విండ్‌రష్: మానసిక రోగులను దేశం నుంచి బలవంతంగా పంపించేశారు.. రహస్య పత్రాలలో వెల్లడైన దశాబ్దాల కిందటి ‘చారిత్రక అన్యాయం’

ఫొటో సోర్స్, BBC/GETTY IMAGES
- రచయిత, నవ్‌తేజ్ జొహాల్, జొయాన్న హాల్
- హోదా, బీబీసీ న్యూస్
సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో, మానసిక సమస్యలతో ఉన్న వందలాది మందిని బ్రిటన్ నుంచి కరీబియన్ దీవులకు తిప్పి పంపించారు.
దశాబ్దాల కిందటి ఈ చర్యను ‘‘చారిత్రక అన్యాయంగా’’ బీబీసీ పేర్కొంది.
1950-1970ల మధ్య ఒక స్వచ్ఛంద పథకం కింద కనీసం 411 మందిని వెనక్కి పంపినట్లు పాత డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి.
తమ కుటుంబాలను విచ్ఛిన్నం చేశారని, కొంతమందిని ఎప్పటికీ కలుసుకోలేకపోయామని ఆ కుటుంబాలు చెబుతున్నాయి.
ఆ తరానికి జరిగిన అన్యాయాన్ని పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నామని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది.
‘‘తమ సన్నిహితులకు జరిగిన చారిత్రక అన్యాయంపై ఆయా కుటుంబాలు చేస్తున్న ప్రచారాన్ని మేం గుర్తించాం. ‘విండ్‌రష్ తరం’గా పేర్కొనే వారికి జరిగిన అన్యాయాన్ని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని ఒక అధికార ప్రతినిధి అన్నారు.
విండ్‌రష్ కుంభకోణానికి సంబంధించి వెల్లడైన అంశాలు, ‘‘స్వదేశానికి పంపించడం’’ అనే విధానం (రిపాట్రియేషన్ పాలసీ)పై బహిరంగ విచారణ కోసం పిలుపునిస్తున్నాయి.
ఈ విధానంతో వందలాది మంది కామన్వెల్త్ పౌరులను తప్పుడు విధానంలో స్వదేశాలకు పంపించారు.
వీరిలో కరీబియన్ దీవులకు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి దశాబ్దాలలో బ్రిటిష్ కాలనీల నుంచి బ్రిటన్‌కు వేలాది మంది వలస వెళ్లారు.
అలా వెళ్లిన వారిలోని కొంతమందిని ఇలా తప్పుడు విధానంతో స్వదేశాలకు తిరిగి పంపించారు.
వీరిని విండ్‌రష్ తరంగా పిలుస్తారు.
వలసదారులతో యూకేకు వెళ్లిన తొలి నౌక ‘హెచ్‌ఎంటీ ఎంపైర్ విండ్‌రష్’ పేరు మీదుగా వీరికి ఆ పేరు వచ్చింది.
తొలి వలసదారులు యూకేకు చేరుకొని ఈ ఏడాదితో 75 సంవత్సరాలు పూర్తవుతాయి.
ఆ పాలసీ స్థాయిని బహిర్గతం చేసే డాక్యుమెంట్లను నేషనల్ ఆర్కైవ్స్ నుంచి బీబీసీ న్యూస్ సంపాదించింది.
ఇప్పుడు నిపుణులు, ఈ పథకం చట్టవిరుద్ధమైనది కావొచ్చని భావిస్తున్నారు.
జూన్ ఆర్మట్రాడింగ్ తండ్రి జోసెఫ్. స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వచ్చిన వారిలో జోసెఫ్ ఒకరు.
యుద్ధం తర్వాత యూకేకు వెళ్లిన ఇతర కరీబియన్ల తరహాలోనే జోసెఫ్ కూడా బ్రిటిష్ వ్యక్తి. బ్రిటిష్ కాలనీ అయిన సెయింట్ కిట్స్‌లో జోసెఫ్ జన్మించారు. ఇప్పటికీ ఆ ప్రదేశం లండన్ పాలన పరిధిలోనే ఉంది. జోసెఫ్‌కు బ్రిటిష్ పాస్‌పోర్ట్ కూడా ఉంది.
జోసెఫ్ 1954లో యూకేకు చేరుకున్నారు. భార్య, అయిదుగురు కూతుళ్లతో కలిసి ఆయన నాటింగ్‌హామ్‌లో నివసించారు.
1960లలో ఆయనను మానసిక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.
ఆయనకు పారానాయిడ్ సైకోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
1966లో ఆయనను సెయింట్ కిట్స్‌కు పంపించారు. ఆ తర్వాత ఆయన తన కుటుంబాన్ని మళ్లీ చూడలేదు.
ఇప్పుడు జూన్ ఆర్మట్రాడింగ్ వయస్సు 65 ఏళ్లు. తమ కుటుంబాన్ని వదిలేసి తండ్రి వెళ్లిపోయినట్లు తన తల్లి చెప్పినట్లు ఆమె తెలిపారు.
