ఎస్ఎస్ వైతరణ: టైటానిక్ కన్నా 20 ఏళ్ళ ముందు 700 మందితో గుజరాత్ జలాల్లో మునిగిపోయిన భారీ నౌక... అసలేం జరిగిందో చెప్పడానికి ఒక్కరూ మిగల్లేదు

ఫొటో సోర్స్, FALKRIK GOV.UK
- రచయిత, జైదీప్ వసంత్
- హోదా, బీబీసీ కోసం
టైటానిక్ శిథిలాలను చూసేందుకు ఐదు మంది ప్రయాణికులతో వెళ్లిన ‘టైటాన్ సబ్‌మెర్సిబుల్’ పేలిపోయిందని అమెరికా కోస్ట్ గార్డు వెల్లడించింది.
టైటానిక్ శిథిలాలకు సమీపంలోనే సబ్‌మెర్సిబుల్ శిథిలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఈ సబ్‌మెర్సిబుల్ గల్లంతైందనే వార్తపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. మరోవైపు 110 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్‌కు సంబంధించిన కథనాలు కూడా మీడియాలో వచ్చాయి.
వందేళ్లకుపైనే గడుస్తున్నప్పటికీ నేటికీ టైటానిక్ మునకకు సంబంధించిన చాలా విషయాలు మర్మంగానే మిగిలిపోయాయి.
అయితే, టైటానిక్ మునిగిపోవడానికి 20 ఏళ్ల ముందు, గుజరాత్ జలాల్లో ఒక నౌక శిథిలాలు కనిపించాయి. ఆ నౌకలో 700 మంది ప్రయాణికులు వెళ్లారు. అయితే ఆ నౌక ఎలా మునిగిపోయిందో చెప్పడానికి వారిలో ఎవరూ మిగల్లేదు.
ఆ నౌక పేరు ‘ఎస్ఎస్ వైతరణ’.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త కంపెనీ, తొలి నౌక
ఎస్ఎస్ వైతరణను 1885లో గ్రాంజ్‌మౌత్ డాక్‌యార్డ్ కంపెనీ నిర్మించింది. ప్రస్తుతమున్న ఆధునిక టెక్నాలజీలతోనూ అలాంటి నౌకను నిర్మించేందుకు నెలల సమయం పడుతుంది. అలాంటిది అప్పట్లో దీన్ని నిర్మించడమంటే చాలా కష్టంతో కూడుకున్న పని.
స్కాట్లండ్‌లోని ఫాల్కిర్క్ ఆర్కైవ్స్‌లో గ్రాంజ్‌మౌత్ డాక్‌యార్డ్ కంపెనీకి చెందిన కొన్ని వివరాలు ఉన్నాయి. వీటి ప్రకారం, విలియమ్ మిల్లర్, శామ్యూల్ పోప్‌హౌస్ జాక్సన్ 1879లో ఈ కంపెనీని స్థాపించారు.
ఆ నౌకకు సంబంధించిన వివరాలపై కమాండర్ (విశ్రాంత) డా. జాన్సన్ ఓడకెల్ మాట్లాడుతూ.. ‘‘1882లో ఆ నౌక నిర్మాణం మొదలైంది. ఇది పూర్తయ్యేందుకు మూడేళ్ల సమయం పట్టింది. స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో ఆ నౌకను రిజిస్టర్ చేయించారు. దీన్ని నిర్మించేందుకు అప్పట్లోనే పది వేల పౌండ్లు (రూ.10.42 లక్షలు) ఖర్చయింది. దీనికి 4500 పౌండ్లు (రూ.4.69 లక్షలు) ఇన్సూరెన్స్ కూడా చేయించారు.’’ అని ఆయన చెప్పారు.
గ్రాంజ్‌మౌత్ కంపెనీ నిర్మించిన తొలి నౌకే ఎస్ఎస్ వైతరణ.
మెరైన్ హిస్టరీ సొసైటీకి డైరెక్టర్‌గా డా. జాన్సన్ పనిచేశారు. అంతకుముందు, భారత నౌకా దళంలో 34 ఏళ్ల పాటు ఆయన పనిచేసి, కమాండర్‌గా పదవీ విరమణ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
వైతరణ ఎంత పెద్దది?
