తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయి, ఇవి తగ్గించుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురుగేశ్ మడకన్ను
- హోదా, బీబీసీ తమిళ్
విటిలైగో అంటే బొల్లి వ్యాప్తి మన దేశంలోని భిన్న ప్రాంతాల్లో 0.25 శాతం నుంచి 4 శాతంగా ఉందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్‌లలో ఇది 8.8 శాతం వరకూ ఉందని వివరిస్తున్నాయి.
ఈ తెల్లని మచ్చలతో కొంతమందికి శారీరక ఇబ్బందులతోపాటు మానసిక సమస్యలూ తలెత్తుతుంటాయి.
బొల్లితో బాధపడేవారిలో చాలా మంది సమాజంలో వివక్ష ఎదుర్కొంటారు. ఫలితంగా వారికి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి.
అసలు ఈ తెల్ల మచ్చలు ఎందుకు వస్తాయి? వీటికి చికిత్స ఏమిటి? తదితర అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఏమిటీ తెల్లమచ్చలు, ఇవి ఎందుకు వస్తాయి?
మన రోగ నిరోధక వ్యవస్థ శరీరంపై దాడి చేయడం వల్లే ఎక్కువగా ఈ తెల్ల మచ్చలు వస్తాయని డెర్మటాలజీ, లాక్టోబేసిల్లస్, లెప్రసీ ఫిజీషియన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ డా. దినేశ్ కుమార్ చెప్పారు.
‘‘చిన్న పిల్లలతో మొదలుపెట్టి పెద్దల వరకూ.. అన్ని వయసుల వారికీ ఈ తెల్లమచ్చలు రావచ్చు. మెలనోసైట్లుగా పిలిచే రంగుకు కారణమయ్యే కణాలు దెబ్బతినడంతో ఈ మచ్చలు వస్తాయి.’’ అని ఆయన అన్నారు.
‘‘మెలనోసైట్లు మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. మన శరీరం గోధుమ రంగులో ఉండటానికి ఇవే కారణం. అయితే, చర్మంలో మెలనోసైట్లు తగ్గిపోవడంతో తెల్లని ప్యాచ్‌ల లాంటి మచ్చలు వస్తాయి.’’ అని ఆయన వివరించారు.
‘‘అయితే, ఒక వ్యక్తిలో ఎందుకు ఈ విటిలైగో మొదలవుతుందో కచ్చితంగా చెప్పలేనప్పటికీ.. సాధారణంగా ఈ మచ్చలు ఎందుకు రావచ్చో చెప్పేందుకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి.’’ అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, DINESH
తెల్లమచ్చలకు కారణాలు ఇవీ..
నరాల సమస్యలతో రక్త సరఫరా నిలిచిపోవడంతో మెలనోసైట్లు దెబ్బతినొచ్చు.
అయితే, మైలనోసైట్లు వాటినవే దెబ్బ తీసుకుంటాయని కొంతమంది పరిశోధకులు భావిస్తున్నారు.
కొన్నిసార్లు మన రోగ నిరోధక వ్యవస్థే శరీరంలోని కొన్ని భాగాలను బయటి భాగాలుగా భావించి దాడి చేస్తుంది. దీన్నే ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అంటారు. ఇది కూడా మెలనోసైట్లు దెబ్బతినడానికి కారణం కావచ్చు.
కొంతమందిలో జన్యుపరమైన సమస్యల వల్ల కూడా తెల్లమచ్చలు రావచ్చని దినేశ్ చెప్పారు. ‘‘థైరాయిడ్ రుగ్మత, మధుమేహం, తీవ్రమైన రక్తహీనత లాంటి సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు.’’ అని ఆయన అన్నారు.
‘‘కొన్నిసార్లు విపరీతమైన ఒత్తిడి కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
తెల్ల మచ్చల్లో రకాలివీ..
శరీరంపై భిన్న భాగాల్లో ఈ తెల్లమచ్చలు రావచ్చు. శరీరంలో ఇవి వచ్చే చోటును బట్టీ భిన్న రకాల పేర్లతో వీటిని పిలుస్తుంటారు.
- లిప్-టిప్-విటిలైగో ముఖ్యంగా పెదాలు, చేతి, కాలి వేళ్లపై వస్తుంది.
- సెగ్మెంటల్ విటిలైగో- ఇది శరీరంలోని ఏదో ఒక భాగంలో మాత్రమే కనిపిస్తుంది.
- జనరలైజ్డ్ విటిలైగో - దీనిలో చర్మం మొత్తం ప్రభావితం అవుతుంది. మెలనోసైట్లు దెబ్బతినడంతో చర్మం మొత్తం తెల్లగా మారిపోతుంది.