తండ్రికి తామంటే ఇష్టం లేదనే భావనతోనే ఆమె పెరిగారు. ఈ భావన ఆమెకు చాలా దుఃఖాన్ని కలిగించేది.
తన కుటుంబంతో కలిసి బతికేందుకు యూకేకు తిరిగి రావాలనుకుంటున్నట్లు కోరుతూ జోసెఫ్ రాసిన ఒక లేఖను బీబీసీ చూసింది. ఆ తర్వాత జోసెఫ్‌కు ఏం జరిగిందనే సంగతి ఎవరికీ పెద్దగా తెలియదు.
జోసెఫ్ ఆర్మట్రాడింగ్‌ను బ్రిటన్ నుంచి పంపించేసిన విధానం సరైనది కాదని ప్రభుత్వ అధికారులు అంగీకరించినట్లు రహస్య పత్రాల్లో ఉంది.
ఆయన పాస్‌పోర్ట్‌ను తప్పుడు విధానంలో రద్దు చేశారని ఆ పత్రాలు వెల్లడించాయి.
ఆ పత్రాలను జూన్ ఆర్మట్రాడింగ్‌కు చూపించినప్పుడు ఆమె షాక్ అయ్యారు.
‘‘ఇది చాలా అన్యాయం. వారికెంత ధైర్యం. నేను చాలా కలత చెందాను. ఇది చాలా కలవరపెడుతోంది. ఆయన ఒక బలహీన వ్యక్తి. మీ దేశంలోని బలహీన వ్యక్తుల బాగోగులు మీరే చూసుకోవాలి. కానీ, మీరు అలా చేయలేదు. వారు ఆయనను వదిలించుకున్నారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మార్సియా ఫెంటన్ పసిబిడ్డగా ఉన్నప్పుడే ఆమె తల్లికి దూరం అయ్యారు.
ఆమె తల్లి సిల్వియా కాల్వర్ట్‌ను 1960ల చివర్లో జమైకాకు పంపించేశారు.
చాలా ఏళ్ల తర్వాత జమైకాలో మళ్లీ తల్లీకూతుల్లిద్దరూ కలుసుకున్నారు. అప్పటికి సిల్వియా డిశ్చార్జ్ అయ్యారు. కానీ, ఆమె అనారోగ్యంతోనే ఉన్నారు. 2007లో ఆమె చనిపోయారు.
జమైకాకు తిరిగి వెళ్లిపోయాక తన తల్లికి ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు మార్సియా.
ఆమెకు తెలిసిందల్లా కింగ్‌స్టన్‌లోని బెల్లెవ్ ఆసుపత్రిలో సిల్వియా కొంతకాలం ఉండటం మాత్రమే.
‘‘ఆమెను జమైకాకు పంపించి నాకు తల్లిని దూరం చేశారు’’ అని బీబీసీతో మార్సియా అన్నారు.
తన తల్లి లాంటి వారిని ఎందుకు? ఎలా వెనక్కి పంపించారనే అంశంపై విచారణ జరగాలని ఆమె కోరుకుంటున్నారు.
‘‘మానసిక అనారోగ్యంతో ఉన్న ఎవరినీ ఇలా వెనక్కి పంపించకూడదు. దీనికి బ్రిటిష్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పాలసీ ఏంటి?
1958-1970ల మధ్య దీర్ఘకాలిక అనారోగ్యంతో, మానసిక అనారోగ్యంతో ఉన్న 411 మంది రోగులను కరీబియన్‌లోని కామన్వెల్త్ దేశాలకు తిరిగి పంపించినట్లు నేషనల్ ఆర్కైవ్స్‌లో లభించిన పత్రాలపై బీబీసీ చేసిన విశ్లేషణలో తేలింది.
అయితే, ప్రభుత్వ శాఖలు ఈ రికార్డులను సమగ్రంగా భద్రపరిచినట్లుగా అనిపించడం లేదు.
కాబట్టి, ఇలా వెనక్కి పంపించేసిన వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చు.
ఈ ప్రక్రియకు నేషనల్ అసిస్టెన్స్ బోర్డు బాధ్యత వహిస్తుంది.
వెనక్కి తిరిగి రావాలనే కోరికను ప్రతీ రోగి వ్యక్తం చేయాలని ఆర్కైవ్స్‌లోని ప్రభుత్వ పత్రాలు, పాలసీ డాక్యుమెంట్లు సూచిస్తున్నాయి. అలాగే, రోగులకు ప్రయోజనం కలిగే వీలున్నప్పుడు, వారు తిరిగి రావడానికి అనుకూల ఏర్పాట్లు ఉన్నప్పుడు మాత్రమే వారిని స్వదేశానికి తిరిగి పంపాలని ఆ పత్రాలు పేర్కొంటున్నాయి.
కానీ, మానసిక సమస్యలతో ఉన్న రోగులు ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరా అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. అలాగే, అక్కడ వారికి వెనక్కి తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా? అనేది కూడా ప్రశ్నార్థకమే.
