టైటాన్ సబ్‌మెర్సిబుల్: ఆ అయిదుగురిలో ఒకరు టైటానిక్ మృతుడి మునిమనుమరాలి భర్త... వీరికి సముద్ర శోధన అంటే ఎందుకంత ఆసక్తి

టైటాన్ సాహస యాత్రలో మరణించిన వారు

ఫొటో సోర్స్, DAWOOD FAMILY/LOTUS EYE PHOTOGRAPHY/REUTERS

ఫొటో క్యాప్షన్, టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో ప్రాణాలు పోగొట్టుకున్న ఐదుగురు పర్యాటకులు
    • రచయిత, బెర్నాడ్ డేబుస్‌మన్ జూనియర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో చనిపోయిన ఐదుగురు ‘నిజమైన సముద్ర అన్వేషకులు’ అని ఈ సముద్ర యాత్రను నిర్వహించే ప్రైవేట్ కంపెనీ ఓషన్‌ గేట్ చెప్పింది.

వారి స్ఫూర్తి, సాహసం ఎంతో ప్రత్యేకమైనవి ఓషన్‌ గేట్ తెలిపింది.

అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ శిథిలాలు చూడ్డానికి మినీ జలాంతర్గామి టైటాన్‌లో ప్రయాణించిన ఐదుగురూ మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది.

భయంకరమైన పేలుడుతోనే వీరు మరణించి ఉంటారని అమెరికా కోస్ట్ గార్డు భావిస్తోంది.

టైటానిక్ నౌక ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో ఈ జలాంతర్గామి శకలాలను గుర్తించారు.

టైటానిక్ యాత్రకు బయలుదేరిన ఈ జలాంతర్గామి ఆదివారం నుంచి సముద్రంలో కనిపించకుండా పోయింది.

ఈ సబ్‌లో ఓషన్ గేట్ సీఈఓ 61 ఏళ్ల స్టాక్టన్ రష్, 48 ఏళ్ల బ్రిటిష్ పాకిస్తానీ వ్యాపారవేత్త షహజాదా దావూద్, 19 ఏళ్ల ఆయన కొడుకు సులేమాన్, 58 ఏళ్ల బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ ఉన్నారు. దీనిలోని ఐదో వ్యక్తి 77 ఏళ్ల పాల్ హెన్రీ నార్గోలెట్. ఆయన మాజీ ఫ్రెంచ్ నావీ డ్రైవర్, ప్రముఖ అన్వేషకులు.

గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ ఈ శిథిలాలు టైటాన్ సబ్‌మెర్సిబుల్‌వి లాగే ఉన్నాయని చెప్పారు.

టైటాన్ పేలుడుకు ఏది కారణం అనేది స్పష్టంగా తెలీడం లేదన్నారు.

ఉపరితలంతో టైటాన్‌కి సంబంధాలు తెగిపోయిన తర్వాత, భారీ పేలుడుతో శబ్దాలను విన్నట్లు సీబీఎస్ న్యూస్‌కి నేవి అధికారులు తెలిపారు.

ఈ జలాంతర్గామి తప్పిపోయిన తర్వాత దీని కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ బృందాలు ఈ వెతుకులాటలో భాగమయ్యాయి.

‘‘ఐదుగురు అన్వేషకులను కనుగొనేందుకు సహాయక సిబ్బంది నిబద్ధతను మేం అభినందిస్తున్నాం. మా సిబ్బందికి, అన్వేషకుల కుటుంబాలకు సపోర్ట్‌గా రాత్రింబవళ్లు వీరు గాలింపు చర్యలు చేపట్టారు.’’ అని ఓషన్‌ గేట్ తెలిపింది.

టైటానిక్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఉపరితలానికి 3,800 మీటర్ల అడుగున ఉన్న టైటానిక్ (ఫైల్ ఫోటో)

‘ఇప్పటికే 30 సార్లకు పైగా టైటానిక్ శిథిలాలను సందర్శించారు’

సహృదయం గల వ్యక్తుల్లో హార్డింగ్ ఒకరని ఆయన కుటుంబం వర్ణించింది.

‘‘ఆయన ఔత్సాహిక యాత్రికుడు. అది ఏ ఉపరితలంమైనా.. కుటుంబం, వ్యాపారం తర్వాత ఆయన సాహస యాత్రల కోసమే జీవించారు’’ అని హార్డింగ్ కంపెనీ యాక్షన్ ఏవియేషన్ విడుదల చేసిన ప్రకటనలో తమ కుటుంబం తెలిపింది.

సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ దావూద్ ఫ్యామిలీ ఒక ప్రకటన విడుదల చేసింది.

‘‘మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.’’ అని దావూద్ ఫ్యామిలీ తెలిపింది.

ఈ ప్రయాణానికి వెళ్లడానికి ముందు తన మేనల్లుడు సులేమాన్ చాలా భయపడ్డాడని అజ్మేహ్ దావూద్ ఎన్‌బీసీ న్యూస్‌కి తెలిపారు.

కానీ, తన తండ్రిని సంతోషపెట్టేందుకు ధైర్యంగా ఈ ప్రయాణం చేసేందుకు వెళ్లారని అన్నారు.

‘‘ఇది ఇంకా నమ్మశక్యంగా లేదు’’ అని ఆమె తెలిపారు. ఇది అవాస్తవ పరిస్థితి అన్నారు.

అత్యంత భయానక రీతిలో తాను హార్డింగ్, నార్గోలెట్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులను కోల్పోయినట్లు డైవ్ నిపుణుడు డేవిడ్ మెర్న్స్ తెలిపారు.

లోతైన సముద్ర అన్వేషణ రంగంలో నార్గోలెట్ ఒక లెజెండ్ లాంటి వారని అన్నారు.

టైటానిక్‌పై ఆయనకున్న ప్రేమకు నివాళి అర్పించిన నార్గోలెట్ కుటుంబం.. ‘‘ ఆయనలో మేమెప్పటికీ గుర్తుంచుకునే విషయాలు ఏంటంటే, ఆయనకున్న పెద్ద మనసు, ఆయనలో ఉన్న మంచి హాస్యాస్పదం, కుటుంబాన్ని ప్రేమించే విధానం.’’ అని తెలిపింది.

ఇంటికి దూరంగా ఉన్న సముద్రమే ఆయన ఇల్లు అని నార్గోలెట్ దత్త పుత్రుడు తెలిపారు.

తన సవతి తండ్రి ఇప్పటికే 30 సార్లకు పైగా టైటానిక్ నౌక శిథిలాలను సందర్శించినట్లు సీబీఎస్ న్యూస్‌కి చెప్పారు.

‘‘టైటానిక్ అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఆయన తీసుకొచ్చిన ప్రతి కళాకృతిని, అది చిన్నదైనా లేదా పెద్దదైనా వాటిని ఎంతో అభిమానించే వారు. భద్రంగా దాచుకునే వారు’’ అని దత్త పుత్రుడు గుర్తుకు చేసుకున్నారు.

హార్డింగ్, నార్గోలెట్‌లు సభ్యులుగా ఉన్న అమెరికాకు చెందిన ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్ అధ్యక్షుడు రిచర్డ్ గారియెట్ డే కయేక్స్ కూడా వారికి నివాళి అర్పించారు.

తమ సంస్థ హృదయం ముక్కలైందని ఆయన తెలిపారు. వీరి జ్ఞాపకాలు తమకు ఆశీర్వాదాలని, సైన్స్, అన్వేషణ విషయంలో వీరు ఎప్పటికీ తమకి స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు.

ఓషన్ గేట్

ఫొటో సోర్స్, OCEANGATE

ఈ శకలాలను ఎలా గుర్తించారు?

రిమోట్‌తో నియంత్రించే అండర్‌వాటర్ సెర్చ్ వెహికిల్(ఆర్ఓవీ) ద్వారా ఈ శకలాలను గుర్తించారు.

రెండు రకాలైన శకలాలను వారు కనుగొన్నట్లు కోస్ట్ గార్డ్ రేర్ అడ్మిరల్ జాన్ మౌగర్ తెలిపారు. ఒకటి టైటాన్‌కు చెందిన టైల్ కోన్. ఇది వెనుకవైపు ఇంజిన్ వద్ద కోన్ ఆకారంలో ఉంటుంది.

ఇక రెండోది ల్యాండింగ్ ఫ్రేమ్ అని చెప్పారు. ఇవి ఈ సబ్‌మెర్సిబుల్ పేలిపోయింటుందనే దాన్ని సూచిస్తున్నాయని తెలిపారు.

అయితే, ఈ ప్రమాదంలో చనిపోయిన ఐదుగురి మృతదేహాలను వెలికి తీసే అవకాశాలున్నాయా? అనే ప్రశ్నకు మాత్రం మౌగర్ సమాధానం చెప్పలేదు.

ఈ ఆర్ఓవీ ఇంకా ఆ ప్రాంతంలోనే ఉందని, అసలేం జరుగుంటుందా? అనే దానిపై విచారణ కొనసాగుతున్నట్లు మౌగర్ చెప్పారు.

కానీ, సహాయక చర్యల్లో పాల్గొన్న వైద్య పరిశోధకులు, టెక్నిషిన్లు వంటి వారిని వచ్చే 24 గంటల వరకు ఇంటికి పంపించనున్నామని అన్నారు.

శకలాలను సేకరించి, పరిశిలించనున్నామని, ముఖ్యంగా కార్బన్ ఫైబర్ నిర్మాణం ఏ కారణం చేత పేలిపోయి ఉంటుందో వారు పరిశీలించనున్నట్లు చెప్పారు.

ఈ ప్రమాదం నిర్మాణ వైఫల్యం వల్ల జరిగి ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ఇన్వెస్టిగేటర్లు ప్రయత్నిస్తున్నారు.

ఒకవేళ అలానే జరిగి ఉంటే, వేలాది టన్నుల ఈఫిల్ టవర్‌ బరువుకి సమానమైన అధిక పీడనానికి ఈ జలాంతర్గామి గురై ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ప్రొఫెసర్ బ్లెయిర్ థార్న్టన్ చెప్పారు.

‘‘లోపల అత్యంత శక్తిమంతమైన పేలుడు గురించి మేం మాట్లాడుతున్నాం’’ అని బ్లయిర్ చెప్పారు.

పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్లనే ఇలా జరిగి ఉంటుందని కొంతమంది నిపుణులంటున్నారు.

టైటాన్‌ సబ్ మెర్సిబుల్ కోసం వెతికే క్రమంలో ఆ వాహనం శబ్ధాలను కెనడాకు చెందిన ఒక ఎయిర్‌క్రాఫ్ట్ గుర్తించిందని అధికారులు చెప్పిన తర్వాత, అందులోని అయిదుగురు యాత్రికులు ప్రాణాలతోనే ఉండుంటారని కొందరు నిపుణులు భావించారు.

అయితే, ఆ శబ్ధాలకు, సముద్రపు అట్టడుగన తాము గుర్తించిన శకలాల ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేదని ప్రస్తుతం కోస్ట్ గార్డు చెప్పింది.

న్యూఫౌండ్‌ల్యాండ్‌ తీరానికి సుమారు 370 మైళ్ల దూరంలో ఈ టైటానిక్ శిథిలాల ప్రాంతం ఉంది.

టైటానిక్ నౌక ముందు భాగానికి 487 మీటర్ల దూరంలో ఈ సబ్‌మెర్సిబుల్ శకలాలను గుర్తించినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు.

స్టాక్టన్ రష్
ఫొటో క్యాప్షన్, ఓషన్ గేట్ సీఈఓ స్టాక్టన్ రష్

టైటానిక్ యాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న ఈ ఐదుగురు ఎవరసలు?

స్టాక్టన్ రష్

61 ఏళ్ల స్టాక్టన్ రష్ ఓషన్ గేట్ సీఈఓ. టైటానిక్ యాత్రలను ఈ సంస్థ చేపడుతోంది. ఆయన కూడా ప్రమాదానికి గురైన ఈ జలాంతర్గామిలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

ఆయన అనుభవజ్ఞుడైన ఇంజనీర్. ప్రయోగాత్మక విమానాలను రూపొందించిన అనుభవం ఆయనకుంది. ఇతర చిన్న సబ్‌మెర్సిబుల్ వాహనాలపై పనిచేశారు.

2009లో ఓషన్ గేట్ సంస్థను స్టాక్టన్ ఏర్పాటు చేశారు.

లోతైన సముద్ర ప్రయాణాలను ఆస్వాదించే అనుభవాన్ని ప్రజలకు కల్పించాలనే ఉద్దేశ్యతో ఆయన ఈ సంస్థను ప్రారంభించారు.

టైటానిక్ శిథిలాల దగ్గరకి సాహస యాత్రలను ప్రారంభించినప్పుడు, 2021లో ఆయన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు.

ఈ టైటానిక్ నౌకలో ఇంకేం మిగిలి ఉన్నాయో చూసేందుకు 2,50,000 డాలర్లతో అంటే సుమారు రూ.2 కోట్లతో ప్రయాణికులకు ఈ యాత్రలను ఆఫర్ చేస్తోంది.

శిథిలాలున్న ప్రాంతానికి వెళ్లాలంటే, 370 మైళ్ల వరకు ఒక పెద్ద నౌకలో ప్రయాణికులు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత టైటానిక్ శిథిలాలున్న చోటుకి చేరుకునేందుకు ఎనిమిది గంటల పాటు ఒక ట్రక్కు సైజులో ఉండే టైటాన్ అనే సబ్‌మెర్సిబుల్‌లో ప్రయాణించాలి.

2022లో న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడిన సమయంలో తన వ్యాపార విధానాన్ని రష్ సమర్థించుకున్నారు. అంతరిక్షానికి వెళ్లే ఖర్చులో తమ టిక్కెట్ ధర కొంత భాగమేనని అన్నారు.

తాను చదువుకున్న ప్రిన్‌స్టన్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌కి 2017లో రాసిన వ్యాసంలో, ప్రతి ఓషన్ గేట్ యాత్రకు తాను వెళ్తానని రష్ చెప్పారు.

వెండీ రష్‌ను రష్ పెళ్లి చేసుకున్నారు. టైటానిక్ ప్రమాదంలో చనిపోయిన ఇసిడార్, ఇడా స్ట్రాస్‌ల ముని మనరాలే వెండీ రష్.

హమీష్ హార్డింగ్

ఫొటో సోర్స్, LOTUS EYES PHOTOGRAPHY

ఫొటో క్యాప్షన్, దక్షిణ ధృవాన్ని సందర్శించిన, అంతరిక్షయానం చేసిన హమీష్ హార్డింగ్

హమీష్ హార్డింగ్

దుబాయ్‌కి చెందిన ప్రైవేట్ జెట్ డీలర్‌షిప్ కంపెనీ యాక్షన్ ఏవియేషన్‌ను హమీష్ హార్డింగ్ నడుపుతున్నారు.

ఇప్పటికే పలు అన్వేషక యాత్రలను ఆయన విజయవంతంగా చేపట్టారు.

అత్యంత ప్రతికూల వాతావరణం ఉండే దక్షిణ ధృవానికి ఆయన పలుసార్లు వెళ్లి వచ్చారు. 2022లో బ్లూ ఆరిజన్ ఐదవ మానవ అంతరిక్షయానంలో కూడా తాను ప్రయాణించారు.

మరియానా ట్రెంచ్‌లో అత్యంత లోతైన భాగానికి వెళ్లడం ద్వారా ఎక్కువ సమయం పాటు మహా సముద్రం అట్టడుగున గడిపిన రికార్డును కలుపుకుని మూడు గిన్నీస్ వరల్డ్ రికార్డులను ఆయన పొందారు.

2022 వేసవిలో బిజినెస్ ఏవియేషన్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను హాంకాంగ్‌లో పెరిగానని తెలిపారు.

కేంబ్రిడ్జ్‌లో చదువుకునే సమయంలో 1980 మధ్య కాలంలోనే తాను పైలట్‌గా అర్హత పొందినట్లు చెప్పారు.

