ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పడిపోతున్నాయా... ఆహార నాణ్యతపై ఎవరికి ఫిర్యాదు చేయాలి?

ఇండియన్ బ్రెడ్

ఫొటో సోర్స్, Geeta

ఫొటో క్యాప్షన్, ఇండియన్ బ్రెడ్
    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లలిత ఒక కార్పొరేట్ ఉద్యోగి. ఆమె సాధారణంగా భోజనం బయట నుంచే ఆర్డర్ చేస్తారు. వీకెండ్‌లో మాత్రమే ఇంట్లోనే వంట చేసుకుంటారు.

"వారంలో కనీసం నాలుగుసార్లు ఫుడ్ ఆర్డర్ చేస్తాను. లాక్ డౌన్ కి ముందు ఆఫీసు దగ్గరగా ఉండే ఈటరీస్ కు వెళుతూ ఉండేదానిని. స్విగ్గీ, జొమాటో ద్వారా తరచుగా ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటాను" అని చెప్పారు.

"కొన్ని కొన్ని రెస్టారెంట్లు ఇచ్చే ఆహారం బాగుంటుంది. కొన్నిసార్లు నాణ్యమైన ఫుడ్ లభించదు. అలాంటప్పుడు రివ్యూలు రాసి, ఇక పై ఆ రెస్టారంట్ నుంచి ఆర్డర్ పెట్టడం మానేస్తూ ఉంటాను" అని చెప్పారు.

ఈ రివ్యూలకు రెస్టారెంట్లు స్పందిస్తాయా?

రెస్టారెంట్లు, మెస్‌లు, చిన్న చిన్న హోటళ్లు అందించే ఆహార నాణ్యత పై నియంత్రణ విధించేదెవరు? నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా హోటళ్లు, రెస్టారెంట్లు ఆహారం అందించని పక్షంలో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది?

ఏదైనా రెస్టారంట్‌కు వెళ్ళినప్పుడు లేదా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కానీ వారు తగిన నాణ్యతా ప్రమాణాలను పాటించడం లేదనిపిస్తే, వినియోగదారులెవరికి ఫిర్యాదు చేయాలి?

ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశ్యంతో ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ప్రతీ ఏడాది దేశంలో వివిధ రాష్ట్రాల్లో పాటిస్తున్న ఆహార ప్రమాణాలను పరిశీలిస్తుంది. ఇందు కోసం రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తుంది.

ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా సెప్టెంబరులో 2020-21 సంవత్సరానికి 3వ ఫుడ్ సేఫ్టీ జాబితాను విడుదల చేసింది. తొలిసారిగా ఫుడ్ సేఫ్టీ జాబితాను 2018లో విడుదల చేసింది.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 36 పాయింట్లతో 19వ స్థానంలో ఉంది. తెలంగాణ 49 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. మొత్తం 20 పెద్ద రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ 19వ స్థానంలో ఉంది.

2019-20 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్కోర్ 42.8 కాగా 2020-21 నాటికి 36కి పడిపోయింది.

గుజరాత్ 72 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 8000 రెస్టారెంట్లు, హోటళ్లు ఉన్నాయి.

వెజిటేబుల్ మంచూరియా

ఫొటో సోర్స్, Geeta V

ఫొటో క్యాప్షన్, వెజిటేబుల్ మంచూరియా

ఆహార నాణ్యతకు ప్రమాణాలేంటి?

హోటళ్లు, రెస్టారెంట్లు అందించే ఆహార నాణ్యతను పరిశీలించేందుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చట్టంలో 6వ చాప్టర్ లోని సెక్షన్లకు అనుగుణంగా తనిఖీలు నిర్వహిస్తామని విజయనగరం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఆఫీసర్ ఈశ్వరి చెప్పారు.

ఇందులో భాగంగా రెస్టారంట్ రిజిస్ట్రేషన్‌కు ముందు, లైసెన్స్ ఇచ్చే ముందు, రొటీన్ తనిఖీలు, ఫాలో అప్ ఇన్స్పెక్షన్లు, లైసెన్స్ పునరుద్ధరణకు ముందు లేదా ఏదైనా ఫిర్యాదును స్వీకరించినప్పుడు తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.