ఆ సమయంలో కరీబియన్ దీవులలో మానసిక ఆరోగ్య సంరక్షణలో శిక్షణ పొందిన సిబ్బంది లేరని, తగిన వనరులు కూడా లేవని ఒక అకడమిక్ పేపర్ పేర్కొంది.

యూకేలో జన్మించిన వారితో సమాన లీగల్ హోదాను యునైటెడ్ కింగ్‌డమ్ అండ్ కాలనీస్ పౌరులుగా విండ్‌రష్ తరం ప్రజలు కూడా పొందారు.
కరీబియన్ నుంచి కామన్వెల్త్ ప్రజలు మొదటిసారి యూకేకు చేరుకున్నప్పటి నుంచే యూకేలోని లేబర్, కన్జర్వేటివ్ ప్రభుత్వాలకు ఈ వలసదారుల సంఖ్యను పరిమితం చేయాలనే కోరిక ఉందని ససెక్స్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ హాంప్‌షైర్ అన్నారు.
1960-70 వ్యవధిలో అమలైన చట్టం ఉద్దేశం ఏంటంటే కొన్ని రకాల వలసలను నియంత్రించడమే అని ఆయన చెప్పారు.
మానసిక రోగులను స్వదేశాలకు తిరిగి పంపించడం అసలు చట్టబద్ధమైనదేనా అని ప్రొఫెసర్ క్రిస్ గ్లెదిల్ ప్రశ్నించారు.
గతంలో మెంటల్ హెల్త్ కేసుల ట్రిబ్యునళ్లకు ఆయన న్యాయమూర్తిగా వ్యవహరించారు.
2018 విండ్‌రష్ కుంభకోణానికి చెందిన వందలాది మంది బాధితులకు ఇమ్మిగ్రేషన్ లాయర్ జాక్వెలిన్ మెకంజీ ప్రాతినిధ్యం వహించారు.
మానసిక రోగుల పట్ల ఇలా వ్యవహరించడం చాలా షాకింగ్ అంశమని ఆమె వ్యాఖ్యానించారు.
‘‘జీవితాలు నాశనం అయ్యాయి. వారి వారసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది’’ అని ఆమె అన్నారు.
తీవ్ర విచారం
మానసిక రోగులను కరీబియన్‌కు తిరిగి పంపడం వల్ల కలిగే ప్రభావాలపై పరిశోధించిన వైద్యులు దీనివల్ల చెడు ప్రభావం ఏర్పడిందని, చాలామంది తిరిగి యూకేకు రావాలని కోరుకున్నారని చెప్పారు.
మానసిక రోగులను యూకే నుంచి జమైకాలోని బెల్లెవ్ ఆసుపత్రికి పంపించడం ఆ రోగులకు మంచిది కాదని డాక్టర్ అగ్రే బుర్కే చెప్పారు. ఆయన యూకేకు చెందిన తొలి నల్లజాతి ఎన్‌హెచ్‌ఎస్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్.
కరీబియన్‌కు చెందిన దాదాపు 200 మానసిక రోగుల కేసులను డాక్టర్ జార్జ్ మహై అనే మానసిక వైద్యుడు పరిశీలించారు.
వారిలో 52 శాతం మంది రోగులకు యూకే నుంచి తిరిగి వెళ్లిపోవాలని సలహా ఇచ్చారని, అందుకుగానూ యూకే ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందించిందని ఆయన కనుగొన్నారు. వీరిలో చాలామంది తిరిగి యూకేకు రావాలనుకున్నారని, యూకే నుంచి బయటకు వచ్చినందుకు వారు తీవ్ర విచారం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.
బీబీసీతో మాట్లాడుతూ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు ఇలా అన్నారు. ‘‘మానసిక ఆరోగ్య చట్టం కింద ఆసుపత్రుల్లో ఉన్న రోగుల బాగోగులు చూడటం చాలా ముఖ్యమైనవి. అయితే, ఈ చట్టంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు రోగులను స్వదేశానికి పంపించాలంటే అందుకు స్వతంత్ర ట్రిబ్యూనల్ అంగీకరించాలి’’ అని అన్నారు.
జోసెఫ్ అర్మట్రేడింగ్ ఫొటోలు ఇప్పుడు వారి కుటుంబం వద్ద లేవు. అయితే, తన తండ్రి కథను మర్చిపోకూడదని జూన్ నిశ్చయించుకున్నారు.
‘‘మా నాన్నకు ఏమైంది? జోసెఫ్ అర్మట్రేడింగ్‌కు ఏం జరిగింది? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి’’ అని జూన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
- రూ. 88 వేల కోట్లకు పైగా విలువైన రూ.500 నోట్లు అదృశ్యమయ్యాయా, ఆర్బీఐ ఏం చెప్పింది?
- స్విమ్‌సూట్: ఈత కొట్టేటప్పుడు ఏ రంగు దుస్తులు వేసుకోవాలో తెలుసా?
- ఆర్బీఐ: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుందా?
- ఈ కాలు నాదే, ఆ కాలూ నాదే అని కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఏమవుతుందో తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















