2022లో 9 కీలక ఘట్టాలు

జనాభా

ఫొటో సోర్స్, Getty Images

ఊహించని ఎన్నో ఘట్టాలకు 2022 వేదికైంది. వీటిలో కొన్నింటిని మనం ఎప్పటికీ మరచిపోలేం కూడా.

‘‘రికార్డు స్థాయి జనాభా’’ నుంచి గతంలోకి ప్రయాణం వరకు కొన్ని కీలకమైన ఘట్టాలివీ..

1) గ్రహశకలాన్ని దారి మళ్లించిన నాసా

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఓ గ్రహశకలాన్ని దారి మళ్లించింది. సెప్టెంబరు 28న ఓ వ్యోమనౌకతో దాన్ని ఢీకొట్టించి దాని దిశను మార్చింది.

భూమిని ఢీకొట్టే ముప్పున్న గ్రహశకలాలను దారి మళ్లించేందుకు అభివృద్ధి చేసిన సాంకేతికతను ఈ ప్రయోగంలో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు.

మైక్రోప్లాస్టిక్స్

ఫొటో సోర్స్, Getty Images

2) రక్తంలో మైక్రోప్లాస్టిక్స్

మనుషుల రక్తంలో మైక్రోప్లాస్టిక్స్ కలిసి పోతున్నట్లు ద జర్నల్ ఎన్విరాన్‌మెంట్ ఇంటర్నేషనల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధనలో పాల్గొన్న 80 శాతం మంది రక్తంలో మైక్రోప్లాస్టిక్స్ కనిపించాయి.

మైక్రోప్లాస్టిక్స్ అనేవి 5 మి.మీ. కంటే తక్కువ మందం గల చిన్న ప్లాస్టిక్ ముక్కలు. పెద్దపెద్ద ప్లాస్టిక్స్ మట్టి లేదా నీటిలో విచ్ఛిన్నం అయినప్పుడు లేదా కలుషిత పర్యావరణం వల్ల ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.

ఈ మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పటివరకు కచ్చితంగా తెలియదు. అయితే, ఇవి మానవ కణాలను దెబ్బతీసే అవకాశముందని పరిశోధకులు ఆందోళన వ్యక్తంచేశారు.

ఫిఫా

ఫొటో సోర్స్, Getty Images

3) వరల్డ్ కప్‌లో ఎన్నో కీలక ఘట్టాలు..

కొన్ని కీలకమైన ఘట్టాలకు ఫిఫా వరల్డ్ కప్‌ వేదికైంది. ఫిఫాకు ఒక ముస్లిం దేశం (ఖతార్) లేదా అరబ్ దేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి.

మరోవైపు తొలిసారి ఫ్రాన్స్‌కు చెందిన స్టెఫనీ ఫ్రెప్పార్ట్ మహిళా లీడ్ రిఫరీగా చరిత్ర సృష్టించారు. జర్మనీ, కోస్టారికా మ్యాచ్‌కు ఆమె రిఫరీగా పనిచేశారు. ఆ మ్యాచ్‌లో బ్రెజిల్‌కు చెందిన న్యూ బ్యాక్, మెక్సికోకు చెందిన కరీనా మెడీనా కూడా ఆమెతోపాటు పనిచేశారు.

మరో కీలక ఘట్టం ఏమిటంటే, మొరాకో సెమీఫైనల్స్‌కు చేరుకోవడం. ఒక ఆఫ్రికా, అరబ్ దేశం ఈ స్థాయిలో ప్రతిభ చూపడం ఇదే తొలిసారి.

మరోవైపు ఐదుసార్లు తీవ్రంగా ప్రయత్నించిన తర్వాత అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ తొలిసారి ఈ కప్‌ను సాధించాడు.

జనాభా

ఫొటో సోర్స్, Getty Images

4) 800 కోట్లకు జనాభా..

2022 నవంబరు 15.. ఈ డేట్ ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ రోజు తొలిసారి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

‘‘ప్రజారోగ్యం, పోషక విలువలు, వ్యక్తిగత పరిశుభ్రత, వైద్యంలో పురోగతి వల్ల మనుషుల జీవిత కాలం పెరగడంతో రికార్డు స్థాయిలో జనాభా 800 కోట్లకు చేరుకుంది’’అని సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

700 కోట్ల నుంచి 800 కోట్లకు జనాభా పెరగడానికి 12 ఏళ్ల సమయం పట్టింది. అయితే, ఆ తర్వాత వంద కోట్లకు పెరగడానికి మాత్రం 15 ఏళ్లకుపైనే సమయం పట్టొచ్చని ఐరాస అంచనా వేస్తోంది.

