పలాస జీడి పప్పు: మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పటికీ రైతుకు మాత్రం నష్టం ఎందుకు?

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
2020 జూన్ 16న పలాస ఎమ్మేల్యే సీదిరి అప్పలరాజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖ ఇది. అప్పటికి ఆయన మంత్రి కాలేదు.
రైతులకు మద్దతుగా 80 కేజీల జీడి పిక్కల బస్తాకు రూ.14000/- ఇవ్వాలని ఈ లేఖలో అప్పలరాజు కోరారు.
అయితే, కొంత కాలంగా 80 కేజీల జీడి పిక్కల బస్తాకు రూ. 16000/- మద్దతు ధర ప్రకటించాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న సీదిరి అప్పలరాజును జీడి పంట మద్దతు ధరపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందని బీబీసీ ప్రశ్నించింది.
“ప్రస్తుతానికి జీడి పంటను కొనే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. కానీ జీడి రైతులకు నష్టం రాకుండా ఏం చేయాలనే దానిపై అధికారులతో చర్చిస్తున్నాం.” అని మాత్రమే ఆయన సమాధానం చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
జీడి పప్పు కేంద్రం
శ్రీకాకుళం జిల్లా జీడి పప్పుకు ఫేమస్. జీడి పప్పు రకాలను బట్టి మార్కెట్‌లో కనీసం రూ.800 నుంచి గరిష్ఠంగా రూ.900 వరకు పలుకుతోంది. రైతులు వ్యాపారులకు అమ్మే 80 కేజీల జీడి పిక్కల బస్తాకు రూ. 7000 మాత్రమే ఇస్తున్నారు.
ఈ ధరకు అమ్మితే ఎకరాకు పెట్టిన పెట్టుబడిపై రూ.6 వేల నష్టం వస్తోందని జీడి రైతుల సంఘం కన్వీనర్ అజయ్ కుమార్ చెప్పారు. దీంతో మార్కెట్‌లో అమ్మినా కనీస పెట్టుబడి రావడం లేదని.. జీడి రైతులు జీడి పిక్కలను తమ ఇళ్లలోనే పెట్టుకుంటున్నారు.
అసలు మార్కెట్‌లో మంచి ధరే పలుకున్న జీడిపప్పు... దానిని పండించే రైతుకు మాత్రం నష్టాన్ని ఎలా మిగులుస్తుంది?

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
పంట ఖర్చు ఎంత?
శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 60 వేల ఎకరాల్లో జీడి సాగు జరుగుతుండగా, అందులో ఉద్దాన ప్రాంతమైన వజ్రపుకొత్తూరు, పలాస, మందస, కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లోనే 45 వేల ఎకరాల్లో జీడి తోటలున్నాయని జిల్లా ఉద్యానవనశాఖ లెక్కలు చెప్తున్నాయి.
ఎకరాకు కనిష్ఠంగా 250.. గరిష్ఠంగా 400 కిలోల పిక్కల దిగుబడి ఉంటుంది. జీడి పంటపై ఆధారపడి కనీసం లక్ష కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయని అంచనా.
ఉద్దాన ప్రాంతానికి చెందిన జీడి రైతులు తెప్పల చినపిల్ల, గార రుద్రయ్య, తాతారావులతో బీబీసీ మాట్లాడింది. వారు పంటకు అయ్యే ఖర్చు తదితర వివరాలను చెప్పారు. తెప్పల చినపిల్ల రెండు ఎకరాల రైతు.
“జీడి పంట చేతికి రావాలంటే నవంబర్ నుంచి మే నెల వరకు కష్టపడాలి. తోట వేసింది మొదలు ఎరువులు, క్రిమి సంహారక మందులు, ప్రోనింగ్ (కొమ్మలు కత్తిరించడం), పిక్క ఏరడం వంటివి పనులు చేయాలి. వాటన్నింటికి కూలీలు అవసరమవుతారు. వీటన్నింటికి లెక్కలేస్తే ఎకరాకు రూ. 30 వేలకు పైగానే పెట్టుబడి అవుతుంది. అన్ని సవ్యంగా జరిగితే ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాల జీడిపిక్క చేతికొస్తుంది.” అని గార రుద్రయ్య బీబీసీతో చెప్పారు.