ఎస్ఎస్ వైతరణ పొడవు 170 అడుగులు, వెడల్పు 26 అడుగులు. 73 హార్స్ పవర్ ఇంజిన్‌ను నడిపించేందుకు దీనిలో బొగ్గుతో నడిచే బాయిలర్ ఉంది.
దీని ఇంజిన్‌లో రెండు సిలిండర్లు ఉండేవి. వీటి వ్యాసం 21 అంగుళాలు. ఇంజిన్ నుంచి వచ్చే పొగను బయటకు పంపేందుకు నౌక మధ్యలో ఒక చిమ్నీ కూడా ఉండేది. దీనిలో మూడు డెక్‌లు కూడా ఉండేవి.
ఈ నౌక 292 టన్నుల బరువును తరలించగలదు. దీనిబట్టి ఈ నౌక సామర్థ్యమేంటో అర్థం చేసుకోవచ్చు. ఇంధనాన్ని నిల్వ చేసే గది, ప్రయాణికులు ఆహారం, పానీయాలు తీసుకోవడానికి గదులు, లగేజీలు పెట్టుకునే గదులు.. ఇలా గదులు ఆ నౌకలో ఉండేవి.
కచ్ నుంచి ముంబయి వెళ్తున్న వైతరణలో 22 టన్నుల బొగ్గును నింపారు. దీనిలో ప్రయాణించేందుకు టికెట్ ధర 8 రూపాయలు. టికెట్లను విక్రయించేందుకు పోర్టులలో ప్రత్యేక ఏజెంట్లను నియమించారు.

ఫొటో సోర్స్, Getty Images
విజిల్ అనే పేరు ఎలా వచ్చింది?
అప్పట్లో ఇక్కడి నౌకలు సుదూర ప్రాంతాలకు ప్రయాణించకుండా బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు విధించేది.
ఆ కాలంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ కూడా ఉండేది కాదు. అయితే, ఈ నౌక ప్రయాణించేటప్పుడు ఒడ్డున ఉండేవారికి కూడా ఇది కనిపించేది. దీని కారణం దీనిలో విద్యుత్ బల్బులే. అందుకే దీన్ని కొందరు విజిల్ అని పిలిచేవారు. అప్పట్లో కొన్ని ఇతర నౌకల్లోనూ ఇలాంటి విద్యుత్ బల్బులు ఉండేవి.
ఒక మోస్తరు దూరంలోని ప్రాంతాలకు ప్రజలను తీసుకెళ్లేందుకు ఈ నౌకను తయారుచేశారు. మొదట్లో ఇస్తాంబుల్ నుంచి జెడ్డా మధ్య ప్రయాణికులను ఈ నౌక తీసుకెళ్లేది.
అయితే, తొలి ప్రయాణంలోనే రాత్రి సమయంలో ఈ నౌకలో సమస్యలు ఎదురయ్యాయి. ఈ విషయంపై అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. 1885 ఆగస్టు 24న జెడ్డాకు ఆరు మైళ్ల దూరంలో ఉండేటప్పుడే ఈ నౌక నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. తుర్కియే నౌక ఎడ్రినా వెంటనే సాయం కోసం అక్కడకు వెళ్లింది.

ఫొటో సోర్స్, TWITTER/GO_MOVIE_MANGO
కెప్టెన్ ఎవరు?
ఈ నౌకకు సంబంధించిన రెండు పేర్లు అప్పట్లో ప్రధానంగా వినిపించాయి. వీటిలో ఒక పేరు హాజీ కాసం అగబోటవాలే. ఆయనే నౌక కెప్టెన్. రెండో వ్యక్తి నూర్ మొహమ్మద్ హలాయీ. ఆయన పోర్‌బందర్‌లో బుకింగ్ ఏజెంట్‌గా పనిచేసేవారు.
