డ్రమ్మండ్ స్ట్రీట్‌-లిటిల్ ఇండియా: ఏళ్లు గడిచిన కొద్దీ లండన్‌లో భారతీయ భోజనానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది ఎందుకు?

లిటిల్ ఇండియా

ఫొటో సోర్స్, Ajay Shah

    • రచయిత, మీరా దత్తాని
    • హోదా, బీబీసీ ట్రావెల్

అసలైన దక్షిణ ఆసియా అనుభవాన్ని ఆస్వాదించాలంటే లండన్‌లో కనిపించే లిటిల్ ఇండియాను మించిన ప్రదేశం ఉండదు.

లండన్‌లోని డ్రమ్మండ్ స్ట్రీట్‌ను మీరు అంత తేలిగ్గా వదలాలని అనుకోరు. సెంట్రల్ లండన్‌లోని యూస్టన్ స్టేషన్‌కు పశ్చిమంగా ఉండే డ్రమ్మండ్ వీధంతా బేస్మెంట్ ఫ్లాట్లు, రెస్టారెంట్లు, షాపులతో నిండి ఉంటుంది. స్టేషన్ నుంచి ఇక్కడకు సులభంగా నడిచి రావచ్చు.

కానీ, ఆ వీధిని కాస్త నిశితంగా పరిశీలిస్తే, దక్షిణ ఆసియాకు చెందిన అనేక రెస్టారెంట్లు కనిపిస్తాయి. ఆ రెస్టారెంట్లలో భారతీయులు ఇష్టంగా తినే మసాలా దోశలు , ముంబయి తరహా స్ట్రీట్ ఫుడ్, లాహోరీ మాంసం కబాబ్‌లు, దక్షిణ ఆసియాకు చెందిన మిఠాయిలు, తినుబండారాలు కనిపిస్తాయి. భారతీయ వివాహాల్లో వడ్డించే వంటల్లో వాడే మసాలాలు, పప్పులు, పచ్చళ్ళు, పిండులు కూడా లభిస్తాయి.

నేను 1980లలో లండన్‌లో పెరగడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో లభించని ఫుడ్ కోసం కుటుంబంతో కలిసి ఇక్కడకు వస్తూ ఉండేవాళ్ళం.

30 సంవత్సరాల తర్వాత బహుశా యూకేలోనే అత్యంత పాత దక్షిణ ఆసియా శాకాహార రెస్టారెంటు దివానా భేల్ పూరీ హౌస్‌లో కూర్చుంటే, రెస్టారెంట్ ఇంటీరియర్స్, గోడల మీదున్న చిత్రాల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదని అనిపించింది. అది 1971 నుంచి నాకిష్టమైన రెస్టారెంట్.

ఇక్కడ వడ్డించే ఆహారం ఇప్పటికీ రుచికరంగానే ఉంది. ఈ రెస్టారెంట్లో 30 సంవత్సరాల పాటు చెఫ్‌గా పని చేసిన వ్యక్తి ఇప్పుడా రెస్టారంట్ యజమానిగా మారారు. ఆయనిప్పుడు అదే వీధిలో ఉన్న చట్నీస్ రెస్టారెంట్ కూడా నిర్వహిస్తున్నారు.

లివర్‌పూల్‌లోని ఒక రెస్టారెంట్‌లో భారతీయ భోజనం చేస్తున్న బ్రిటన్ యువతులు

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణ ఆసియాకు చెందినవారు 17వ శతాబ్దం మధ్య నుంచీ లండన్‌లో నివసిస్తున్నారు. ఈస్ట్ ఇండియాకు చెందిన నౌకలు లండన్ రావడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఇక్కడకు దక్షిణ ఆసియా వారు రావడం మొదలయింది.

కానీ, ఎక్కువ మంది భారతదేశానికి స్వతంత్య్రం వచ్చిన తర్వాత 20వ శతాబ్దం మధ్య నుంచీ భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి రావడం మొదలుపెట్టారు. యుద్ధం తర్వాత బ్రిటన్ పునర్నిర్మాణానికి, ఇక్కడి నేషనల్ హెల్త్ సర్వీస్‌లో పని చేసేందుకు, లేదా ఇక్కడ చదువుకోవడానికి ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు.

