టైఫాయిడ్: వర్షాకాలంలో విజృంభించే ఈ వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్. ప్రతిభా లక్ష్మీ
- హోదా, బీబీసీ కోసం
టైఫాయిడ్ లేదా ఎంటరిక్ ఫీవర్ అనే వ్యాధి కలుషిత నీరు, ఆహారం కారణంగా వ్యాపిస్తుంది. ప్రపంచంలో సగానికి పైగా టైఫాయిడ్ కేసులు భారత్‌లోనే నమోదవుతున్నాయి.
రాబోయే వర్షాకాలంలో అంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు కోటి 40 లక్షల టైఫాయిడ్ కేసులు దేశంలో నమోదవుతుండగా, అందులో 10-30 శాతం వరకు కేసులు మరణాలకు దారితీస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
లక్షణాలు
ఈ వ్యాధి సాల్మొనెల్లా టైఫి అనే ఒక సూక్ష్మ జీవి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించాక వ్యాధి లక్షణాలు కనిపించడానికి రెండు మూడు వారాల సమయం పట్టవచ్చు.
టైఫాయిడ్ లక్షణాలు అనేవి సాధారణ జ్వరం నుంచి తీవ్ర ఇన్ఫెక్షన్ అయ్యి, మరణానికి దారితీసే వరకు అనేక రకాలుగా ఉంటాయి.
సాధారణంగా కనిపించే లక్షణాలు
- దీర్ఘకాలిక జ్వరం, కొన్ని సార్లు 103-104 °F కూడా చేరుతుంది.
- జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి.
- నీరసం, అలసట, ఒళ్ళు నొప్పులు.
- వికారం లేక వాంతులు కలగడం.
- కడుపులో నొప్పి స్వల్పంగా మొదలయ్యి, కొన్నిసార్లు చాలా తీవ్రంగా ఉండవచ్చు.
- విరేచనాలు - కడుపు నొప్పితో పాటు ప్రతిరోజు కొన్నిసార్లు రావడం.
- ఆకలి లేకపోవడం లేదా కొద్దిగా తినగానే కడుపు నిండినట్లు అనిపించడం.
- శరీరంపైన గులాబీ రంగులో చిన్నచిన్న మచ్చలు.
- కొన్నిసార్లు పేగుల మీద పుండు అయ్యి, అది పగలడం వల్ల అపస్మారక స్థితికి చేరుకోవడం.

ఫొటో సోర్స్, Getty Images
నివారణ ఎలా?
శుభ్రమైన నీటిని, లేదా వేడి చేసి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి. మరగబెట్టిన పాలను తాగడం శ్రేయస్కరం.
ఏదైనా తినడానికి ముందు, తర్వాత, మలమూత్ర విసర్జన తరవాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో ఈగలు లేకుండా చూసుకోవడం, ఆహార పదార్థాలను మూతతో కప్పి ఉంచటం వంటి ప్రతీ జాగ్రత్త కీలకమైనది.

ఫొటో సోర్స్, Getty Images
టీకా
ముఖ్యంగా భారతదేశంలో చాలా సహజంగా ఈ వ్యాధి వస్తోంది. అయితే, చాలామంది కొంతవరకు రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నారు. ఈ వ్యాధి నివారణకు రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి పూర్తి రక్షణను కలిగించలేవు.
మొదటి రకం టీకా ఆరు నెలల వయసు పిల్లల నుంచి 45 సంవత్సరాల వరకు ఒకే డోస్ తీసుకోవచ్చును. మరొక రకం (unconjugated polysaccharide vaccine) రెండు సంవత్సరాల వయసు దాటిన వారికి ఇస్తారు. ఇది మూడు సంవత్సరాల వరకు పని చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పరీక్షలు
ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్లి, నాకు రెండు మూడు రోజుల నుంచి జ్వరంగా ఉంది అనగానే, కొన్ని పరీక్షల లిస్ట్ రాసి, ఇవి చేయించుకొని రండి అనడం సహజంగా చూస్తుంటాం. అందులో ఒకటి "వైడాల్" టెస్ట్.