“ఈ ఏడాది రెండు ఎకరాలకు ఏడు బస్తాలు వచ్చాయి. బస్తా అంటే 80 కేజీలు. ఈ బస్తాను మార్కెట్‌కు తీసుకెళ్తే... రూ. 7 వేలే ఇస్తామంటున్నారు. ఆ లెక్కన రెండు ఎకరాలకు నా మొత్తం పెట్టుబడి రూ. 60 వేలు, అమ్మితే వచ్చే ధర రూ. 49 వేలు. నాకు రూ. 11 వేలు నష్టం. అందుకే ధర వచ్చినప్పుడే అమ్ముదామని ఇంట్లోనే జీడిపిక్కను పెట్టుకున్నాను.” అని తెప్పల చినపిల్ల బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
రైతుకు ఇచ్చే ధర ఎందుకు తగ్గిస్తున్నారు?
జీడి తోటలను ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా పండించేది శ్రీకాకుళంలోనే అయినా... విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాల్లో కూడా జీడి పంట రైతులు ఎక్కువగానే ఉంటారు.
ఉత్తరాంధ్రలో జీడి తోటల్లో శ్రీకాకుళంలోనే 50 శాతం ఉంటాయి. ఇందులో ఉద్దానం ప్రాంతంలోనే 70 శాతం జీడి పంట ఉంటుంది. దీంతో ఉద్దానం కేంద్రంగానే జీడిపంట మద్దతు ధర కోరుతూ ఆందోళనలు జరుగుతున్నాయి.
“జీడి పిక్కలను తెల్ల బంగారంగా పిలుస్తాం. ఈ తెల్లబంగారం 80 కిలోల బస్తాని ప్రస్తుతం రూ.7 వేలకు కొనే పరిస్థితి లేదు. దీనికి ప్రధాన కారణం విదేశాల నుంచి జీడి పిక్కలను దిగుమతి చేసుకోవడమే. నెల రోజుల కిందట స్థానిక జీడి రైతుల నుంచి రూ. 8 వేలకు కొన్న బస్తాని ఇప్పుడు రూ. 7 వేల కంటే తక్కువకే అడుగుతున్నారు. పలాస, కాశీబుగ్గలో కనీసం 320 జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. ఏటా 80 వేల నుంచి లక్ష టన్నుల జీడి పిక్కలను ఇక్కడ ప్రాసెసింగ్ చేస్తారు. వీరిలో ఎక్కువ శాతం జీడి పిక్కలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.” అని జీడి రైతుల సంఘం కన్వీనర్ అజయ్ కుమార్ అన్నారు.
ఆ రోజు మార్కెట్‌లో 80 కేజీల జీడి బస్తా ఎంత ధర నిర్ణయించాలనేది చిన్న చిన్న చీటిలపై రాసుకుని వ్యాపారులు, దళారులు ఒకరికి ఒకరు సమాచారం అందించుకుంటారు.
ఆ ధరనే మార్కెట్‌లో నిర్ణయిస్తారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, మార్కెట్‌పై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతోనే జీడి రైతు నష్టపోవాల్సి వస్తుందని అజయ్ కుమార్ అన్నారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
విదేశాల నుంచి ఎందుకు?
ఉద్దానం జీడి తోటల్లోని జీడి పిక్కలకు మంచి గిరాకీ ఉంది. 1985-1990లలో ఉద్దానం ప్రాంతానికి కేరళ నుంచి వ్యాపారులు వచ్చి... ఆ రోజుల్లోనే 80 కేజీల బస్తాను రూ. 3500లకు కొనుగోలు చేసేవారు. కానీ ఈ రోజులు దళారులు, మార్కెట్‌లోని వ్యాపారులు దాని ధర ఎంత నిర్ణయిస్తే అంతే అన్నట్లుగా తయారైంది. వ్యాపారులంతా సిండికేట్‌గా మారిపోయారని జీడితోటల రైతు రుద్రయ్య అన్నారు.
‘‘ఉద్దానం ప్రాంతంలోని వ్యాపారులు ముఖ్యంగా పలాస కేంద్రంగా జీడి పప్పు వ్యాపారం చేసే వారంతా కూడా అఫ్గానిస్తాన్, మియన్మార్, ఘనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడ నుంచి దిగుమతి చేసుకునే 80 కేజీల జీడి పప్పు బస్తా రూ. 6500లకే దొరుకుతుంది. పైగా ఇది చూడటానికి బాగుంటుంది.’’ అని జీడి పిక్కలను ప్రాసెసింగ్ చేసే శ్రీనివాసరావు చెప్పారు. దీంతో స్థానికంగా కొనేకంటే చూసేందుకు బాగుండి, తక్కువ ధరకు లభించే విదేశీ జీడిపప్పునే దిగుమతి చేసుకుంటున్నామని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 80 కేజీల బస్తాను ప్రాసెసింగ్ చేస్తే కేలం 16 కేజీల జీడి పప్పే వస్తుందని, అదే ఇక్కడ రైతుల నుంచి తీసుకున్నదైతే 24 కేజీలు వస్తుందని జీడి రైతులు అంటున్నారు.