1960, 70లలో తూర్పు ఆఫ్రికాలో నివసించే ముఖ్యంగా గుజరాతీ, పంజాబీ జనాభా వలస రావడం మొదలుపెట్టారు.

మా కుటుంబం కూడా ఇక్కడకు అలాగే వచ్చింది.

ఆ సమయంలో లండన్‌లో నివసించే సౌత్ ఆసియా జనాభా ఇంటి రుచులు ఆస్వాదించాలంటే, డ్రమ్మండ్ స్ట్రీట్‌కు రావల్సిందే. ఇక్కడ చాలా కెఫెలు, చిన్న చిన్న రెస్టారెంట్ల నిర్వహణ కుటుంబ వ్యాపారాలుగా సాగేవి.

రీజెంట్స్ పార్క్‌కు, బ్రిటిష్ లైబ్రరీకి మధ్యలో ఉన్న ఈ చిన్న వీధి రైల్వే స్టేషన్‌కు దగ్గరగా ఉంటుంది. దీని ప్రాముఖ్యాన్ని ఈస్ట్ లండన్‌లో లివర్‌పూల్ స్ట్రీట్‌లో ఉన్న బ్రిక్‌లేన్ మింగేసింది.

అక్కడ, 1980ల నుంచీ పెద్ద సంఖ్యలో బంగ్లాదేశీ రెస్టారెంట్లు పుట్టుకొచ్చాయి. ఆ ప్రాంతాన్ని బంగ్లా టౌన్ అని పిలుస్తారు.

కానీ, బ్రిక్‌లేన్‌లో క్లబ్‌లు, షాపులు, బార్లతో పాటు ట్రూమన్ బ్రివరీ కూడా ఉంది. దాంతో, ఇది లండన్ ప్రజలను, పర్యటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది.

డ్రమ్మండ్ స్ట్రీట్ మాత్రం పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోకుండా పాత తరహాలోనే ఉండిపోయింది. అందుకే చాలా మంది పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు ఇంకా ఇక్కడకు వస్తూ ఉంటారు.

సమోసాలు

ఫొటో సోర్స్, AJAY SHAH

ప్రస్తుతం, యూకేలో ఉన్న ప్రతీ పట్టణంలోనూ ఒక సౌత్ ఆసియా రెస్టారెంట్ కానీ, టేక్ అవే కౌంటర్లు కానీ ఉన్నాయి.

డ్రమ్మండ్ స్ట్రీట్ లాంటి వీధులు లండన్ చుట్టుపక్కల కూడా పుట్టుకొస్తున్నాయి.

వెంబ్లీ, ఈలింగ్ రోడ్, గ్రీన్ స్ట్రీట్‌లో భారతీయ తినుబండారాలు అమ్మే గ్రాసరీ షాపులు, చీరల దుకాణాలు, దాబాలు, కెఫెలు పుట్టాయి.

కానీ, డ్రమ్మింగ్ స్ట్రీట్ వీటన్నిటి కంటే ముందు నుంచే లండన్‌లో ఉంది. రాజధాని నగరం నడిబొడ్డున ఉన్న డ్రమ్మండ్ స్ట్రీట్లో దక్షిణ ఆసియా నాడి కనిపించినట్లు లండన్‌లోని ఇతర వీధుల్లో ఎక్కడా కనిపించదు.

రవిశంకర్ రెస్టారెంట్ ముందు కస్టమర్లు క్యూలు ఎలా కట్టేవారో రెస్టారెంట్ మేనేజర్ ఇస్రబ్ మియా గుర్తు చేసుకున్నారు. ఇది 1982 నుంచి నాకిష్టమైన రెస్టారెంట్.

"వెంబ్లీ, సౌత్ఆల్, బర్మింగ్‌హాం, మాంచెస్టర్‌లలో భారతీయ రెస్టారెంట్లు రాకముందు వరకూ కూడా అక్కడి నుంచి మా రెస్టారెంట్ ప్రజలు ‌వచ్చేవారు" అని ఆయన చెప్పారు. .

