కతీజా బీబీ: 'దాదాపు 10 వేల డెలివరీలు చేశాను... అన్నీ సాధారణ ప్రసవాలే, ఒక్కరు కూడా చనిపోలేదు'

కతీజా

ఫొటో సోర్స్, kathija

    • రచయిత, ప్రమీలా కృష్ణన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

''నేను దాదాపు 10 వేల డెలివరీలు చేశాను. అన్నీ కూడా సాధారణ ప్రసవాలే, ఒక్క బేబీ కూడా చనిపోలేదు'' అని తన 33 ఏళ్ల కెరీర్ గురించి తమిళనాడు చెందిన నర్సు కతీజా బీబీ చెప్పారు.

భారతదేశం అధిక మాతాశిశు మరణాలు ఉన్న దేశం నుంచి ప్రపంచ సగటుకు దగ్గరగా చేరుతున్న సమయమది.

చిన్న కుటుంబాల్లో ఆడపిల్ల పుట్టడాన్ని బహుమతిగా స్వాగతించే మనస్తత్వాలను చూశారామె.

1990లో కేరళలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగం ప్రారంభించిన సమయంలో కతీజా గర్భవతి.

''నేను ఏడు నెలల గర్భిణిని, అయినా కూడా ఇతర మహిళలకు సాయం చేశాను. నేను డెలివరీ అయిన రెండు నెలలకే తిరిగి విధుల్లో చేరా. మహిళలు ప్రసవానికి వచ్చినపుడు ఎంత ఆత్రుతగా ఉంటారో నాకు తెలుసు, వారిని సుఖంగా, నమ్మకంగా ఉంచడం నా మొదటి ప్రాధాన్యత" అంటున్నారు కతీజా.

నర్సు కతీజా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు.

ఆమె క్లినిక్ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి దక్షిణంగా 150 కి.మీ దూరంలో గల విల్లుపురం పట్టణంలో ఉంది.

ఈ చిన్న దవాఖానలో సిజేరియన్ చేసేందుకు సరిపడా సౌకర్యాలు లేవు. కాబట్టి గర్భిణీకి ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా ఆసుపత్రికి పంపుతారు కతీజా.

కతీజా

ఫొటో సోర్స్, kathija

తల్లి నుంచి వారసత్వం

తల్లి జులేఖా కతీజాకు ప్రేరణ. ఆమె గ్రామ మంత్రసాని.

“నేను చిన్నప్పుడు ఇంజెక్షన్ సిరంజీలతో ఆడుకునేదాన్ని. అలాగే ఆసుపత్రి పరిసరాలకు అలవాటుపడ్డాను'' అని చెప్పారు కతీజా.

గ్రామంలోని పేదలకు, అంతగా చదువుకోని మహిళలకు ఆరోగ్య సౌకర్యాలు కల్పించడంలో తన తల్లి కృషి ఎంతటిదో చిన్న వయసులోనే కతీజాకు అర్థమైంది.

ఆ రోజుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు చాలా తక్కువ. పేదలైనా, ధనిక మహిళలైనా ప్రసవం కోసం రాష్ట్ర ప్రసూతి గృహాలపైనే ఆధారపడే వారు. వాటినే ఇపుడు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలంటున్నాం.

"నేను కెరీర్ ప్రారంభించినప్పుడు ఒక డాక్టర్, ఏడుగురు సహాయకులు, మరో ఇద్దరు నర్సులు ఉన్నారు. మొదట్లో పని చాలా ఎక్కువగా ఉండేది. నా పిల్లలను పట్టించుకోవడానికి కూడా సమయం దొరికేది కాదు. కుటుంబ కార్యక్రమాలకూ హాజరు కాలేకపోయేదాన్ని. కానీ ఆ రోజులు నాకు చాలా అనుభవాన్ని ఇచ్చాయి, చాలా నేర్పించాయి" అని గుర్తుచేసుకున్నారు కతీజా.

1990లో భారతదేశంలో ప్రసూతి మరణాల రేటు 10,000 జననాలకు 556 మరణాలుగా ఉండేది. శిశు మరణాల రేటు ప్రతి వెయ్యికి 88 గా ఉండేది.

ప్రస్తుతం ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో ప్రసూతి మరణాల రేటు 10,000 జననాలకు 97గా ఉంది. శిశు మరణాల రేటు ప్రతి 1,000కి 27గా ఉంది.

