కాఫీ ఫిల్టర్‌ కనిపెట్టిన మహిళ కథ... ఆమెకు ఈ ఐడియా ఎలా వచ్చింది?

మెలిట్టా బెంట్జ్

ఫొటో సోర్స్, MELITTA GROUP

ఫొటో క్యాప్షన్, 1908లో ఫిల్టర్ కాఫీని కనుగొన్న మెలిట్టా బెంట్జ్

మెలిట్టా బెంట్జ్ (1873-1950) ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు కాఫీ తాగేవారు. కానీ, సిప్ చేసిన ప్రతిసారి కూడా ఆమెకు ఏదో తేడాగా అనిపించేది.

కాఫీ గింజల చేదు రుచి, దాంతో పాటు వాటి మట్టి వాసన ఆమె నోటికి తగిలి, ఆ క్షణాన్ని ఆస్వాదించకుండా చేసేవి.

దీంతో, అప్పటి వరకు గృహిణిగా ఉన్న ఈ జర్మనీ మహిళ దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు.

తన స్వస్థలమైన జర్మనీలోని డ్రెస్డెన్‌లో ఉన్న తన ఇంటి కిచెన్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభించారు. యూరప్‌లో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్న కాఫీని ప్రజలు ఇష్టంగా తాగేలా చేసేందుకు ఇంట్లోనే ప్రయోగాలు చేయడం మొదలు పెట్టారు.

ఎన్నో సార్లు ఈ ప్రయోగాల్లో విఫలమైన తర్వాత, ఒక రోజు తన పిల్లల్లో ఒకరి స్కూల్ నోట్‌బుక్ నుంచి ఒక కాగితాన్ని చించి, దానికి కొన్ని రంధ్రాలు చేసి, దాన్ని పాత టిన్ పాట్‌పై ఉంచారు.

ఆ తర్వాత దానిపై పొడి చేసిన కాఫీ వేసి, వేడి నీళ్లు పోశారు.

అలా పోస్తున్నప్పుడు పేపర్ ద్వారా కాఫీ కిందనున్న కప్‌లోకి వెళ్లింది.

ఇది ప్రత్యేకమైన ద్రవ పదార్థంగా ఉండటంతో పాటు, ముందు దానితో పోలిస్తే కాస్త తక్కువ చేదు ఉంది.

కాఫీ తాగుతున్న అమ్మాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫిల్టర్ కాఫీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తన పిల్లల స్కూల్ నోట్‌బుల్‌లోని పేపర్ నుంచి తొలి ఫిల్టర్ కాఫీని తయారు చేసిన మెలిట్టా బెంట్జ్

ప్రారంభ దశలో...

మెలిట్టా బెంట్జ్ కళ్ల ముందున్నది తొలి కాఫీ ఫిల్టర్.

కాస్త దూరదృష్టి కలిగిన మెలిట్టా తను కనుగొన్న ఈ ప్రక్రియను తన సన్నిహితులతో కలిసి పరీక్షించారు.

‘‘కాఫీ ఆఫ్టర్‌నూన్స్’’ పేరుతో ఈ పరీక్షలు చేపట్టారు. 1908లో ఆమె దీనిపై పేటెంట్ హక్కులు కూడా పొందారు.

తన భర్త హుగో బెంట్జ్‌తో కలిసి ఫిల్టర్లను తయారు చేసి, అమ్మేందుకు డ్రెస్డెన్‌లో ఒక కంపెనీని ప్రారంభించారు.

తన ప్రొడక్ట్ ప్రత్యేకమైనదని ప్రజలకు తెలియజేసేందుకు ఆమె చాలా కష్టపడ్డారు.

దాని గురించి ప్రజలకు వివరించేందుకు అనేక స్టోర్లకు, వేర్‌హౌస్‌లకు, ట్రేడ్ ఫెయిర్లకు వెళ్లారు.

అదే సమయంలో తన ఇంటిని కూడా ప్రొడక్షన్ వర్క్‌షాపుగా మార్చేశారు. ఇంట్లో ఉన్న 5 గదులను ప్రొడక్షన్ వర్క్‌షాపు కోసమే వాడే వారు.

తన కొడుకులు విల్లీ, హార్స్ట్‌లు తోపుడు బండ్లపై కాఫీ ఫిల్టర్లను డెలివరీ చేసేవారు.

1909లో జరిగిన లీప్‌జిగ్ ట్రేడ్ ఫెయిర్‌లో ఆమె వెయ్యికి పైగా ఫిల్టర్లను అమ్మారు.

తన ఫిల్టర్లకు మంచి డిమాండ్ వస్తుండటంతో పాటు, ప్రజలు వీటిపై ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో, ఐదేళ్లలోనే మెలిట్టా బెంట్జ్ ఒక పేరున్న వ్యాపారవేత్తగా ఎదిగారు.

దీంతో, ఆమె తన కంపెనీని పాత లాక్స్మిత్‌కి తరలించాలనుకున్నారు.

ఉత్పత్తిని పెంచేందుకు పెద్ద మెషిన్లపై ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. 15 మంది ఉద్యోగులను నియమించుకున్నారు.

