దేశంలో ఎక్కడ వస్తువు కొని నష్టపోయినా మీ సొంత జిల్లాలో ఫిర్యాదు చేయొచ్చు.. ఫోన్ చేసి కూడా కంప్లయింట్ చేయొచ్చు.. వినియోగదారుడి హక్కు అది..

వీడియో క్యాప్షన్, వినియోగదారులు మోసపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? పరిహారం ఎలా పొందాలి?
దేశంలో ఎక్కడ వస్తువు కొని నష్టపోయినా మీ సొంత జిల్లాలో ఫిర్యాదు చేయొచ్చు.. ఫోన్ చేసి కూడా కంప్లయింట్ చేయొచ్చు.. వినియోగదారుడి హక్కు అది..

వినియోగదారుల రక్షణ చట్టం భారతదేశంలో 1986 డిసెంబర్ 24న అమల్లోకి వచ్చింది.

ఆ రోజు నుంచి ఏటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

సాంకేతికత పెరగడంతో డిజిటల్ లావాదేవీలు, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు, టెలి మార్కెటింగ్ తదితరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం పాత చట్టం స్థానంలో 2019లో కొత్త రక్షణ చట్టం రూపొందించింది.

2020 జులై 20 నుంచి ఇది దేశమంతటా అమల్లోకి వచ్చింది.

‘వినియోగదారుడా మేలుకో’ అనే నినాదంతో వినియోగదారుల వ్యవహారాలు ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల కోసం పలు కార్యక్రమాలు నిర్వహించింది.

ఈ కొత్త చట్టంలో ఈ కామర్స్ నిబంధనలు తీసుకురావడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు కూడా ఇది వర్తించనుంది.

శ్రీకాకుళం జిల్లా ‘వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు’ రఘు పాత్రుని చిరంజీవి ‘బీబీసీ’తో మాట్లాడుతూ... వినియోగదారుల హక్కులు, ఆ హక్కులకు భంగం కలిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? నష్టపోతే పరిహారం ఎలా పొందాలి వంటి విషయాలను వివరించారు.

బంగారం కొనుగోళ్లు

ఫొటో సోర్స్, Getty Images

లాయర్ అవసరం లేకుండా నేరుగా వినియోగదారుడే ఫిర్యాదు చేయొచ్చు

జిల్లా స్థాయిలో కంజ్యూమర్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుంది. వస్తు సేవల్లో లోపాలు జరిగితే ఈ కమిషన్‌‌లో ఫిర్యాదు చేయవచ్చు.

న్యాయవాది సాయం లేకుండా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

రూ.5 లక్షలు విలువైన వస్తుసేవల వరకు సంబంధించిన కేసులలో ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించనక్కర్లేదు.

చట్ట ప్రకారం కేసు నమోదైన 120 రోజుల్లోపు తీర్పులు వెలువరిస్తారు.

జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పుపై అసంతృప్తి ఉంటే రాష్ట్ర కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

sales

ఫొటో సోర్స్, Getty Images

వస్తువు ఎక్కడ కొన్నా సొంత జిల్లాలో కంప్లయింట్ చేయొచ్చు

దేశంలో ఎక్కడ వస్తువు కొన్నా, ఎక్కడ సేవా లోపం ఉన్నా ఆ వినియోగదారుడు నివసించే లేదా ఉద్యోగం చేసే జిల్లా కమిషన్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

రూ. 50 లక్షలు విలువైన వస్తుసేవలకు సంబంధించిన కేసుల వరకు జిల్లా స్థాయిలో విచారిస్తారు.

రూ. 50 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు విలువజేసే కేసులను రాష్ట్ర కమిషన్‌లో విచారిస్తారు.

రూ. 2 కోట్ల విలువ కన్నా పైన ఉంటే జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాలి.

edaakhil.nic.in

ఫొటో సోర్స్, https://edaakhil.nic.in/

ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడానికి యాప్, వెబ్‌సైట్

బాధితులు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేసుకునేందుకు ఈ-దాఖిల్ ( https://edaakhil.nic.in/ ) అనే వెబ్‌సైట్/యాప్‌ అందుబాటులో ఉంది.

నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ ( ఎన్‌సీ‌హెచ్) మొబైల్ యాప్‌లో కూడా బాధితులు ఫిర్యాదు చేయవచ్చు.

మొబైల్ ఫోన్‌ చూస్తున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఫోన్‌లో కూడా ఫిర్యాదు చేయొచ్చు

1915, 1800114000 టోల్ ఫ్రీ నంబర్లకు కాల్ చేసి సమస్య చెబితే వారు జిల్లా స్థాయి కమిషన్‌కు తెలియజేస్తారు.

వస్తువు కొనేటపుడు బిల్లు, రశీదు, ఆన్‌లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఇన్‌వాయిస్‌లను, ఐడీలను భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఫిర్యాదు సమయంలో వాటిని సమర్పించాల్సి ఉంటుంది.

‘వినియోగదారుల కమిషన్ పరిధిలోకి ప్రభుత్వ శాఖలు కూడా వస్తాయి.

ఉదాహరణకు రైలు టికెట్లు రద్దు చేసుకుంటే సంబంధిత డబ్బులు అకౌంట్‌లో పడకపోయినా ఫిర్యాదు చేయవచ్చు'' అని శ్రీకాకుళం జిల్లా ‘వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షులు’ రఘు పాత్రుని చిరంజీవి చెప్పారు.

ఇవి కూడా చదవండి: