ఓషన్ గేట్ ఎక్స్‌పెడిషన్స్: టైటానిక్ షిప్‌ను చూపించే ఈ కంపెనీ వాహనం సముద్రంలో గల్లంతు...

ఫొటో సోర్స్, Reuters
టైటానిక్ శిథిలాలను చూసేందుకు ప్రజల్ని తీసుకెళ్లే ఒక సబ్‌మెర్సిబుల్(నీటి లోపలికి వెళ్లే వాహనం) అట్లాంటిక్ సముద్రంలో తప్పిపోయింది.
కనిపించకుండా పోయిన ఈ వాహనం జాడ తెలుసుకునేందుకు వెతుకులాట ప్రారంభించారు. దీనిని కనిపెట్టే ఆపరేషన్ కొనసాగుతున్నట్లు బోస్టన్ తీర ప్రాంతానికి చెందిన అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.
అయితే, ఈ వాహనంలో ఎంత మంది ఉన్నారన్నది ఇంకా తెలియలేదు. ఇందులో ఉన్నవారంతా గల్లంతయినట్లు భావిస్తున్నారు.
సముద్రంలో మునిగిపోయిన ఒకప్పటి నౌక ‘టైటానిక్’ శిథిలాలను చూసేందుకు పర్యాటకులను, నిపుణులను ఈ సబ్‌మెర్సిబుల్ వాహనం ద్వారా నీటి లోపలికి వెళ్తుంటారు.
లోతైన సముద్ర యాత్రల కోసం సబ్‌మెర్సిబుల్స్‌ను పంపే ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.
తన సాహస సముద్ర యాత్రలో ఒకటి మొదలు కాబోతుందని అందులో పేర్కొంది.
టైటానిక్ శిథిలాలను చూసేందుకు 8 రోజుల పాటు సాగే ఈ సాహస యాత్ర కోసం ఔత్సాహికుల నుంచి 2,50,000 డాలర్లు వసూలు చేస్తుంది ఈ కంపెనీ. అంటే భారతీయ కరెన్సీలో రూ.2 కోట్ల పైమాటే.
రోజువారీ జీవితం నుంచి బయటికి వచ్చి, ప్రపంచంలో అసాధారణమైన విషయాలను చూడాలనుకునేవారికి ఇదొక అవకాశం. అందుకే ఈ కంపెనీ తన కార్బన్ ఫైబర్ సబ్‌మెర్సిబుల్‌లో ప్రయాణానికి ఇంత వసూలు చేస్తుంది.
ఈ ప్రమాదం అంశంపై ఓషన్‌గేట్ సంస్థను బీబీసీ సంప్రదించింది. కానీ, అటువైపు నుంచి స్పందన రాలేదు.

ఉపరితలానికి 3,800 మీటర్ల అడుగున టైటానిక్ శిథిలాలు
అట్లాంటిక్ సముద్రం కింద ఉపరితలానికి 3,800 మీటర్ల అడుగున టైటానిక్ శిథిలాలు ఉన్నాయి.
ఇది కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ తీర ప్రాంతానికి 600 కి.మీల దూరంలో ఉంది.
1912 నాటికి అతిపెద్ద నౌకగా పేరున్న టైటానిక్, సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్ ప్రయాణిస్తుండగా, ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగిపోయింది.
ఈ నౌకలో ఉన్న 2,200 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండగా.. వారిలో 1,500 మందికి పైగా మరణించారు.
1985లో దీని శిథిలాలను కనుగొన్నారు.

‘గంటల పాటు సముద్రం అడుగునే’
సముద్భ గర్భంలోని విశేషాలను ప్రజలకు చూపించేందుకు ‘‘ఓషన్ గేట్’’ ప్రయత్నించింది.
ఎలాన్ మస్క్, రిచర్డ్ బ్రాస్నన్ , జెఫ్ బెజోస్ లాంటి వారు అంతరిక్ష వాణిజ్య పర్యటనలకు వ్యూహాలు రచించినట్లే, సముద్ర గర్భంలో పర్యటనలకు కూడా ఈ సంస్థ ప్రణాళికలు రచించింది.
డబ్బులు ఉంటే చాలు, పెద్దగా నైపుణ్యాలు లేకపోయినా ఈ పర్యటనలకు వెళ్లొచ్చు.
సముద్ర గర్భంలోని జీవజాతులపై సమాచారం అందించడంతోపాటు అక్కడి ప్రకృతి చిత్రాలు తీయడం, శాస్త్రవేత్తలకు తోడ్పడటం లాంటి అంశాల్లోనూ ఈ పర్యటనలు ఉపయోగపడే అవకాశముంది.
‘‘నేను మిలియనీర్‌ను కాదు. అయితే, దీని కోసం ఎప్పటినుంచో డబ్బులు పోగు చేసుకున్నాను. టైటానిక్ చూడటం కోసం నేను చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది. కారు కొనుక్కోలేదు. ఇప్పటివరకు పెళ్లి కూడా చేసుకోలేదు. పిల్లలను కనలేదు. ఇవన్నీ టైటానిక్ చూడటం కోసమే’’అని అంతకుముందు ఈ యాత్ర చేసిన రోజాస్ అనే ఒక పర్యాటకురాలు బీబీసీకి తెలిపారు.
మరోవైపు అంతకుముందు ఈ పర్యటన చేసిన రోస్ కూడా, పర్యటనతో సముద్ర గర్భంలోని టైటానిక్ చుట్టుపక్కల పరిశోధన చేపట్టేందుకు, అక్కడి నీటి నమూనా సేకరించేందుకు ఇదొక మంచి అవకాశమన్నారు.
‘‘సముద్ర గర్భంలో చాలా విశేషాలు ఉంటాయి. దీని గురించి మనకు అందుబాటులోనున్న సమాచారం చాలా తక్కువ. ఈ సముద్రంలోని మార్పులు ప్రపంచం మొత్తంపైనా ప్రభావం చూపిస్తాయి’’అని రోస్ చెప్పారు.
రోస్, రోజాస్‌లు పర్యటించిన సబ్‌మెర్సిబుల్, రెండు గంటలకు పైగా సముద్రం అడుగున గడపడంతో వారు అక్కడి జీవజాతులన్నింటినీ చూడగలిగారు.
తాజాగా, టైటానిక్‌ను చూపించడానికి వెళ్లిన సబ్ మెర్సిబుల్ వాహనం గల్లంతు కావడంతో ఆందోళన నెలకొంది.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్: సరిగ్గా 110 ఏళ్ళ కిందట మునిగిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఏలియన్స్ తరహా జీవ వ్యవస్థ ఆర్కిటిక్ సముద్ర గర్భంలో ఉందా?
- మొక్కల వ్యర్థాలు చేపలకు ఆహారం.. చేపల వ్యర్థాలు మొక్కలకు ఆహారం.. వృధా ఆహారాన్ని ఉపయోగించుకోవటం ఎలా?
- అటకామా అగాధంలో 8000 మీటర్ల లోతుకు వెళ్లొచ్చిన తొలి శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు
- సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలుడును శాటిలైట్లు ఎలా గుర్తించగలిగాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