ప్రతీ నెలా కనీసం 12 తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

"తనిఖీలలో భాగంగా ఆహార ఉత్పత్తులు నిల్వ చేసే విధానం, వాటి సరఫరా, ప్యాక్ చేసే విధానం, హోటల్ నిర్వహిస్తున్న స్థలం, పరికరాలు, సిబ్బంది, పరిశుభ్రత, ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న విధానాలు, వంటకాల్లో వాడుతున్న పదార్ధాలు, పరిసరాల పరిశుభ్రతను కూడా పరిశీలిస్తాం" అని ఈశ్వరి చెప్పారు.

ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ జాబితా రాష్ట్రాలకు ఎలా స్కోర్ ఇచ్చింది?

1. మానవ వనరులు/సంస్థాగత సమాచారం: (20% ప్రాధాన్యం)

రాష్ట్రాల్లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ కేసులను పర్యవేక్షించే ట్రిబ్యునల్స్, రాష్ట్ర, జిల్లా స్థాయిలో స్టీరింగ్ కమిటీలు, పెండింగ్ లో ఉన్న కేసులు వాటి పర్యవేక్షణ, ఫుడ్ అథారిటీ నిర్వహించే సెంట్రల్ అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో భాగస్వామ్య తీరును పరిశీలిస్తారు.

మానవ వనరులకు సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు 8 పాయింట్లు లభించగా తెలంగాణ కు 9 పాయింట్లు వచ్చాయి.

ఏపీకి ఇంత తక్కువ స్కోర్ ఎందుకు వచ్చింది?

"ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన తర్వాత కేవలం ఎన్‌ఫోర్స్‌మెంట్, కార్యనిర్వాహక విధులు నిర్వహించేందుకు కేవలం 50 మంది సిబ్బందినే కేటాయించారు. జిల్లాల్లో సిబ్బంది యధాతథంగానే ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి కొత్త సిబ్బంది నియామకం జరగలేదు. మానవ వనరుల విషయంలోనే ఏపీ స్కోర్ తగ్గిపోయింది. దీనికి హోటల్ సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదు" అని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ మంజరి బీబీసీకి వివరించారు.

మలయ్ కోఫ్తా

ఫొటో సోర్స్, Geeta v

ఫొటో క్యాప్షన్, మలయ్ కోఫ్తా

2.విధానాల అనుసరణ (కంప్లైయన్స్) (30% ప్రాధాన్యం)

నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన విధానాలను పాటించడం స్కోరింగ్‌లో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం.

ఆహార పరిశ్రమకు సంబందించిన లైసెన్సులు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలతో పాటు గడువు ముగిసిన లైసెన్సుల పునరుద్ధరణ సక్రమ రీతిలో జరుగుతుందో లేదో పరిశీలిస్తారు. వీటికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్న తీరును కూడా పరిశీలిస్తారు.

రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఫుడ్ ఇన్స్పెక్షన్ లు, వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరిస్తున్న తీరు, హెల్ప్ డెస్క్ సౌలభ్యం, వెబ్ పోర్టల్స్ ను కూడా పరిశీలిస్తారు.

ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్‌కు 13 పాయింట్లు లభించగా, తెలంగాణకు 11 పాయింట్లు లభించాయి. గుజరాత్ 19 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉంది.

పొంగల్

ఫొటో సోర్స్, Geeta V

ఫొటో క్యాప్షన్, పొంగల్

3. ఫుడ్ టెస్టింగ్ (20% ప్రాధాన్యం)

ఫుడ్ శాంపిళ్లు పరీక్షించేందుకు తగినంత మంది శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారో లేదోనని పరిశీలిస్తారు.

ఎన్ఏబిఎల్ (ల్యాబులకు ఆమోదం తెలిపే జాతీయ సంస్థ) గుర్తింపు పొందిన ల్యాబులు, అందులో ఉండే సిబ్బందిని బట్టీ ఈ అంశం పై స్కోర్ లభిస్తుంది.

ఈ అంశంలో ఏపీ కి 3 పాయింట్లు రాగా తెలంగాణకు 14 పాయింట్లు లభించాయి.

దీనికి కూడా రాష్ట్ర విభజననే కారణమని డాక్టర్ మంజరి చెప్పారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ లో ఉన్న ల్యాబ్ లో శాంపిళ్లను పరిశీలించేవారు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం రొటీన్ టెస్టులు నిర్వహించేందుకు మాత్రమే ల్యాబ్ ఉండటంతో, తనిఖీలు తగినంత జరగకపోవడం వల్ల కూడా ఈ స్కోర్ తక్కువ అయ్యింది’’ అని డాక్టర్ మంజరి వివరించారు.

