలతో ఇలానే గందరగోళం నెలకొంది. బాగా ప్రాసెస్ చేసిన ఎర్రని మాంసాలను క్యాన్సర్ కారకాలుగా పేర్కొనడంతో, దీన్ని చాలా మంది ధూమపానంతో పోల్చారు.
అయితే, రోజూ తీసుకొనే ఆహారానికి అదనంగా 100 మందికి 50 గ్రాముల పంది మాంసాన్ని రోజూ ఇవ్వడంతో వారిలో ఒకరికి మాత్రమే పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
అస్పార్టేమ్ విషయంలో ఇలాంటి వివరాలు స్పష్టంగా చెప్పే అధ్యయనాలు లేవు.
అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నిపుణుల కమిటీ ఈ నెలలోనే దీనిపై నివేదికను వెల్లడించే అవకాశముంది.
మీ శరీర బరువులో ప్రతి కేజీకి రోజుకు 40 మిల్లీగ్రాముల వరకూ అస్పార్టేమ్‌ను తీసుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజా వార్తలపై ద ఇంట్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ బేవరేజెస్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేట్ లోట్‌మన్ స్పందించారు.
‘‘ఈ విషయంలో అధికారులు కాస్త అప్రమ్తంగా ఉండాలి. ఎందుకంటే దీని వల్ల అస్పార్టేమ్ లాంటి ప్రత్యామ్నాయాలకు బదులుగా ఎక్కువ మంది చక్కెరను తీసుకునే ముప్పుంది.’’ అని పేర్కొన్నారు.
యూకే ఫుడ్ స్టాండార్ట్స్ ఏజెన్సీ డిప్యూటీ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ రిక్ మంఫోర్డ్ స్పందిస్తూ.. ‘‘ఈ స్వీటెనర్‌ల ముప్పును ఇక్కడి నిపుణుల కమిటీలు పర్యవేక్షించాయి, పరిమితంగా తీసుకోవడంతో ఎలాంటి ముప్పు లేదని వీటిలో నిర్ధారించారు. అయితే, తాజాగా వస్తున్న వార్తలను మేం జాగ్రత్తగా గమనిస్తున్నాం.’’అని చెప్పారు.
2000 ప్రారంభంలో ఈ విషయంలో ఎలుకలపై చేపట్టిన పరిశోధనల్లో అస్పార్టేమ్ క్యాన్సర్‌కు కారణం కావొచ్చని తేలింది. అయితే, మిగతా జంతువులపై చేపట్టిన అధ్యయనాల్లో ఈ విషయం రుజువుకాలేదని నిపుణులు చెప్పారు.
ఆ తర్వాత 1,05,500 మంది మనుషులపై మరో అధ్యయనం సాగింది. దీనిలో అస్పార్టేమ్ భారీగా తీసుకుంటే క్యాన్సర్ ముప్పు ఉంటుందని, అయితే, ఇక్కడ ఇతర ఆరోగ్య సమస్యలు, జీవన శైలి కూడా ప్రభావం చూపించొచ్చని దీనిలో వెల్లడైంది.
ఈ విషయంపై ఇంటర్నేషనల్ స్వీటెనర్స్ అసోసియేషన్‌కు చెందిన ఫ్రాన్సెస్ హంట్-వుడ్ స్పందిస్తూ.. ‘‘ఎక్కువ పరిశోధనలకు కేంద్రమైన ఆహార పదార్థాల్లో అస్పార్టేమ్ కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా 90కిపైగా దేశాల్లో ఆహార పరిశోధన సంస్థలు ఇది సురక్షితమైనదని తేల్చాయి.’’ అని చెప్పారు.
అయితే, కొంతమంది అస్పార్టేమ్ తీసుకోకూడదు. వీరిలో ఫెనిల్‌కీటోన్యూరియా లాంటి వ్యాధులతో బాధపడేవారు ఉంటారు, వీరు అస్పార్టేమ్‌ను జీర్ణించుకోలేరు.
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