టైఫాయిడ్ వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారణ చేయడానికి రక్తం, మూత్రం లేదా మలంలో కల్చర్ టెస్ట్, లేదా సీరం యాంటీజన్/ యాంటీబాడీ టెస్ట్ చేయాలి. కానీ, "వైడాల్" టెస్ట్ చేస్తారు.
జ్వరం వచ్చిన వారం రోజుల తర్వాత "వైడాల్" టెస్ట్ చేయించాలి. మన దేశంలో దాని రిపోర్ట్ లో టైట్రే (titre) 1:160 కన్నా ఎక్కువ ఉంటేనే దానిని 'పాజిటివ్' గా పరిగణించాలి. లేదా, రెండో సారి చేసినపుడు దాని విలువ ముందు కన్నా ఎక్కువ అయ్యి ఉండాలి.
ఇంకా చెప్పాలంటే కొన్ని ఇతర ఇన్ఫెక్షన్స్ సోకినపుడు (cross reactivity వల్ల) వైడాల్ టైట్రే పెరిగే అవకాశం కూడా ఉంది. కానీ, ఎన్నో సందర్భాల్లో రెండు, మూడు రోజుల జ్వరానికి కూడా వైడాల్ చేయించడం చూస్తున్నాం.
రిపోర్టులో 1:80 ఉంటే కూడా 'పాజిటివ్'గా పరిగణించి, డాక్టర్లు 'టైఫాయిడ్' అంటూ చెప్పడం చూస్తుంటాం. అంతేకాకుండా 1:160 ఉంటే 'డబుల్ టైఫాయిడ్' అని కూడా అంటుంటారు.
సాధారణంగా డాక్టర్స్ ఏ జ్వరానికైనా ఏదో ఒక యాంటిబయాటిక్ ఇస్తారు. సాధారణంగా వాడే ఏ యాంటీ బయాటిక్‌తో అయినా టైఫాయిడ్ తగ్గిపోతుంది. కాబట్టి అది వైరల్ జ్వరం అయినా, ఇతర ఏ సాధారణ ఇన్ఫెక్షన్ అయినా లేక టైఫాయిడే అయినా వారంలో తగ్గిపోతుంది.
మరి ఈ వైడాల్ టెస్ట్ చేయించడం వల్ల ఏం లాభం ? అన్ని రిపోర్ట్స్ నార్మల్ వస్తే అనవసరంగా టెస్టులు చేయించారు అని పేషెంట్ అనుకోకుండా పాజిటివ్ అని చెబుతారు. దీంతో తన రోగం ఏంటో తెలిసింది అనే తృప్తి పేషెంట్‌కు, తన కుటుంబానికి కలిగిస్తుంది.
సరిగ్గా పరీక్ష చేసి, చికిత్స ఇచ్చారు అనే నమ్మకం రోగికి కలిగితే డాక్టర్‌కు మంచి పేరు వస్తుంది. చాలా సందర్భాల్లో టైఫాయిడ్ వచ్చినా, రాకపోయినా అందుకే 'వైడాల్' టెస్ట్‌లో వచ్చింది అని నమ్మిస్తారు. ఇది రోగిని ప్రశాంతంగా ఉంచే డాక్టర్ చిట్కా మాత్రమే.
(గమనిక: రచయిత ఒక వైద్యురాలు. ఈ అంశంపై స్థూలమైన అవగాహన కోసమే ఈ కథనం.)
ఇవి కూడా చదవండి
- అమెరికాలో యోగా ఎందుకంత పాపులర్ అయింది? అమెరికా ప్రెసిడెంట్లు, పాప్స్టార్లు కూడా యోగాకు ఎలా ఆకర్షితులయ్యారు?
- రామ్ చరణ్ – ఉపాసన: బొడ్డు తాడు రక్తాన్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నారు? ఎంత ఖర్చవుతుంది
- హంటర్ బైడెన్: పన్ను ఎగవేసినట్లు అంగీకరించిన అమెరికా అధ్యక్షుడి కొడుకు
- టైటానిక్ శిథిలాలను చూడటానికి వెళ్లి సముద్ర గర్భంలో మిస్సయిన తండ్రీ కొడుకులు, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది?
- ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