విశాఖపట్నం ల్యాబ్ లో అదనపు సదుపాయాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతుండటంతో మరో రెండు మూడు నెలల్లో ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

4. శిక్షణ, సామర్ధ్యం (10% ప్రాధాన్యం)

ఆహార పదార్ధాల నియంత్రణ, శిక్షణ పొందిన ల్యాబ్ సిబ్బంది, వారి సామర్ధ్యాన్ని అంచనా వేస్తారు. రాష్ట్రాల్లో శిక్షణ పొందిన ఫుడ్ సేఫ్టీ సూపర్ వైజర్ల సంఖ్యను కూడా పరిశీలిస్తారు.

ఈ అంశంలో కూడా ఏపీ ప్రమాణాల స్కోర్ 3 మాత్రమే ఉంది. తెలంగాణ స్కోర్ 5 ఉంది.

వెజిటేబుల్ సలాడ్

ఫొటో సోర్స్, Geeta V

ఫొటో క్యాప్షన్, వెజిటేబుల్ సలాడ్

5) వినియోగదారుల అవగాహన (20% ప్రాధాన్యం)

బలవర్ధకమైన ఆహారం, ఈట్ రైట్ క్యాంపస్, భోగ్ లాంటి ఎఫ్ఎస్‌ఎస్‌ఏఐ కార్యక్రమాలు, రెస్టారెంట్లకు ఇచ్చే రేటింగ్‌లు, వంట నూనెను వాడుతున్న తీరు, స్ట్రీట్‌ఫుడ్ హబ్స్2లో ఉన్న పరిశుభ్రత, ప్రభుత్వ కార్యక్రమాలు, జిల్లాల్లో లభించే బలవర్ధక ఆహారం గురించి రాష్ట్రాలు వినియోగదారులకు కలిగిస్తున్న అవగాహనా కార్యక్రమాలను పరిశీలించి ఈ మేరకు స్కోర్ ఇస్తారు.

రాష్ట్రాలు స్వతంత్రంగా అమలు చేస్తున్న అవగాహనా కార్యక్రమాలను కూడా పరిశీలిస్తారు. ఇందులో ఆంధ్ర‌ప్రదేశ్ కు 9 పాయింట్లు రాగా తెలంగాణకు 10 పాయింట్లు లభించాయి.

ఆహార ప్రమాణాల నాణ్యతను పాటిస్తున్న విషయంలో గుజరాత్, కేరళ, తమిళనాడు అత్యధిక స్కోర్ సంపాదించిన మూడు రాష్ట్రాల జాబితాలో ఉండగా, రాజస్తాన్, ఆంధ్ర ప్రదేశ్, బిహార్ చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి.

అయితే, ఈ స్కోర్ తక్కువగా రావడానికి సిబ్బంది కొరత, ల్యాబ్ సదుపాయాలు లేకపోవడమే ప్రధాన కారణమని డాక్టర్ మంజరి అన్నారు.

చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే గోవా నాణ్యతా ప్రమాణాల విషయంలో అగ్రస్థానంలో ఉండగా, త్రిపుర చివరి స్థానంలో ఉంది.

కేంద్ర పాలిత ప్రాంతాల్లో జమ్మూ, కశ్మీర్ ప్రధమ స్థానంలో ఉండగా, లక్షద్వీప్ చివరి స్థానంలో ఉంది.

చాట్

ఫొటో సోర్స్, Geeta V

ఫొటో క్యాప్షన్, చాట్

రివ్యూలను నమ్మవచ్చా?

పార్థ్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇంటికి దూరంగా ఉండటంతో, పనుల ఒత్తిడితో సమయం లేక, భోజనం కోసం ప్రతీ రోజూ హోటళ్లు, ఆన్ లైన్ డెలివరీల మీదే ఆధారపడతారు.

