విశాఖపట్నం: 18 వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఎర్రమట్టి దిబ్బల వద్ద భూమిని ప్రభుత్వం ఎందుకు చదును చేసింది... ఏమిటీ వివాదం?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
భీమిలికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బల సమీపంలో వందలాది చెట్లను, జీడితోటలను కొట్టివేసి చదును చేయడం వివాదస్పదమైంది.
దీనిపై పర్యావరణవేత్తలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎర్రమట్టి దెబ్బలు వద్ద ఏం జరుగుతుంది? ఎర్రమట్టి దిబ్బలను తవ్వేస్తున్నారా?
అసలు అక్కడ చెట్లను ఎందుకు కొట్టేస్తున్నారు? ఎర్ర మట్టి దిబ్బల సమీపంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చా? బీబీసీ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్.

‘చెట్లను తొలగించి అక్కడే కాల్చేశారు’
చెట్లను తొలగించి చదును చేసిన ప్రాంతంలో బీబీసీ బృందం పర్యటించింది. ఒకప్పుడు ఎర్రమట్టి దిబ్బల్లో భాగంగా కనిపించే ఆ ప్రదేశమంతా పూర్తిగా చదునుగా, ఒక్క మొక్క, చెట్టు లేకుండా కనిపించింది. వందలాది తాటిచెట్లను కుప్పలుగా పోసి, వాటిని అక్కడే కాల్చేసిన అనవాళ్లు ఉన్నాయి. ఇదంతా, ఎర్రమట్టి దిబ్బల అందాలను చూసేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన వాచ్ టవర్‌కు అత్యంత సమీపంలోనే ఉంది.
భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఆనుకుని ఉన్న భూముల్లో అభివృద్ధి పనుల కోసం, ఎర్రమట్టి దిబ్బలకు సమీప గ్రామమైన జె.వి. అగ్రహారం రైతుల నుంచి భూసమీకరణను విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చేపట్టింది.
మొత్తం 38 ఎకరాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్న ఈ ప్రాంతం నుంచే సందర్శకులు గతంలో ఎర్రమట్టి దిబ్బలను చూసేందుకు వెళ్లేవారని స్థానికులు చెప్తున్నారు. ఈ దారి ఎర్రమట్టి దిబ్బలకు పశ్చిమం వైపు ఉంది. ఇక్కడ జీడిమామిడి, మామిడి, తాటిచెట్లు ఉండేవి. ఇప్పుడు అక్కడ అవేవి కనిపించడం లేదు.
ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలకు ఒక వైపు ఐఎన్‌ఎస్ కళింగ, ఇంకోవైపు హౌసింగ్ సొసైటీ స్థలాలు ఉన్నాయి.
ఈ ప్రాంతం కూడా ఎర్రమట్టి దిబ్బల్లో భాగంగానే చూస్తున్నామని పర్యావరణ వేత్తలు అంటున్నారు. ఎర్రమట్టి దిబ్బలకు సమీపంలో ఎటువంటి నిర్మాణాలు జరిగినా అవి కచ్చితంగా ఎర్రమట్టి దిబ్బలకు ప్రమాదంగానే పరిగణించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఎర్రమట్టి దిబ్బలను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తే వాటి విలువ మరెవరికి తెలుస్తుందని జియాలజీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

‘ప్రపంచంలోనే అరుదైనవి’
భీమిలికి సమీపంలో ఉండే ఈ ఎర్రమట్టి దిబ్బల వయసు 18 వేల నుంచి 20 వేల సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఒక వైపు సముద్రం, మరోవైపు ఎర్రమట్టి దిబ్బలను చూసేందుకు పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. భూఉపరితలంపైకి పొడుచుకు వచ్చినట్లు కనిపించే ఈ దిబ్బలు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయని జియాలజీ నిపుణులు చెబుతున్నారు.
''ఎర్రమట్టి దిబ్బలు స్థానిక పరిస్థితుల వల్ల కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలెత్తిన వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడ్డాయి. ఇటువంటివి దక్షిణాసియాలో కేవలం మూడు ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందులో రెండు భారతదేశంలో ఉన్నాయి. తమిళనాడులోని టెరీ దిబ్బలు, విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు అవే. మరొకటి శ్రీలంకలో ఉంది'' అని ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర రెడ్డి బీబీసీతో చెప్పారు.
''జియలాజికల్‌గా ఇది ఇసుక నుంచి రాయి ఏర్పడుతుంది. పొరలు పొరలుగా ఒక చోట చేరిన ఇసుక రేణువులే వేల సంవత్సరాల తర్వాత రాయిగా మారతాయి. అలా ఒకచోట పేరుకుపోయిన ఇసుక క్రమంగా గట్టిపడటం మొదలవుతుంది. అది పూర్తి రాయిగా మారే క్రమంలో కాస్త మట్టిలా అనిపించే విధంగా మారుతుంది. ఇది ఇసుకే అయినా...మట్టిలా గట్టిగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ దిబ్బల్లోని ఇసుక, మట్టి రంగులో ఉండటం వల్ల వీటిని మట్టి దిబ్బలు అనడం అలవాటైపోయింది'' అని రాజశేఖర్ రెడ్డి చెప్పారు.