అయితే, ఆమె ఆశలకు మొదటి ప్రపంచ యుద్ధం గండికొట్టింది.

ప్రపంచ యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తొలి ప్రపంచ యుద్ధ సమయంలో ఆర్మీలోకి వెళ్లిన మెలిట్టా బెంట్జ్ భర్త, పెద్ద కొడుకు

యుద్ధంతో చెల్లాచెదరైన కలలు

మెలిట్టా బెంట్జ్ భర్త హుగో బెంట్జ్‌, పెద్ద కొడుకు విల్లీ యుద్ధంలో చేరాల్సి రావడంతో తన కుటుంబం విడిపోవాల్సి వచ్చింది.

ఆ క్లిష్ట సమయంలో ఒకరే తన కంపెనీని నడపాల్సి వచ్చింది. అప్పుడు తన కుటుంబ బరువు బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది.

తన కుటుంబం మొత్తానికి ఆదాయాన్ని సమకూర్చాల్సి ఉంది.

కాఫీ బీన్ల దిగుమతులు తగ్గడం, పేపర్ వంటి కొన్ని ఉత్పత్తులపై పరిమితులు విధించడంతో ఆమె వ్యాపారాలు మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఉత్పత్తి చేసిన ఫిల్టర్లను అమ్మడం అసాధ్యమైనప్పుడు, మెలిట్టా బెంట్జ్ మరికొన్ని వస్తువులను కూడా అమ్మడం ప్రారంభించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కార్డ్‌బోర్డు బాక్స్‌లను కూడా అమ్మారు.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ఫిల్టర్లకు డిమాండ్ మళ్లీ పెరిగింది. ఆమె తన వ్యాపారాలు విస్తరించడం మొదలు పెట్టాయి.

ఆ సమయంలోనే ఈ వ్యాపారవేత్త తన ఉద్యోగులకు పలు రకాల ప్రయోజనాలను అందించాలని నిర్ణయించారు.

క్రిస్మస్ బోనస్, వెకేషన్ సెలవులు, వారానికి 5 రోజులే పని వంటి పలు రకాల విధానాలను తీసుకొచ్చారు.

నాజీ పాలన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాఫీ ఫిల్టర్ల తయారీపై నిషేధం విధించిన నాజీ పాలన

రెండో ప్రపంచ యుద్ధం

ఈ తర్వాత కొన్నేళ్లకు రెండవ ప్రపంచ యుద్ధం కూడా ఆమె వ్యాపారాలను మళ్లీ దెబ్బకొట్టింది.

1942లో అధికారంలో ఉన్నఅడాల్ఫ్ హిట్లర్, కాఫీ ఫిల్టర్ల ఉత్పత్తిని కొనసాగించకుండా నిషేధం విధించారు.

యుద్ధ పరికరాలను తయారు చేయాలని, వాటిని సైన్యానికి సరఫరా చేయాలని నాజీల ప్రభుత్వం మెలిట్టా బెంట్జ్‌పై ఒత్తిడి తెచ్చింది.

నేరుగా హిల్టర్‌తోనే కలిసి పనిచేయాలని ఆదేశించింది.

ఈ యుద్ధం తర్వాత నాజీ పాలనలో బలవంతంగా కార్మికులుగా మారిన బాధితుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు సోషల్ ప్రొగ్రామ్‌కి ఈ కంపెనీ సహకారం అందించింది.

బెంట్జ్ మళ్లీ తన కాఫీ ఫిల్టర్లకు 1947లో పునరుత్తేజం తీసుకొచ్చారు.

కానీ, మూడేళ్ల తర్వాత 1950 జూన్ 29న ఈ 77 ఏళ్ల వయసులో మహిళా వ్యాపారవేత్త మరణించారు.

మెలిట్టా బెంట్జ్ కుటుంబం

ఫొటో సోర్స్, MELITTA GROUP

బలమైన వారసత్వం

మెలిట్టా మరణించిన తర్వాత, ఆమె పిల్లలే ఈ కంపెనీని కొనసాగించారు.

1959లో మిండెన్ నగరంలో సరికొత్తగా మిల్ ఫ్యాక్టరీ పెట్టారు. యూరప్‌లోనే అత్యంత ఆధునిక పేపర్ మిషన్ దీనిలో ఏర్పాటు చేశారు.

ఈ ప్లాంట్ ఇప్పటికీ నడుస్తోంది.

ఇన్నేళ్లలో వారు తమ వ్యాపారాలను పలు రంగాల్లోకి విస్తరించారు.

వాక్యూమ్ క్లీన్లకు బ్యాగ్‌లను రూపొందించడం నుంచి ఇతర గృహోపకరణాల తయారీలోకి ప్రవేశించారు.

ప్రస్తుతం ఈ కంపెనీని మెలిట్టా గ్రూప్‌గా పిలుస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రూప్‌లో 5 వేల మందికి పైగా పనిచేస్తున్నారు.

2021 నాటి సమాచారం ప్రకారం, ఈ సంస్థ 2 బిలియన్ డాలర్లకు పైగా లాభాలను ఆర్జిస్తోంది.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)