బఠానీ రుచి లేని కొత్త రకం బఠానీలు, సోయాకు ప్రత్యామ్నాయం దొరికినట్టేనా?

కొత్త రకం బఠానీలు

ఫొటో సోర్స్, GWYNDAF HUGHES/BBC

    • రచయిత, పల్లబ్ ఘోస్
    • హోదా, సైన్స్ కరెస్పాండెంట్

చూడటానికి అవి బఠానీల లాగే ఉంటాయి. కానీ, రుచి మాత్రం అలా ఉండదు. బఠానీ రుచి ఉండని కొత్త రకం బఠానీలను బ్రిటన్‌లోని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.

ఇది పిల్లలు ఈ శాకాహారాన్ని తినేలా చేసేందుకు చేపడుతున్న మోసపూరిత ప్లాన్ మాత్రం కాదని వాళ్లు అంటున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు ప్రస్తుతం మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని తినేందుకు మొగ్గుచూపుతున్నారు.

పర్యావరణానికి మరింత అనుకూలమైన, సోయా బీన్స్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త రకం వంగడాలను ఉత్పత్తి చేయాలని వారు ఆశిస్తున్నారు.

బఠానీల్లో ప్రొటీన్లు అత్యధికంగా ఉంటాయి. శాకాహార వంటలలో పెద్ద మొత్తంలో మాంసానికి బదులుగా వీటిని వాడేటప్పుడు, రుచి కారణంగా శాకాహారులు వీటిని తినకుండా పక్కన పెడుతున్నారు.

బఠానీల రుచి కోసం 30 ఏళ్ల క్రితం ఒక జన్యువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే, దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో, ఈ పరిశోధనను మధ్యలోనే ఆపివేశారు. కానీ, ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మళ్లీ ఈ పరిశోధనలు జరుగుతున్నాయి.

‘‘ప్రపంచం మారిపోయింది. ప్రజలు మాంసాహారం నుంచి కాకుండా మొక్కల ఆధారితంగా వచ్చే ప్రొటీన్లను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఈ సమయంలో, రుచిలేని బఠానీల మీద అకస్మాత్తుగా ఆసక్తి పెరిగింది ’’ అని ఈ ప్రాజెక్ట్‌పై పనిచేసే శాస్త్రవేత్తల్లో ఒకరైన నార్విచ్‌లోని జాన్ ఇన్నెస్ సెంటర్(జేఐసీ) ప్రొఫెసర్ క్లయిర్ డోమోనీ చెప్పారు.

ప్రజల ఆహారం కోసం, పశువుల మేతకు బ్రిటన్ ప్రతి సంవత్సరం 40 లక్షల టన్నుల సోయాను దిగుమతి చేసుకుంటోంది. దీనిలో 5 లక్షల టన్నులను శాకాహారానికి వాడుతున్నట్లు ప్రభుత్వ ఇన్నొవేషన్ ఏజెన్సీ ఇన్నొవేట్ యూకే తెలిపింది.

వీటిలో చాలా వరకు దక్షిణ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

పరిశ్రమతో అనుసంధానమైన ప్రభుత్వ పథకంలో ఈ ప్రాజెక్ట్‌ భాగమైంది. సమాజానికి ఉపయోగపడే మరిన్ని కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు అకడమిక్ రీసెర్చర్లు పని చేస్తున్నారు.

గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలను తగ్గిస్తూ ఆహారోత్పత్తిని పెంచే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం పలు పరిశోధనాత్మక కార్యక్రమాలను ప్రకటించింది.

ఈ ప్రాజెక్ట్‌ను బెల్‌ఫాస్ట్‌ కేంద్రంగా పని చేసే మొక్కల ఉత్పత్తి కంపెనీ జెర్మినాల్ చేపడుతోంది.

‘‘మనం సోయాను బాగా అలవాటు చేసుకున్నాం. ఈ అలవాటును మనం మానుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఆ సంస్థకు చెందిన బ్రిటన్ మేనేజింగ్ డైరెక్టర్ పాల్ బిల్లింగ్స్ చెప్పారు.

కొత్త రకం బఠానీలు

ఫొటో సోర్స్, Getty Images

మొక్కల ఆధారిత ఆహారానికి డిమాండ్

మాంసాహార ప్రత్యామ్నాయాలకు ప్రతి సంవత్సరం 30 శాతం డిమాండ్ పెరుగుతోంది. అలాగే పాల ఉత్పత్తుల ప్రత్యామ్నాయాలకు 50 శాతం, చీజ్ ప్రత్యామ్నాయానికి 40 శాతం డిమాండ్ పెరుగుతున్నట్లు ఇన్నొవేట్ యూకే తెలిపింది.

బ్రిటన్ రైతులు బఠానీల ఉత్పత్తిని పెంచడం ద్వారా పెరుగుతోన్న ఈ డిమాండ్‌ను పూరించనున్నారు.

బఠానీల్లో పర్యావరణానికి అనుకూలమైన పోషకాలు చాలా ఉన్నాయి. నత్రజని అధికంగా ఉండే ఎరువులు ఈ పంటలకు అవసరం లేదు.