ఈ పురోగతికి ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ, మహిళల్లో అక్షరాస్యత రేటు పెరగడానికి కారణమని కతీజా భావిస్తున్నారు.

కతీజా ఈ మార్పులన్నింటికీ క్రియాశీల కారకంగా ఉన్నారు. భారతదేశంలో పెరుగుతున్న జననాల రేటును ఆమె ప్రత్యక్షంగా చూశారు.

కతీజా రోజుకు ఒకరు లేదా ఇద్దరికి డెలివరీ చేస్తుంటారు. అయితే, ఆమె ఒత్తిడితో కూడిన రోజులను కూడా గుర్తుంచుకుంటారు.

కతీజా బ్యాచ్ మేట్స్

ఫొటో సోర్స్, kathija

ఫొటో క్యాప్షన్, కతీజా శిక్షణ సమయంలో బ్యాచ్‌మేట్స్

''నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే''

“2000 మార్చి 8వ తేదీ నా జీవితంలో అత్యంత ఒత్తిడితో కూడిన రోజు. '' అని చెప్పారు కతీజా.

ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కతీజా క్లినిక్‌కి వెళ్లినప్పుడు పలువురు ఆమెను అభినందిస్తున్నారు.

''అదే సమయంలో ఇద్దరు మహిళలు ప్రసవ వేదనతో నా కోసం ఎదురుచూస్తున్నారు. వారికి ప్రసవం చేయించాను. తర్వాత మరో ఆరుగురు మహిళలు మా క్లినిక్‌కి వచ్చారు.'' అని కతీజా చెప్పారు .

కతీజాతో అప్పుడు ఒక అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు, కానీ ఆ ఒత్తిడి అంతా మరిచిపోయారు ఆమె.

“ఆ రోజు నేను ఇంటికి వెళ్లడానికి సిద్ధమైనపుడు, పిల్లల ఏడుపు శబ్దం వినిపించింది. ఇది అత్యంత అందమైన విషయం. మా ఆరోగ్య కేంద్రంలో ఓ భారీ గుంపు ఉంది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.'' అని ఆమె అన్నారు.

కతీజా చేసిన డెలివరీల్లో 50 జతల కవలలు ఉన్నారు, ఒకరికి ముగ్గురు పుట్టారు.

90వ దశకం ప్రారంభంలో ఒక మహిళ పెరిగిన పొత్తి కడుపుతో క్లినిక్‌కి వచ్చింది. ఆమె చాలా బాధలో ఉంది. తనకు కవల పిల్లలు ఉన్నారని కతీజా భావించారు.

క్లినిక్‌లో అప్పుడు అల్ట్రాసౌండ్ స్కానర్ లేదు.

“మొదటి బిడ్డకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే మరో బిడ్డకు జన్మనిచ్చింది” అని కతీజా అన్నారు.

అయితే పరికాలన్నీ శుభ్రం చేయడానికి వెళ్లగా, ఆ మహిళ మళ్లీ నొప్పితో కేకలు వేయడం ప్రారంభించారు.

“అప్పుడు నేను చాలా ఒత్తిడికి లోనయ్యా. నాకది కొత్త. నేను అంతలా సిద్ధం కాలేదు. పరిస్థితులను పరిశీలిస్తే ఆ మహిళను జిల్లా ఆసుపత్రికి పంపించడం సాధ్యం కాదు'' అని ఆమె గుర్తుచేసుకున్నారు.

దీంతో మొదట కతీజా నొప్పులతో బాధపడుతున్న గర్భిణి తల, వీపును మర్ధనా చేసి, ఆమెను శాంతింపజేశారు. అనంతరం ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చింది.

కతీజా 10 వేల మంది శిశువుల డెలివరీ చేసినట్లు జిల్లా యంత్రాంగం కూడా ధృవీకరించింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు కతీజా.

కతీజా

ఫొటో సోర్స్, kathija

ఫొటో క్యాప్షన్, కతీజా

ఆడపిల్ల పుడితే కన్నీళ్లు పెట్టుకునేవారు..

ధనిక కుటుంబాలకు చెందిన మహిళలు ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారని కతీజా చెప్పారు.

అమ్మాయిలు సిజేరియన్‌పై పట్టుబడుతున్నారని తెలిపారు.