ఇప్పటికీ చాలా మంది వస్తూ ఉంటారని చెప్పారు.

"చాలా మంది పాత రోజులు తలచుకుంటారు. అందులో కొంత మంది చదువు పూర్తయిన విద్యార్థులు పాత డ్రమ్మండ్ స్ట్రీట్ వెతుక్కుంటూ వస్తారు" అని చెప్పారు.

చాట్, కరకర లాడేభేల్ పూరీ, మురీ మిక్చర్, ఆలూ చాట్ లాంటివి తినడానికి కూడా వస్తూ ఉంటారని చెప్పారు.

ఇక్కడ దొరికే దోశలు, రక రకాల పదార్ధాలతో వడ్డించే తాలీ (పళ్లెంలో భోజనం) తినడానికి కూడా వస్తూ ఉంటారు. ఇందులో రకరకాల పప్పులు, కూరలు, అన్నంతో కానీ, రొట్టెతో కానీ అందిస్తారు.

ఇండియన్ రెస్టారెంట్లతో నిండిన లండన్‌లోని డ్రమ్మండ్ స్ట్రీట్

ఫొటో సోర్స్, BENJAMIN JOHN/ALAMY

ఫొటో క్యాప్షన్, ఇండియన్ రెస్టారెంట్లతో నిండిన లండన్‌లోని డ్రమ్మండ్ స్ట్రీట్

ఎన్నేళ్లయినా ఆకర్షించే ఈ వీధి గొప్పతనం ఏంటి?

"దక్షిణ ఆసియా వంటలను వివిధ స్థాయిల్లో తయారు చేస్తారు. మసాలాలను కూడా వంటలో వాడే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. వాటిని వంట వండుతున్నప్పుడు ఒక ప్రత్యేక సమయంలోనే వేస్తారు" అని ఫుడ్ రైటర్, చెఫ్, అంజుల దేవి అన్నారు.

"ఉదాహరణకు ముందు ఆవాలు వేస్తాం, అవి వేగాక, జీలకర్ర, సోంపు వేస్తాం. ఈ రుచులన్నీ నోటిలో ఆహారం పెట్టుకున్నప్పుడు తెలుస్తాయి. ఇలాంటివి దివానా లాంటి రెస్టారెంట్లలో రుచి చూడవచ్చు" అని చెప్పారు.

ఇక్కడుండే ప్రశాంతమైన వాతావరణం కూడా ఇక్కడకు రావడానికొక కారణం.

"పిన్ని లేదా అత్త ఇంటికి వెళ్ళినప్పుడు దొరికే ఆదరణ మాదిరి ఇక్కడుండే సిబ్బంది నా పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. దాంతో పాటు, కావాల్సినన్ని పచ్చళ్ళు, చట్నీలు కూడా దొరుకుతాయి"అని దేవి చెప్పారు. ఇక్కడకు వచ్చేవారందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.

డ్రమ్మండ్ విల్లా రెస్టారెంట్, మసాలా కింగ్, చట్నీస్, యూస్టన్ స్పైస్, టేస్ట్ ఆఫ్ ఇండియా, షా తందూరీ.. ఇలా ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా ఇదే అభిప్రాయం కలుగుతుంది.

వీటినన్నటినీ కుటుంబాలే నడుపుతున్నాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది కూడా కొన్నేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నారు.

చాలా మంది ఇక్కడ కొన్ని దశాబ్దాల నుంచీ ఉంటున్నారు. చాలా మంది కలిసే స్కూలుకు కూడా వెళ్లారు.

ఇంటి గుమ్మం ముందు నిల్చుని కబుర్లు చెప్పుకునేవారు కనిపిస్తే, అదేమీ అసాధారణమైన విషయమేమీ కాదు.

డ్రమ్మండ్ స్ట్రీట్

ఫొటో సోర్స్, Ajay shah

రావి కబాబ్ షాపు యజమాని తెహ్రీమ్ రియాజ్‌ను కలిసాను.