బ్యాంకింగ్ సాఫ్ట్‌వేర్‌లో డబ్బు సంపాదించిన తర్వాత తాను విమానయాన సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

హార్డింగ్‌తో పాటు పాల్ హెన్రీ నార్గోలెట్ కూడా ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఉన్నారు. ఆయన మాజీ ఫ్రెంచ్ నేవీ డ్రైవర్, ప్రముఖ అన్వేషకులు.

హార్డింగ్‌తో పాటు పాల్ హెన్రీ నార్గోలెట్ కూడా ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్ సభ్యుడు.

సులేమాన్ దావూద్, షహజాద్ దావూద్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, సులేమాన్ దావూద్, షహజాద్ దావూద్

షాహజాద్ దావూద్, సూలేమాన్ దావూద్

బ్రిటీష్ వ్యాపారవేత్త అయిన షాహజాద్ దావూద్ పాకిస్తాన్‌లో అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వారు.

48 ఏళ్ల షాహజాద్ తన 19 ఏళ్ల కుమారుడు సులేమాన్‌తో కలిసి ఈ సాహస యాత్రకు వెళ్లారు.

పాకిస్తాన్ దిగ్గజం, అతిపెద్ద ఎరువుల సంస్థ ఎంగ్రో కార్పొరేషన్‌కు షాహజాద్ దావూద్ వైస్ చైర్మన్.

కాలిఫోర్నియాకు చెందిన రీసెర్చ్ సంస్థ ఎస్ఈటీఐ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు తన కుటుంబానికి చెందిన దావూద్ ఫౌండేషన్‌లో ఆయన పనిచేశారు.

కింగ్ చార్లెస్ 3 ఏర్పాటు చేసిన రెండు చారిటీలు బ్రిటీష్ ఏసియన్ ట్రస్ట్, ది ప్రిన్స్ ట్రస్ట్ ఇంటర్నేషనల్‌కు మద్దతుదారుడిగా ఉన్నారు.

షాహజాద్ కుమారుడు సులేమాన్ గ్లాస్గోలోని స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

పాల్ హెన్రీ నార్గోలెట్

ఫొటో సోర్స్, JOEL SAGET/AFP

ఫొటో క్యాప్షన్, పాల్ హెన్రీ నార్గోలెట్

పాల్ హెన్రీ నార్గోలెట్

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో హెన్రీ నార్గోలెట్ పాల్ కూడా ఉన్నారు. ఆయన మాజీ ఫ్రెంచ్ నావీ డ్రైవర్, ప్రముఖ అన్వేషకులు.

హార్డింగ్‌తో పాటు పాల్ హెన్రీ నార్గోలెట్ కూడా ఎక్స్‌ప్లోరర్స్ క్లబ్ సభ్యుడు.

ఆయనకు మిస్టర్ టైటానిక్ అనే నిక్‌నేమ్ కూడా ఉంది. ఇతర అన్వేషణల కంటే ఎక్కువ కాలం పాటు శిథిలాల వద్దనే గడిపారు. దీని శిథిలాలు కనుగొన్న రెండేళ్ల తర్వాత అంటే 1987లో తొలిసారి ఈ సాహస యాత్రకు వెళ్లారు.

టైటానిక్ శిథిలాల హక్కులు కలిగి ఉన్న కంపెనీలో నీటి అడుగున పరిశోధనలకు డైరెక్టర్‌గా ఉన్నారు.

కంపెనీ ప్రొఫైల్ ప్రకారం, వెలికి తీసిన వేలాది టైటానిక్ కళాకృతులకు నార్గోలెట్ పర్యవేక్షిస్తున్నారు.

ఫ్రాన్స్‌లో తమకు నార్గోలెట్ సూర్ హీరో అని ఆయన కుటుంబ ప్రతినిధి చెప్పారు.

సబ్‌మెర్సిబుల్ ఎక్కడానికి కొద్ది సేపటికి ముందు కూడా ఈ శిథిలాల నుంచి అవశేషాలను తీసుకొచ్చేందుకు వచ్చే ఏడాది కూడా తాను యాత్రను చేపట్టాలనుకుంటున్నట్లు తెలిపారు.

వీడియో క్యాప్షన్, టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో టైటానిక్ శిథిలాలు చూడ్డానికి వెళ్ళిన అయిదుగురూ చనిపోయారు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)