‘మూడేళ్ల క్రితమే మొదలైంది’
జె.వి. అగ్రహారం, నేరేళ్ల వలస, కాపులుప్పడ, దాకమర్రి, నిడిగట్టు, చిప్పాడ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో భూ సమీకరణకు 2020లోనే వీఎంఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎర్రమట్టి దిబ్బలకు సమీపంలో జరిగిన భూ సమీకరణ అంతా నేరళ్ల వలస మండల పరిధిలో ఉండే ఆర్. వై. అగ్రహారం పంచాయితీ పరిధిలోకి వస్తుంది. భూ సమీకరణలో భాగంగా ల్యాండ్ ఇచ్చిన వారిలో కొందరు డీ-పట్టాదారులు, కొందరు సొంత భూమిని కలిగిన వారు ఉన్నారు.
ఎకరా సొంత భూమి ఇస్తే 950 గజాలు, అదే డీ-పట్టా భూమి తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తే 450 గజాలు అభివృద్ధి చేసిన స్థలాన్ని ఇస్తామని ప్రభుత్వం చెప్పి మూడేళ్ల క్రితమే భూమిని తీసుకుందని స్థానిక రైతులు చెప్తున్నారు.
పర్యావరణంపై అవగాహన కలిగిన భీమిలి సమీపంలోని యువత మాత్రం ఇలా వారసత్వ సంపదైన ఎర్రమట్టి దిబ్బలకు ఆనుకుని అభివృద్ధి పనులు చేయడం మంచి పని కాదని, పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దాని విచ్ఛిన్నానికి పాల్పడుతుందని స్థానికుడైన బాలు బీబీసీతో అన్నారు.
“ఒక హద్దు రాయిని ఏర్పాటు చేసి, అటు ఎర్రమట్టి దిబ్బలు, ఇటు వెంచర్లు వేసుకునే భూమి అన్నట్లు చూపించి...అధికారులు పర్యావరణ వినాశనానికి పూనుకుంటున్నారు. ఎర్రమట్టి దిబ్బలకు అనుకుని 38 ఎకరాల్లో అసలు ఎటువంటి నిర్మాణాలు కడతారు? ఏం చేయబోతున్నారు? అనే విషయాలు చెప్పకుండా అభివృద్ధి పనులకు అంటే సరిపోతుందా?” అని బాలు ప్రశ్నించారు.

‘ప్రభుత్వం పర్యావరణంపై పగబట్టింది’
ఎర్రమట్టి దిబ్బలకు సమీపంలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిలిపి వేయాలని విశాఖ జనసేన నాయకుడు మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలని జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.
“ఎర్రమట్టి దిబ్బల ఉనికిని దెబ్బతీసేలా వీఎంఆర్డీఏ భూ సమీకరణ నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్ధం. దేశ విదేశీ పర్యాటకులను, సినీ పరిశ్రమలను ఆకర్షిస్తున్న వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఎర్రమట్టి దిబ్బలలో లే అవుట్‌లు వేయడం వల్ల పర్యావరణ సమతౌల్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకప్పుడు 1200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దిబ్బలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వలన ప్రస్తుతం 80 ఎకరాలకే పరిమితమయ్యాయి” అని మూర్తి యాదవ్ బీబీసీతో అన్నారు.
“ఎర్రమట్టి దిబ్బల ఉనికికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యలపై గతంలో వుడాకి వీసీగా పని చేసిన కోన శశిధర్ ఒక రిపోర్ట్ రూపొందించారు. దానిని ప్రభుత్వానికి కూడా సమర్పించారు. దానిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఇటీవల కాలంలో ఋషికొండ, ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రాంతాల్లో వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ వేలాది చెట్లు నరికేసి ప్రకృతి విద్వాంసానికి పాల్పడ్డారు. అసలు ఈ ప్రభుత్వం పర్యావరణంపై పగబట్టినట్లు ఉంది” అని మూర్తి యాదవ్ ఆరోపించారు.
భోగాపురం విమానాశ్రయానికి ఎర్రమట్టి దిబ్బల నుంచి వెళ్లేందుకు మార్గం ఉంది. అయితే ఎర్రమట్టి దిబ్బలకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఆ దారిని ప్రభుత్వం కుదించింది. అలాంటిది, ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బలకు అనుకుని ఉన్న 38 ఎకరాలలో అభివృద్ధి పనులకు ఎలా అనుమతులు ఇస్తారని జె.వి. అగ్రహారం గ్రామస్థులు అన్నారు.