వాస్తవానికి రైతులు తమ పంటలను తిరిగి వేసేటప్పుడు ఎరువుల అవసరాన్ని తగ్గించేందుకు, నత్రజని, ఇతర పోషకాలుండే వాటిని భూముల్లో వేస్తారు.

కొత్త రకం బఠానీల వల్ల ఎరువుల వాడకం తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చాలా మంది ప్రజలకు బఠానీలంటే ఇష్టమున్నప్పటికీ, రుచి కారణంగా మొక్కల ఆధారిత ఆహారంలో దీన్ని తీసుకోవడం లేదు.

ఒకవేళ మీరు మాంసం నుంచి బయట పడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, మీ శాకాహార బర్గర్‌లో బఠానీల రుచి ఉండటాన్ని కూడా ఇష్టపడుతుండకపోవచ్చు.

బఠానీ

ఫొటో సోర్స్, JIC

1990ల్లో తొలుత ఈ రుచిని కనిపెట్టిన బృందంలో జాన్ ఇన్నెస్ సెంటర్‌లో యువ పరిశోధకురాలిగా ప్రొఫెసర్ క్లయిర్ డోమోనీ ఉన్నారు.

శాస్త్రవేత్తలు బఠానీల మొక్కలలో ఒక జన్యువును గుర్తించారు. ఇది రుచిలేని బఠానీలను ఉత్పత్తి చేస్తుంది.

కానీ, భారత్‌లో ఒక బఠానీ మొక్కలో ఈ జన్యువు పనిచేయలేదని ప్రొఫెసర్ గుర్తించారు.

‘‘ఇది ముందుకు వెళ్లడం లేదు. ఈ కారణంతో ఎలాంటి రుచిలేని బఠానీల ప్రొడక్షన్‌ను ఇక్కడితో ఆపేయాలని ఒక ఉత్పత్తిదారుడు చెప్పారు’’ అని ఆమె వివరించారు.

చివరికి గత ఏడాది జెర్మినల్ కంపెనీ జాన్ ఇన్నెస్ కేంద్రాన్ని సంప్రదించింది. బ్రిటన్‌లో పండే సోయాకు ప్రత్యామ్నాయంగా ఏదైనా అభివృద్ధి చేయొచ్చేమో చూడాలని కోరింది.

దీనికి ప్రొఫెసర్ డోమోనీ ప్రాజెక్ట్ బాగా సరిపోతుందని గుర్తించారు. ఇంకా ఆమె జాన్ ఇన్నెస్ కేంద్రంలోనే పనిచేస్తూ ఉండటంతో, ఆ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించారు.

సైన్స్ ఎప్పటికీ దుర్వినియోగం కాదని ఆమె నవ్వుతూ అన్నారు.

బఠానీ

ఫొటో సోర్స్, BBC NEWS

సోయాకు ప్రత్యామ్నాయంగా వాణిజ్యపరమైన పంటను ఉత్పత్తి చేయాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. అంతేకాక, దీనిలో అత్యధిక స్థాయిలో జీర్ణమయ్యే ప్రొటీన్లు ఉండాలి. ఇప్పుడున్న వాటి కంటే తేలికగా వీటిని పండించగలగాలి.

సంప్రదాయ రీప్రొడక్షన్ విధానాల ద్వారానే దీన్ని చేస్తున్నారు. దిగుబడి కోసం ఎంపిక చేసిన ఇతర రకాలతో ఈ భారతీయ మొక్కను ఫలదీకరణం చేయడం, అత్యధిక స్థాయిలో ప్రొటీన్ ఉండేలా చూస్తున్నారు.

ఒకసారి తగిన వంగడాన్ని గుర్తించిన తర్వాత, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో రైతులు దీని ద్వారా లబ్ది పొందుతారో లేదో, నిజంగా దీన్ని ఉత్పత్తి చేయగలమా అన్న విషయాలను ఫీల్డ్ ట్రయల్స్ ద్వారా నిర్ధరించనున్నారు.

ప్రొఫెసర్ అండ్ గ్రోవర్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ ట్రయల్స్‌ను చేపట్టనుంది.

రైతులు ఇప్పటికే బఠానీలను ఎక్కువగా పండించడం ప్రారంభించారని, ఎందుకంటే ఇది ఎరువుల భారాన్ని తగ్గిస్తుందని ప్రొఫెసర్ అండ్ గ్రోవర్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సీఈవో రోగల్ విక్కర్స్ చెప్పారు.

‘‘ఒకవేళ రైతులు వారి ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే, పర్యావరణసహిత పంటలను పండించేందుకు బఠానీలను ఉత్పత్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వపు కొత్త మార్గదర్శకాలలో ఏమైనా పర్యావరణంపై దృష్టి పెట్టాలనుకుంటే, ఈ పంట మంచి ఆప్షన్. రైతులు దీన్ని గుర్తించారు’’ అని రోగర్ విక్కర్స్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)