పైగా విదేశాల నుంచి వచ్చే జీడిపప్పు తేలికగా ఉండి ఎక్కువ పరిమాణం వచ్చినట్లు కనపడుతుందని, కానీ ఉద్దానం జీడిపప్పు కాస్త బరువుగా ఉండి తక్కువ పరిమాణంలోనే ఉంటుందని, రుచిలో మాత్రం ఉద్దానం జీడిపప్పు బాగుంటుందని అంటున్నారు స్థానిక జీడితోటల రైతులు.
‘‘పలాస పరిసర ప్రాంతాల్లో ఉన్న జీడి పరిశ్రమల్లో రోజుకు 5 వేల బస్తాలు అంటే 4 లక్షల కేజీల జీడి పిక్కలు అవసరం అవుతాయి, కానీ ఆ స్థాయిలో మా వద్దకు స్థానిక రైతుల నుంచి జీడి పిక్కలు రావడం లేదు, అందుకే వ్యాపారం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం’’ అని జీడి పిక్కల వ్యాపారి సురేశ్ చెప్పారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే జీడి పప్పు నాణ్యత కూడా అంతగా ఉండదని, కానీ వ్యాపారం కోసం ఎంతోకొంత దిగుమతి చేసుకోవడం తప్పడం లేదని వ్యాపారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju Srinivas
‘ప్రభుత్వ నిర్లక్ష్యంతో దళారులను ఆశ్రయిస్తున్న రైతులు’
శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 60 వేల ఎకరాల్లో జీడితోటలు ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు, రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా జీడి పంటను కొనుగోలు చేస్తామని, రైతులకు మద్దతు ధర ఇస్తామని ప్రభుత్వ ప్రకటించినా క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోలు జరగడం లేదు.
‘‘ఫలితంగా.. రైతులు తాము పండిచిన పంటను అమ్ముకునేందుకు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. ఇదే అదనుగా దళారులు, వ్యాపారులు కుమ్మక్కే ధరలను అమాంతం తగ్గించేస్తున్నారు’’ అని జీడి రైతుల సంఘం కన్వీనర్ అజయ్ కుమార్ అన్నారు.
“80 కేజీల జీడి పిక్కల బస్తాకు రూ. 16 వేలు ఇవ్వాలని, ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. మంత్రి సీదిరి అప్పలరాజు కూడా గతంలో రూ. 14 వేల మద్దతు ధర ఇవ్వాలని లేఖ రాయడమే కాదు, అలా అయ్యే దాకా నేను ప్రభుత్వంతో చర్చిస్తానని కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన మంత్రి అయినా కూడా జీడి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు” అని అజయ్ కుమార్ అన్నారు.
రైతు ఉత్పిత్తి సంఘాల ద్వారా ఈ ఏడాది జీడి పిక్కలను కొనుగోలు చేస్తామని శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐకేపీ సెంటర్ అధికారులు చెప్తున్నారు.
అయితే, ‘‘పెట్టుబడి డబ్బులు తిరిగి వచ్చేంత ధర పలికే వరకు మా ఇళ్లలోనే బస్తాలను ఉంచుకుంటాం. అమ్ముడుకాకపోతే పారేస్తాం కానీ.. మార్కెట్‌లో దళారులు నిర్ణయించే ధరకు మాత్రం అమ్మం.’’ అని ఉద్దానం జీడి రైతులు బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?
- ‘ఆక్సిజన్ అయిపోతుంటే కార్బన్ డయాక్సైడ్ రక్తంలో చేరి హైపర్కాప్నియాతో స్పృహ కోల్పోతారు’
- టైటానిక్: 111 ఏళ్ల కిందట మునిగిపోయిన ఈ ఓడలోని 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- జలాంతర్గామిలో వెళ్లి టైటానిక్ చూసొచ్చిన ఈ యూట్యూబర్ 'టైటాన్ అదృశ్యం'పై ఏమంటున్నారంటే..
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