"1976లో లీజు దొరికేవరకూ మేము ఈ షాపుపై అంతస్తులోనే ఉండేవాళ్ళం" అని చెప్పారు.

"మా అమ్మ లాహోరీ పంజాబీ వంటకాలు వండటం మొదలుపెట్టారు. వాటిని అందరూ ఇష్టపడేవారు" అని చెప్పారు.

అక్కడ పని చేసే చెఫ్ ఖలీద్ జమీల్ 1985లో కశ్మీర్ నుంచి వచ్చారు.

అప్పుడు ఆయనకు 16 ఏళ్ళు. ఆయన గత 35 సంవత్సరాల నుంచీ పాకిస్తానీ వంటలు వండుతున్నారు. నేనామెతో మాట్లాడుతూ ఉండగా.. మా ఇద్దరి మాటలను విన్న ఒక కస్టమర్ మధ్యలో వచ్చి 1990లలో న్యాయ శాస్త్రం చదువుకోవడానికి పాకిస్తాన్ నుంచి లండన్ వచ్చినప్పటి నుంచీ ఆయనకు కావాల్సిన కబాబ్‌లు ఇక్కడే దొరుకుతున్నట్లు చెప్పారు.

"ఇది ఇంటి నుంచి వచ్చిన వంటలా ఉంటుంది" అని బారిస్టర్ సామిర్ మహమూద్ చెప్పారు.

"ఇక్కడ నెమ్మదిగా వండే నిహారి మాంసం కోసం వస్తూ ఉంటాను. అది నన్ను నా బాల్యంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది" అని చెప్పారు.

ఇక్కడ దొరికే వంటలు ఇంటి వంటల్లా ఉండటమే ఈ వీధికున్న ప్రత్యేకత.

అదే రోడ్డు మీద ఆ వీధిలో 1965 నుంచీ ఉన్న అంబాలా మిఠాయి దుకాణం ఉంది. అక్కడ పెళ్లి విందుల్లో వడ్డించే స్వీట్ల నుంచీ, అల్పాహారంలో తినే మిఠాయిలు వరకూ అన్ని రకాలూ లభిస్తాయి.

ప్రత్యేకమైన సోఫా సెట్‌లతో, మెరిసే కౌంటర్లతో, అంబాలా బ్రాండ్ పచ్చళ్ళు, సాస్ సీసాలు నిండిన షెల్ఫ్‌లతో ఈ దుకాణం మిగిలిన షాపుల కంటే భిన్నంగా, కాస్త ఫ్యాన్సీగా ఉంటుంది.

అక్కడకు కొన్ని షాపుల అవతల రిక్కీ, రాఖీ గుప్తా 1979లో స్థాపించిన గుప్తాస్ కనిపిస్తుంది.

అక్కడ ట్రేలలో నిండిన సమోసాలు, కచోరీలు, ఇంట్లో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ దొరుకుతాయి.

ఈ వీధిలో ఒక్క దక్షిణ ఆసియా మాత్రమే కాదు, చైనాకు చెందిన రెస్టారెంట్, సూపర్ మార్కెట్, ఐస్ క్రీమ్ పార్లర్, గ్రేడ్ 2 పబ్‌లు కూడా ఉన్నాయి.

మరో వైపు అక్కడుండే హెయిర్ డ్రెస్సర్లు, మందుల షాపులు, కన్వీనియన్స్ స్టోర్లు కూడా అక్కడి జీవితాన్ని, జీవనశైలిని ప్రతిబింబిస్తాయి.

డ్రమ్మండ్ స్ట్రీట్

ఫొటో సోర్స్, Ajay Shah

అంతర్జాతీయ స్థాయిలో ఆహార వ్యాపారం విస్తరించడానికి డ్రమ్మండ్ స్ట్రీట్ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.

1950లలో పాఠక్ కుటుంబం అక్కడకు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న కెంట్‌లో సమోసాలు అమ్మడం మొదలుపెట్టింది.

ఆ పనిలో వారి 10 ఏళ్ల కొడుకు కిరీట్ కూడా సహాయం చేస్తూ ఉండేవాడు.