హాజీ కాసం కచ్ ప్రాంత జమీందారు. ముంబయిలోని మలబార్ హిల్స్‌లో ఆయన జీవించేవారు. ఆయన కార్యాలయం అబ్దుల్ రహమాన్ వీధిలో ఉండేది. నేటి బోరీవలి, దాహిసార్ మధ్య ఆయన పేరుపై చాలా భూమి ఉండేది.
నౌకాయానంలో హాజీకి రెండు దశాబ్దాల అనుభవముంది. అయితే, నాడు గుజరాత్‌లోని సౌరాష్ట్రను తాకిన తుపాను ఆయనకు పెద్ద పరీక్షలా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
కచ్ నుంచి బయలుదేరే నౌకలు సుదూర ప్రాంతాలకు ప్రయాణించకుండా అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కచ్‌లో సుదీర్ఘమైన తీర ప్రాంతముంది. అయితే, ఇక్కడ నీటిలొ లోతు తక్కువ. దీంతో పెద్ద నౌకలు ఇక్కడ నిలపడం కొంచెం కష్టం.
అదే సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ముంబయి, కరాచీ పోర్టులను ప్రోత్సహించేది. అందుకే వ్యాపారులు ఎక్కువగా ముంబయి లేదా కరాచీలో ఉండేవారు.
నవంబరు 1888లో కచ్‌లో స్థిరపడుతున్న వ్యాపారుల సంఖ్య పెరిగింది. దీంతో దిపావళికి ఐదు రోజుల తర్వాత వచ్చే పంచమినాడు ప్రయాణించేందుకు భారీగా వైతరణ టిక్కెట్లు కొన్నారు. ఈ నౌకలోకి 13 మంది పెళ్లి చేసుకోబోతున్న జంటలు కూడా ఎక్కాయి.
అప్పట్లో కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల యువత చదువుకునేందుకు, పరీక్షలు రాసేందుకు బాంబే యూనివర్సిటీకి వెళ్లేవారు. ఉన్నత విద్యకు బాంబే పెట్టింది పేరు. దీంతో చాలా మంది యువత పరీక్షలు రాసేందుకు బాంబే వెళ్లడానికి ఈ నౌక ఎక్కారు.
1888 నవంబరు 8న ఉదయం ఏడున్నరకు విజిల్ కచ్ నుంచి నుంచి మొదలైంది.
అయితే, దీనికి మూడు రోజుల ముందు నుంచే యాత్రపై నీలినీడలు కమ్ముకున్నాయి. అరేబియా సముద్రంలో మెమ్వా తుపాను బలపడుతోందని, ఇది ఉత్తర దిశగా కదులుతోందని వార్తలు వచ్చాయి. అయితే, ఏడో తేదీ సాయంత్రం ఇది వాయువ్య దిశగా కదలడం మొదలైంది.
నవంబరు 8నాటికి ఈ తుపాన్ కథియావాడ్ వైపుగా కదిలింది. అయితే, ఇదేమీ తీవ్రమైన తుపాను కాదు. కానీ, గాలి మాత్రం వేగంగా వీచేది. కొన్ని బ్రిటిష్ నౌకలు ఈ తుపాను నుంచి సురక్షితంగా బయటపడ్డాయి. కానీ, కొన్నింటిపై పిడుగులు పడ్డాయి.
మొత్తానికి నవంబరు 9నాటికి గుజరాత్ తీరానికి తుపాను చేరువైంది.
అసలేమైంది?
చరిత్రకారుడు వైఎం చైతల్వాలా తన పుస్తకం ‘‘విజిల్ హాజీ కాస్మనీ’ పుస్తకంలో ఎస్ఎస్ వైతరణ ప్రమాదం గురించి రాశారు. మరోవైపు 2018లో ఈ ప్రమాదానికి 130 ఏళ్లు పూర్తికావడంతో గుజరాతీ మ్యాగజైన్ ‘అభియాన్’ ఒక కవర్‌స్టోరీ ప్రచురించింది.
