టైటాన్ సబ్ మెర్సిబుల్: ఆక్సీజన్ తగ్గినా, స్పృహ కోల్పోయినా యాత్రికులను బతికించవచ్చా?

ఫొటో సోర్స్, AMERICAN PHOTO ARCHIVE/ALAMY
- రచయిత, న్యూఫౌండ్‌లాండ్ నుంచి ఎలాయిస్ అలానా, నడిన్ యూసిఫ్.. లండన్ నుంచి అలెక్స్ థెరీన్, క్యాథరీన్ ఆర్మ్‌స్ట్రాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
అట్లాంటిక్ మహా సముద్రంలో మిస్సయిన టైటాన్ సబ్ మెర్సిబుల్ కోసం అన్వేషణ తీవ్రంగా కొనసాగుతోంది. దీన్ని వెతికే పనిలో కొత్త కొత్త యంత్రాలను రంగంలోకి దించుతున్నారు.
సముద్రంలో వేల అడుగుల నీటి లోతులో, ఒక సబ్‌మెర్సిబుల్‌లో ఇరుక్కుపోవడం చాలా భయంకరమైన ఘటన. పైగా, అందులో ఆక్సీజన్ నిల్వలు నిమిష నిమిషానికి తగ్గుతుండటం మరింత భయంకరంగా మారుతోంది.
అందులోని అయిదుగురు యాత్రికుల పరిస్థితి ఏంటన్న దానిపై ఇంకా ఏ కబురూ లేదు.
ఒకవేళ ఆ సబ్ మెర్సిబుల్ ఇప్పటికీ ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా, మంచి స్థితిలోనే ఉండి ఉంటే, అందులో మరికొన్ని గంటలకు సరిపడా మాత్రమే ఆక్సీజన్ నిల్వలు మిగిలి ఉండొచ్చని భావిస్తున్నారు.
అందుకే, కాలంతో పోటీ పడుతూ సబ్ మెర్సిబుల్ ఆచూకీని కనుక్కోవాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అయితే, ఆక్సీజన్ ఎంతసేపు మిగిలి ఉంటుంది అని చెప్పడానికి కచ్చితమైన టైమ్‌లైన్ అంటూ ఏమీ లేదు. పరిస్థితులను బట్టి, సబ్ మెర్సిబుల్‌లో ఉన్నవారిలో కొందరు అనుకున్నదానికంటే ఎక్కువ కాలం బతికి ఉండవచ్చని న్యూఫౌండ్‌లాండ్‌లోని సెయింట్ జాన్స్ మెమోరియల్ యూనివర్సిటీ హైపర్‌బరిక్ మెడిసిన్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ కెన్ లీడెజ్ అభిప్రాయపడ్డారు.
‘‘లోపల ఎంత చల్లదనం ఉంది, ఆక్సీజన్‌ను వారు ఎంత ప్రభావవంతంగా వాడుకుంటారనే అంశంపై ఆధారపడి ఉంటుంది. చలికి వణుకు పుట్టినప్పుడు చాలా ఆక్సీజన్ అవసరం అవుతుంది. అందరూ ఒక్కదగ్గర చేరి ఒంట్లోని వేడిని ఆదా చేసుకోవచ్చు’’ అని ఆయన వివరించారు.
‘‘స్విచాఫ్ చేస్తే లైట్ పోయినట్లుగా ఆక్సీజన్ వెంటనే తగ్గిపోదు. ఇది పర్వతాన్ని ఎక్కడం లాంటిది. ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు జీవక్రియ నెమ్మదిస్తుంది. అప్పుడు మీరు ఎంత వేగంగా పర్వతాన్ని అధిరోహించగలరు. అలాగే ఇది కూడా’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, OCEANGATE
సబ్ మెర్సిబుల్ లోపల ఎలాంటి పరిస్థితి ఉందో మనకు తెలియదని లీడెజ్ అన్నారు. అయితే పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం వ్యక్తికి వ్యక్తికి వేరుగా ఉంటుందని, కొందరు అనుకున్నదాని కంటే ఎక్కువ కాలం మనుగడ సాగించగలరని ఆయన చెప్పారు.
యూఎస్ కోస్ట్ గార్డ్ రియర్ అడ్మిరల్ జాన్ మౌగర్ బుధవారం మాట్లాడుతూ, ‘‘సబ్ మెర్సిబుల్‌లో ఉన్న ప్రతీ యాత్రికుడి ఆక్సీజన్ వినియోగపు రేటు ఎంతో మాకు తెలియదు’’ అని అన్నారు.
ఆక్సీజన్ నిల్వలు తగ్గిపోవడం ఒక్కటే ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న ప్రమాదం కాదని డాక్టర్ లీడెజ్ చెప్పారు.
ఆ నౌకలో విద్యుత్ శక్తి నిలిచిపోయి ఉండొచ్చు. సబ్ మెర్సిబుల్ లోపలి ఆక్సీజన్, కార్బన్ డయాక్సైడ్‌ల స్థాయిలను నియంత్రించడంలో విద్యుత్ పాత్ర కూడా ఉంటుంది.