1958లో ప్రస్తుతం ఇండియన్ స్పైస్ షాప్ ఉన్న చోటే, కిరీట్ తండ్రి ఎల్ జి పాఠక్ పాఠక్ గ్రాసరీ స్టార్ తెరిచారు.

చాలా మంది మా నాన్నగారితో సహా భారతీయ వంటకాలను బోర్డింగ్ స్కూళ్ళలో చదివే పిల్లలకు పంపేందుకు ఆర్డర్ చేసేవారు.

ఆ తర్వాత ఇదే షాపు ప్రఖ్యాత బ్రాండ్ పాఠక్‌గా మారింది. కిరీట్ పాఠక్ దానిని స్థాపించారు.

ఆయన 2021లో జరిగిన దారుణమైన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య కూడా మరణించారు.

ఇంటింటా వినిపించే కూరల్లో వాడే సాస్‌లు, నిమ్మకాయ, ఆవకాయ పచ్చళ్ళతో కూడిన వారి బ్రాండ్ ఉత్పత్తులు ఒక్క యూకేలోనే మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా అమ్ముతారు.

ప్రస్తుతం ఈ ప్రాంతం కొత్త సవాళ్ళను ఎదుర్కొంటోంది.

మహమ్మారి సమయంలో చాలా మంది లాగే, ఈ వీధిలో ఉండే వ్యాపారులు కూడా ఇబ్బంది పడ్డారు.

కానీ, యూకేలో హైస్పీడ్ రెయిల్ నెట్ వర్క్‌ను నిర్వహిస్తున్న హెచ్‌ఎస్-2 చేపట్టిన నిర్మాణ పనుల వల్ల స్టేషన్ నుంచి వచ్చేవారు తగ్గి, ఈ వీధిలోకి రావడానికి, పార్కింగ్ చేయడానికి అవాంతరంగా మారుతుందేమోనని వ్యాపారులు భయపడుతున్నారు.

ఆ వీధి ప్రాముఖ్యతను గుర్తిస్తూ దానిని పునరుద్ధరించేందుకు నిధులను జారీ చేశారు. దాంతో ఈ వీధి కొత్త రూపం సంతరించుకుని మరింత శోభాయమానంగా, రుచికరమైన వంటకాలను అందించే ప్రాంతంగా తయారవుతోంది.

షాపుల ముందు భాగాలను పునరుద్ధరించి, థీమ్ ఆధారంగా పార్టీల నిర్వహణ, రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ చేయాలనే ప్రణాళికలు కూడా ఉన్నాయి. స్థానిక పర్యావరణ సంస్థలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

"ఇదంతా ఇక్కడ ఆధునిక వాతావరణం సృష్టించడానికి కాదు. గత వైభవాన్ని ఉత్సవంగా జరుపుకోవడానికే"అని యూస్టన్ ప్రాజెక్ట్స్ టౌన్ హెడ్ జార్జీ స్ట్రీట్ రవిశంకర్ రెస్టారెంట్లో పాలకూర చీజ్ దోశ తింటూ చెప్పారు.

కథలతో నిండిన వీధులే నగరానికి ఆత్మగా ఉంటాయి. కొంత మంది వ్యాపారులు వ్యాపారం గురించి ఆలోచిస్తున్నారు.

కానీ, అందరిలోనూ ఒక ఆశావహ దృక్పథం, సంకల్పం కనిపిస్తున్నాయి.

30ఏళ్ల తర్వాత కూడా తన రెస్టారెంట్‌కి వచ్చి కబాబ్‌లను ఆస్వాదించడం రియాజ్‌కి ఒక నమ్మకాన్ని కల్పిస్తుంది.

"ఈ వీధిలో చాలా మంది ఇంటి వంటకాల రుచిని ఆస్వాదిస్తారు. ఆహారానికి చాలా చరిత్ర ఉంది. ఇదెన్నో జ్ఞాపకాలను తట్టి లేపుతుంది. ప్రజల మనస్సులో మాకొక ప్రత్యేక స్థానం ఉండటాన్ని మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా భావిస్తాను" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)