"కోవిడ్ లాక్ డౌన్ తర్వాత హోటల్‌కి వెళ్లి భోజనం ఆర్డర్ చేశాను. తినడం మొదలు పెట్టగానే అది ఫ్రెష్ ఫుడ్ కాదని అర్ధమైపోయింది. హోటల్ మేనేజర్‌ను పిలిచి ఫుడ్ బాలేదని చెప్పగానే, సారీ చెప్పి మరో సారి వేడి ఫుడ్ తెచ్చారు" అని పార్ధ్ చెప్పారు.

"ఆన్‌లైన్ ఆర్డర్ చేసేటప్పుడు మాత్రం కచ్చితంగా రివ్యూలు చూసి ఆర్డర్ పెడతాను" అని ఆయన అన్నారు.

"ఆన్‌లైన్ ఆర్డర్ లలో ఇచ్చిన ఫుడ్ బాలేనప్పుడు కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేసి వెనక్కి పంపిన సందర్భాలున్నాయి" అని చెప్పారు.

"ఫుడ్ గురించి తరచుగా రివ్యూలు పెడుతూనే ఉంటాను" అని చెప్పారు.

ఫుడ్‌ నాణ్యంగా లేకపోతే ఎక్కడ ఫిర్యాదు చేయాలి?

వినియోగదారులు ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఈ-మెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

ఆన్‌లైన్ ఆర్డర్ లు తీసుకున్నప్పుడు కూడా వినియోగదారులకు ఏమైనా ఫిర్యాదులు ఉంటే ఆ ఫుడ్ బిల్, ఆర్డర్ చేసిన ఫుడ్ వివరాలతో ఫిర్యాదు నమోదు చేయవచ్చు.

గులాబ్ జామూన్

ఫొటో సోర్స్, Geeta v

ఫొటో క్యాప్షన్, గులాబ్ జామూన్

చర్యలు ఎలా ఉంటాయి?

తనిఖీ ప్రక్రియ తరువాత అధికారులు తీసుకునే చర్యల గురించి తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ డాక్టర్ కె.శంకర్ బీబీసీకి వివరించారు.

ఏదైనా హోటల్‌లో ఆర్డర్ చేసిన ఫుడ్ నాణ్యంగా లేదనే ఫిర్యాదు వచ్చిన వెంటనే, ఆ ప్రాంత పరిధిలో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ సదరు హోటల్‌కు వెళ్లి తనిఖీ నిర్వహిస్తారు.

తనిఖీ చేసిన తర్వాత సేకరించిన వంటకాలను ల్యాబ్‌లకు పంపించి, వచ్చిన నివేదికల ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు తీసుకుంటుంది.

వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సదరు రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి ఫుడ్ శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తారు. ఫిర్యాదుల ఆధారంగా మాత్రమే కాకుండా, సాధారణ తనిఖీలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.

ల్యాబ్ నివేదికను సదరు హోటల్ యజమానులకు పంపిస్తారు. ఆ నివేదికను సవాలు చేసుకునేందుకు హోటల్ యాజమాన్యానికి 30 రోజుల సమయం ఉంటుంది.

ఈ 30 రోజుల్లో యజమానులు స్పందించని పక్షంలో సంబంధిత అడ్‌జ్యుడికేషన్ ఆఫీసర్ (జాయింట్ కలెక్టర్) దగ్గర కేసు నమోదు చేస్తారు.

అన్‌సేఫ్ (సురక్షితం కానివి) అని వచ్చిన పక్షంలో క్రిమినల్ కోర్టులోనూ, సబ్ స్టాండర్డ్ అని వస్తే జాయింట్ కలెక్టర్ పరిధిలోనూ కేసు ఫైల్ చేస్తారు.

సబ్ స్టాండర్డ్ (నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువ స్థాయి) వస్తే హోటల్ స్థాయి, ఆదాయం, సిబ్బందిని బట్టీ 3లక్షల రూపాయిల వరకూ జరిమానా విధించవచ్చని చెప్పారు. అన్‌సేఫ్ అని నివేదిక వస్తే జాయింట్ కలెక్టర్ నిర్ణయం మేరకు శిక్ష ఉంటుందని చెప్పారు.

"ఒకే హోటల్ మీద పదే పదే ఫిర్యాదులు వచ్చిన పక్షంలో వాటిని పరిశీలించి సదరు రెస్టారెంట్లు తగిన చర్యలు అవలంబించని పక్షంలో వాటి లైసెన్స్ కూడా రద్దు చేస్తాం" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)