‘‘ఆ నౌకలో 43 మంది సిబ్బంది, 700 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో చాలా మంది మాండ్వీ, ద్వారకల్లో నౌక ఎక్కారు.’’ అని చైతల్వాలా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ నౌకలో 1,000 నుంచి 1,300 మంది ప్రయాణించారనే వార్తలను ఆయన ఖండించారు.
పోర్‌బందర్ సమీపంలో ఏడు నిమిషాలు ఆ నౌక ఆగింది. అయితే, ఆ పోర్టు వరకూ రాలేదు. దీంతో అక్కడ ఎక్కాల్సిన వంద మంది ప్రాణాలతో బయటపడ్డారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో ఆ ప్రాంత అడ్మినిస్ట్రేటర్ లల్లీ కావాలనే ప్రజలను ఎక్కకుండా అడ్డుకున్నారని, ఆయన వల్లే దాదాపు వంద మంది ప్రాణాలు మిగిలాయని వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తలను చైతల్వాలా ఖండించారు. అప్పటికీ సముద్రం ప్రశాంతంగానే ఉందని చెప్పారు.
మంగ్రోల్‌లో ఈ నౌక ఏజెంట్‌గా బలకృష్ణ బావాజీ పనిచేస్తున్నారు. తొమ్మిదో తేదీ రాత్రి ఒంటి గంటలకు సముద్రంలో ఒక పిడుగుపాటు చూసినట్లు ఆయన చెప్పారు. దీంతో బహుశా ఆ నౌకపై పిడుగు పడి ఉండొచ్చని కూడా కొన్ని వార్తలు వచ్చాయి.
మంగ్రోల్‌కు 30 నుంచి 40 కి.మీ. దూరంలో ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య ఆ నౌక మునిగిపోయింది.
దర్యాప్తులో ఏం తేలింది?
నౌకలోని ప్రెషర్ గేజ్‌లు, బారోమీటర్లు సరిగ్గా పనిచేయలేదని, వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసుండాల్సిందని దర్యాప్తులో తేలింది. మరోవైపు ప్రమాద సమయంలో ప్రయాణికులను రక్షించే ఏర్పాట్లు కూడా లేవని వెల్లడైంది. ఎస్ఎస్ వైతరణ తక్కువ దూరం ప్రయాణాలకు మాత్రమే సరిపోయే నౌకని, సుదూర ప్రయాణాలకు ఇది పనికిరాదని నిపుణులు కూడా చెప్పారు.
మరోవైపు దర్యాప్తు అనంతరం ఆ నౌక యాజమాన్య సంస్థపై చర్యలు తీసుకోలేదని అప్పట్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
చార్లెస్ ఎడ్వర్డ్ బ్లాక్ తన పుస్తకం ‘మెమొయిర్స్ ఆఫ్ ద ఇండియన్ సర్వే 1875-1890’లో దీని గురించి స్పందించారు. ‘అప్పట్లో తుపాను గురించి అన్ని పోర్టుల్లోనూ హెచ్చరికలు జారీచేశారు. వైతరణకు కూడా సమయానికి సమాచారం అందుంటే ఆ ప్రమాదకర ప్రయాణాన్ని అడ్డుకొని ఉండొచ్చు’’ అని పేర్కొన్నారు.
ఆ ప్రమాదం తర్వాత షిప్పింగ్ యాక్ట్‌కు సవరణలు తీసుకొచ్చారు. సముద్ర ప్రయాణాలను సురక్షితంగా మార్చేందుకు దీనిలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
- బెలూన్: ఆకాశంలో 25 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరితే ఏమవుతుంది? ఇలాంటి బెలూన్ల తయారీకి ఎంత ఖర్చవుతుంది
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
- బిల్ గేట్స్: ఆవు తేన్పులు పర్యావరణహితంగా ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారు
- మనిషి మృతదేహాన్ని ఎరువుగా ఎలా మారుస్తారు... కూరగాయలు ఎలా పండిస్తారు
- ఇక్కడ పూలతో శాకాహార చెప్పులు, బ్యాగులు తయారు చేస్తారు, ఏమిటివి, ఎలా తయారవుతాయి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