“నా తల్లి కూడా ప్రసవాలలో మరణాలను చూసింది. సిజేరియన్లు చాలామంది ప్రాణాలను కాపాడాయి. నేను ప్రారంభించినప్పుడు, మహిళలు శస్త్రచికిత్సకు భయపడేవారు. ఇప్పుడు చాలామంది సహజ ప్రసవానికి భయపడుతున్నారు, శస్త్రచికిత్స కోసం పట్టుబడుతున్నారు'' అని అన్నారు

కతీజా తన కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితిని చూశారు. తన కోడలికి సహజ ప్రసవం జరగాలని కోరుకున్నారామె. అయితే కోడలిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.

"నేను ఆమెకు డెలివరీ చేసి ఉంటే, అది శస్త్రచికిత్సకు దారితీసి ఉండకపోవచ్చు. ఈ విషయంలో నేను వైద్యుడిని నిందించబోను. కానీ సిజేరియన్ అన్ని కేసుల్లో అవసరం లేదని అనుకుంటున్నా. స్త్రీ పూర్తిగా మద్దతుగా ఉన్నంత వరకు యోని ద్వారా జననం సాధ్యమవుతుంది" అని అన్నారు కతీజా.

గత మూడు దశాబ్దాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం కూడా పెరిగింది. ఇది మంచి విషయమే అయినప్పటికీ, దీనికి కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి.

గర్భధారణ మధుమేహం చాలా అరుదుగా వచ్చేదని, కానీ అది ఇప్పుడు చాలామందిలో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు కతీజా.

సమాజ ఆలోచనా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రసవ సమయంలో తమ భార్యలతో ఉండాలని ఇప్పుడు తరచుగా భర్తలు అభ్యర్థిస్తున్నారు.

"నేను మంచి, చెడు సమయాలను చూశాను. ఆడపిల్ల పుడితే భార్యను కూడా చూడని భర్తలను చూశాను. రెండు లేదా మూడో ఆడపిల్ల పుడితే కొందరు స్త్రీలు కన్నీళ్లు పెట్టుకుంటారు.'' అని ఆమె గుర్తుచేసుకున్నారు.

కతీజా
ఫొటో క్యాప్షన్, కతీజా కుటుంబం

జూన్ 30న పదవీ విరమణ

90వ దశకంలో సెక్స్ సెలెక్టివ్ అబార్షన్లు ఎక్కువగా జరిగాయి. అవి ఎంతగా పెరిగాయంటే, ఆ తరువాత ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించాల్సి వచ్చింది.

తల్లిదండ్రులు వదిలేసిన బాలికల కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఫోస్టర్ హోమ్ పథకాలను కూడా ప్రారంభించాయి.

"కానీ ఇప్పుడంతా మారిపోయింది" అని కతీజా అంటున్నారు.

చాలామంది జంటలు ఇప్పుడు అబ్బాయి లేదా అమ్మాయి అని ఆలోచించకుండా ఇద్దరు పిల్లలైతే చాలని భావిస్తున్నారని తెలిపారు.

కతీజా భర్త ఏడేళ్ల క్రితం చనిపోయారు.

ఆమె కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, కుమారుడు దుబాయ్‌లో మెకానికల్ ఇంజనీర్.

తన మనవళ్లతో కతీజా శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆమె కోడలు మోనిషా కోరుకుంటున్నారు..

కతీజా జూన్ 30న పదవీ విరమణ చేస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదంటున్నారు ఆమె.

కానీ జీవితంలో తనకు దూరమయ్యేదేంటో ఆమెకు తెలుసు.

"నవజాత శిశువుల ఏడుపు నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. వాస్తవానికి స్త్రీ చాలా బాధను అనుభవిస్తుంది. కానీ తన పాప ఏడుపు శబ్దం వినగానే ఆ బాధనంతా మరిచిపోయి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది.

అది చూడటం నాకు చాలా ఆహ్లాదకరమైన అనుభవం. నా ఈ మొత్తం ప్రయాణం సంతృప్తికరంగా ఉంది.” అని కతీజా తెలిపారు.

వీడియో క్యాప్షన్, బీబీసీ పరిశోధనలో వెల్లడైన దిగ్భ్రాంతికర నిజాలు

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)