మలేరియా వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Katie Ewer

5) మలేరియా వ్యాక్సీన్

శక్తిమంతమైన మలేరియా వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గత సెప్టెంబరులో ప్రకటించారు. దీన్ని వచ్చే ఏడాది ప్రజలకు ఇవ్వడం మొదలుపెడతారు.

క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టీకా 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని రుజువైంది. ఏటా మలేరియాతో 4,00,000 మంది మరణిస్తున్నారు.

చాలా చవక ధరకే ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

పిల్లల్లో మరణాల రేటు పెరగడానికి మలేరియా కూడా ఒక కారణం. దీనిపై పనిచేసే వ్యాక్సీన్ తయారుచేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది చాలా సంక్లిష్టమైన ఇన్ఫెక్షన్. ఇది శరీరంలోని భిన్న భాగాలకు వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక భాగాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాక్సీన్ తయారుచేయడం కాస్త కష్టం.

ఒలింపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

6) ఇది ఒలింపిక్ హిస్టరీ..

బీజింగ్‌లో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న తొలి నాన్-బైనరీ వ్యక్తిగా అమెరికా స్కేటింగ్ దిగ్గజం టిమోతీ లేడక్ చరిత్ర సృష్టించారు.

నిజానికి టిమోతీ పతకాన్ని సాధించలేదు. ఆష్లీ కెయిన్‌తో కలిసి టిమోతీ ఏడో స్థానంలో నిలిచారు. కానీ, నాన్-బైనరీ చాంపియన్‌గా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.

నాసా

ఫొటో సోర్స్, NASA

7) జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌తో గతంలోకి..

2022లో కీలక ఘట్టాల గురించి చెప్పుకునేటప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. జులైలో ఈ టెలిస్కోప్ పని మొదలుపెట్టింది. అద్భుతమైన చిత్రాలను ఇది మనకు అందించింది.

1300 కోట్ల ఏళ్ల క్రితం బిగ్‌బ్యాంగ్ తర్వాత రూపుదిద్దుకున్న ఓ గ్యాలక్సీకి సంబంధించిన ఫోటో జేఏడీఈఎస్-జీఎస్-జీ13-0ను గతంలోకి తొంగిచూసి జేమ్స్ వెబ్ మనకు అందించింది.

ఇప్పటివరకు మనం చూసిన అత్యంత సుదూరమైన గ్యాలక్సీ ఇదే.

రిషి సునక్

ఫొటో సోర్స్, Getty Images

8) బ్రిటన్‌కు తొలి నల్లజాతి ప్రధాని

2022లో బ్రిటన్‌ ప్రధానుల నియామకంలో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 45 రోజులు ప్రధానిగా పనిచేసి అతి తక్కువ రోజులు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగా లిజ్ ట్రస్ చరిత్ర సృష్టించారు.

ఆ తర్వాత వచ్చిన రిషి సునక్.. తొలి నల్లజాతి బ్రిటన్ ప్రధానిగా అక్టోబరు 25న చరిత్ర సృష్టించారు.

బ్యాక్టీరియా

ఫొటో సోర్స్, Jean-Marie Volland

9) మైక్రోస్కోప్ లేకుండా బ్యాక్టీరియా కనిపించింది

ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాక్టీరియాను తాము గుర్తించినట్లు గత జూన్‌లో శాస్త్రవేత్తలు ప్రకటించారు. థియోమార్గరీటీ మ్యాగ్నిఫిషియాగా పిలిచే ఈ బ్యాక్టీరియాను చూడటానికి మనకు మైక్రోస్కోప్ కూడా అవసరం లేదు.

ఇది మనుషుల కనుబొమ్మ ఆకారంలో ఒక సెంటీ మీటర్ పొడవున ఉంటుంది. ఇప్పటివరకు మనకు తెలిసిన అతిపెద్ద బ్యాక్టీరియా కంటే ఇది 50 రెట్లు పెద్దది. నేరుగా కంటికి కనిపించే తొలి బ్యాక్టీరియా ఇదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)