- మరోవైపు తెల్లమచ్చలు పెదాలకు లోపలి వైపు, జననాంగాల లోపలి వైపు వస్తే మ్యూకోసల్ విటిలైగోగా చెబుతారు.

ఫొటో సోర్స్, Getty Images
చికిత్సలేమిటి?
ఈ తెల్లమచ్చలకు ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయనే అంశంపై డా. దినేశ్ బీబీసీతో మాట్లాడారు.
‘‘చికిత్సలో భాగంగా నోటిలో వేసుకునే మాత్రలు, చర్మంపై రాసుకొనే క్రీమ్‌లను ఇస్తుంటాం. చాలా ప్రాంతాల్లో కోల్పోతున్న రంగును అడ్డుకునేందుకు ఇవి పనిచేస్తుంటాయి.’’ అని ఆయన అన్నారు.
ఆ తర్వాత చికిత్సగా యూవీ థెరపీ సూచిస్తుంటారు. అంటే ప్రభావిత ప్రాంతాలపై అల్ట్రావయోలెట్ కాంతితో చికిత్స అందిస్తారు.
ఇక మూడోది సర్జరీ. శరీరంలో ఇతర భాగాల్లోని చర్మాన్ని తొలగించి, ప్రభావిత ప్రాంతంలో చికిత్స ద్వారా అమరుస్తారు. దీన్నే ‘‘స్కిన్ గ్రాఫిటింగ్’’ అని అంటారు.
అయితే, తెల్ల మచ్చల వ్యాప్తి ఆగిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే, స్కిన్ గ్రాఫిటింగ్‌ను చేయాల్సి ఉంటుందని, లేకపోతే, దీని వల్ల ఎలాంటి ప్రభావమూ ఉండదని దినేశ్ చెప్పారు.
పూర్తిగా కోలుకోవడం సాధ్యంకాదా?
ఈ విషయంపై దినేశ్ మాట్లాడుతూ.. ‘‘ఈ తెల్లమచ్చలు అనేవి ఆటోఇమ్యూన్ డిసీజ్ వల్ల వస్తాయి. కాబట్టి పూర్తిగా వీటి నుంచి కోలుకోవడం అనేది సాధ్యం కాకపోవచ్చు.’’ అని చెప్పారు.
చికిత్స తర్వాత కూడా మళ్లీ ఈ తెల్లమచ్చలు రావచ్చు. కొన్నిసార్లు ఈ మచ్చలను శరీరంలోని మిగతా ప్రాంతాలకు విస్తరించకుండా ఈ చికిత్సలు అడ్డుకుంటాయి.
అంటే చికిత్సను ఆపేస్తే మళ్లీ ఈ మచ్చల వ్యాప్తి మొదలుకావచ్చు. అందుకే మొదట్లోనే ఈ మచ్చలకు అడ్డుకట్ట వేసేందుకు తొలి దశల్లోనే వైద్యులను సంప్రదించాలని డా. దినేశ్ చెప్పారు.
తగిన చికిత్సలతోపాటు తరచూ వైద్యుల దగ్గరకు వెళ్లడంతో ఈ మచ్చలు మరిన్ని ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చని ఆయన అన్నారు.
ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయా?
చాలా మంది ఈ మచ్చలు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయని భావిస్తుంటారు. అయితే, ఈ వ్యాధి మహమ్మారిలా వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలూలేవని డాక్టర్ దినేశ్ చెప్పారు.
‘‘కొంతమంది పెళ్లికి ముందు మా దగ్గరకు వస్తుంటారు. అయితే, పెళ్లి తర్వాత వారి జీవిత భాగస్వాములకు ఇది వచ్చినట్లు ఎక్కడా కనబడదు.’’ అని ఆయన అన్నారు.
‘‘వారి ఇంట్లో బహుశా తాతయ్య, లేదా నాన్నమ్మలకు ఈ రుగ్మత ఉండొచ్చు. అంతేకానీ, ఒకరిని ముట్టుకోవడంతో ఆ వ్యాధి మనకు రాదు.’’ అని ఆయన తెలిపారు.
చాలా మంది ఈ తెల్లమచ్చలను లెప్రసీ అంటే కుష్టుగా భ్రమపడుతుంటారు. అందుకే విటిలైగో బాధితులను దూరం పెడుతుంటారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని డా. దినేశ్ చెప్పారు.
(గమనిక - ఇది అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి:
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