ఎర్రగా ఉన్నవన్ని ఎర్రమట్టి దిబ్బలు కావు: భీమిలి తహాశీల్దార్
ఎర్రమట్టి దిబ్బలు దేశంలో ఉన్న 32 నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ సైట్లలో ఇది కూడా ఒకటి. దీనిని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2012లో గుర్తించింది. ఎంతో ప్రాధాన్యత ఉన్న ఎర్రమట్టి దిబ్బలను చర్రిత అనవాళ్లుగా చూసి వాటిని కాపాడాలని పర్యావరణ వేత్తలు అంటున్నారు. కానీ ప్రభుత్వం, అధికారులు వీటిని కూడా అభివృద్ది పనుల పేరుతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు.
అసలు ఎర్రమట్టి దిబ్బల సమీపంలోనే ఇంత పెద్ద ఎత్తున్న అభివృద్ధి పనులకు భూమిని కేటాయించడంపై రెవెన్యూ అధికారులను బీబీసీ ప్రశ్నించింది. భీమిలి తహశీల్దార్ టి. వేణుగోపాల్ దీనికి సమాధానం చెప్పారు.
“ఎర్రమట్టి దిబ్బలున్న ప్రాంతంలో 262 ఎకరాలను జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తించడం జరిగింది. దీనికి కనీసం 50 మీటర్ల మేర బఫర్ జోన్ విడిచి పెట్టి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ ద్వారా వీఎంఆర్డీఏకి అప్పగించిన స్థలం సర్వే నెంబర్లు 75, 86, 87. ఈ సర్వే నెంబర్లకు ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతానికి ఎటువంటి సంబంధం లేదు" అని వేణుగోపాల్ అన్నారు.
భూ సమీకరణలో భాగంగా 2020లోనే ఈ భూమిని వీఎంఆర్డీఏకి ఇచ్చామని ఆయన చెప్పారు. "ఎర్రమట్టి దిబ్బలకు ఏ వైపున తవ్వినా మట్టి ఎర్రమట్టి దిబ్బల్లో ఉన్నట్లే ఉంటుంది. అందుకే ఎక్కడ తవ్వినా ఎర్రమట్టి దిబ్బలు తవ్వేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు” అని వేణుగోపాల్ బీబీసీతో అన్నారు.

భవిష్యత్తులో ఎర్రమట్టి దిబ్బలకు సమీపంలో ఉన్న ఈ స్థలంలో ఏదైనా భారీ నిర్మాణాలు వస్తే, అప్పుడు ఎర్రమట్టి దిబ్బలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కదా అని అడిగితే, "నిర్మాణాలు జరిగినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుని, జియో హేరిటేజ్ సైట్ కి ఇబ్బందులు లేకుండానే చూసుకుంటాం" అని ఆయన బదులిచ్చారు.
మరి భ సమీకరణ చేసేముందు ఎర్రమట్టి దిబ్బలకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశముందా, దీనిపై జియోలజీ నిపుణులను సంప్రదించారా అని ప్రశ్నిస్తే, “ఈ విషయంతో మేం ఎవరిని సంప్రదించలేదు. ఎందుకంటే ఎర్రమట్టి దిబ్బలు, దాని పరిసరాలపై మాకు పూర్తి అవగాహన ఉంది. వీఎంఆర్డీఏకు ఇచ్చిన స్థలానికి ఎర్రమట్టి దిబ్బలకు ఎటువంటి సంబంధం లేదు” అని చెప్పారు.

‘బఫర్ జోన్‌కు అది ఏ మాత్రం సరిపోదు’
సముద్ర మట్టాలు, అక్కడ ఉష్ణోగ్రతలు, మత్స్యసంపద, ఖనిజాల వివరాలు ఇలాంటివన్ని తెలుసుకోవాలంటే సహజ సిద్ధంగా ఉన్న ఎర్రదిబ్బలు, సముద్ర తీరాలు అలాగే ఉండాలి. వాటిని అభివృద్ధి పేరుతో మార్పులకు గురిచేస్తే...భవిష్యత్తు తరాలకు మనం సరైన సమాచారం అందించలేమని జియాలజీ నిపుణులు అంటున్నారు.
“అధికారులు చెప్తున్నట్లు ఎర్రమట్టి దిబ్బలు, డెవలప్ చేస్తున్న స్థలం మధ్య 50 మీటర్లు బఫర్ అనేది ఏ మాత్రం సరిపోదని, ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అభివృద్ధి అంటూ ఎర్రమట్టి దిబ్బల సమీపంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా, అది కచ్చితంగా భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసినట్లే” అని ఆంధ్ర యూనివర్సిటీ జియోలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- Raipur: ఎనిమిదేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