ఆక్సీజన్ స్థాయిలు పడిపోయిన కొద్ది, అందులో కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇలా జరిగితే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడవచ్చు.
‘‘కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగిన కొద్దీ శరీరం మందకొడిగా మారుతుంది. మత్తు మందు పీల్చినట్లుగా నిద్రలోకి జారుకుంటారు. వ్యక్తి రక్త ప్రవాహంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు ఎక్కువగా చేరితే హైపర్‌కాప్నియాకు గురవుతారు. వెంటనే తగిన చికిత్స అందకపోతే మరణిస్తారు’’ అని చెప్పారు.
ఆన్‌లైన్‌లో టైటాన్ సబ్ మెర్సిబుల్ లోపలి భాగాన్ని చూసినట్లు రాయల్ నేవీ సబ్ మెరైన్ మాజీ కెప్టెన్ ర్యాన్ రామ్‌సే చెప్పారు. అయితే, అందులో కార్బన్ డయాక్సైడ్ వాయువును బయటకు పంపించే ‘‘స్కబ్బర్స్’’ అని పిలిచే ఏర్పాటు తనకు కనిపించలేదని ఆయన తెలిపారు.
‘‘టైటాన్‌లో ఉన్న వారందరికీ అదే అతిపెద్ద సమస్య’’ అని ఆయన చెప్పారు.
అలాగే వారందరూ హైపోథెర్మియాకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ స్థితిలో వారి శరీరాలు పూర్తిగా చల్లబడిపోతాయి.
ఒకవేళ ఆ సబ్ మెర్సిబుల్ సముద్ర గర్భంలో ఉంటే అక్కడ నీటి ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నౌకలో కరెంట్ కూడా లేకపోతే, అక్కడ ఉష్ణం పుట్టే పరిస్థితే ఉండదు. దీంతో వారు హైపోథెర్మియాకు గురికావొచ్చు’’ అని డాక్టర్ లీడెజ్ అన్నారు.
‘‘ఒకవేళ వారి శరీరాలు పూర్తిగా చల్లబడిపోయి, స్పృహ కోల్పోతే వారిని కాపాడగలిగే అవకాశం ఉంటుంది. ఈ విషయం రెస్కూ టీమ్‌కు కూడా తెలుసు. ఈ పరిస్థితుల్లో స్పృహ కోల్పోయినప్పుడు, శరీరం తనంతట తానుగా మనుగడ కోసం పోరాటం మొదలుపెడుతుంది.
కానీ, వారు సృహ కోల్పోతే రెస్క్యూ టీమ్‌కు ఎలాంటి సంకేతాలను పంపలేరు. ఉదాహరణకు సబ్ మెర్సిబుల్ గోడలను బాదడం ద్వారా సంకేతాలు పంపడం వంటివి చేయలేరు.
వారు ఒకవేళ అపస్మారక స్థితిలోకి వెళితే, రెస్క్యూ టీమ్‌కు సహాయపడలేరు’’ అని డాక్టర్ లీడెజ్ వివరించారు.
బహుశా సబ్ మెర్సిబుల్‌లో కొద్దిపాటి ఆక్సీజన్ మాత్రమే మిగిలి ఉండొచ్చని కోస్ట్‌గార్డ్ హెచ్చరించింది.
నెమ్మదిగా శ్వాస తీసుకోవడం ద్వారా వారు మరికొంత సమయం పాటు అందులోని ఆక్సీజన్‌ను ఉపయోగించుకోవచ్చని రామ్‌సే అన్నారు. కానీ, వారు ఉన్న ఒత్తిడిలో ఇలా నెమ్మదిగా శ్వాస తీసుకోడం అసాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
సబ్ మెర్సిబుల్‌లో ఆహారం కూడా పరిమిత స్థాయిలో ఉందని, అయితే ఎంత ఉందనేది మాత్రం చెప్పలేమని కోస్ట్‌గార్డ్ తెలిపింది.
గాలింపు చర్యలను వీలైనంత ఎక్కువ సేపు కొనసాగించాలని డాక్టర్ లీడెజ్ కోరారు. ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, ఆక్సీజన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ వారు బతికే అవకాశం ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘వారిలో ఎవరైనా ప్రాణాలతో బతికి బయటపడొచ్చు. కానీ, ఇది వారిపైనే ఆధారపడి ఉంటుంది. కానీ, కచ్చితంగా వారు ఇప్పటికీ బతికే ఉండొచ్చు’’ అని లీడెజ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ‘అమరుల’ స్మారకం: 3 ఎకరాల ప్రాంగణంలో ‘త్యాగాల దివ్వె’.. 150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం
- సోయం బాపూరావు - ఎంపీల్యాడ్స్: ఈ నిధులతో ఎంపీలు సొంత ఇల్లు కట్టుకోవచ్చా? 9 సందేహాలు, సమాధానాలు
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- భారత్, అమెరికాలు మాట్లాడుకోని ఆ ఒక్క విషయం
- మణిపుర్: వందల చర్చిలను ధ్వంసం చేశారని క్రైస్తవ సంఘాల ఆరోపణ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















